ఇమ్రాన్‌ స్వయంకృతం

ABN , First Publish Date - 2022-10-22T07:44:21+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద అక్కడి ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇతర దేశాలనుంచి, దేశాధినేతలనుంచి స్వీకరించిన బహుమతుల...

ఇమ్రాన్‌ స్వయంకృతం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద అక్కడి ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇతర దేశాలనుంచి, దేశాధినేతలనుంచి స్వీకరించిన బహుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఇమ్రాన్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేయడమే కాక, మరో ఐదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించబోతున్నది.


‘అతడు అందరినీ జయించాడు’ అంటూ పాకిస్థాన్ దినపత్రికలు మూడురోజుల క్రితమే పతాకశీర్షికలతో ఇమ్రాన్ ఖాన్ ను ఆకాశానికి ఎత్తేశాయి. అక్కడి పార్లమెంటు దిగువసభకు జరిగిన ఉపఎన్నికల్లో ఆయన పార్టీ ఎనిమిదిస్థానాల్లో పోటీచేసి ఆరుస్థానాలు నెగ్గింది. మరోపక్క పంజాబ్ అసెంబ్లీకి జరిగిన మూడుస్థానాల్లో రెండింటిని గెలిచింది. ఈ ఉపఎన్నిక జరిగిన పార్లమెంటు స్థానాలన్నీ ఇమ్రాన్ పార్టీకి చెందినవే. ఏప్రిల్ లో జరిగిన అవిశ్వాసతీర్మానంలో ఓడిపోయిన తరువాత ఆయన తన ఎంపీలతో రాజీనామాలు చేయించడంతో, వాటిలో ఎనిమిది స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇమ్రాన్ ఒక్కడే ఏడుస్థానాల్లో నిలబడి, ఆరింటిలో అద్భుత మెజారిటీ సాధించాడు. తద్వారా ప్రజాభిమానంలో తనకు ఎదురులేదనీ, తన ప్రతిష్ఠ ఉచ్ఛస్థితిలో ఉన్నదనీ రుజువు చేయదల్చుకున్నాడు. ఆయన ఎలాగూ ఒక్కస్థానంలోనే కొనసాగాలి కనుక, మిగతావాటికి మళ్ళీ ఎన్నికలు జరగక తప్పదు. అప్పుడూ ఆయన పార్టీ అభ్యర్థులే గెలుస్తారు కనుక, భుట్టోలూ షరీఫ్ ల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిడి దశలవారీగా కొనసాగించడం సాధ్యపడుతుంది. పైగా, ఈ ఎన్నికలు అధికారపక్ష  కూటమిపై రెఫరెండమ్ అని ఆయన ముందుగానే ప్రకటించినా అది ఏ మాత్రం సత్తా ప్రదర్శించలేకపోయింది. వచ్చే ఏడాది అక్టోబరులో జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలను వెంటనే నిర్వహించాలనీ, విదేశీకుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఆయన డిమాండ్ కు ఈ ఫలితాలు మంచి ఊతాన్నిచ్చాయి. మొన్న జులైలో పంజాబ్ అసెంబ్లీకి 20 స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో 15 స్థానాలు కైవసం చేసుకున్న పీటీఐ ఈ సరికొత్త విజయంతో మంచి ఊపుమీద ఉండగా, ఎన్నికల సంఘం ఇమ్రాన్ మీద అనర్హత వేటువేసింది.


‘తోషాఖానా’ వ్యవహారంలో ఇమ్రాన్ కు శిక్షపడుతుందన్నది ఊహించిందే. ఇందులో రాజకీయం లేదని పూర్తిగా అనలేం కానీ, అధికారంలో ఉన్నప్పుడు ఇమ్రాన్ కక్కూర్తి పడటం కొంపముంచింది. విదేశీపర్యటనలప్పుడూ, అరబ్ దేశాలనుంచి అతిధులు వచ్చినప్పుడూ దక్కిన వజ్రాలు, వాచీలు, ఖరీదైన పెర్ఫ్యూమ్స్ వంటి బహుమతుల్లో కొంత విలువ మేరకు వ్యక్తిగతంగా వాడుకోవడానికి ప్రధానిగా ఆయనకు అనుమతి ఉన్నది. ఓ విలువ దాటినవాటిని మాత్రం ఆయన ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఈ పని చేయకుండా మరో వెసులుబాటును వాడుకున్నాడు. ఖరీదైన బహుమతుల విలువలో ఇరవైశాతం చెల్లించి తీసుకోవచ్చన్న నిబంధనను ఆయన యాభైశాతం చేశాడు. వచ్చినవాటిలో కూడా అన్నింటికీ కాక కొన్నింటికే ఆ సొమ్ము చెల్లించాడు. అది కూడా, ముందుగా వాటిని కొనుక్కొని, బయట అమ్ముకోవడం కాక, అనేకరెట్లు ఎక్కువ ధరకు అమ్మి సొమ్ముచేసుకున్న తరువాత ఖజానాకు తాను నిర్ణయించిన ఆ రిబేటు ధర చెల్లించాడు. తీరా లక్షలాది రూపాయల ఈ ఆదాయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రాల్లో చూపలేదు. అవినీతి వ్యతిరేకంగా పోరాడతానని, భుట్టోలు, షరీఫ్ లు మాత్రమే ఏలుతున్న పాకిస్థాన్ నుంచి సామాన్యులను రక్షించి దేశాన్ని ఏలుతానని చెప్పిన ఇమ్రాన్ ఈ వ్యవహారంలో అప్రదిష్ఠపాలైన మాట నిజం.


ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ విజయం సాధించారని అనేకంటే, అధికార కూటమి పాకిస్థాన్ డెమోక్రాటిక్ మూవ్ మెంట్ కు వ్యతిరేకంగా ప్రజలున్నారని చెప్పుకోవడం సరైనది. ఎన్నికల సంఘం ద్వారా ఇమ్రాన్ మీద వేటువేయించడంలో అధికారపక్షం విజయవంతమైంది కానీ, దేశాన్ని ఆర్థికంగా ఉద్ధరించడంలోనూ, వరదలవంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవడంలోనూ అది విఫలమైంది. ఎన్నికల సంఘం నిర్ణయం రేపు న్యాయస్థానాల్లో నిలవకపోతే, ప్రస్తుత ప్రభుత్వం అమెరికా ప్రతిష్ఠించినదన్న వాదనను ప్రజలు విశ్వసిస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇమ్రాన్ ను నిలువరించడం కష్టమే.

Read more