ఆకలిలో అగ్రస్థానం!

ABN , First Publish Date - 2022-10-18T06:08:47+05:30 IST

ప్రపంచ ఆకలిసూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం 107వ స్థానంలో ఉంది. జాబితాలో ఉన్నది 121 దేశాలే. విశేషమేమంటే, ఆహారసంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక...

ఆకలిలో అగ్రస్థానం!

ప్రపంచ ఆకలిసూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం 107వ స్థానంలో ఉంది. జాబితాలో ఉన్నది 121 దేశాలే. విశేషమేమంటే, ఆహారసంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక 64వ(స్థానంలోనూ, పాకిస్థాన్ 99వ స్థానంలోనూ ఉన్నాయి. ఆసియాలో నేపాల్, భూటాన్ కంటే కూడా మనమే వెనుకబడి, అంతర్గత సంక్షోభంతో తీసుకుంటున్న అఫ్ఘానిస్థాన్ కన్నా మెరుగ్గా ఉన్నామంతే.


ఎన్డీయే ప్రభుత్వం సాధించిన మరో అద్భుత విజయం అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, నాయకులు విమర్శలు చేస్తున్నారు. అచ్ఛేదిన్, అభివృద్ధి నినాదాలకే పరిమితమై, మోదీ పాలనలో దేశం ఆకలికేకల దిశగా పయనిస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ లెక్కల్లో శాస్త్రీయత లేదని వాదిస్తోంది. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ దెబ్బతీయడానికి ఇలా తక్కువ ర్యాంకు ఇచ్చారనీ, మూడువేల మందిని ఒక యూనిట్‌గా తీసుకొని పోషకాహార లోపాన్ని లెక్కించే విధానంతో సరైన ఫలితాలు రావనీ, జీహెచ్ఐ పరిగణనలోకి తీసుకున్న నాలుగు అంశాల్లో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవే కనుక, దీనిని జనాభా మొత్తానికి ఆపాదించలేమని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. అంతర్జాతీయంగా భారతదేశం పరువు మాత్రమే దిగజార్చే ఉద్దేశం ఎవరికి ఎందుకు ఉంటుందో తెలియదు. భారత్ అద్భుతం, అమోఘం అన్న నివేదికలను ఉధృతంగా ప్రచారం చేసుకోవడం, వ్యతిరేకంగా వస్తున్నవాటిని కొట్టిపారేయడం ఒక విధానంగా ప్రభుత్వం పెట్టుకున్నట్టుంది. ప్రపంచ ఆకలిసూచీ గణాంకాల సేకరణలో సంబంధిత సంస్థలు భారత్ కంటూ ప్రత్యేకంగా ఒక విధానాన్ని పాటించేదేమీ లేదు. అన్ని దేశాలతో సమానంగానే ఇక్కడి లెక్కలూ, నమూనాలూ ఉంటాయి. ఇక, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సూచీలను కొట్టిపారేయడంలో ఏమాత్రం ఔచిత్యం లేదు. పోషకారలేమి, ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు, గిడసబారినతనం, కండరాల క్షీణత వంటివి ఎంతో ముఖ్యమైనవి, తీవ్రమైనవి.


ఆయా రంగాల్లో భారత్ దుస్థితిని తెలియచెప్పే ప్రతీ అంతర్జాతీయ నివేదికనూ తప్పుబట్టడమో, దానిని కుట్రగా తీసిపారేయడం వల్లనో ప్రయోజనం లేదు. ఈ లెక్కలు ప్రభుత్వానికి నచ్చకపోయినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను తెలియచెబుతున్నాయి. దేశంలో ఆకలి లేనేలేదని ప్రభుత్వం నిజంగా నమ్మిన పక్షంలో, దేశవ్యాప్తంగా ప్రభుత్వమే సమగ్ర స్వతంత్ర అధ్యయనం చేయించి, ఆ వివరాలను ప్రకటిస్తే దాని వాదనకు విశ్వసనీయత సమకూరుతుంది. అటువంటిదేమీ లేకుండా, డొల్ల విమర్శలు చేస్తూ, నచ్చని నివేదికలను, అధ్యయనాలను ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దేశంలో ఆకలిచావులు లేవని ఇటీవల ప్రభుత్వం వాదించినప్పుడు, సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సూచనలు తెలిసినవే. పోషకాహారలోపం, రక్తహీనత వంటి సమస్యలు నివారించడంలో ప్రభుత్వ పథకాలు ఆశించినంత ఫలితాన్నివ్వడం లేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఆవేదన వెలిబుచ్చింది. ఎనభైకోట్లమందికి ఆహారధాన్యాలను ఉచితంగా ఇస్తున్నామని పాలకులు అంటున్నప్పటికీ, అవి వివిధ కారణాల వల్ల ఐదోవంతుమందికి కూడా చేరడం లేదని క్షేత్రస్థాయి సామాజిక కార్యకర్తలు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం ఎంతో మెరుగుపడినప్పటికీ కూడా ఆదాయ అసమానతలు, ధరలు, పడిపోతున్న ఉపాధి వంటి అనేక కారణాల వల్ల అధికశాతం పేదలకు ఆకలి తీరడం లేదు, పోషకాహారం దక్కడం లేదు. ఆకలి సమస్య దేశంలో గట్టిగానే ఉన్నదని తేలిపోయినప్పుడు, సహేతుకమైన పథకాలతో, సామాజిక వంటశాలలవంటి ప్రయోగాలతో రంగంలోకి దిగాలి. ఒకవైపు ఆర్థికశక్తిగా ఎదుగుతున్నామని అంటున్నప్పుడు, ఆకలిసూచీలో ఇలా వెనుకబడటం దేశానికి అప్రదిష్ఠ మాత్రమే కాదు, రెండింటికీ లంకెలేదన్న వాస్తవాన్ని కూడా తెలియచెబుతోంది. ఉపాధికల్పనకు ఊతమిచ్చే అభివృద్ధి విధానాలకు పాలకులు కట్టుబడాల్సిన సత్యాన్ని తెలియచెబుతోంది. మనం సాధిస్తున్న ప్రగతి, అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు నిరుపేదలకు మేలు చేయడం లేదన్నది వాస్తవం. దేశంలో ఆదాయ అంతరాలు పెరిగిపోతున్నాయని ఎంతమంది మొత్తుకుంటున్నా, ఎన్ని నివేదికలు వెలుగుచూస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. 2030నాటికల్లా ఆకలిని నిర్మూలించాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం. భారతదేశం ఈ లక్ష్యానికి ఎంతో దూరంలో ఉన్నదనీ, మరో ఏడేళ్ళలో ఆ పని అసాధ్యమని ఈ నివేదిక తేల్చేసింది.

Read more