రక్షకులు–అర్హతలు

ABN , First Publish Date - 2022-06-11T07:30:52+05:30 IST

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆరునెలలకు..

రక్షకులు–అర్హతలు

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆరునెలలకు కొత్త సీడీఎస్ నియామకంమీద భారతప్రభుత్వం దృష్టిపెట్టింది. దేశరక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ పదవిని భర్తీచేసేందుకు ఉద్దేశించిన సరికొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సీడీఎస్ అవసరమే లేకుండా దేశం ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించినప్పటికీ, మోదీ ప్రభుత్వం ఏ కారణంచేతనో ఈ సంప్రదాయాన్ని ఆరంభించినందున దానిని కొనసాగించవలసిందే. అయితే, కొత్త సీడీఎస్‌గా రాబోయే వ్యక్తికి ఉండాల్సిన అర్హతల విషయంలో ఇప్పుడు విడుదల చేసిన నిబంధనలు విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు తావిస్తున్నాయి.


తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, సర్వీసులో ఉన్న లేదా రిటైరైన త్రివిధ దళాల అధిపతులు ఈ పదవికి పోటీపడేందుకు అర్హులు. వారితో పాటు వైస్ చీఫ్‌లు కూడా ఈ పదవికి పోటీపడవచ్చు. వయోపరిమితిని 62 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ, సర్వీసులో ఉన్న లేదా రిటైరైన లెఫ్ట్‌నెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్ సీడీఎస్‌గా ఉండవచ్చునని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఈ ప్రకారం నాలుగు నక్షత్రాల త్రివిధ దళాధిపతులతో మూడు నక్షత్రాలవారూ పోటీపడగలిగే అవకాశం ఏర్పడింది. కేవలం త్రివిధ దళాధిపతులను మాత్రమే అర్హులుగా ఉంచుతూ వారినుంచి ఒకరిని సీడీఎస్‌గా నియమించవలసి ఉండగా, ప్రభుత్వం ఇప్పుడు ఆ అర్హతను మరింత విస్తరించడం రక్షణరంగ నిపుణుల్లోనే ఎక్కువమందికి నచ్చడం లేదు. అంతిమంగా ఎవరిని నియమిస్తారన్నది అటుంచితే, ఈ కొత్త నిబంధనలతో ప్రభుత్వం ఆ వ్యవస్థను పలుచనచేసిందని వారి అభిప్రాయం. కనీస అర్హతను కాస్తంత దిగువనే ఉంచినా, ఉన్నతస్థాయి అధికారిని సీడీఎస్ కుర్చీలో కూచోబెడితే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. కానీ, ఏ కారణంవల్లనో సర్వీస్ చీఫ్‌గా నియామకం కూడా దక్కని వ్యక్తిని ఏకంగా సీడీఎస్ చేస్తే మట్టుకు విమర్శలు వస్తాయి. సీడీఎస్‌ని సమానుల్లో ప్రథముడని అంటున్నప్పుడు ఈ రకమైన చర్య మరీ ప్రమాదం. ఇటువంటి వ్యక్తికి సర్వీస్‌లో ఉన్న నాలుగు నక్షత్రాల అధికారి రిపోర్టు చేయడమన్నది ఊహకు కూడా అందని విషయం. పాలకుల మనసులో ఎవరో ఉన్నారనీ, తదనుగుణంగానే నిబంధనలను సవరించారనీ కొందరు ఆడిపోసుకుంటున్నది నిజం కాకపోవచ్చు. పాలకులు సమర్థులనుకున్నవారు కాస్త కిందన ఉండనూవచ్చు. కానీ, అధికారం, హోదా, ర్యాంకులు ఇత్యాది అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రక్షణరంగంలో ఇది అంతిమంగా తీవ్ర గందరగోళానికి దారి తీస్తుంది. త్రివిధ దళాలనూ ఒక్కటిగా చేసి, వాటి మధ్య సమన్వయం సాధిస్తూ కష్టకాలంలో దేశభద్రతకు ఏ ఇబ్బందీ రాకుండా చూడటానికి సీడీఎస్ స్థానం ఉపకరిస్తుంది. త్రివిధ దళాధిపతులకూ పెద్ద తలకాయగా ఉండాల్సిన ఆ వ్యక్తి అన్ని విధాలుగా అందుకు అర్హులై ఉండాలి. ఆర్మీచీఫ్‌గా రిటైరైన రావత్‌ను ఆ స్థానంలో కూచోబెడుతున్నప్పుడు అప్పటికి సర్వీస్‌లో ఉన్న చీఫ్‌లు అందరికన్నా ఆయన వయసులోనూ, హోదాలోనూ పెద్ద కనుక ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, మారిన నిబంధనల ద్వారా పొరపాటున తమ కంటే దిగువస్థాయి ఉద్యోగి త్రివిధ దళాధిపతులకూ బాస్‌గా వచ్చిపడితే అది ఇబ్బందికరమే.


నెహ్రూ కాలం నుంచి ఉన్న ఈ ఆలోచనను మోదీ ప్రభుత్వం తన రెండవ విడత ఏలుబడిలో ఆచరణలోకి తీసువచ్చింది. ఇందిరాగాంధీ సైతం ఒకదశలో సీడీఎస్ నియామకం వైపు ఊగి, ఆ తరువాత రక్షణరంగ పెద్దల మధ్య అనవసరపు వైమనస్యాల భయంతో వెనక్కుతగ్గినట్టు చెబుతారు. ఎన్ని కమిటీలు సూచించినా గతపాలకులు చేయని సాహసాన్ని మోదీ ప్రభుత్వం రావత్ నియామకంతో చేసింది. ప్రస్తుతం చైనాతో వ్యవహారం వేగంగా వేడెక్కుతున్నది. తైవాన్ కోసం ఎంతకైనా తెగిస్తాననీ, యుద్ధానికి కూడా సిద్ధమని అది ప్రకటించింది. తైవాన్ జోలికి వస్తే ఊరుకొనేది లేదని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో చైనా ఇలా విషయాన్ని తేల్చేసింది. అమెరికా పక్షాన దాని ప్రయోజనాలు కాపాడుతూ చైనాతో కాలుదువ్వాల్సిన స్థితిలో మనం ఉన్నాం. పాకిస్థాన్ ఎలాగూ పక్కలో కుంపటే. ఈ నేపథ్యంలో, కొత్త సీడీఎస్‌గా నియమితుడయ్యే వ్యక్తి త్రివిధ దళాధిపతులకే కాక, దేశప్రజలందరికీ గర్వకారణం కావాలి.

Read more