ఒకే నేరం, రెండు తీర్పులు!

ABN , First Publish Date - 2022-12-17T01:38:22+05:30 IST

ముప్పైసంవత్సరాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఫిలిబిత్ ఎన్ కౌంటర్ కేసులో, 43మంది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు అలహాబాద్ కోర్టు గురువారం ఏడేళ్ళ కఠినకారాగార శిక్ష విధించింది.

ఒకే నేరం, రెండు తీర్పులు!

ముప్పైసంవత్సరాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఫిలిబిత్ ఎన్ కౌంటర్ కేసులో, 43మంది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు అలహాబాద్ కోర్టు గురువారం ఏడేళ్ళ కఠినకారాగార శిక్ష విధించింది. ఖలిస్తానీ ఉగ్రవాదుల పేరిట పదిమంది సిక్కులను కాల్చిచంపిన ఈ కేసులో, సీబీఐ కోర్టు 2016లో నేరాన్ని హత్యగా పరిగణించి, నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తే, హైకోర్టు ఇప్పుడు దానిని హత్యకిందకు రాని నరవధగా పరిగణిస్తూ శిక్షను మార్చింది. ఒక ప్రభుత్వోద్యోగి తాను చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నానని నమ్ముతూ మరొకరి మరణానికి కారకుడైనప్పుడు, దానిని హత్య అనకూడదన్న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 300లోని మినహాయింపును హైకోర్టు ఈ కేసులో వర్తింపచేసింది. ఘటన జరిగిన ముప్పయ్యేళ్ళ తరువాత ఈ తీర్పుతో నిందితులకు ఒరిగేదేమిటన్నది అటుంచితే, ఈ రెండు తీర్పుల్లోనూ నిందితులను చూసే కోణంలో చాలా తేడా ఉన్నది.

తీర్థయాత్ర ముగించుకొని కొందరు సిక్కులు బస్సులో వెనక్కు వస్తుండగా 1991 జులైలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కు చెందిన ఉగ్రవాదులు ఈ బస్సులో ఉన్నారని అనుమానించిన పోలీసులు, ఒకరిద్దరు వృద్ధులను, స్త్రీలను బస్సులోనే వదిలి, ఓ పదిమందిని తమ వ్యానులో ఎక్కించుకొని గంటలపాటు తిప్పారు. ఆ తరువాత బస్సును ఒక గురుద్వారా వద్ద వదిలి, యువకులను తీసుకుపోయి మూడుచోట్ల ఎన్ కౌంటర్ చేశారు. ఆ మర్నాడు పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కరడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించారు. పంజాబ్ లో ఉగ్రవాదం పతాకస్థాయిలో ఉంటూ, ఉత్తర్ ప్రదేశ్ అంచుల్లోనూ ఉగ్రవాదులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న భయాలున్న దశ అది. అంతేకాదు, ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరిట భారీ కేటాయింపులు జరుగుతూ, పోలీసులకు పురస్కారాలు, ప్రమోషన్లు అందుతున్న కాలం కనుక ప్రభుత్వాలు అనుమానితుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించగలిగేవి. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన మీద కల్యాణ్ సింగ్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఈ పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు మూసివేసిన తరువాత, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి, యాభై ఏడుమంది పోలీసులను నకిలీ ఎన్ కౌంటర్ కు బాధ్యులుగా ప్రకటించింది. పోలీసులు చెప్పినవన్నీ కట్టుకథలేననీ, నిరాయుధులైనవారిని బస్సులోనుంచి దించి ఇతరత్రా ఉద్దేశాలతో కాల్చిచంపేశారని సీబీఐ నిరూపిస్తే, దీనిని ఘోరాతిఘోరమైన హత్యాకాండగా సీబీఐ కోర్టు నిర్ధారించి నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది.

ఆ పదిమంది సిక్కులూ తమపై కాల్పులు జరిపితే, ఆత్మరక్షణలో భాగంగా తాము ఎన్ కౌంటర్ చేయవలసి వచ్చిందన్న నిందితుల వాదనను ఇప్పుడుకూడా అలహాబాద్ హైకోర్టు విశ్వసించలేదు. అయితే, బస్సులో కొందరు ఉగ్రవాదులున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, వారిలో కొందరిపై గతంలో కేసులున్నాయన్న ప్రభుత్వవాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే, బాధితులను బస్సులో నుంచి దింపి, బలవంతంగా పట్టుకుపోయి వేర్వేరు చోట్ల హత్యచేసినట్టుగా నిర్ధారించగల సాక్ష్యాలు లేనందున నిందితులు ఉమ్మడి లక్ష్యంతో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని భావించలేమన్నది. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసినమాట నిజమే అయినా, బాధితులకు నిందితులకు మధ్య గతకాలపు వైరాలు వైషమ్యాలు లేవు కనుక, వారి ఉద్దేశం కూడా ప్రజారక్షణే కనుక దీనిని నేరుగా హత్యగా పరిగణించలేమన్నది. వృత్తిధర్మానికి కట్టుబడిన భావన, సదుద్దేశం ఇత్యాది ప్రాతిపదికల ఆధారంగా, ఐపీసీలో ఇచ్చిన మినహాయింపును నిందితులకు అన్వయింపచేస్తూ, సీబీఐ కోర్టు విధించిన జీవితకాల ఖైదును ఏడు సంవత్సరాల కఠినకారాగారంగా మార్చింది.

న్యాయంలో జాప్యం అన్యాయంతో సమానమంటారు. అయినా, ఈ ఎన్ కౌంటర్ జరిగిన పదిహేనేళ్ళకు సీబీఐ కోర్టు తీర్పు చెప్పినప్పుడు న్యాయం చేకూరిందనే బాధిత కుటుంబీకులు, ప్రజాసంఘాలు సంతోషించాయి. ప్రజారక్షణ మాటున పోలీసులు, భద్రతాదళాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ అమాయకులను భక్షిస్తున్నా, శిక్షలకు అతీతమన్న భావనతో నిర్భయంగా ఉండగలుగుతున్నారనీ, సీబీఐ కోర్టు తన తీర్పుతో మంచి హెచ్చరిక చేసిందని అందరూ భావించారు. అనేక సెక్షన్ల ఆధారంగా పలురకాల అభియోగాలతో పడిన ఆ శిక్షను ఇప్పుడు ఒకటి రెండు సెక్షన్లకు కుదించి అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

Updated Date - 2022-12-17T01:38:22+05:30 IST

Read more