హిందీ వార్‌...!

ABN , First Publish Date - 2022-10-12T06:35:44+05:30 IST

ఇంగ్లిష్ భాషను దేశం నుండి వెళ్ళగొట్టే పేరిట, హిందీని మరింత పునాదిదిట్టం చేసే కృషిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది...

హిందీ వార్‌...!

ఇంగ్లిష్ భాషను దేశం నుండి వెళ్ళగొట్టే పేరిట, హిందీని మరింత పునాదిదిట్టం చేసే కృషిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. ఈనెల తొమ్మిదిన అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటు అధికార భాషా కమిటీ రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు సమర్పించిన నివేదికలో చేసిన సూచనలు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హిందీని దేశమంతటా రుద్దే ఈ ప్రయత్నానికి తక్షణమే స్వస్తిచెప్పండి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానిస్తే, ఎండీఎంకే నాయకుడు వైగోవంటివారు దీనిని హిందీయేతర ప్రజలపై కేంద్రం ప్రకటించిన యుద్ధంగా అభివర్ణించారు. కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీల నుంచి ఐఐటీలూ ఐఎఎంల వరకూ అన్నింటా హిందీలోనే బోధన సాగాలనడంతో పాటు, హిందీని నూటికి నూరుపాళ్ళూ అమలు చేయని చోట్ల శిక్షలు ఏ విధంగా ఉండాలో కూడా ఈ కమిటీ చెప్పింది.


అన్ని సాంకేతిక, సాంకేతికేతర విద్యా సంస్థల్లో హిందీ మాధ్యమంలో బోధనతో పాటు సర్వకార్యకలాపాలూ హిందీలోనే సాగాలని కమిటీ సూచించింది. హిందీ లేదా స్థానిక భాషలో మాత్రమే బోధన సాగాలి తప్ప, ఇంగ్లిష్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఉండకూడదన్నది కమిటీ సూచన. ఇంగ్లిష్ విదేశీభాష, వలసభాష కనుక దానిని అతివేగంగా వదిలించుకోవాలన్నది నివేదిక సారాంశం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉన్న ఐఐటీలు, ఐఎఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలని, ఇతర రాష్ట్రాల్లో వీటిలో బోధన స్థానిక భాషలో సాగాలని కమిటీ సూచించింది. హిందీ అభివృద్ధి ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ మూడు గ్రూపులుగా విభజించి, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లిష్‌కు స్థానం లేకుండా చేసేట్టు సూచనలున్నాయి. ఉద్యోగ నియామకాల్లో ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యానికి సంబంధించిన ప్రశ్నపత్రం కూడా ఎత్తివేయాలని కమిటీ సూచించింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాల్లో సకల వ్యవహారాలూ హిందీలోనే సాగాలనడంతో పాటు, కమిటీ తన నివేదికలో హిందీని ‘కామన్ లాంగ్వేజ్’ అంటూ శ్లాఘించింది. ప్రభుత్వం తన ప్రకటనల ఖర్చులో యాభైశాతానికి మించి హిందీ ప్రకటనలకే కేటాయించాలనీ, అవి భారీగా పెద్దగా ఉండాలనీ, విధిలేక ఇంగ్లిష్ ప్రకటనలు ఇవ్వవలసి వస్తే చిన్నగా లోపలి పేజీల్లో ఉండాలని కూడా ఓ సూచన. ప్రపంచీకరణతో హిందీకి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు వచ్చిందనీ, అందువల్ల హిందీ ఐక్యరాజ్యసమితి అధికారభాష కావాలని కూడా కమిటీ వాంఛించింది.


ఉపరితలంలో ప్రాంతీయభాషలకు స్థానం ఇస్తున్నట్టు కనిపిస్తూనే, అన్ని విద్యాసంస్థల్లోనూ ఇంగ్లిష్‌ను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా అమిత్ షా నేతృత్వంలోని ఈ కమిటీ ఒక బలమైన కుట్రకు పాల్పడుతున్నదని విమర్శకుల వాదన. దేశ ఫెడరల్ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అంటూ దేశాన్ని ‘హిందీస్థాన్’గా మార్చే లక్ష్యానికి అనుగుణంగానే ఈ సూచనలున్నాయని వారు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంలు వంటి అత్యున్నతస్థాయి విజ్ఞానకేంద్రాల్లో ఆంగ్లభాష లేకుండా చేయడంవల్ల దక్షిణ భారతదేశ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శ కాదనలేనిది. ఐఐటీలు, ఐఎఎంలు దేశవ్యాప్త అత్యున్నత స్థాయి విజ్ఞానకేంద్రాలు. అవి ఎక్కడున్నాయన్నదానిని బట్టి మాధ్యమాన్ని నిర్ణయించడం అవివేకం. హిందీలోనే బోధన ఉన్నప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాలకు చెందినవారు పోటీపడి అక్కడకుపోయి చదువుకొనే అవకాశం ఉండదు. మిగతా మాతృభాషలవారికి భిన్నంగా హిందీ భాషీయులు వాటిలో సులువుగా చదువుకోగలరు, పట్టాలు తెచ్చుకోగలరు, జాతీయస్థాయిలో ఉద్యోగాలూ సాధించగలరు. హిందీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నందున ప్రభుత్వం దీనిని అతివేగంగా ఆచరణసాధ్యం చేయగలదు కూడా. రాజ్యాంగం ప్రకారం అన్ని భాషలూ సమానమైనప్పుడు, అధికార భాష పేరుతో హిందీని రుద్దే ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు దక్షిణభారతం నుంచి వ్యతిరేకత వస్తూనే ఉన్నది. కానీ, భిన్నభాషల కలగూరగంపలాంటి ఈ దేశంలో భారత రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. దేశసమైక్యత గురించి ఉపన్యాసాలు దంచుతూనే, దేశంలోని మిగతా భాషలకు హిందీ శత్రువు కాదు, సహజ మిత్రుడు అంటూనే దానిని హిందీయేతరులపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రుద్దుతూనే ఉంది. 

Read more