నాటి బెంగాల్ మార్క్సిస్టులు, నేటి భారత్ కమలనాథులూ ఒకటే!

ABN , First Publish Date - 2022-09-24T07:04:44+05:30 IST

ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తం చేసి, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినా నరేంద్రమోదీ పార్టీ జాతీయస్థాయిలో ఎదురులేనిశక్తిగా విజృంభిస్తోంది...

నాటి బెంగాల్ మార్క్సిస్టులు, నేటి భారత్ కమలనాథులూ ఒకటే!

ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తం చేసి, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినా నరేంద్రమోదీ పార్టీ జాతీయస్థాయిలో ఎదురులేనిశక్తిగా విజృంభిస్తోంది. గతంలో పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు, సిపిఎం చేసిన దానినే నరేంద్రమోదీ, బీజేపీ ఇప్పుడు జాతీయస్థాయిలో అనుకరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. జ్యోతిబసు ప్రభుత్వం వివేకవంతమైన పాలన అందించి ఉంటే బెంగాల్ ఈ పాటికి రాష్ట్రాలలో అగ్రగామిగా ఉండేది. ‘బెంగాల్ నేడు ఆలోచించిందే, భారత్ రేపు ఆలోచిస్తుంది’ అన్న సుభాషితం మరోవిధంగా సత్యమే.


నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జయకేతనాలు ఎగురవేస్తోంది. గత రెండు సార్వత్రక ఎన్నికలలోనూ సొంత బలంతో మెజారిటీ సీట్లను గెలుచుకున్నది. ఒకప్పుడు పశ్చిమ, ఉత్తర భారతావనికే పరిమితమైన ఈ పార్టీ ప్రభావం ఇప్పుడు తూర్పు, దక్షిణాది రాష్ట్రాలలో కూడా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. జాతీయ రాజకీయాలలోకి మోదీ రాక పూర్వం, బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించగలదని, అసోంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తెలంగాణలో అధికారసాధనకు చేరువవుతుందని ఎవరు ఊహించారు?


అయితే, బీజేపీ విజయాలు సమర్థ పాలనకు ఆలంబనలు కావడం లేదు. 2014 మేలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత భారత్ ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా పథభ్రష్టమయింది. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు బలహీనపడ్డాయి. కొవిడ్ ఉపద్రవానికి ముందే నోట్లరద్దు, అవకతవకల జీఎస్టీ ఆర్థిక వ్యవస్థను కుదేలుపరిచాయి. కరోనా కాలంలో ప్రధాని మోదీ విధానాలు మరింత అపకారం చేశాయి. మున్నెన్నడూ లేని విధంగా మోదీ పాలనలో కొద్ది మంది ఆశ్రిత పెట్టుబడిదారుల చేతుల్లో అపార సిరిసంపదలు కేంద్రీకృతమవుతున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక కార్యకలాపాలలో కార్మికుల భాగస్వామ్యం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. కేంద్ర హోం మంత్రి పర్యవేక్షణలో ముస్లింలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రంలో ఆ విధానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరింత పటిష్ఠంగా అమలుపరుస్తున్నారు. ఫలితంగా అసలే సున్నితమైన మన సామాజిక చట్రం మరింతగా ధ్వంసమయింది. మన ఉత్కృష్ట విశ్వవిద్యాలయాలు, ప్రశస్త పరిశోధనా సంస్థలకు వైస్ ఛాన్సలర్ల/డైరెరక్టర్ల నియామకాలు ప్రతిభాపాటవాల ఆధారంగా కాకుండా భావజాల ప్రాతిపదికన చేస్తుండడంతో శాస్త్ర పరిశోధనల పురోగతి, జ్ఞాన సృష్టికి తీవ్ర, తీరని నష్టం సంభవించింది. స్వతంత్ర ప్రతిపత్తిగల కొన్ని రాజ్యాంగ సంస్థలు హిందూత్వ భావజాలానికి ఉపకరణాలుగా మారాయి. మరి కొన్ని పాలకపక్షానికి సన్నిహితులైన పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.


మొత్తం మీద మోదీ ప్రభుత్వ పాలనా విజయాలు ఘనమైనవి కావు. వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల రికార్డు కంటే మోదీ సర్కార్ రికార్డు తీసికట్టే. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టపరిచి తద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినా, (ఈ వ్యాసం రాస్తున్న సమయంలో) నరేంద్ర మోదీ పార్టీ జాతీయ స్థాయిలో ఎదురులేని శక్తిగా విజృంభిస్తోంది! ఈ ఏడాది తొలి నెలల్లో ఐదు రాష్ట్రాల శాసనసభా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో జైత్రయాత్ర చేసిన బీజేపీ, 2024 సార్వత్రక ఎన్నికలలో మరోసారి జయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమిటి ఈ పార్టీ బలం? అపార ఆర్థిక వనరులు, మొక్కవోని సైద్ధాంతిక నిబద్ధత, సంస్థాగత సామర్థ్యం, ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ, మరీ ముఖ్యంగా విశ్వసనీయ జాతీయ ప్రతిపక్షం కొరవడడమేనని చెప్పి తీరాలి.


ఆధునిక భారతదేశ చరిత్రకారునిగా విస్తృత స్థాయిలో గమనార్హంలోకిరాని ఒక సమాంతర దేశీయ ఉదాహరణను కూడా పేర్కొనదలిచాను. గతంలో పశ్చిమ బెంగాల్‌లో జ్యోతి బసు, సిపిఐ(ఎం) చేసిన దానినే నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ స్థాయిలో అనుకరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. సిపిఎం ప్రధాన భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కోల్‌కతాలో వరుసగా 34 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఈ కాలంలో జ్యోతి బసు 23 ఏళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనేమీ ప్రభావశీల, సమర్థ ముఖ్యమంత్రి కాదు. 1977లో జ్యోతిబసు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉంది. విద్యారంగంలో అన్ని స్థాయిలలో ఉత్కృష్ట ప్రమాణాలు వర్థిల్లుతున్నాయి. సాంస్కృతిక రంగం దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. జ్యోతి బసు ప్రభుత్వం వివేకవంతమైన పాలననందించి ఉంటే బెంగాల్ ఈ పాటికి, దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో అగ్రగామిగా ఉండేది. కాని అలా జరగలేదు. ఎందుకని? ఫ్యాక్టరీల నిర్వహణలో ట్రేడ్ యూనియన్లకు వీటో అధికారాలు కల్పించారు; ప్రభుత్వ యంత్రాంగం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నిర్దేశించేందుకు అలీముద్దీన్ స్ట్రీట్‌లోని పార్టీ బాస్‌లను అనుమతించారు; అంతేకాదు, విశ్వవిద్యాలయాల నియామకాలలో కూడా పార్టీ బాసులదే తుది మాటగా చెల్లుబడి అయింది. తద్వారా జ్యోతిబసు, సిపిఎంల పాలన బెంగాల్ ఆర్థిక పురోగతి సుదీర్ఘకాలం పాటు స్తంభించిపోవడానికి దారితీసింది. బెంగాల్‌లో ప్రభవించి, వర్థిల్లుతున్న అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సిపిఎం అనుసరించిన విధానాలతో మేధావులు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలసపోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల పురోభివృద్ధికి తాము విశేషంగా దోహదం చేశామని బెంగాల్ మార్క్సిస్టులు ఘనంగా చెప్పుకోవడం కద్దు. వాస్తవమేమిటి? గతంలో బాగా వెనుకబడి ఉన్న, చారిత్రకంగా భూస్వామ్య రాజ్యమైన కొండ ప్రాంతాల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ ఇప్పుడు విద్య, వైద్య, వ్యవసాయక అభివృద్ధి మొదలైన రంగాలలో పశ్చిమ బెంగాల్ కంటే చాలా మెరుగ్గా ఉంది.

కేరళలో సిపిఎం పాలన, బెంగాల్‌లో అదే పార్టీ అందించిన పాలనకు భిన్నమైనది. ఆ దక్షిణాది రాష్ట్రంలో 19, 20 శతాబ్దాలలో కుల నిర్మూలన, జెండర్ సమానత్వ సాధనకు జరిగిన ఉద్యమాలు, పోరాటాల నుంచి స్ఫూర్తి పొందిన పార్టీ సిపిఎం. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అధికారానికి వస్తున్న కారణంగా కేరళలో సిపిఎం నిర్దిష్ట జవాబుదారీతనంతో వ్యవహరించడం అనివార్యమూ, పరిపాటి అయింది కేరళలో మానవాభివృద్ధికి సిపిఎం ప్రభుత్వాలు అందించిన తోడ్పాటు, సాధించిన విజయాలు మార్క్సిస్టులు సగర్వంగా చెప్పుకోదగ్గవి అనడంలో సందేహం లేదు. బెంగాల్‌లో కామ్రేడ్లకు ఇటువంటి పరిస్థితిలేదు. అయినప్పటికీ సిపిఎం రెండు దశాబ్దాల పాటు వరుస విజయాలు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీకి కార్యకర్తలు అత్యధికంగా ఉన్నారు. సైద్ధాంతిక నిబద్ధులు. పార్టీ అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించే కార్యదక్షులు. సిపిఎం ప్రజా ముఖం జ్యోతిబసు. సభ్యత సంస్కారాల సమున్నతుడు. కోల్‌కతా మధ్యతరగతి వర్గాల వారి ప్రశంసలను అమితంగా పొందిన నేత.


సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టి విషయాలలో బెంగాల్‌లో జ్యోతి బసు ప్రభుత్వం, కేంద్రంలో మోదీ సర్కార్ గురించి చెప్పుకోదగింది ఏమీ లేదు. అయితే లక్షిత సంక్షేమ పథకాల విషయంలో ఈ ఉభయ ప్రభుత్వాలూ కొంత విజయాన్ని సాధించాయి. ‘ఆపరేషన్ బర్గా’ కింద సాగుదారులకు బెంగాల్ లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం భూ హక్కులు కల్పించింది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ప్రోత్సహించిన వంటగ్యాస్, ఉచిత రేషన్ల పథకాలతో దానిని పోల్చవచ్చు. ఎన్నికల సమయంలో తగుమాత్రంగానైనా జనహితానికి తోడ్పడుతుంది తామేనని అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వాలకు అవి వీలు కల్పించాయి. ఎన్నికలలో వాటి వరుస విజయాలకు ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.


గడచిన కాలంలోని పశ్చిమ బెంగాల్‌కు, వర్తమానంలోని భారత్‌కు మధ్య ఉన్న ఈ రాజకీయ తుల్యతలు గమనార్హమైనవి. అయితే కొన్ని ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి. జాతీయ రాజధాని పట్ల ఒక రాష్ట్రం చూపిన వ్యతిరేకత, విద్వేషం, మతపరమైన అధిక సంఖ్యాకులు, మత మైనారిటీల పట్ల ప్రదర్శిస్తున్న విద్వేషం వలే సామాజిక సామరస్యానికి హానికరం కాదు. పాలకుడుగా జ్యోతి బసు ఎలాంటి వాడయినప్పటికీ, నరేంద్ర మోదీ వలే తన వ్యక్తి పూజను ప్రోత్సహించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. సభ్యత ఉన్న వ్యక్తి, ఔచిత్యం తెలిసిన నేత జ్యోతి బసు. ఇటువంటి సుగణాలు మన ప్రస్తుత ప్రధానమంత్రిలో పూర్తిగా లోపించాయి. మైనారిటీ వర్గాల హక్కులను కాపాడేందుకు మోదీ వలే కాకుండా జ్యోతి బసు సదా ప్రయత్నించారు. మరో ప్రధాన వ్యత్యాసాన్ని కూడా తప్పక ప్రస్తావించవలసి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు తన నియంత్రణలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. 2014 నుంచి సిబిఐ అరెస్ట్ చేసిన లేదా దాని దాడులకు గురైన రాజకీయవేత్తలలో 95 శాతం మంది ప్రతిపక్షాలకు చెందినవారేనని ఇటీవలే ఒక జాతీయ దినపత్రిక వెల్లడించింది. ఈ వ్యత్యాసాలకు భిన్నంగా పాలనా పద్ధతులు, ఫలితాలలో సాదృశ్యాలు గమనార్హమైనవి. శాసనసభా ఎన్నికలలో వరుస విజయాలు సుపరిపాలనకు, శ్రేయోసాధనకు హామీ కాదని అత్యవసర పరిస్థితి అనంతర పశ్చిమ బెంగాల్ చరిత్ర రుజువు చేసింది. దేశాన్ని మరింతగా అధోగతి పాలు చేస్తూ సార్వత్రక ఎన్నికలలో విజయపరంపరను బీజేపీ కొనసాగిస్తే నవ భారత ఇతిహాసమూ బెంగాల్ కథే అవుతుంది. ‘బెంగాల్ నేడు ఆలోచించిందే, భారత్ రేపు ఆలోచిస్తుంది’ అన్న అనుభవశీల సుభాషితం సత్యమని మరోసారి నిరూపితమవుతోంది- కాకపోతే ఇంతకు ముందు వలే కాకుండా ఒక నిరాశామయ, మరింత కపట రీతిలో!

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Read more