కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణాయక వేళ..

ABN , First Publish Date - 2022-09-24T07:02:51+05:30 IST

మన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత సమున్నతంగా వర్ధిల్లేందుకు, ప్రయోజనాత్మకంగా పని చేసే పార్లమెంటును సాధించుకునేందుకు..

కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణాయక వేళ..

మన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత సమున్నతంగా వర్ధిల్లేందుకు, ప్రయోజనాత్మకంగా పని చేసే పార్లమెంటును సాధించుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్ మనుగడ కీలకం.మరి కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా అయిన అధ్యక్షుడిని పొందుతుందా లేక ఒక అధినేత, ఒక అధ్యక్షుడిని ఎంచుకుంటుందా అన్నది వచ్చే 7 రోజులలో తెలుస్తుంది. ఈ వారం రోజులూ కాంగ్రెస్‌కే కాకుండా దేశానికి కూడా చాలా ప్రధానమైనవి.


భారత జాతీయ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలలో మీడియా, రాజకీయ వర్గాలు, ప్రజలు అసాధారణ, అపూర్వ ఆసక్తి చూపుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జెపి నద్దా ‘ఎన్నికయినప్పుడు’, ఆ పార్టీ కార్యకర్తలు, కచ్చితంగా కాంగ్రెస్ సభ్యులతో సహా దేశంలో ఎవ్వరూ ఏ మాత్రం పట్టించుకోలేదు. బీజేపీ అధ్యక్ష పదవీ ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉన్న పార్టీ సభ్యుల జాబితాను చూపించాలని ఎవరైనా సతాయించారా? ఆ అధ్యక్ష పదవీ ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించింది ఎవరో మీకెవరికైనా తెలుసా? అసలు నద్దా తన ‘నామినేషన్’ పత్రాలు దాఖలు చేశారా? చేస్తే ఎవరి వద్ద చేశారు? ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతమంది సభ్యులు తమ పార్టీలో ఉన్నారని బీజేపీ ఊరూ వాడా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడుగా నద్దా ఎన్నిక చెప్పుకోదగిన ప్రాధాన్యమున్న రాజకీయ ఘటన కానేకాదు.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో బీజేపీ, మీడియా చూపుతున్న శ్రద్ధ రెండు వాస్తవాలను ధ్రువీకరిస్తోంది: ఒకటి– కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఒక తప్పుడు భావన, ఒక భ్రాంతి. ఇది ఎన్నటికీ సంభవించదు; రెండు– భారత్ జోడో యాత్ర జాతీయ పాలక పక్షాన్ని కుదిపివేసింది. మనకేమీ పరవాలేదన్న ఆ పార్టీ శ్రేణులలోని ఆనందం ఆవిరైపోతోంది. కాంగ్రెస్ కథ ముగిసినట్టే అన్న భావం చూపుతూ వస్తోన్న మీడియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జోడో యాత్రపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ వ్యవహారాలను మహా శ్రద్ధగా పట్టించుకొంటోంది.


కాంగ్రెస్ పార్టీ తన తదుపరి అధ్యక్షుడిని అక్టోబర్‌లో ఎన్నుకోనున్నది. కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికవుతారు అన్న విషయమై నేను ఏమీ చెప్పలేను. పార్టీ శ్రేణుల్లో అత్యధికులు రాహుల్ గాంధీయే అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు (2019 జూలైలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు). అలా కోరడం వారి హక్కు. అయితే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కావాలనే కోరిక తనకు లేదని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో విలువైన పాఠాలు ఉన్నాయి. భారత రాజకీయాలలోకి మహాత్మా గాంధీ ఆగమనం తరువాత కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకుడుగా ఆయన గుర్తింపు పొందారు. కాంగ్రెస్ మహా నాయకులలో ఆయన మహోన్నతుడు. 1921–48 సంవత్సరాల మధ్య 14 మంది మేరునగధీరులు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిష్టించారు. చిత్తరంజన్ దాస్, సరోజినీనాయుడు, ఎస్.శ్రీనివాస అయ్యంగార్, ఎమ్ఏ అన్సారీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలామ్ ఆజాద్, ఆచార్య కృపలానీ మొదలైన దిగ్గజాలు వారిలో ఉన్నారు.


కాంగ్రెస్ సాధారణ సభ్యులు, సభ్యులు కాని సామాన్య ప్రజలు పార్టీ వ్యవహారాలలోని ఒక సూక్ష్మ, అయితే అతి ముఖ్యమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు: మహాత్మా గాంధీ ‘కాంగ్రెస్ నాయకుడు’ కాగా మరొక వ్యక్తి ‘కాంగ్రెస్ అధ్యక్షుడు’ నాయకుడు, అధ్యక్షుడు తమ తమ విధ్యుక్త ధర్మాలను సమున్నతంగా నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నించేవారు కాదు.


ఇటువంటి ఏర్పాటే 1948–64 సంవత్సరాల మధ్య కూడా ఉండేది. జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్‌కు తిరుగులేని నాయకుడుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రధానమంత్రిత్వ హయాంలో ఏడుగురు వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిష్టించారు. 1965–84 సంవత్సరాల మధ్య కూడా ఇటువంటి ఏర్పాటే ఉండేది. ఇందిరాగాంధీ కాంగ్రెస్‌కు తిరుగులేని నాయకురాలు. ఆమె హయాంలో ఎనిమిది మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు.


సువిశాల భారతదేశపు అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఇటువంటి ఏర్పాటు అర్థవంతమైనది. ఈ ఉత్కృష్ట ఏర్పాటును ప్రజలు ఆమోదించారు. నాయకుడి కర్తవ్యం ప్రజలకు నాయకత్వాన్ని సమకూర్చడం, తన భావాలు, అభిప్రాయాలు, దార్శనికతను వారితో పంచుకోవడం, పార్టీకి ఓటు వేసేలా వారిని ఉత్తేజపరచడం. అధ్యక్షుడి ప్రధాన బాధ్యతలు పార్టీ కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడడం, ప్రజలతో నిత్య సంబంధాలు పెట్టుకోవడం, ఎన్నికల పోరుకు పార్టీ యంత్రాంగాన్ని సదా సంసిద్ధంగా ఉంచడం.

నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఒక నాయకుడు ప్రజలను ఉత్తేజపరచాలి. జాతి పురోభివృద్ధికి తోడ్పడే పనులు నిర్వహించేలా వారిని పురిగొల్పాలి. మహాత్మా గాంధీ తన అహింసా సిద్ధాంతం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘ నోద్యమం, అంతిమంగా క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఆ నాయకత్వ బాధ్యతలను అనితర సాధ్యంగా నిర్వర్తించారు. జవహర్ లాల్ నెహ్రూ తన సమున్నత ఆదర్శాలు అయిన అలీనోద్యమం, లౌకికవాదం, సామ్యవాద భావాలతో ప్రజలను జాతి నిర్మాణానికి సమాయత్తం చేశారు. గొప్ప కలలు కనాలని, ఆ కలల సాధనకు దీక్షా బద్ధులు కావాలని జాతికి ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల జాతీయీకరణ, ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పన మొదలైన సాహసోపేత చర్యలు చేపట్టారు. ‘స్వర్ణ చతుర్భుజి’ పథకం ద్వారా అటల్ బిహారీ వాజపేయి జాతిలో సమైక్యతా భావాన్ని పెంపొందించారు. మహోన్నతమైన కార్యాల నిర్వహణకు ఉపక్రమించేలా ప్రజలను ఉత్తేజరచారు. స్ఫూర్తిదాయకమైన పద బంధం (‘విధితో సంభాషణ’), ఉద్వేగాత్మక నినాదం (‘గరీబీ హటావో’), వికాసపూరిత దార్శనికత (‘ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్’) నాయకులకు సమున్నత గౌరవాదరాలను సమకూరుస్తాయి. నాయకుడికి భిన్నంగా అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు సకల విషయాలలో మార్గదర్శకత్వమివ్వాలి. కార్యకర్తలకు ఆప్త బంధువుగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం శిథిలావస్థలో ఉందనేది సత్యం. పార్టీని సమూలంగా సంస్కరించాల్సిన అవసరముంది. ఇది తక్షణమే నిర్వర్తించాల్సిన కర్తవ్యం. ఇందుకు పార్టీ కార్యకర్తలతో నిత్య సంబంధాలు కలిగి ఉండాలి. పార్టీలోని ప్రతి విభాగం కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విభాగాల నేతలు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. అంకిత భావంతో పనిచేస్తున్నవారిని ప్రోత్సహించాలి. స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నవారిని శిక్షించాలి. సంవత్సరం పొడుగునా 364 రోజులు (అధ్యక్షుని పుట్టిన రోజు మినహాయింపు!) రేయింబవళ్లు నిర్వర్తించవలసిన బాధ్యతలివి.


మన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత సమున్నతంగా వర్ధిల్లేందుకు, ప్రయోజనాత్మకంగా పని చేసే పార్లమెంటును సాధించుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్ మనుగడ కీలకం. కాంగ్రెస్ లేని పక్షంలో ఏకపార్టీ రాజ్య వ్యవస్థను సహిస్తూ మనదీ ఒక ప్రజాస్వామ్యమే అన్న భ్రాంతికి అలవాటుపడతాము. మరి కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా అయిన అధ్యక్షుడిని పొందుతుందా లేక ఒక అధినేత, ఒక అధ్యక్షుడిని ఎంచుకుంటుందా అన్నది వచ్చే 7 రోజులలో తెలుస్తుంది. ఈ వారం రోజులూ కాంగ్రెస్‌కే కాకుండా దేశానికి కూడా చాలా ప్రధానమైనవి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలలో మీడియా, రాజకీయ వర్గాలు, ప్రజలు అసాధారణ, అపూర్వ ఆసక్తి చూపుతున్నారని తొలుతనే అన్నాను కదా. దీనిపై పునరాలోచన చేస్తే ఆ అరుదైన, విలక్షణ శ్రద్ధ పూర్తిగా సమర్థనీయమే అన్న అభిప్రాయం సునిశ్చితంగా కలుగుతోంది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Read more