ఎట్టకేలకు ఉపశమనం!

ABN , First Publish Date - 2022-09-13T07:13:26+05:30 IST

కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది....

ఎట్టకేలకు ఉపశమనం!

కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్ స్వాతంత్ర్యాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా, బెయిల్ అవకాశం లేని అత్యంత కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ‘ఊపా’ను ఒక అణచివేత ఆయుధంగా విరివిగా వాడుతున్న స్థితిలో, కప్పన్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఒక కొత్త అడుగు. 


పాస్ పోర్టు అప్పగించి, వారానికోమారు పోలీసు స్టేషన్ లో సంతకంపెడుతూ, ఆరువారాలు ఢిల్లీలోనే ఉన్న తరువాత, ఇతర బెయిల్ నిబంధనలన్నీ పూర్తిచేసుకొని కప్పన్ స్వరాష్ట్రానికి పోవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. రెండేళ్ళుగా జైల్లో ఉంటున్న కప్పన్ కు ఇది పెద్ద ఉపశమనం. ఉత్తర్ ప్రదేశ్ హథ్రాస్ లో ఒక దళిత బాలిక సామూహిక అత్యాచారం, హత్య ఘటన 2020లో దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు కేరళనుంచి అక్కడకు వెళ్ళిన కప్పన్ ను యూపీ పోలీసులు అరెస్టుచేశారు. ఆరంభంలో యూపీ పోలీసులు ఆయనపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆరోపణే చేశారు. ఆ తరువాత ఆయనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతోనూ, నక్సల్స్ తోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు. మతవిద్వేషాలు రేకెత్తించడం వంటి ఆరోపణలు చేశారు. ఆ సంఘటననుంచి దేశం దృష్టిని మరల్చే లక్ష్యంతో, మరే పాత్రికేయుడూ తన రాష్ట్రంలో కాలూనకుండా, నిజానిజాలు బయటకు తెలియకుండా నిరోధించేందుకు యూపీ ప్రభుత్వం చేపట్టిన పలు కుట్రపూరిత చర్యల్లో ఇది కూడా ఒకటి. కప్పన్ ను సుదీర్ఘకాలం జైల్లో ఉంచి, మిగతా పాత్రికేయులందరినీ భయపెట్టే లక్ష్యంతో ఆయన మీద ఊపాను కూడా ప్రయోగించింది. ఆయన వద్ద విద్రోహాన్ని రేకెత్తించే, ప్రజలను రెచ్చగొట్టే సాహిత్యం దొరికిందని ఆరోపించింది. 


బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టుకు పోతే, విచిత్రంగా హథ్రాస్ లో నీకేమి పని అంటూ యూపీ ప్రభుత్వం మాదిరిగానే ప్రశ్నించి, ఉపా కేసు ఉన్నందున బెయిల్ ఆలోచనే చేయలేదు. నిందితుడికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు ప్రాథమికంగా ఏమాత్రం విశ్వసనీయంగా కనిపించినా న్యాయస్థానాలు బెయిల్ ఊసెత్తకూడదని ఊపా చట్టంలోని సెక్షన్ 43డి (5) చెబుతుంది. దీనికితోడు, 2019నాటి ఎన్ఐఎ వర్సెస్ జహూర్ అహ్మద్ షా వతాలీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు బెయిల్ దశలో సాక్ష్యాధారాలను లోతుగా అధ్యయనం చేయకుండా నిరోధిస్తున్నాయి. ఎన్ఐఎ సమర్పించిన సాక్ష్యాలను మొత్తంగా చూడాలే తప్ప, వాటి స్వీకారయోగ్యత జోలికి పోకూడదని అంటున్నది. ఈ కారణాల రీత్యానే, న్యాయస్థానాలు ఊపా కేసుల్లో బెయిల్ ఊసెత్తడం మానేశాయి. భీమా కోరేగావ్ నిందితులంతా విచారణ మాట అటుంచితే, బెయిల్ కోసం కూడా ఏళ్ళతరబడి ఎదురుచూపులు చూస్తూండవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. వారికి వ్యతిరేకంగా చూపుతున్న సాక్ష్యాధారాలు పాలకులు సృష్టించవేననీ, అక్రమంగా చొరబడి ప్రతిష్ఠించినవేననీ తేలిపోతున్నప్పటికీ, వారంతా జైళ్ళలోనే మగ్గవలసి వస్తున్నది.


ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం అన్ని కట్టుబాట్లను దాటి కప్పన్ కు బెయిల్ మంజూరు చేసింది. పలు లోతైన ప్రశ్నలద్వారా అది ప్రాథమికంగా ఈ కేసులో కుట్రలూ కుతంత్రాలు దేశద్రోహాలు లేవని గుర్తించింది. హత్రాస్ లో మతకల్లోలాలు రెచ్చగొట్టడానికి కప్పన్ తీసుకెళుతున్న ‘టూల్ కిట్’ అని యూపీ పాలకులు అంటున్నది అమెరికాలో బ్లాక్ లైవ్స్ మేటర్స్ ఉద్యమానికి సంబంధించిన ఇంగ్లీషు కరపత్రాలని నిర్థారించింది. కప్పన్ ను ఉగ్రవాదిగా పరిగణించడానికి తమకు ఒక్క ఆధారం కూడా కనబడటం లేదని ప్రకటించింది. ఒక బాధితురాలి పక్షాన గొంతువిప్పితే నేరం ఎలా అవుతుందని ప్రశ్నించింది. కప్పన్ వద్ద పేలుడుపదార్థాలేమైనా దొరికాయా అన్న ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నలోనే పాలకులపై లోతైన విమర్శ ఉన్నది. 


ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి చొరవ స్పష్టంగా కనిపిస్తున్నది. న్యాయమూర్తులు కాస్త మానవత్వంతో, విచక్షణతో వ్యవహరిస్తే ఇటువంటి కేసుల్లో డొల్లతనం ఇట్టే బయటపడుతుంది. నిరాధారమైన ఆరోపణలతో, రాక్షసచట్టాల ప్రయోగంతో ఎవరినైనా కటకటాలవెనక్కునెట్టేయవచ్చునన్న పాలకుల నమ్మకాన్ని ప్రశ్నించే తీర్పు ఇది.

Updated Date - 2022-09-13T07:13:26+05:30 IST