యుద్ధం ముగుస్తుందా?

ABN , First Publish Date - 2022-12-24T01:48:59+05:30 IST

రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నోట ‘వార్‌’ అన్నమాట వినిపించడం ఇదే ప్రథమం.

యుద్ధం ముగుస్తుందా?

రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నోట ‘వార్‌’ అన్నమాట వినిపించడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానిని ఆయన ‘స్పెషల్‌ మిలటరీ ఆపరేషన్‌’ వంటి వేర్వేరు పదాలతో ఇంతకాలమూ ప్రస్తావించారు కానీ, ఇప్పుడు ఆయన నేరుగా పాశ్చాత్యదేశాల పదజాలాన్నే ప్రయోగించి ఇంటాబయటా చిక్కుల్లో పడ్డారు. ప్రత్యేకచట్టాలతో ‘యుద్ధం’, ‘చొరబాటు’ అన్నపదాలు నిషేధించి, అలా పేర్కొన్నవారిని శిక్షార్హులను చేస్తూ, ‘ప్రత్యేక సైనికచర్య’ పేరిట భారీగా పన్నులూ సెస్సులూ వసూలు చేసిన పుతిన్‌ ఇప్పుడు దానిని యుద్ధం అని తేల్చారనీ, ప్రజలదగ్గర విషయాన్ని దాచిపెట్టి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆయనపై న్యాయవిచారణ జరపాలంటూ రష్యాలో ఒక నాయకుడు కేసుపెట్టారు కూడా. ‘వార్‌’ అని అంటూనే రష్యా అధ్యక్షుడు దానిని త్వరలోనే ముగిస్తామని కూడా ప్రకటించారు. సంక్షోభాన్ని ముగించడమే తన లక్ష్యమనీ, ప్రతీ సంక్షోభం చర్చలతోనే ముగుస్తుందన్న పుతిన్‌ వ్యాఖ్యలో అంతర్లీనమైన సందేశం ఉన్నదని కొందరు నమ్ముతున్నారు. యుద్ధాన్ని త్వరితంగా ముగించాలన్నదే తన లక్ష్యమని అంటూనే, అది మెరుగైన ఫలితాలతో జరుగుతుందని పుతిన్‌ వ్యాఖ్యానించడం ఆయనలో ఏమాత్రం మార్పురాలేదనడానికి నిదర్శనమని కూడా చాలామంది అంటున్నారు.

యుద్ధం ఆరంభించినప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు కూడా పుతిన్‌ దాదాపుగా ఇటువంటి మంచిమాటలే చెబుతూవచ్చారు. తాను ఘర్షణకు స్వస్తిచెప్పాలని అనుకుంటున్నప్పటికీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడే కయ్యానికి కాలుదువ్వుతున్నాడని చాలామార్లు అన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయిన తరువాత, యుద్ధం ముగించడం గురించి పుతిన్‌ మాట్లాడటంతో పాశ్చాత్యదేశాల మీడియా తెగసంబరపడిపోతోంది. రష్యా దండయాత్ర ఆరంభమైన పదినెలల తరువాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తొలిసారిగా దేశం వీడి, పోలెండ్‌ మీదుగా అమెరికా చేరుకొని బైడెన్‌తో భేటీ అయ్యారు, అమెరికా పార్లమెంటులో ప్రసంగించారు. ప్రయాణానికి ముందే, అమెరికానుంచి ఆయన రెండుబిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అందుకున్నారు. పేట్రియాట్‌ మిసైళ్లు, క్షిపణిరక్షణ వ్యవస్థల సరఫరాలతో పాటు, యుద్ధం కొనసాగినంతకాలం అమెరికా అండగా ఉంటుందన్న హామీని కూడా జోబైడెన్‌నుంచి పొందారు.

యుద్ధాన్ని సత్వరంగా ముగించడం గురించి రష్యా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు ఎంత విలువ ఉన్నదన్న విషయాన్ని అటుంచితే, రష్యా వెనక్కుతగ్గే సూచనలేవీ ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. యుద్ధానికి హద్దుపద్దులేనంత బడ్జెట్‌ కేటాయింపులు జరపడం, రష్యా సైన్యం సంఖ్యను మరో ఐదులక్షల మేరకు పెంచుకోవడం, వయోపరిమితిని హెచ్చించి మరీ కాంట్రాక్టు సైనికులను సమీకరించుకోవడం, ఇటీవల నాటోలో చేరిన ఫిన్లాండ్‌, స్వీడన్‌లకు చెక్‌ పెట్టడానికి పశ్చిమరష్యాలో సైనికవ్యవస్థలను మరింతబలోపేతం చేయడం వంటి లక్ష్యాలను రష్యా ఇప్పటికే ప్రకటించింది. ఉన్నవారికి తోడుగా వేలాదిమంది సైనికులను అది అదనంగా యుద్ధరంగానికి తరలిస్తున్నది కూడా. అందువల్ల, ‘ప్రత్యేక సైనికచర్య’ బదులు, వార్‌ అని పుతిన్‌ వాడటం పొరపాటున కాక, దానిని కొనసాగించే లక్ష్యంతోనే ఉపయోగించినట్టుంది. ‘యుద్ధం’ అన్నప్పుడు అనేకవిశేషాధికారాలు దఖలుపడటంతో పాటు, దానికి మరిన్ని నిధులు సమకూర్చుకోవడానికీ, సైనికబలగాన్ని రెట్టింపు చేసుకోవడానికి వీలవుతుంది. పుతిన్‌ మాటలకు, కార్యక్షేత్రంలో జరుగుతున్నదానికీ పొంతనలేనందున యుద్ధం ముగియడం కాక, కొత్త సంవత్సరంలో మరింత బలంగా కొనసాగుతుందనడానికే ఆధారాలు అనేకం. అమెరికా క్రమంగా ఉక్రెయిన్‌ పక్షాన నిలబడుతూ ఇప్పటికే 54బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అమెరికా యుద్ధవిమానాలు, ట్యాంకులు, లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ వంటివి కూడా కావాలని ఉక్రెయిన్‌ అడుగుతున్నది. అత్యంత అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్‌ను కాపాడవచ్చునేమో కానీ, రష్యా రెచ్చిపోతూ, యుద్ధం మరింత పెరిగి, వినాశనం అధికంగా జరుగుతుంది. ఇప్పటికైతే సమీపకాలంలో కూడా యుద్ధం నిలిచిపోతుందన్న సంకేతాలేమీ లేవు. ఉభయపక్షాలూ ప్రజల ప్రయోజనాలను, ప్రాణాలను పణంగా పెట్టి రక్తం ఓడుతూనే మొండిగా యుద్ధం కొనసాగిస్తున్నాయి. అందువల్ల, చర్చలకు సంబంధించి ఉభయపక్షాలమీదా ఒత్తిడి పెంచడం ఒక్కటే మార్గం. ఆయుధాలు అందిస్తూనే, రష్యాతో సయోధ్యకు సంకేతాలు పంపాల్సిందిగా ఉక్రెయిన్‌మీద అమెరికా ఒత్తిడిపెంచడం ముఖ్యం. అటువంటి వాతావరణం కనిపిస్తే, భారత్‌, చైనాల మధ్యవర్తిత్వంతో రష్యా కూడా దిగివస్తుంది. ఆగ్రహంగా కలయబడుతున్న ఇద్దరిని విడదీయాల్సింది ఎప్పటికైనా చుట్టూవున్నవారే.

Updated Date - 2022-12-24T01:49:00+05:30 IST