‘ఆవ’కు అనుమతి!

ABN , First Publish Date - 2022-10-29T01:54:26+05:30 IST

దేశంలో జన్యుమార్పిడి ఆవాల పంటలు వేయడానికి పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే జెనెటిక్ ఇంజనీరింగ్ ఎప్రైజల్ కమిటీ (జీఈఎసి) పచ్చజెండా ఊపింది.

‘ఆవ’కు అనుమతి!

దేశంలో జన్యుమార్పిడి ఆవాల పంటలు వేయడానికి పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే జెనెటిక్ ఇంజనీరింగ్ ఎప్రైజల్ కమిటీ (జీఈఎసి) పచ్చజెండా ఊపింది. ఢిల్లీ యూనివర్సిటీలో రూపొందిన డీఎంహెచ్ 11 రకాన్ని విస్తృతంగా పండించవచ్చునంటూ వచ్చిన ఈ పర్యావరణ ఆమోదానికి ప్రభుత్వం సరేనంటే, భారతదేశం అనుమతించిన తొలి స్వదేశీ జన్యుమార్పిడి (జీఎం) పంట ఇదే అవుతుంది. రెండు దశాబ్దాల క్రితం బీటీ కాటన్‌కు దారులు వేసినతరువాత, జీఎం పంటలమీద విమర్శలు, ఇంకా అదే స్థాయిలో ఉండగానే ఇప్పుడు ఆవాల వంతు వచ్చింది.

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, జన్యుశాస్త్రవేత్త దీపక్ పెంటల్ ఈ జీఎం ఆవ రకాన్ని అభివృద్ధిచేశారు. జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది. అమెరికా మోన్సాంటో పత్తిలాగా ఈ ఆవ విదేశీ కాదు కనుక, సృష్టికర్త కూడా దేశీయే కనుక అర్థంలేని భయాలను పక్కనబెట్టగలిగితే మన పంటపండుతుందంటున్నారు కొందరు. ఈ జన్యుమార్పిడి ఆవ వంగడం ప్రస్తుతం ఉన్న చాలా రకాలకంటే ముప్పైశాతం ఎక్కువ దిగుబడినిస్తుందనీ, క్రిమిసంహారిణులను తట్టుకోగలశక్తి ఉన్నదనీ, కలుపును సునాయాసంగా నివారించవచ్చునని చెబుతున్నారు. తేనెటీగల వంటి ప్రాణులపై, ఇతర పంటలపై ఈ వంగడం ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో అంచనావేయమని జీఈఎసి సూచించినప్పటికీ, దీని వాణిజ్య ఉత్పత్తి ఇక ఎంతో దూరంలో లేదని కొన్ని రైతు సంఘాల అనుమానం. 2017లో ఇలాగే ఓమారు అనుమతిచ్చి, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో డెబ్బైలక్షల ఎకరాల్లో జీఎం ఆవ వేసినప్పటికీ, ప్రభుత్వం ఆ తరువాత పలు కారణాలరీత్యా దానిని ఉపసంహరించుకుంది. దీనికి ముందు, 2009లో మోన్సాంటోనుంచి లైసెన్సు పొందిన మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ బీటీ వంకాయను అభివృద్ధి చేసినప్పటికీ, రైతుసంఘాలు, సామాజిక కార్యకర్తల అభ్యంతరాలతో అప్పటి పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్ క్షేత్రస్థాయి వినియోగానికి అనుమతినివ్వలేదు. కానీ, మొత్తం వంటనూనెల్లో ఆవనూనె వినియోగం పదిహేను శాతం ఉండటం, ఏటా వంటనూనెల దిగుమతికి దేశం 20 బిలియన్ డాలర్ల విదేశీమారక ద్రవ్యాన్ని వినియోగిస్తుండంతో ఆవను అనుమతించినపక్షంలో చాలా సొమ్ము ఆదా అవుతుంది కనుక, ప్రభుత్వం ఈ మారు వెనక్కుతగ్గే అవకాశాలు లేవని రైతుసంఘాల అనుమానం. ఆరెస్సెస్ అనుబంధ స్వదేశీజాగరణ్ మంచ్ సహా పలువురు పర్యావరణ, సామాజిక ఉద్యమకారులు జీఎం ఆవ పంటకు అనుమతి ఇవ్వవద్దంటూ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ప్రజారోగ్యానికీ, మరీముఖ్యంగా రైతుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఈ వంగడం మీద గతంలోనూ పరీక్షలు సరైన ప్రాతిపదికలమీద ప్రామాణికంగా జరగలేదనీ, ఏదో తతంగాన్ని నడిపించి, విస్తారంగా పంటలకు అనుమతించే ప్రమాదం ఉన్నదని వారి భయం. పైగా, ఈ వంగడం క్రిమినాశనులనూ, కలుపునివారణులనూ గట్టిగా తట్టుకోగలదని అంటున్నందున రైతులు విష రసాయనాలను అధికంగా వినియోగించే అవకాశం ఉన్నదనీ, ఇది కలుపు మరింత శక్తిమంతంగా తయారవడానికీ, భూమితో పాటు జీవులనూ దెబ్బతీయడానికీ దారితీస్తుందని వారి వాదన.

జన్యుమార్పిడి పంటలకు దేశంలో అనుమతించకపోయినా, అర్జెంటినా, బ్రెజిల్, అమెరికా తదితర దేశాల నుంచి జీఎం నూనెలను దేశం ఇప్పటికే దిగుమతి చేసుకుంటున్నదనీ, 2002లో బీటీ కాటన్ కు అనుమతి ఇచ్చినందునే పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగి, ఎగుమతిలో చైనా తరువాత స్థానంలో మన దేశం రెండోస్థానంలో నిలబడిందని జీఎం సమర్థకులు గుర్తుచేస్తున్నారు. కానీ, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం వంటి అంశాల్లో రాజీకూడదనీ, స్వదేశీ వ్యవసాయ విధానాలను, సాంప్రదాయాలను చావుదెబ్బ తీసి, ఈ జీఎం పంటల ద్వారా దేశ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. జీఎం పంటలమీద ఉన్న భయాలు, వ్యతిరేకతలు, వాదనలు కొత్తవేమీ కావు. శాస్త్రబద్ధమైన డేటాతో వాటిని ఎదుర్కొనడానికి ఎటువంటి ప్రయత్నమూ జరగకపోవడం సరికాదు. ప్రభుత్వం పరీక్షల స్థాయినుంచి సమస్త ప్రక్రియల్లోనూ జీఎం ఉత్పత్తులను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలను భాగస్వాములను చేసి, సమష్టిగా ముందుకు కదిలినప్పుడే ఈ భయాలు తొలగిపోతాయి.

Updated Date - 2022-10-29T01:54:26+05:30 IST
Read more