తెలుగు మెడ మీద ఫ్రెంచి కత్తి

ABN , First Publish Date - 2022-11-19T01:22:58+05:30 IST

నిజాముల దగ్గర డేరా వేసిన ఫ్రెంచి దొర బుస్సీ. అతనే బొబ్బిలియుద్ధంలో పాల్గొన్నాడు. అతనికి చాలా కర్కోటకుడన్న పేరున్నదేమో, బూచాడన్న పేరు బుస్సీ నుంచే వచ్చిందని చెప్పుకుంటారు.

తెలుగు మెడ మీద ఫ్రెంచి కత్తి

నిజాముల దగ్గర డేరా వేసిన ఫ్రెంచి దొర బుస్సీ. అతనే బొబ్బిలియుద్ధంలో పాల్గొన్నాడు. అతనికి చాలా కర్కోటకుడన్న పేరున్నదేమో, బూచాడన్న పేరు బుస్సీ నుంచే వచ్చిందని చెప్పుకుంటారు. బొబ్బిలియుద్ధం జరిగిన సమయానికి అటూ ఇటూగా ఐరోపా సామ్రాజ్యవాదుల మధ్య ఏడు సంవత్సరాల సముద్రయుద్ధం మొదలయింది. అందులో ఇంగ్లండ్ గెలిచి, ఫ్రాన్స్ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమి లేకపోతే, ఫ్రెంచి విప్లవం జరిగేది కాదేమో? ఇంగ్లండే ఓడిపోయి ఉంటే, ఫ్రాన్సే మన వలసపాలక దేశం అయి ఉంటే, ఏమి జరిగి ఉండేది? ఇదొక ఆసక్తికరమైన ఊహాత్మక ప్రశ్న. ఆ ప్రశ్నకు మొత్తంగా సమాధానం చెప్పడం కష్టమే అయినా, ఒక సులువైన జవాబు మాత్రం చెప్పుకోవచ్చు. అది, మన దేశంలో ఫ్రెంచి రాజభాషగా, బోధనాభాషగా, జ్ఞానభాషగా చెలామణిలో ఉండేది. పాండిచ్చేరిలోనో, మన యానాంలోనో ఉన్నట్టు అరకొర ఫ్రెంచి కాక, పూర్తి పరాసుభాష దేశమంతా ఉండేది.

అప్పుడు జరగనిదానిని ఇప్పుడు సాధించాలనేమో, మన దేశంలో భాషను విస్తరించాలని ఫ్రాన్స్ వారు పట్టుదలగా ఉన్నారు. మన పాలకులు, ముఖ్యంగా ఘనత వహించిన రెండు తెలుగు రాష్ట్రాలవారు అందుకు ఎర్రతివాచీ పరచి సహకరిస్తున్నారు. ఫ్రెంచి భాష చదివితే గ్లోబల్ ఉద్యోగాలు వస్తాయట, అందుకని నేర్చుకోవాలట, యూనివర్సిటీలలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారట. నేర్చుకోవడానికి విముఖంగా ఉండనవసరం లేదు. ఫ్రెంచి, స్పానిష్, జర్మన్ భాషలు నేర్చుకుంటే మంచిదే. జర్మన్ భాష రెండు మూడు ఐరోపా దేశాలలో విస్తరించి ఉన్నది. ఫ్రాన్స్, స్పెయిన్ ప్రపంచంలో విస్తృతమైన వలసవాద చరిత్ర కలిగి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో స్పానిష్, ఆఫ్రికా ఖండంలోను, కరేబియన్ దేశాలలోను ఫ్రెంచి ఉనికి బాగా ఉంది. ఇంగ్లీషుతో పాటు ఈ భాషలు వచ్చినవారికి నిజంగానే మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అట్లాగని, మబ్బుల్ని చూసి కుండలో నీళ్లు పారబోసుకుంటామా?

విదేశీభాషలు నేర్చుకోవడానికి ఇంతకు మునుపే మన దగ్గర అవకాశాలున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను, ఉస్మానియాలోనూ ఫ్రెంచి, జర్మన్ భాషలలో ప్రత్యేక డిప్లమో కోర్సులు ఉన్నాయి. ఇంగ్లీషు, విదేశీభాషల అధ్యయనానికి హైదరాబాద్‌లో ఒక విశ్వవిద్యాలయమే ఉన్నది. జర్మన్ భాష నేర్చుకోవడానికి జర్మనీ దేశ సాంస్కృతిక సంస్థ ‘గెథె జంత్రమ్’ లో బోధనాకోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాన్స్ దేశ సాంస్కృతిక సంస్థ ‘అలయంజ్ ఫ్రాంసెస్’ ద్వారా ఫ్రెంచి భాష నేర్చుకునే మార్గాలున్నాయి. ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ, పట్టభద్ర తరగతులలో ద్వితీయభాషగా ఫ్రెంచిని ప్రవేశపెట్టడం అవసరమా? అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు విద్యను పూర్తిగా అణగార్చడం న్యాయమా? ఇప్పుడు క్రెడిట్ల పద్ధతి వచ్చింది, డిగ్రీలలో కనీస క్రెడిట్లకు అదనంగా ఎన్ని కోర్సులయినా తీసుకోవచ్చు. అటువంటి అదనపు కోర్సుగా విదేశీభాషలను పెట్టవచ్చు. లేదా, డిగ్రీ కోర్సులలో మూడు ప్రధానాంశాలలో ఒకటిగా తీసుకునే అవకాశం కల్పించవచ్చు. ద్వితీయభాష అన్నది డిగ్రీస్థాయిలో మాతృభాషకు, స్థానికభాషలకు ఉద్దేశించినది. ఇదివరకే ఇంటర్మీడియేట్‌లో ద్వితీయభాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టి, తెలుగుకు స్థానం లేకుండా చేశారు. ఇప్పుడు డిగ్రీలో కూడా అదే ఊచకోత కొనసాగుతున్నది. పోయిన మేలోనే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుని, మొదటగా ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో వెంటనే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎందరు విద్యార్థులు తీసుకున్నారో, ఎందరు ఫ్రెంచి బోధకులు సిద్ధమయ్యారో తెలియదు కానీ, వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ కళాశాలలకు విస్తరించే ఉద్దేశ్యాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇంగ్లీషు మీడియాన్ని ఒక సైద్ధాంతిక అంశంగా ముందుకు తీసుకువెడుతున్న అక్కడి ప్రభుత్వానికి, తెలుగు ప్రతిపత్తి గురించి పెద్ద పట్టింపు ఉంటుందని ఆశించలేము.

ఇంటర్మీడియేట్‌లో ద్వితీయభాషగా సంస్కృతాన్ని ఎంచుకోవడానికి, మార్కులు గరిష్ఠంగా వచ్చే అవకాశమే కారణం. విద్యార్థులు సంస్కృతంలో అద్భుతంగా చదివేసినందువల్ల, ఆ మార్కులు రావడం లేదు. మూల్యాంకన విధానం అట్లా ఉన్నది. రెండు ముక్కలు సరిగ్గా రాసినా, మంచి మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెంచి బోధనలో కూడా అదే తీరు ఉండవచ్చు. డిమాండ్ బట్టి మాత్రమే ఫ్రెంచిని ప్రవేశపెడతాం అంటున్నారు కానీ, డిమాండ్ ఉంటుందన్న ప్రచారానికి ఏమీ తక్కువ ఉండదు కదా? ఇంటర్‌లోను, డిగ్రీలోను తెలుగులేకపోతే, ఇక తెలుగులో పీజీ చేసేదెవరు? తెలుగును బోధించగలిగే అధ్యాపకులెట్లా? ఇక తెలుగు విశ్వవిద్యాలయం అవసరం ఏమిటి? అభిరుచి కొద్దీ లేదా ఇతర కారణాలతో ఇప్పుడు తెలుగు చదువుతున్నవారికి ఉపాధి అవకాశాలేవీ?

వేదికలెక్కినప్పుడు ఏదో మాటవరసకు మాతృభాష, తెలుగు రక్షణ అంటూ ఉంటారు పాలకులు, అధికారులు. విధాన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆ మాటలేవీ గుర్తుండవు. తెలుగు భాషను మాధ్యమంగా, అధ్యయనాంశంగా మిగల్చడం అన్నది తెలుగు మాట్లాడేవారి అభివృద్ధిలో భాగంగా గుర్తించకపోతే, దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది. ఇంగ్లీషును కాదంటున్న భాషలుగా ఫ్రాన్స్, జర్మన్, చైనీస్, స్పానిష్ ప్రపంచంలో ఇప్పుడు నిలబడ్డాయి. మనం వాటిని నేర్చుకోవడానికి ఉత్సాహపడుతున్నాము. సొంత భాషలను నిలుపుకోవడం ఎట్లాగో వాటిని చూసి నేర్చుకోవాలి. మన దేశభాషలకు కూడా ఎప్పుడో ప్రతిష్ఠ, చెల్లుబాటు పెరుగుతాయి. అప్పటిదాకా, భాషాదీపాలను కాపాడుకోవాలి.

Updated Date - 2022-11-19T01:23:01+05:30 IST