థరూర్‌ ఆవేదన

ABN , First Publish Date - 2022-10-14T06:22:19+05:30 IST

‘అభ్యర్థులకు సమాన అవకాశాలులేని ఎన్నికల బరి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శశిథరూర్ చేసిన వ్యాఖ్య పార్టీమీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు కానీ...

థరూర్‌ ఆవేదన

‘అభ్యర్థులకు సమాన అవకాశాలులేని ఎన్నికల బరి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శశిథరూర్ చేసిన వ్యాఖ్య పార్టీమీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు కానీ, ఈ ప్రక్రియను అవహేళన చేస్తున్న అధికారపక్షానికి మాత్రం మంచి ఆయుధాన్ని సమకూర్చింది. తొమ్మిదివేలమంది ప్రతినిధులూ తమకు నచ్చినవారికి నిర్భయంగా ఓటేసుకోవచ్చని అంటూ కాంగ్రెస్ ఎన్నికల అధికారి మధుసూదన్‌ మిస్త్రీ బుధవారం ఉపయోగించిన పదాన్నే థరూర్ ఇప్పుడు వ్యతిరేకంగా ప్రయోగించారు. మల్లికార్జున్ ఖర్గేకు మద్దతుగా అనేకమంది పీసీసీ అధ్యక్షులు, నేతలు బారులు తీరుతున్నారనీ, తన విషయంలో అలా జరగడం లేదని అన్నారాయన. చివరకు ఫోన్ నెంబర్లు లేని ప్రతినిధుల జాబితా తనకు ఇచ్చారనీ, ప్రచారానికి తాను మీడియామీద ఆధారపడవలసి వస్తున్నదని వాపోయారు ఆయన. 


మిస్త్రీని ఏమీ అనడం లేదని అంటూనే థరూర్ చేసిన విమర్శలు చిన్నవేమీ కావు. ఖర్గే బరిలోకి దిగడంతోనే గాంధీ కుటుంబం మద్దతు ఆయనకే అన్న ప్రచారం ఊపందుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం దీనిని తుంచేందుకు కానీ, అడ్డుకట్టవేసేందుకు కానీ ఏ ప్రయత్నమూ చేయలేదు. పైగా, థరూర్ విమర్శకు అనుగుణంగానే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆహ్వానాలు, స్వాగతాలు ఎలాగూ లేకపోగా, ఆయన వస్తున్నారని తెలిసి రాష్ట్ర నాయకులు ముందే తప్పుకోవడం, వెళ్ళినా పలకరించేవారు లేకపోవడం, మొహమాటానికి రమ్మనిపిలిచి, వచ్చేలోగా మాయమైపోవడం వంటి ఘట్టాలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. అభ్యర్థులు ఇద్దరూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఖర్గే పార్టీ ‘అధికారిక అభ్యర్థి’ అన్న వాదనకు తగినట్టుగానే పరిస్థితులున్నందున, ఆయనను ఒకలా, నన్నొకలా చూస్తున్నారన్న థరూర్ ఆవేదన అనుచితమైనదేమీ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు తమ అప్రకటిత అధ్యక్షుడికి హారతులు పడుతుంటే, థరూర్ ఒంటరి పోరాటం చేయవలసి వస్తున్నది. స్వరాష్ట్రం కేరళ సహా చాలా రాష్ట్రాల పీసీసీ అధినాయకులు ఖర్గేను శ్లాఘిస్తూ, రేపు ఓటువేయబోతున్నవారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఖర్గే నామినేషన్ ఘట్టంలోనే భవిష్యత్ చిత్రం ఏమిటో థరూర్‌కు అర్థమైపోయి ఉంటుంది. రాహుల్ చెప్పిన మేరకే తాను పోటీలో కొనసాగుతున్నానని అంటున్న థరూర్ ఈ విషయంలో ముందే తేల్చుకొని ఉంటే బాగుండేదేమో! ఖర్గే నామినేషన్ ఘట్టం కాంగ్రెస్ దిగ్గజాలతో కళకళలాడిపోవడం, థరూర్ నామినేషన్ ఇందుకు భిన్నంగా సాగడంతోనే అప్రకటిత సందేశం కిందకు చేరిపోయింది. ఓటువిలువ సీనియర్లకు, జూనియర్లకు సమానమేననీ, కొందరు సీనియర్లు తనకు రహస్యంగా అభినందనలు తెలియచేస్తున్నారనీ, తనకు ఓటేసే ప్రతినిధులు ఎవరికీ భయపడనక్కరలేదని థరూర్ చెప్పుకోవలసి రావడం విచారకరం. 700మంది ప్రతినిధులున్న తమిళనాడులో కేవలం 12మంది ఆయన సమావేశానికి హాజరైతే, అప్పటికప్పుడు కుర్చీలు నింపడానికి బయటివారిని తెచ్చి కూర్చోబెట్టారట. తనకు రహస్యమద్దతు ఉన్నదని థరూర్ చెప్పుకుంటున్నప్పటికీ, అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్న ఇదేతరహా దృశ్యాలు భవిష్యత్ ఫలితాన్ని దాదాపుగా చెప్పేస్తున్నాయి. 


తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోకుండా, అవమానాలకు ఎదురొడ్డుతూ పోరాడుతున్న థరూర్ రేపు నెగ్గకపోయినప్పటికీ అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న మాట వాస్తవం. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని గాంధీలు నియంత్రిస్తారన్న వ్యాఖ్యలపై రాహుల్ ఇటీవలే మండిపడ్డారు. ఇది పోటీచేస్తున్న అభ్యర్థులిద్దరినీ అవమానించడమేననీ, వారిద్దరూ ఉన్నతులు, నిష్ణాతులని రాహుల్ కీర్తించారు. కానీ, థరూర్ కు ఎదురవుతున్న అవమానకరమైన పరిస్థితులను మాత్రం గుర్తించనట్టు ఊరుకుంటున్నారు. ప్రత్యర్థులకంటే స్వపక్షమే ఆయనను ఇలా అవమానిస్తున్నప్పుడు గాంధీలు నోరుమెదపకపోడం విచిత్రం, విషాదం. ఇంతోటిదానికి, గాంధీలు పోటీపడని అధ్యక్ష ఎన్నిక అని చెప్పుకోవడం ఎందుకు, నిష్పక్షపాతంగా జరుగుతాయని అనడం ఎందుకు? దీనికి బదులు ఖర్గేనే కూచోబెడితే సరిపోయేది. ఆరంభంలోనే గెహ్లోత్ ఉదంతం పార్టీకి ఎంతో నష్టం చేసింది. ఇప్పుడు ప్రక్రియలో ఏ మాత్రం ప్రజాస్వామిక లక్షణాలు లేకపోతే పార్టీకి అంతకంటే అవమానం ఉండదు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ క్షణాల్లోనైనా సోనియాగాంధీ స్వయంగా ‘హైకమాండ్ అభ్యర్థి’ అంటూ ఎవరూ లేరని, నచ్చినవారిని ఎన్నుకోమని పార్టీ ప్రతినిధులకు విస్పష్ట సందేశాన్నిస్తే తప్ప పరువు దక్కదు.

Updated Date - 2022-10-14T06:22:19+05:30 IST