కొంచెం సిగ్గుండాలి!

ABN , First Publish Date - 2022-08-19T09:43:27+05:30 IST

తెలంగాణకు చెందిన సంగెం లక్ష్మీబాయి, చదువుకోవడానికి అనుకూలతలు లేక, గుంటూరులోని ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు నిర్వహించే శారదా నికేతనం వెళ్లారు...

కొంచెం సిగ్గుండాలి!

తెలంగాణకు చెందిన సంగెం లక్ష్మీబాయి, చదువుకోవడానికి అనుకూలతలు లేక, గుంటూరులోని ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు నిర్వహించే శారదా నికేతనం వెళ్లారు. చదువుకుంటూ కుటీర వృత్తులు నేర్చుకుంటూనే ఆమె, లక్ష్మీనారాయణతో పాటు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మతో పాటే జైలుకు వెళ్లారు. కొద్దికాలం గడిచాక, తిరిగి హైదరాబాద్ రావాలంటే, ఆమెకు లోలోపల భయం ఉండేదట. జైలుకు వెళ్లివచ్చాను, కుటుంబమూ చుట్టుపక్కలవాళ్లూ ఏమి అనుకుంటారో అని. అప్పటికి, అంటే, 1940ల మొదట్లో, తెలంగాణలో కోస్తా ఆంధ్రలో ఉన్నట్టుగా ప్రజా ఉద్యమాలు లేవు. చెరసాలల్ పృథుచంద్రశాలలయ్యె అనుకుంటూ జైళ్లకు సగర్వంగా వెళ్లే వాతావరణమూ లేదు. దేశభక్తితో జైలుకు వెళ్లినవారికి ఆంధ్ర ప్రాంతంలో ఎంతటి గౌరవమో కళ్లారా చూసి కూడా, తెలంగాణ సమాజంలో ఎట్లా పరిగణిస్తారో అని ఆమె భయపడ్డారు. తరువాత తరువాత తెలంగాణలో కూడా ప్రజా ఉద్యమాలు విస్తరించి, ఆదర్శవాదులు జైలుకు వెళ్లడం సర్వసాధారణం అయింది. లక్ష్మీబాయి తరువాత పార్లమెంటు సభ్యురాలై, రాష్ట్రమంత్రి కూడా అయి, ప్రజాసేవకురాలిగా ఖ్యాతి పొందారు.


ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడేవారు, నమ్మిన సిద్ధాంతాన్ని నిబద్ధతతో ఆచరించేవారు, ప్రభుత్వాలకు గిట్టని ఆదర్శాలను ఆచరించేవారు, వీరందరూ జైళ్లకు వెళ్లే అవకాశం ఉన్నవారే. ప్రస్తుతం కూడా ఇటువంటివారు అనేకులు నిర్బంధంలో ఉన్నారు. వారిని ప్రజలెవరూ నేరస్థులుగా పరిగణించరు. న్యాయవ్యవస్థ, జైళ్ల యంత్రాంగం కూడా వారిని భిన్నంగానే చూస్తాయి. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మోసగాళ్లు, వీళ్లు కూడా జైళ్లకు వెడతారు. వీరిని సమాజం చూడవలసిన పద్ధతిలోనే చూస్తుంది. అటువంటి వారిని దేశభక్తులుగానో, ఉదాత్తులుగానో పొరపాటు పడరు. ప్రజలకు స్పష్టంగా తెలుసు, ఎవరిని ఎట్లా చూడాలో? 


కానీ, రాను రాను తప్పుడు పనులకు జైళ్లకు వెళ్లవలసి వస్తున్న రాజకీయవాదులు, ఆర్థిక నేరస్థులు, అసాంఘిక నేరాలు చేసేవారు తామేదో దేశభక్తులమన్నట్టుగా గర్వపడడం పెరిగిపోయింది. ప్రజాధనాన్ని దిగమింగో, అధికార దుర్వినియోగంతో అక్రమంగా స్వార్థ ప్రతిఫలాలను పొందో జైళ్లకు వెళ్లినవారు, బెయిల్ మీద రావడాన్ని కూడా ఒక వేడుకగా జరుపుకోవడం చూశాం. అటువంటి వారిని కూడా ప్రజలు ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటుంటే, ఇక చిన్న చిన్న నాయకులకు అడ్డూ ఆపూ ఏముంటుంది? వ్యక్తిగతమో సామాజికమో ఆ చర్చ పక్కనబెడితే, బట్టలు లేని వీడియో బయటపడి రచ్చ అవుతుంటే, ముఖం చాటుచేసుకుని మౌనంగా ఉండవలసిన వాడు, ఏదో ఘనకార్యం చేసినట్టు బైకులతో, కార్లతో ఊరేగడం, సిగ్గుకే సిగ్గేసే వ్యవహారం.


ఇక గుజరాత్‌లో జరిగింది వెగటు, ఏవగింపు, జుగుప్స, చీదరింపు, నిస్పృహ కలిగే సంఘటన. తల్లుల మీదా పిల్లల మీదా అత్యాచారాలు చేసి, మగవాళ్లందరినీ చంపేసిన రేపిస్టులను, హంతకులను సత్ప్రవర్తన పేరుతో వదిలివేయడం ఒక ఎత్తు. వారికి దండలువేసి సన్మానం చేసి స్వాగతం చెప్పడం మరొక ఎత్తు. వీరికి క్షమాభిక్ష సిఫారసు చేసిన కమిటీలో గుజరాత్ అధికార బిజెపి శాసనసభ్యులు కూడా ఉన్నారట. ఆ సిఫారసును ప్రభుత్వం అంగీకరించింది. ఇంతటి కీలకమైన విడుదలను ఢిల్లీ అనుమతి లేకుండా చేస్తారని అనుకోలేము. స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో ఇటువంటి విడుదల వల్ల అప్రదిష్ఠ కలుగుతుందన్న సంకోచం కూడా లేకపోయింది. పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం విడుదలైన దోషులకు విశ్వహిందూ పరిషత్ వారి కార్యాలయంలో స్వాగతం చెప్పి దండలతో సన్మానించారట. ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉన్నాయి. పరిషత్‌కు చెందిన ఏ స్థాయి విభాగమో, వారి జాతీయ, రాష్ట్ర నాయకత్వం అనుమతితోనే అది జరిగిందో లేదో తెలియదు. మైనారిటీలపై హత్యాచారాలు చేసినవారిని సన్మానించడం హిందూ సమాజానికి గౌరవం కలిగిస్తుందా? సాధారణ హిందువులు దీనిని హర్షిస్తారా? రానున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విడుదలలు, స్వాగతాలు జరిగాయని అంటున్నారు. అవునా? అయితే, ఈ దోషుల చేత ఎన్నికల ప్రచారం కూడా చేయిస్తారా? బహుశా వారే హీరోలై మరో విడత అధికారం ఇప్పిస్తారు కాబోలు! అది గుజరాత్ సమాజానికి అవమానం కాదా? కీచకులను హంతకులను ధర్మరక్షకులుగా పరిగణించే రోజులు వచ్చాయా? రాబోయే తరాల వారికి మనం దేన్ని ఆదర్శంగా నిలబెడుతున్నాం?


విలువలకు విలువ లేని కాలంలో జీవిస్తున్నాము. మంచీ చెడ్డా అన్న పరిగణనకు ఒకప్పుడు విలువ ఉండేది. ఎంపిక చేసిన రాజకీయవాదుల మీదా, ఆలోచనాపరుల మీదా, మతవర్గం మీదా గురిపెట్టి మరీ కక్షసాధింపు చర్యలు తీసుకుంటే, సమాజం ఏమనుకుంటుందో అన్న సోయి లేదు. ఒకప్పుడు రాజకీయ విధేయతలను గొప్ప విలువగా పరిగణించిన చరిత్ర పెట్టుకుని, ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే పెద్దమనుషులు ఏమనుకుంటారో అన్న పట్టింపు లేదు. ఎటువంటి విచక్షణలూ లేని దేనినీ ఖాతరు చేయని ఏ వ్యవస్థకూ గౌరవం ఇవ్వని పరిపాలనలను చూస్తున్నాము. ఇదొక రకమైన బరితెగింపు. ముసుగులు తీసేసిన దిగంబరత్వం కాదు. సిగ్గూ లజ్జా వదిలేసిన నగ్నత్వం. జనసమ్మతిని ఆసరాగా చేసుకుని ఆడుతున్న ఆట. సంఘభయం ఉండాలి లేదా ధర్మభయం ఉండాలి, ఆత్మసాక్షి అయినా ఉండాలి. ఏదీ లేని కాలంలో జీవించడానికి మనకు ఎన్ని గుండెలుండాలి?

Updated Date - 2022-08-19T09:43:27+05:30 IST