‘ఉద్ధరణ’ నిజమేనా?

ABN , First Publish Date - 2022-08-02T06:17:51+05:30 IST

చక్కగా పనిచేస్తూ లాభాలు ఆర్జించి పెడుతున్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా ప్రైవేటురంగానికి చవుకగా కట్టబెడుతున్న ఈ కాలంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్...

‘ఉద్ధరణ’ నిజమేనా?

చక్కగా పనిచేస్తూ లాభాలు ఆర్జించి పెడుతున్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా ప్రైవేటురంగానికి చవుకగా కట్టబెడుతున్న ఈ కాలంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు కేంద్రప్రభుత్వం లక్షన్నరకోట్లకు మించిన ప్యాకేజీ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నాలుగేళ్ళకు విస్తరించే లక్షా అరవైనాలుగువేల కోట్లలో నగదు సాయం 43వేల కోట్లు కాగా, మిగతాది వేరే రూపాల్లో ఉంటుంది. ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసిన వెంటనే వెలువడిన ఈ నిర్ణయంలో, బీఎస్ఎన్ఎల్‌కు 4జీ కేటాయింపు ఓ సాయంగా ఉండటం విచిత్రం. 


అన్నీ అమ్మిపారేస్తున్నారన్న అపప్రధ నుంచి బయటపడటానికి ప్రభుత్వం ప్యాకేజీ పేరిట ఓ విచిత్ర విన్యాసం చేసిందన్న విమర్శలూ ఉన్నాయి. మూడేళ్ళక్రితం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీలోనే సంస్థకు 4జీ సర్వీసుల కోసం తగినంత స్పెక్ట్రమ్ కేటాయిస్తామన్న హామీ ఉంది. పథకంలో భాగంగా 80వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించే పని అమలు జరిగింది కానీ, 4జీ సర్వీసుల విషయంలో మాత్రం బీఎస్ఎన్ఎల్ మూడేళ్ళుగా మూలుగుతున్నది. పైగా ప్రైవేటు కంపెనీలన్నీ విదేశీ సాంకేతిక వాడుతుంటే, ఈ సంస్థను మాత్రం ఆత్మనిర్భరత పేరిట స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, వినియోగానికి కట్టుబడి ఉండాలన్న నియమం విధించింది ప్రభుత్వం. అందువల్ల, ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీలో మూడేళ్ళక్రితం 4జీకి సంబంధించిన హామీల పునరుద్ఘాటన మాత్రమే ఉన్నది కనుక రమారమి ఓ డెబ్బైవేలకోట్లు కొత్త మొత్తం కాదని ఉద్యోగసంఘాల నాయకుల వాదన. అలాగే, ఇక్విటీ ఇన్ఫ్యూజన్ వంటి మాటలు కొన్ని కొందరికి భవిష్యత్తులో పెట్టుబడి ఉపసంహరణ సూచికలుగా కనిపిస్తున్నమాట నిజం.


ప్రైవేటు పోటీని తట్టుకోలేక బిఎస్ఎన్ఎల్ తనకుతానుగా పతనమైందని అనేకంటే, ఆ సంస్థను ప్రైవేటురంగ సంస్థల ప్రయోజనాలకు వీలుగా ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారనడం సమంజసం. అప్పులు, పన్నులు వంటి విషయాల్లో ప్రైవేటు సంస్థలకు దక్కే మినహాయింపులు, రాయితీలు ఈ సంస్థకు వర్తించవు. ప్రైవేటు సంస్థలు 4జీ వినియోగం ఆరంభించి, మార్కెట్ మొత్తం స్వాధీనం చేసుకొని ఆరేళ్ళయిన తరువాత కూడా ఈ సంస్థ 4జీ పూర్తిస్థాయిలో దక్కకపోవడం గురించే మాట్లాడవలసివస్తూంటుంది. లాభార్జనే ప్రధానధ్యేయంగా ఉన్న ప్రైవేటు సంస్థలు చేయలేని, చేయని పనులు, బాధ్యతలు కొన్ని ఈ సంస్థ చేయవలసి ఉన్నది కనుక దానిని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి అవసరం. ముఖ్యంగా, దేశరక్షణకు, భద్రతకు సంబంధించిన సమాచార వినిమయంకోసం ప్రభుత్వం తన వ్యవస్థపై ఆధారపడక తప్పదు. ప్రైవేటు సంస్థలు వెళ్ళని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించి, అక్కడి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువచేసే కార్యక్రమాలను, పథకాలను ఈ సంస్థ అమలు చేయవలసి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్, బిబిఎన్ఎల్ విలీనంతో అదనంగా ఓ ఆరులక్షల కిలోమీటర్ల నెట్‌వర్క్ ఏర్పడి, దాదాపు రెండు లక్షల పంచాయితీలకు సేవలను విస్తరించగలిగే అవకాశం పెరుగుతుందట.


తీవ్రవాద, వేర్పాటువాద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం ఒనగూరే ఆర్థికనష్టాన్ని భరిస్తూ, శాంతిభద్రతలను కాపాడాలంటే ఈ ప్రభుత్వరంగ సంస్థ ఒక్కటే ఆధారం. తనమాట వినే, తన చేతుల్లో ఉండే ఓ వ్యవస్థతో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల్లో ప్రజలను సునాయాసంగా కట్టడి చేయగలదు. ఎన్ని దశాబ్దాలైనా అమర్‌నాథ్ కొండల్లో పనిచేసేది ఈ ఒక్కనెట్ వర్కే కనుక ఉపద్రవాల్లోనూ ఉపకరించేది ఇదే. మొదటి పునరుద్ధరణ ప్యాకేజీలోని చాలా హామీలు ఇంకా కాగితాలమీదనే ఉండగా, ఈ కొత్త ప్యాకేజీతో ప్రభుత్వం సంస్థను భారీగా ఆదుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్నదని ఉద్యోగసంఘాల నాయకుల ఆరోపణ. స్పెక్ట్రమ్ కేటాయింపునుంచి, ఉన్న పరికరాల ఆధునికీకరణ వరకూ ప్రతీదశనూ పాలకులు ఏ విధంగా అడ్డుకున్నదీ వారు వివరిస్తున్నారు. వాణిజ్యపరంగా లాభదాయకం కాని సేవలు అందించి, దేశప్రయోజనాలు పరిరక్షించినందుకు ప్రభుత్వం తనకుతానుగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఈ తరహా ఉద్ధరణ ప్యాకేజీల్లో చూపించడం పాలకులకు అలవాటైపోయింది. వివిధ పద్దుల్లో భాగంగా బిఎస్ఎన్ఎల్‌కు ప్రభుత్వం బకాయిపడిన మొత్తం దాదాపు నలభైవేల కోట్లు ఉన్నందున, ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీలో అసలుసిసలు ఉద్ధరణకు ఉద్దేశించిందేమీ లేదని ఓ విమర్శ. టెలీవిద్య, టెలీవైద్యం, ఈ పాలన వంటివి మారుమూల ప్రాంతాల్లోకి అందుబాటులోకి తేవాలనుకున్నప్పుడు, కీలకభూమిక పోషించేస్థాయిలో బిఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేయడం అవసరం.

Read more