గాయపడిన నేతల గాండ్రింపులు!

ABN , First Publish Date - 2022-09-07T10:03:39+05:30 IST

ప్రజల మధ్య మతాల వారీ విభజనకు బిజెపి విద్వేష రాజకీయాలతో ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు కృషిచేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు...

గాయపడిన నేతల గాండ్రింపులు!

ప్రజల మధ్య మతాల వారీ విభజనకు బిజెపి విద్వేష రాజకీయాలతో ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు కృషిచేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు. దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడివే వాక్యాలను వల్లెవేస్తున్నారు. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐలను ప్రయోగించడం, ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనాలు సమకూర్చడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, నిరుద్యోగం, అధిక ధరలు, అగ్నిపథ్, సరిహద్దుల్లో చైనా చొరబాటు వంటి అనేక అంశాలపై విపక్షాల మధ్య ఐక్యత నెలకొన్నది. ఆర్థిక అంశాలపై కూడా వాటిమధ్య ఏకాభిప్రాయం నెలకొని ఉన్నట్లు కనపడుతోంది.


‘మరల నిదేల రామాయణంబన్నచో ఈ ప్రపంచకమెల్ల వేళల యందు తినుచున్నయన్నమే తినుచున్నదిన్నాళ్లు’ అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన వాక్యాల్లో అత్యంత గూఢార్థం లేకపోలేదు. చరిత్ర ఏ విధంగా పునరావృతమవుతుందో అదే విధంగా పోరాటాలు, ఘర్షణలు కూడా పునరావృతమవుతాయి. ఈ సత్యం తెలిసినందువల్లే నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మరోసారి సంఘటితమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ ప్రతిపక్షాలు బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ను జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోనూ నిర్మించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలనన్నిటినీ మోదీ తుత్తునియలు చేశారు. ఆయన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇంట గెలువకుండా రచ్చ గెలువడం అసాధ్యమని భావించిన కొందరు నేతలు తమ పోరాటాన్ని విరమించుకుని తమ ఇళ్లను చక్కబెట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పోరాటం చేయడం అంత సులభం కాదు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడే ఆయన గుజరాత్ పీఠంపై కన్నువేసి రకరకాల అడ్డంకులను తొలగించుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికైన తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి పదవికి కూడా పార్టీలో తనకు ప్రత్యర్థి లేకుండా చూసుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలోనే కాదు, దేశంలోనే తనకు ప్రత్యర్థి లేకుండా చూసుకోవడంలో ఆయన ఇప్పటి వరకూ విజయవంతమయ్యారు.


అంత మాత్రాన ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయి నిస్తేజంగా, స్తబ్దంగా ఉండిపోతారని మోదీ భావించడం పొరపాటు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్నవారిని జైళ్లకు పంపిన తర్వాత, సోనియా, రాహుల్‌లను సైతం ఈడీ కార్యాలయాల చుట్టూ తిప్పిన తర్వాత భీతిల్లిన ప్రతిపక్షాలు తమ గాయాలు మానకముందే సమర శంఖారావం పూరిస్తున్నాయి. 1967 నుంచి ఇప్పటి వరకూ 15సార్లు చట్టసభలకు ఎన్నికై 32వ ఏట రాష్ట్ర మంత్రిగా, 38వ ఏట ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన శరద్ పవార్ తన 81వ ఏట ఇంకా మోదీ ధాటికి తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రఫుల్ల పటేల్, నవాబ్ మాలిక్‌తో పాటు అనేకమంది ఎన్‌సిపి నేతలు ఈడీ ఉచ్చులో ఉన్నారు. ‘మీ చిటికెన వ్రేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని మోదీ అంటున్నారు కదా’ అని ఇటీవల ఒక విలేఖరి ప్రశ్నించినప్పుడు ‘దాని వల్ల నాకింత నష్టం జరుగుతుందని అప్పుడూహించలేదు..’ అని ఆయన వ్యాఖ్యానించారు. 1985లో మోదీ ఆర్ఎస్ఎస్ నుంచి బిజెపిలోకి ప్రవేశించే నాటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభలో సభ్యురాలు. తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న తన కుడిభుజం పార్థాబెనర్జీ ఈడీ కస్టడీలోకి వెళ్లిన తర్వాత ఆమె తనకు సమయం అనుకూలంగా లేదని మౌనం పాటించవలిసి వచ్చింది. కేసీఆర్ కూడా మోదీ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. నితీశ్ కుమార్ కూడా మోదీ కంటే ఎంతో ముందు 1985లో ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ టార్గెట్‌గా ఈడీ, సిబిఐ ఇప్పటికే రంగంలోకి దూకాయి. నితీశ్ కుమార్ బిజెపిని వదుల్చుకుని ఆర్‌జెడితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మణిపూర్‌లో ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడాన్ని చూస్తే బిహార్ పరిణామాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోయిందని స్పష్టం అవుతుంది. బిజెపిలో తనకంటే సీనియర్లు అయిన నేతలను ఇంటికి పంపించడంతో విజయం సాధించిన మోదీ, ఇవాళ రాజకీయాల్లో తనకంటే సీనియర్ నేతలైన పవార్, నితీశ్, మమత, కేసీఆర్ తదితరులను సాగనంపేందుకు పోరును ఉధృతం చేశారు.


గదుల్లో బంధించిన పిల్లులు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు ఒక రకంగా తన చర్యల ద్వారా మోదీ, బిజెపి వ్యతిరేక పార్టీలు ఏకం అయ్యేందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తన వ్యతిరేక శక్తులన్నీ తనను ఎదుర్కొనేందుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను అనుసరించేందుకు ప్రేరేపిస్తున్నారు. అందువల్ల నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు శరద్ పవార్, మాజీ ప్రధాని దేవెగౌడ ఒకే రకమైన సైద్ధాంతిక పరిభాషను ప్రయోగిస్తున్నారు. బీహార్ పరిణామాల తర్వాత దేశంలోని ఒకప్పటి జనతాదళ్ పరివార్ రాజకీయ ప్రత్యామ్నాయంగా తలెత్తే అవకాశం ఉన్నదని జనతాదళ్ (సెక్యులర్) నేత మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. జనతాదళ్ పరివార్ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులను అందించిన విషయం ఆయన గుర్తు చేశారు. బిహార్ పరిణామాలతో 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల మహా కూటమి అవతరించేందుకు మంచి అవకాశం ఉన్నదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం నిర్మించాల్సిన అవసరం ఉన్నదని ఎన్‌సిపి నేత శరద్ పవార్ నొక్కి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరందరికంటే ఒక అడుగు ముందుకు వేసి దేశంలో బిజెపి ముక్త్ భారత్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. బిహార్‌లో కేసీఆర్ తనను కలిసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి సార్వత్రక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయాలన్నదే తన లక్ష్యం అని ప్రకటించారు. కేసీఆర్ మాదిరి ఆయన కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జనతాదళ్ (ఎస్) అధినేత కుమారస్వామి తదితరులను కలుసుకున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే 2024 ఎన్నికలకు ఎంతో ముందు ప్రతిపక్ష ఐక్యతకు రంగం సిద్ధమవుతున్నట్లు కనపడుతోంది.


కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్ ఆలోచనను కూడా ప్రక్కన పెట్టి కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే అభిప్రాయం దాదాపు అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. అంతే కాదు, ఈడీ, సిబిఐ దాడులకు ఏ మాత్రం భయపడకుండా ముందుకు వెళ్లాలన్న పట్టుదల కూడా ఈ పార్టీల్లో కనపడుతోంది. మరో వైపు ఈ పార్టీలన్నీ ఒకే సైద్ధాంతిక రాజకీయ కార్యాచరణ అనుసరించే అవకాశాలు లేకపోలేదని ఈ పార్టీల నేతల ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్నది సైద్ధాంతిక సమరమని రాహుల్ గాంధీ రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రకటించారు. ప్రజల మధ్య మతాల వారీగా విభజన చేసేందుకు బిజెపి విద్వేష రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడివే వాక్యాలను ప్రయోగిస్తున్నారు. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐలను ప్రయోగించడం, ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనాలు సమకూర్చడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, నిరుద్యోగం, అధిక ధరలు, అగ్నిపథ్, సరిహద్దుల్లో చైనా చొరబాటు వంటి అనేక అంశాలపై ప్రతిపక్షాల మధ్య ఐక్యత నెలకొన్నది. ఆర్థిక అంశాలపై కూడా వీరి మధ్య ఏకాభిప్రాయం నెలకొని ఉన్నట్లు కనపడుతోంది. గుజరాత్‌లో రాహుల్ గాంధీ రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడితే నిజామాబాద్‌లో కేసీఆర్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మోదీ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని దాదాపు బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ ప్రకటిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు కూడా ఒక కీలక ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎందరో రాజకీయనాయకులు రకరకాల యాత్రలు చేసి ఫలితాలను పొందారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ 1983లో దాదాపు ఆరునెలల పాటు జరిపిన 4500 కిమీ పాదయాత్రకు అద్భుత ప్రతిస్పందన లభించింది. కాని 1984లో ఇందిర మరణానంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కేవలం 10 సీట్లనే సాధించగలిగింది. తన రథయాత్ర ద్వారా బిజెపిని రాజకీయంగా బలోపేతం చేసిన లాల్ కృష్ణ ఆడ్వాణీ వాజపేయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చేసిన యాత్రల వల్ల ప్రత్యేక ఫలితాలు సాధించలేకపోయారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎవరూ యాత్రలు జరపలేదు. అందువల్ల రాహుల్ యాత్రకు ఎటువంటి ప్రతిస్పందన లభిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2019లో రెండవసారి కూడా కాంగ్రెస్ పరాజయం చెందిన తర్వాత, దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆత్మరక్షణలో పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తప్పని సరై కాంగ్రెస్ ఉనికిని కాపాడేందుకు ఈ యాత్రను చేపట్టవలసి వచ్చింది. ఈ యాత్రలో రాహుల్ చేసే ప్రసంగాలు, కలుసుకునే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఏర్పడే ఉత్సాహం పార్టీని సైద్ధాంతికంగా పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడవచ్చు. అరుణా రాయ్, యోగేంద్ర యాదవ్, బెజవాడ విల్సన్, పివి రాజగోపాల్ లాంటి మేధావులు, గాంధేయ వాదులు పాల్గొనడం ద్వారా ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఒక రాజకీయ పార్టీకి మించిన నైతిక అస్తిత్వాన్ని కల్పించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లుతోంది. ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు మరోసారి సన్నద్ధమవుతున్నాయి. ఒకేరకమైన భాషలో మాట్లాడుతున్నాయి. మరి 2024 సార్వత్రక ఎన్నికలలో మోదీని దీటుగా ఎదుర్కోగల ఐక్యతను అవి సాధించగలవా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రతిపక్ష నేతలు గతంలో కంటే ఎక్కువ పరిపక్వతతో వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి పదవి గురించి ప్రశ్న తలెత్తినప్పుడు కేసీఆర్, నితీశ్ కుమార్ స్పందించిన తీరు ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌లో ప్రతిపక్షాల ఐక్యతకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మోదీ ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారు. ఆయన అనుయాయులు మతాన్ని, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ అస్త్రాలను మోదీకి వ్యతిరేకంగా తిప్పిగొట్టేందుకు ప్రతిపక్షాలు తమ రాజకీయ సైద్ధాంతిక కార్యాచరణపై మరింత స్పష్టతను ఏర్పర్చుకోవాలి. అనేక శక్తులను, పాత మిత్రులను కలుపుకుపోవాలి. జీవన్మరణ సమస్యగా ఉధృత పోరు చేపట్టాలి. మోదీపై ప్రతిపక్షాల పోరు ఇప్పటికి మొదటి అంకంలోనే ఉన్నది కనుక రాజకీయాలు ఎటువైపు మలుపుతిరుగుతాయో ఇప్పుడే చెప్పలేము.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-09-07T10:03:39+05:30 IST