అణుయుద్ధం ముప్పు!

ABN , First Publish Date - 2022-10-13T06:40:54+05:30 IST

యుద్ధంరాకూడదు కానీ, వస్తే కనుక అది ఏ స్థాయికి చేరుతుందో, ఎలా ముగుస్తుందో ఊహించడం కష్టం. ఉక్రెయిన్ లోకి రష్యా చొరబడినప్పుడు అది ఇంతకాలం సాగుతుందని ఎవరూ అనుకోలేదు.

అణుయుద్ధం ముప్పు!

యుద్ధంరాకూడదు కానీ, వస్తే కనుక అది ఏ స్థాయికి చేరుతుందో, ఎలా ముగుస్తుందో ఊహించడం కష్టం. ఉక్రెయిన్ లోకి రష్యా చొరబడినప్పుడు అది ఇంతకాలం సాగుతుందని ఎవరూ అనుకోలేదు. ఉత్తములెవరో రంగప్రవేశం చేసి, సయోధ్యసాధిస్తారని ఆశించారు కానీ, ఆది జరగలేదు. ఆదిలో చావుదెబ్బ తిన్న ఆ చిన్న దేశం అనతికాలంలోనే  ఎదురుతిరిగింది, కదనరంగంలో రష్యా ఎత్తులను చిత్తుచిత్తు చేసింది. ఇందుకు ఉక్రెయిన్ బలంకంటే దాని వెనుక ఉన్న శక్తుల సహకారం కారణమన్నది ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. పుతిన్ అవమానాన్ని తట్టుకోలేక మరింత తీవ్ర విధ్వంసానికి, మానవహననానికీ ఒడిగడుతున్నారు. రెండువందల ముప్పైరోజులుగా సాగుతున్న ఈ యుద్ధం చూస్తుండగానే ఏ పక్షమూ వెనక్కు తగ్గడానికి అవకాశం లేనంత ఉగ్రస్థితికి చేరుకుంది. అమెరికా రష్యాల ప్రచ్ఛన్నయుద్ధం ప్రత్యక్షయుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. అహానికిపోతున్న అగ్రదేశాలను ఇప్పుడే ఆపకపోతే, అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించిన ఈ హెచ్చరికలు, హూంకరింపుల దశకూడా దాటి, లక్షలాదిమందిని పొట్టనబెట్టుకొనే పరిస్థితి రావచ్చుకూడా. 


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణుయుద్ధం ముప్పు గురించి మాట్లాడుతున్నది దానిని నివారించడానికి ఉపకరిస్తుందని కొందరివాదన. ప్రత్యక్షఘర్షణను నివారించడానికి ఈ మాటలకంటే ఆచరణ ముఖ్యం. నన్ను ఇంకా ఇంకా రెచ్చగొట్టకండి అని పుతిన్ అంటున్నకొద్దీ పాశ్చాత్యదేశాల చర్యలు హద్దులు దాటిపోతున్నాయి. నాటోలోకి స్వీడన్, ఫిన్ లాండ్ లను చేర్చుకోవద్దన్న రష్యా హెచ్చరికలను ఈ దేశాలు ఏమాత్రం ఖాతరుచేయలేదు. 2014లో తాను ఆక్రమించుకున్న క్రిమియా జోలికి రావద్దన్న రష్యా హెచ్చరికనూ ఖాతరుచేయలేదు. రష్యా, క్రిమియాలను కలుపుతున్న ఏకైక మార్గం పుతిన్ 70వ జన్మదినం మర్నాడే అక్టోబర్ 8న భారీ పేలుళ్ళతో ధ్వంసమైంది. క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాకు కలిపే ఈ రైలు రోడ్డు మార్గాన్ని భారీ ఖర్చుతో 2018లో పుతిన్ నిర్మించుకున్నారు. క్రిమియా మీద మీ చేయిపడితే, నేను కఠిననిర్ణయం తీసుకోవాల్సిన ఘడియ సమీపించినట్టేనని పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో, క్రిమియా ఆక్రమణకు ప్రతీకగా ఉన్న ఈ మార్గాన్ని ధ్వంసం చేయడం రష్యాను రెచ్చగొట్టడమే. దీనికి ప్రతీకారంగా, ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కొత్త సైనిక కమాండర్ నేతృత్వంలో రష్యా మొన్న రెండురోజుల పాటు ఉక్రెయిన్ రాజధాని సహా చాలా నగరాలపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో  అనేకమంది ప్రాణాలు కోల్పోయారు, వందలమంది గాయపడ్డారు.


ఉక్రెయిన్‌కు మద్దతుగా మరిన్ని మిసైళ్ళను రష్యా సరిహద్దుల్లో మోహరిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం, జి సెవన్ దేశాలనుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు మరిన్ని ఆయుధాలను, రష్యాపై మరింత తీవ్రమైన ఆంక్షలను కోరడం యుద్ధాన్ని తీవ్రతరం చేసే చర్యలే. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిసైళ్ళు చేరినపక్షంలో అమెరికా గీత దాటినట్టుగా భావిస్తానని, యుద్ధంలో ప్రత్యక్ష శత్రువుగా గుర్తిస్తానని పుతిన్ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఇటువంటి హెచ్చరికలూ, గీతలుదాటడం ఈ యుద్ధకాలంలో చాలా జరిగాయి. పాశ్చాత్యదేశాల నుంచి అందుతున్న మరిన్ని అధునాతన ఆయుధాలతో ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోగలుగుతున్నది కానీ, ఇందుకు ప్రతీకారంగా రష్యా ఇంకా రెచ్చిపోతున్నది. ఉక్రెయిన్‌కు ఈ యుద్ధం బతుకుపోరాటం. రష్యాకు ఇది ఆధిపత్యానికీ, ఆత్మగౌరవానికీ సంబంధించిన అంశం. యుద్ధంలో మునిగిన ఉభయపక్షాలూ ఓడిపోతామన్న భయంలో, ఎదుటిపక్షానికి ఎనలేని హాని చేస్తున్నామన్న భ్రమలో కొట్టుమిట్టాడుతూ దానిని తీవ్రతరం చేస్తున్నాయి. భారీ విధ్వంసకర ఆయుధాల మోహరింపుతో, మరిన్ని కఠినమైన ఆంక్షలతో రష్యాను చావుదెబ్బతీయగలమని అమెరికా, దాని మిత్రదేశాలు అనుకుంటూంటే, పౌరులను చంపడం ద్వారా, యూరప్‌కు చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం ద్వారా రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది. పెరుగుతున్న ఈ ఉద్రిక్తతల వల్ల, అరవైయేళ్ళ తరువాత, ప్రపంచం అణ్వస్త్ర మహాసంగ్రామానికి అతిదగ్గరకు చేరిందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ హెచ్చరిక చేశారే తప్ప, ఆ పరిస్థితి నిలువరించడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కృషి చేస్తున్నదేమీ లేదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుప్పకూలబోతున్నదన్న ఐఎంఎఫ్ హెచ్చరికల నేపథ్యంలోనైనా తటస్థదేశాలూ, కూటములు తక్షణం పూనుకుంటే తప్ప ప్రపంచం ఓ పెను ప్రమాదం నుంచి బయటపడలేదు.

Read more