సిగ్గు విడిచిన అక్షరాలు

ABN , First Publish Date - 2022-11-26T00:49:55+05:30 IST

సమస్త జీవరాశులకూ ఒకే ఆరంభం ఉండి ఉండవచ్చును కానీ, కాలక్రమంలో తనను అన్నిటికి మిన్నగా మలచుకుని ముందుకు వెడుతున్నది మనిషే.

సిగ్గు విడిచిన అక్షరాలు

సమస్త జీవరాశులకూ ఒకే ఆరంభం ఉండి ఉండవచ్చును కానీ, కాలక్రమంలో తనను అన్నిటికి మిన్నగా మలచుకుని ముందుకు వెడుతున్నది మనిషే. మానవుడిని ప్రత్యేకం, విభిన్నం చేస్తున్నవి, శ్రమ నుంచి పెంచుకున్న మేధ, దానినుంచి మలచుకున్న ఆలోచన, అందుకు తగ్గ ఆచరణను చేపట్టగల సంకల్పం, సాటి మనుషులతో, యావత్ ప్రపంచంతో ఉన్నతంగా వ్యవహరించగల సభ్యత. మనుషులు అనుభవించగలిగే ఉద్వేగాలలో సిగ్గు, అవమానం, అతిశయం, హాస్యం వంటివి చెప్పుకోదగినవి. సిగ్గూ శరం లేని వారని ఎవరినైనా భావిస్తున్నామంటే, నిందిస్తున్నామంటే, వారు మానవీయ లక్షణాలకు వెలిగా ఉంటున్నారని అనుకుంటున్నట్టు.

కేవలం తన వంశానికి, కుటుంబానికి చెందిన మనుషుల మధ్య కూడా పాటించవలసిన మర్యాదలుంటాయి. పదిమంది కూడి మాట్లాడుకుని, పనిచేయవలసి వచ్చే ప్రజారంగంలో మరిన్ని సభ్యతా నియమాలుంటాయి. పద్ధతి తప్పి మాట్లాడేవారిని ఎవరూ గౌరవించరు. ఒకరి మాటలను ఒకరు ఒప్పుకోకపోవచ్చు, ఒకరి ఆధిక్యాన్ని మరొకరు సమ్మతించకపోవచ్చు, ఎదుటివారిని తప్పించి, వారి స్థానాన్ని అధీనం చేసుకోవాలని అనుకోవచ్చు. ప్రత్యర్థులైనా, శత్రువులైనా సరే, సభలో సంబోధిస్తున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు గౌరవించవలసిందే. గౌరవం అన్నది అన్ని సాంఘిక మర్యాదల వలెనే ఇచ్చి పుచ్చుకునేది. సంఘనియమాలన్నిటికి పరస్పరతే ప్రాతిపదిక. ఎంతటి క్రూర రాచరికంలో కూడా దాని మర్యాదలు దానికి ఉంటాయి. మర్యాద తప్పిన రాజు అధికారానికి లోబడతారేమో కానీ, ప్రజలు గౌరవం మాత్రం ఇవ్వరు.

ఆధునిక ప్రజాస్వామ్యంలో, భావ వినిమయంలోను, వాదసంవాదాలలోను కేవలం మర్యాద మాత్రమే కాదు, సంస్కారం కూడా అవసరం. ఎదుటివారిని బహువచనంతోనో, గారు మీరు సంబోధనలతోనో మర్యాద ఇస్తే చాలదు, మాట్లాడే మాటల్లో, విషయంలో సంస్కారం ఉండాలి. సమకాలీన సమాజం అసభ్యంగా, వెకిలిగా, అనాగరికంగా భావించే భాషను, వ్యక్తీకరణలను మాట్లాడకూడదు. కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులను సభాముఖంగా దూషించినప్పుడు, పత్రికలలో దానిని వార్తగా రాసేటప్పుడు, అందులోని అసభ్యతను పరిహరించడం ఒకనాడు పద్ధతిగా ఉండేది. మాట్లాడగూడని, రాయగూడని మాటలు తాను మాట్లాడినట్టు ఆ వక్తకు కూడా అర్థమయ్యేది. ఎదుటివారి కంటె తాను ఎక్కువ సంస్కారిగా కనిపించాలన్న తపన కూడా ఒకనాటి రాజకీయనాయకులలో ఉండేది. ఇప్పుడు ప్రత్యర్థి కంటె బలశాలిగా, మాటకు మాట అందించగల తెంపరిగా కనిపించాలన్న దుగ్ధ పెరిగిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఎంతగా దిగజారిపోయాయంటే, తిట్టు పని కోసం ప్రత్యేకంగా కొందరిని పెంచి పోషించడం చూస్తుంటాము. నోరు తెరిస్తే చాలు బూతులు, అమర్యాదకర సంబోధనలతో తమ వర్గీయులను రంజింపజేయడం ఇప్పటి రాజకీయాలలో పెరిగిపోయిన జులాయి ధోరణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీమంత్రులు కొడాలి నాని, అనిల్ ఇందుకు ప్రసిద్ధులు. తెలంగాణలో మంచి వాక్శుద్ధి కలిగి ఉండి కూడా ముఖ్యమంత్రి అడపాదడపా అదుపుతప్పి నోరుపారేసుకోవడం చూస్తుంటాము. కెసిఆర్ పై తీవ్రమయిన వ్యతిరేకతను ప్రకటించడానికి నోరుపారేసుకోవడమే మంచిమార్గమని నమ్మిన రేవంత్ రెడ్డి తరువాత కాలంలో సభ్యత పరిధులు దాటితే నాయకత్వ స్థాయి సిద్ధించదని గుర్తించి సవరించుకున్నారు. ఇక బిజెపి నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ అసభ్యత తక్కువే అయినా, దురుసుగా మొరటుగా మాట్లాడడం ఒక విధానంగా అభివృద్ధి జరిపారు. దృశ్య మాధ్యమాల వ్యాప్తి తరువాత, తిట్లదండకంతో జనాన్ని ఆకట్టుకోవచ్చునన్న భ్రమ నాయకులకు పెరిగింది.

మాట్లాడడం సరే, ఒక ధారలో ఒక్కోసారి పొరపాట్లకు, తొందరపాట్లకు అవకాశం ఉంటుంది. రాత భిన్నమైనది. అందుకే మాట్లాడేటప్పుడు బూతులు దొర్లించేవారు కూడా రాతలో మర్యాదగా ఉంటారు. రాసిన అక్షరం శాశ్వతమని విశ్వాసం కాబట్టి, అందులో పవిత్రతను కూడా ఆశిస్తారు. కానీ, సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేసేవారు ఆ కట్టుబాటును కూడా పాటించడం లేదు. వైసిపికి చెందిన పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ సందేశాలను చూస్తే, చదివేవారికే సిగ్గు కలుగుతుంది. మరి ఆయన ఎట్లా రాయగలుగుతున్నారో? ఆడిటింగ్ అంటే సమాజంలో ఉన్నతాదాయ శ్రేణులతో మెలిగేవృత్తి. మర్యాదలు పాటించవలసిన ప్రజారంగం, రాజకీయాలు. పార్లమెంటు సభ్యుడు అంటే జాతీయస్థాయిలో గుర్తింపు, పరిగణన ఉండే హోదా. అయినప్పటికీ, ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండా ఆయన, ఉచ్చం నీచం, మంచి చెడు, బూతునీతి అన్న విచక్షణే లేకుండా ట్విట్టర్ లో తన కుసంస్కారాన్ని వమనం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుమారుడిని, పత్రికాధిపతులను, జనసేన నేతలను అందరి మీదా దుర్భాషా ప్రయోగం చేస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించే హక్కు ఆయనకు ఉన్నది. కానీ, రాజకీయ నాయకుల కుటుంబసభ్యులను, వ్యక్తిగత విషయాలను, రూపురేఖలను, స్వభావ విశేషాలను కించపరిచేలా, అక్షరాలు తలదించుకునేలా మాట్లాడడం ఏమి సంస్కారం? వారి నాయకుడు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడా ఏమిటి? ఇటువంటి వారికి దీటైన సమాధానం ఇవ్వాలనే పేరుతో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల నాయకులు, తెలంగాణలో కొత్తగా అవతరించిన నేతలు కూడా రాజకీయ భాషను భ్రష్టుపట్టిస్తున్నారు. రాజకీయ సంస్కృతికి ఒకసారి మకిలి పట్టిందంటే దాన్ని మళ్లీ సభ్యతామార్గానికి మళ్లించడం కష్టం.

Updated Date - 2022-11-26T00:49:58+05:30 IST