నయా నవాబుల పాలనలో నిజాం నాటి ‘గస్తీ’

ABN , First Publish Date - 2022-09-07T10:05:30+05:30 IST

1929లో ‘గస్తీ నిషాన్ – 53’ పేరిట నిషేధ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం దాష్టీకం నేటి తెలంగాణ ప్రభుత్వ పాలనలోనూ గుర్తుకు వస్తోంది...

నయా నవాబుల పాలనలో నిజాం నాటి ‘గస్తీ’

1929లో ‘గస్తీ నిషాన్ – 53’ పేరిట నిషేధ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం దాష్టీకం నేటి తెలంగాణ ప్రభుత్వ పాలనలోనూ గుర్తుకు వస్తోంది. నిజాం నవాబుల కాలంలో, ముఖ్యంగా చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలో, ప్రజలు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో పరిస్థితి నిజాం పాలనకు భిన్నంగా ఉన్నదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళ నుండి అనేక రకాల అప్రకటిత నిర్బంధాలు అమలులో ఉన్నాయి. 


ఉద్యమ పోరాటాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ జాతులవారూ తమకు సామాజికంగా ఆర్థికంగా జరిగిన న్యాయానికి సంబరపడ్డారు. నూతన ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియమాకాలు, స్వయంపాలన, ఆత్మగౌరవాలను కలలుగన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ప్రతిపక్షాలు వారి వారి గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ మనుగడ సాగిస్తారనుకున్నారు. గతంలో అనుభవించిన అసమానత లేని ఒక ఆదర్శ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధించుకుంటామని  ఆశించారు. కానీ తెలంగాణ సాధించిన తర్వాత తమ పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని గత ఎనిమిదేళ్ళ పాలనలో అందరికీ అర్థమైంది.


ఈ సందర్భంగా 1929లో ‘గస్తీ నిషాన్ – 53’ పేరిట నిషేధ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం దాష్టీకం గుర్తుకు వస్తోంది. నిజాం నవాబుల కాలంలో, ముఖ్యంగా చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలో, ప్రజలు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు’ అనే పుస్తకంలో కామ్రేడ్ గురువారెడ్డి  పేర్కొన్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు, బంధువర్గం, సన్నిహితులైన వారి సామాజిక వర్గం అంతా కలిసి ప్రజలను ఇష్టానుసారం ఏలుకున్నారు.


1925 నుంచి నిజాం రాజ్యంలో ఆంధ్ర మహాసభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాం నవాబు 1929నవంబరు 2వ తేదీన ‘గస్తీ నిషాన్ – 53’ పేరిట నిషేధ ఉత్తర్వులను జారీ చేశారు. దీని ప్రకారం నిజాం రాష్ట్రంలో రాజకీయ సభలు గానీ, రాజకీయ పరిణామాలకు కారణం కావచ్చునన్న అనుమానం కలిగించే సభలు కానీ జరపకూడదు. ఏ సభలనూ నిజాం అనుమతి పొందకుండా నిర్వహించకూడదు. వీటిని ఉల్లంఘించే వారు కఠినంగా శిక్షించబడతారని ‘గస్తీ నిషాన్ 53’ ఆర్డినెన్స్ తెలియజేస్తున్నది. ఆనాడు విద్యావంతులైన మాడపాటి హనుమంతరావు, కొండా వెంకట రంగారెడ్డి, వెంకటరెడ్డి, భాగి సుబ్రహ్మణ్యం, బసవేశ్వర రావు, పాలకుర్తి సత్యనారాయణ, సోమవరపు సుబ్బారావు, పచ్చ రంగారావు, పువ్వాడ వెంకటప్పయ్య గార్లు ప్రథమాంధ్ర మహాసభను (1930) నిర్వహించారు.


నిజాం ఉత్తర్వుల ప్రకారం నైజాం ప్రాంతంలో నవాబు అనుమతి లేకుండా సభలు, సమావేశాలే కాదు, తెలుగు పాఠశాలలను, గ్రంథాలయాలను కూడా ప్రారంభించకూడదు. ఇలా ప్రారంభించిన నాలుగు వేల తెలుగు పాఠశాలల్ని ఈ ఉత్తర్వుల ప్రకారమే మూసివేశారు. అంతేకాదు, నైజాం ప్రాంతంలో ప్రతి విద్యా సంస్థలోనూ ప్రతిరోజూ నవాబును విద్యార్థులు ప్రార్థనలతో స్తుతిస్తూ పాఠశాల కార్యక్రమాలను మొదలుపెట్టాలి. సాధారణ ప్రజలు సమూహాలతో పండుగలు నిర్వహించాలంటే రెండు నెలల ముందే నవాబు అనుమతి పొందాలి. కవులు, గాయకులు, యువకులు, విద్యావంతులు, రచయితలు కూడా అనుమతి లేకుండా సమావేశాలను నిర్వహించకూడదు. ముందస్తుగా సభలూ సమావేశాల్లో పాల్గొనే వారి పేర్లతోపాటు వారి ప్రసంగాల సంక్షిప్తాన్ని రాసి సమర్పించాలి. ఒకవేళ నవాబుకు ఇష్టం లేకపోతే ఆ దరఖాస్తు తిరస్కారానికి గురవుతుంది. తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన కవుల సమావేశానికి ఇలా నవాబు ఇచ్చిన అనుమతినే రద్దు చేశారు. నవాబు కుటుంబమూ ఆయన పాలక వర్గమూ ఒక్కటే! మంత్రుల సభను, ‘బాబే హుకోమత్’ అనే కౌన్సిలును నవాబు తన బంధుమిత్రులతో నింపుకొన్నారు. ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, జలవనరుల శాఖ, శాంతిభద్రతల శాఖలన్నీ నవాబు కుటుంబ సభ్యులే పంచుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో పరిస్థితి నిజాం పాలనకు భిన్నంగా ఉన్నదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళ నుండి అనేక రకాల అప్రకటిత నిర్బంధాలు నిరంతరం అమలులో ఉన్నాయి. ప్రజలతోపాటు, ప్రతిపక్ష నేతలు, మేధావుల, రైతు ఉద్యమ నాయకులు ప్రజలు ఎదుర్కొన్న అనేక చేదు అనుభవాలే దీనికి ఋజువు. నిజాం పాఠశాలలను పెట్టనివ్వలేదు. ఉన్నవాటిని కొన్నింటిని మూసివేశారు. ప్రస్తుత తెలంగాణలో కూడా ప్రభుత్వ పాఠశాలలను చాలావాటిని  మూసివేశారు. రాష్ట్రంలో అధికార వర్గాలు, వారి అండదండలతో ఇసుక మాఫియా చేసే ఆగడాలను అడ్డుకున్న యువకులను చితకబాదిన ఉదంతాలు ఎన్నెన్నో. సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో దళిత బిడ్డలను నరాలు తెగేటట్లుగా బాధించినందున ప్రాణ నష్టం జరగడమే కాక బాధితులు జీవితకాలం ఆరోగ్యంగా ఉండలేని స్థితిలో బతుకుతున్నారు. గత 50ఏళ్లుగా ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాల పట్ల నిరసన తెలియజేయడానికి వినియోగించుకుంటున్న ఇందిరా పార్కు దగ్గరి ధర్నా చౌకును ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసివేసింది.


ఇలాంటి అనేక ప్రజా కంటక నిర్ణయాల వల్ల ప్రజల పక్షాన నిలబడే గొంతుకలన్నీ మూగబోయాయి. ప్రజల మాట చెప్పేవారు కరువయ్యారు. కొద్దిమంది మాట్లాడినా వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు, పాత కేసులు తిరగదోడుతున్నారు, నిర్బంధాలకు గురి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర జాక్ అధ్యక్షునిగా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటిని చుట్టుముట్టి తలుపులు పగలగొట్టి ఆయనను అరెస్టు చేసిన విధానం తెలంగాణ ప్రజలనే గాక ప్రజాస్వామ్యవాదులను  కూడా విస్మయానికి గురి చేసింది. ప్రతిపక్షాలు బహిరంగ సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వరు. వారిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసి సభలూ సమావేశాలను  నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఉప ఎన్నికల సందర్భంలో పాలకపక్షానికి మద్దతు తెలపకపోతే అనేకమందిపై పూర్వకేసులను తిరగదోడుతామని  ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధ్యాపకులను కూడా ఎన్నికల సందర్భంలో పాలక పార్టీ మార్గంలో నడవాలని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను కాలరాసినప్పుడు 25మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 


ఈ విధానాలన్నింటిలో మచ్చుకైనా ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలు కనపడుతున్నాయా? మరియమ్మ లాకప్ డెత్, ఇంకా ఇతర ప్రాంతాల్లో దళిత స్త్రీల పైన జరిగిన దాడులు ఏ సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తున్నట్టు? ప్రజలను రక్షించడానికి నియమితులైన కొందరు పోలీసు అధికారులు స్త్రీలను, వారి కుటుంబాలను చెర పట్టిన ఉదంతాలు పౌర సమాజాన్ని కూడా నిలదీస్తున్నాయి. అధికార పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకుల పిల్లలు పాల్పడుతున్న రాచలీలలను, పెచ్చుమీరిన సామూహిక అత్యాచారాలను చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నది. నేరం చేసినవారు తగిన శిక్ష అనుభవించకుండా సమాజంలో హీరోల్లా తిరుగుతుంటే న్యాయంపై నమ్మకం మిగులుతుందా? పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ బిడ్డలను, పసిపిల్లలను ఎత్తుకున్న తల్లులను సహితం చితకబాదుతున్నారు పోలీసులు. పిల్లల తల్లులను కూడా పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిర్బంధించిన ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాంటి నవాబుల పాలనను గుర్తు చేస్తున్నవి.


ప్రజలను చైతన్యం చేసే వృత్తిలో ఉన్న జర్నలిస్టులను నిర్బంధంలోకి తీసుకోవడం కూడా సాధారణ విషయంలా మారిపోయింది. తీన్మార్ మల్లన్న(నవీన్), గంజి రఘు లాంటి జర్నలిస్టులను నిర్బంధంలో వారాల తరబడి ఉంచి వేధింపులకు గురి చేశారు. గత ఎనిమిదేళ్ళలో నిర్బంధాలు, భూదందాలు, అనేక రకాల మాఫియాలు, నేరాలు, అత్యాచారాలు, ప్రశ్నించిన వారిపై లాఠీల దెబ్బలు ఇదంతా ఒక సాధారణ ప్రక్రియగా మారింది. ఇంతటి అప్రజాస్వామిక పరిపాలన సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో నిజాం గారు అమలు చేసిన ‘గస్తీ నిషాన్ –53’ అప్రకటితంగానే అమలులో ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఇంతకాలం మౌనంగా అన్ని రకాల నిర్బంధాలను చూస్తూ ఉన్న మేధావులు, మానవతా విలువలు కలిగిన పెద్దలంతా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురు నిలవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని పాలకులూ గుర్తు చేసుకోవాలి.

l కూరపాటి వెంకట్ నారాయణ 

విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం

Read more