కాంగ్రెస్‌ విజేత

ABN , First Publish Date - 2022-10-20T06:05:23+05:30 IST

భారత జాతీయ కాంగ్రెస్ 98వ అధ్యక్షుడుగా ఎనభైయేళ్ళ మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. గాంధీయేతరుడు ఈ స్థానాన్ని అధిరోహించడం దాదాపు పాతికేళ్ళ తరువాత జరిగితే...

కాంగ్రెస్‌ విజేత

భారత జాతీయ కాంగ్రెస్ 98వ అధ్యక్షుడుగా ఎనభైయేళ్ళ మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. గాంధీయేతరుడు ఈ స్థానాన్ని అధిరోహించడం దాదాపు పాతికేళ్ళ తరువాత జరిగితే, ఒక దళితుడు అధ్యక్షుడు కావడమన్నది ఓ యాభైయేళ్ళ తరువాత ఇదే ప్రథమం. స్వరాష్ట్రం కర్ణాటకనుంచి నిజలింగప్ప తరువాత ఆ స్థానంలో కూచోబోతున్నారు. థరూర్ విమర్శలు, వేదనలూ వింటునే ఉన్నాం కనుక, ఖర్గే విజయం అనూహ్యమైనదేమీ కాదు. ఖర్గేకు దాదాపు ఎనిమిదివేల ఓట్లు రావడం కంటే, ‘సమానావకాశాలు లేని బరి’లో కూడా థరూర్‌కు సుమారు వెయ్యి ఓట్లు రావడం విశేషమే.


గాంధీల మనిషిగా, వారి అప్రకటిత అభ్యర్థిగా ఖర్గే సునాయాసంగా విజయం సాధించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా, తనకు ఇద్దరూ సమానమేననని ప్రతినిధులకు సోనియా విస్పష్టంగా చెప్పివుంటే ఈ ఎన్నికకు ఈ మాత్రం అప్రదిష్ఠ కూడా వచ్చేది కాదు. ఈ ఎన్నికల ప్రక్రియకాలంలోనే, అసలు ఎన్నికంటూ లేకుండానే జెపీనడ్డా పదవీకాలాన్ని బీజేపీ మరోవిడత పొడిగించినందున మీ కంటే మేము ఎంతో నయం అని కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పుకోవచ్చు. అసలు ఎన్నికల ప్రక్రియే కనిపించని చాలా పార్టీలతో పోల్చితే, దానిని చేపట్టి, తాము తప్పుకొని, గాంధీయేతరుడిని అధ్యక్షస్థానంలో కూచోబెట్టిన సాహసాన్ని కొందరు అభినందించవచ్చు. ఎన్నికల కాలమంతా విమర్శలూ, రిగ్గింగ్ వంటి ఆరోపణలూ చేస్తూ, అధ్యక్ష ఎన్నికలకు పరోక్షంగా విస్తృత ప్రచారం, విలువ చేకూర్చిన థరూర్, ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ పునర్జీవనం ఆరంభమైందన్న ప్రకటనతో శుభం పలికారు. సోనియాగాంధీ స్వయంగా కొత్త అధ్యక్షుడి ఇంటికి వెళ్ళి  పుష్పగుచ్ఛంతో అభినందించడం, మరోపక్క రాహుల్ గాంధీ తాను ఇక నుంచీ ఖర్గేకే సమస్త విషయాలూ నివేదిస్తాననీ, పార్టీలో తన పాత్రను కూడా ఆయనే నిర్ణయిస్తారని అనడం చూడడానికీ, వినడానికీ బాగున్నాయి. అధ్యక్షస్థానాన్ని తమమాదిరిగానే అందరూ గౌరవించాలన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు చేరవేసేందుకు ఉపకరిస్తాయి.


వరుస పరాజయాలతో పార్టీలో రాజుకున్న అసంతృప్తితో వేగలేక రాహుల్ తప్పుకున్న తరువాత, మూడేళ్ళుగా పార్టీకి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ, ఎట్టకేలకు తమ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గేను అధ్యక్షస్థానంలో కూచోబెట్టగలిగారు. ఇప్పటివరకూ, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాక, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సెన్‌గా మాత్రమే తనను తాను అభివర్ణించుకుంటున్న సోనియా ఇప్పుడు ఖర్గేస్థానంలో రాజ్యసభ విపక్షనాయకుడుగా దిగ్విజయ్ సింగ్‌నో, చిదంబరాన్నో కూచోబెట్టవచ్చునట. గాంధీలతో సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పినా, ఖర్గేతో పార్టీకి ఏ ప్రయోజనం లేదని తీసిపారేయనక్కరలేదు. ఎన్నికల రాజకీయాల్లోనూ, సంస్థాగత వ్యవహారాల్లోనూ ఆయనకు దశాబ్దాల అనుభవం ఉన్నది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కనుక, ఒకవ్యక్తికి ఒకే పదవి, యాభైయేళ్ళలోపు వారికి, అందునా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కీలకబాధ్యతలు అప్పగించడం వంటివి జరగవచ్చు. రాష్ట్రాల స్థాయిలో పీసీసీ అధ్యక్షులు చిత్తం వచ్చిన హోదాలు, పేర్లతో నచ్చినవారిని ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో, ఆ వ్యవస్థాపరమైన గందరగోళాన్ని ఖర్గే ప్రక్షాళించవచ్చు. ఓ స్థాయిలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీ దైనందిన వ్యవహారాలను ఖర్గే చక్కబెడతారు. సోనియా, రాహుల్ బదులుగా వివిధ పార్టీలతో చర్చలు జరపడానికీ, విపక్ష ఐక్యతకు కృషి చేయడానికీ ఖర్గేకు అవకాశం ఉన్నది. ఒకప్పుడు పార్టీలో తాను చేయదల్చుకొని చేయలేకపోయిన మార్పులను ఇప్పుడు ఖర్గే ద్వారా రాహుల్ నెరవేర్చుకుంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో కాంగ్రె‍స్‌ను తిరిగి అధికారంలోకి తేవడానికి జోడో యాత్రతో ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన నాయకుడిగా ఖర్గే తన నాయకుడి మనసులో ఉన్నదాన్ని ఆచరణలో పెట్టవచ్చు. ఇప్పటికే ప్రకటించిన గుజరాత్, హిమాచల్ ఎన్నికలు, తరువాత మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకటించబోయే ఎన్నికలు ఖర్గేకు తొలిపరీక్ష కాకున్నా, వచ్చే ఏడాది వేసవిలో ఆయన స్వరాష్ట్రం కర్ణాటకలో జరగబోయే ఎన్నికలు కచ్చితంగా ఆయన సమర్థతకు పరీక్షే. కాంగ్రెస్ విజయావకాశాలు బాగున్నాయి అని కూడా అంటున్న ఈ రాష్ట్రంలో బలంగా గెలిస్తే పార్టీకి ఎక్కడలేని శక్తీ వస్తుంది, సార్వత్రక ఎన్నికలకు ఆర్థికంగానూ, హార్దికంగానూ ఉపకరిస్తుంది.

Updated Date - 2022-10-20T06:05:23+05:30 IST