దీన్‌ దయాళ్ బాటలో వెలుగుల భారత్‌

ABN , First Publish Date - 2022-09-24T07:06:12+05:30 IST

భారత ప్రభుత్వం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఫిలాసఫీ ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్, అంత్యోదయ..

దీన్‌ దయాళ్ బాటలో వెలుగుల భారత్‌

భారత ప్రభుత్వం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఫిలాసఫీ ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్, అంత్యోదయ భావనలతో సుమారు 740 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పండిట్ దీన్ దయాళ్ తాత్విక సిద్ధాంతాల పునాదుల మీద ఈ రోజు స్వశక్తి, స్వదేశీ, స్వాభిమానం, స్వావలంబనలతో భారత్ ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది.


పాశ్చాత్య దేశాలకు చెందిన తత్వవేత్తల ద్వారా జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన ఆదర్శవాదాలు పెల్లుబికాయి. కానీ కాలక్రమంలో ఇవి తొందరగానే పతనం చెందడం ఆరంభించాయి. మధ్యయుగాలలో చర్చి ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి జాతీయవాదం ప్రారంభమై, జాతీయ రాజ్యాలు ఏర్పడి, పాలించే రాజులు నిరంకుశులుగా మారిపోవడంతో ప్రజాస్వామ్య వాదం తెరపైకి వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్యం ఇచ్చిన పౌరస్వేచ్ఛ వల్ల ధనవంతులు మధ్యతరగతిని, పేదవారిని దోచుకోవడంతో, పెట్టుబడిదారితనం ఆచరణలోకి వచ్చింది.  సంపద కొందరి చేతుల్లోనే ఉండి మిగతావారు పేదవారుగా మిగిలారు. దీంతో సామ్యవాదం తెరపైకి వచ్చి, సమానత్వం – సమన్యాయం కోసం పోరాటం జరిగింది. సామ్యవాదాలలో కారల్ మార్క్స్ ప్రవచించిన ఆధునిక సామ్యవాదం (కమ్యూనిజం) ప్రసిద్ధి వహించింది. ప్రధానంగా రష్యా యుఎస్ఎస్ఆర్‌గా మారి కమ్యూనిస్టు దేశంగా అవతరించింది. యూరోపియన్ దేశాలలో కూడా ఈ వాదంతో ప్రభావితమై కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఈ దేశాలలో ఆయా కమ్యూనిస్టు ప్రభుత్వాధికారులు నియంతలుగా మారి ప్రజలకు కనీస స్వేచ్ఛ లేకుండా అణిచివేశారు. తర్వాత కాలంలో అంటే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలి, అనేక దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించాయి.


అదేవిధంగా స్వాతంత్ర్యానంతర కాలంలో ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా పాశ్చాత్య సామ్యవాదానికి ప్రభావితుడై పంచవర్ష ప్రణాళికలు, సామ్యవాద తరహా ఆర్థిక నమూనాను స్వీకరించడంతో దేశం అనేక నష్టాలు చవిచూసింది. 1991లో ఆ ఆర్థిక నమూనా కుప్పకూలిపోయి, భారతదేశం ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వర్తక సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద అప్పు చేయవలసి వచ్చింది. దాంతో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నూతన ఆర్థిక విధానాలను అనుసరించడం అనివార్యమైంది.


భారతీయ ఆలోచన ఆధారంగా స్వాతంత్ర్యానంతర కాలంలో దేశభద్రత, సంక్షేమం, మానవతా విలువల అభివృద్ధి కోసం భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులుగా పనిచేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాన్ని 60వ దశకంలో రూపొందించారు. ఇది వ్యక్తి నిర్మాణం, అభివృద్ధితోపాటు సమాజం నిర్మాణం, సమాజం అభివృద్ధిని ధర్మమార్గంలో నడిపిస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా వ్యక్తి శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక జరిగి, సమాజం కూడా ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మను కలిగి ఉంటుంది. వ్యక్తితో పాటు సమాజం కూడా చతుర్విధ పురుషార్థాలను (ధర్మ, అర్థ, కామ, మోక్షం) ఆచరించినప్పుడు వ్యక్తి, సమాజం పరస్పర సహకార పూరకాలుగా ఉండి, పరస్పరం అభివృద్ధి చెంది, మానవత్వం పునాదిగా దేశం సమగ్రాభివృద్ధి చెందుతుంది.


నాటి భారతీయ జనసంఘ్ నుంచి నేటి బిజెపి వరకు ఏకాత్మ మానవవాదం... తాత్విక సిద్ధాంతం ఆధారంగా ఆత్మనిర్భర్, అంత్యోదయ భావనలతో అనేక పథకాలకు రూపకల్పన చేసి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని, వారు ఆర్థిక స్వావలంబన సాధించాలని కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఉజ్వల యోజన, జన్‌ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన, దీన్ దయాళ్ కౌశల్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో–బేటి పడావో ఇలా మొదలైన పథకాలతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు,  సాంకేతికత, జనాభా, గిరాకీ...  ఇలా అన్ని రంగాలలో స్వశక్తిగా ఎదగడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. అదేవిధంగా దీన్ దయాళ్ ఆర్థిక విధానాలను అమలుచేయడానికి భారత ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది.


భారత ప్రభుత్వం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఫిలాసఫీ ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్, అంత్యోదయ భావనలతో సుమారు 740 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పండిట్ దీన్ దయాళ్ తాత్విక సిద్ధాంతాల పునాదుల మీద ఈరోజు స్వశక్తి, స్వదేశీ, స్వాభిమానం, స్వావలంబనలతో భారత్ ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే రోజుల్లో భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిద్దాం.

– శ్రీశైలం వీరమల్ల

ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు (రేపు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 105వ జయంతి)

Read more