హిమాచలంతో ఆరంభం

ABN , First Publish Date - 2022-10-15T06:19:59+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో, దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది.

హిమాచలంతో ఆరంభం

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో, దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి హిమాచల్ తో పాటే గుజరాత్ ఎన్నికల తేదీలను కూడా ఈసీ ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ఆరునెలల వ్యవధిలో ముగుస్తుంటే, వాటికి ఒకేసారి షెడ్యూల్ ప్రకటించి, ఓట్ల లెక్కింపు కూడా ఒకే రోజున చేపడతారు. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో, గుజరాత్ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తవుతోంది. రెండింటిమధ్యా నలభైరోజులే తేడా ఉన్నందున రెండు రాష్ట్రాలకూ షెడ్యూల్ విడుదల అవుతుందని అంతా భావించారు. బీజేపీ చేతుల్లో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ బలాలూ బలహీనతలమీద మీడియాలో విశ్లేషణలు కూడా మొదలైనాయి. ఇప్పుడు హిమాచల్ మాత్రమే ప్రకటించి, గుజరాత్ ను వదిలేయడం మీద మీడియా ఈసీని ప్రశ్నించినప్పుడు ఐదేళ్ళక్రితం పాటించిన సంప్రదాయాన్నే ఇప్పుడూ పాటించామనీ, అక్కడి వాతావరణంతోపాటు చాలా కారణాల రీత్యా హిమాచల్ షెడ్యూల్ ముందుగా ప్రకటించామనీ, నిబంధనల ఉల్లంఘనలేమీ జరగలేదనీ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఓ వివరణ ఇచ్చారు. విపక్షాలకు ఇది ఏమాత్రం సమర్థనీయంగా, నమ్మశక్యంగా లేకపోవడంతో అధికారపక్షంమీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.


హిమాచల్‌లో నవంబరు 12న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన తరువాత, ఫలితాలు మాత్రం డిసెంబరు 8న ప్రకటించబోతున్నట్టు ఈసీ చెబుతోంది. పోలింగ్ తేదీ, కౌంటింగ్ మధ్య ఇంత తేడా ఉండటమూ ఊహాగానాలకూ, విమర్శలకూ తావిస్తున్నది. గుజరాత్ ఎన్నికలను కూడా ఈనెలలోనే ప్రకటించే ఉద్దేశంలో ఎన్నికల సంఘం ఉన్నదనీ, అయితే పైకి చెప్పని, చెప్పలేని చాలా కారణాల రీత్యా ఇప్పుడు హిమాచల్ తో కలిపి వాటిని ప్రకటించలేదని అంటున్నారు. 2017లోనే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను ఈసీ తొలిసారిగా విడదీసి, షెడ్యూల్ ప్రకటనకు మధ్యలో పన్నెండురోజులు తేడా ఉంచింది. ఫలితాలను మాత్రం ఒకేమారు ప్రకటించింది. అధికారపక్షానికి బోలెడన్ని వరాలూ, ప్రాజెక్టులు ప్రకటించుకోవడానికి ఈసీ ఈ పన్నెండురోజులూ అవకాశమిచ్చిందని విపక్షాలు అప్పుడూ ఆడిపోసుకున్నాయి. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్ లో చేయాల్సింది ఇంకా మిగిలివున్నందున ఎన్నికల నియమావళి అమలులోకి జాగ్రత్తపడ్డారని విపక్షాలు ఇప్పుడూ విమర్శిస్తున్నాయి.


గుజరాత్‌లో అధికార బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీనుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. పంజాబ్ విజయం తరువాత కేజ్రీవాల్ మంచి దూకుడుమీద ఉన్నారు. సుదీర్ఘకాలంగా గుజరాత్‌ను ఏలుతున్న బీజేపీని, ముఖ్యమంత్రి భుపేన్ పటేల్ మీద ప్రజావ్యతిరేకత అధికంగా ఉన్నదన్న వార్తలు కలవరపెడుతున్నాయి. పదిరోజుల వ్యవధిలో మోదీ రెండుసార్లు వెళ్ళి ఓ యాభైవేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రకటించారు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను, అహ్మదాబాద్ మెట్రోరైల్ ను ప్రారంభించారు. డ్యాములు, రహదారి విస్తరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా చాలా చేసినప్పటికీ, ఆమ్ ఆద్మీ దూకుడు తట్టుకోవాలంటే మరింత చేయాలని, అందుకు మరింత సమయం కావాలని అధికారపక్షం భావించి ఉండవచ్చు. కాంగ్రెస్ కూడా ఈమారు అధికారపక్ష వ్యతిరేకతనుంచి బాగానే లబ్ధిపొందుతుందని అంటున్నారు. హిమాచల్‌లో మోదీతో పాటు, అమిత్ షా కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఆ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారపక్షాన్ని కూలదోసే సంప్రదాయం హిమాచల్‌కు గట్టిగా ఉన్నప్పటికీ, డబుల్ ఇంజన్ నినాదంతోనూ, మోదీ మొఖంతోనూ నెట్టుకురాగలనని బీజేపీ నమ్మకం. అభివృద్ధి విషయంలో ప్రజలను నమ్మించగలిగినా, ఈ మారు గతంలో కంటే ప్రభుత్వోద్యోగుల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని అంటారు. వీరభద్రసింగ్ మరణం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎం పదవి కోసం నలుగురు పోటీ పడుతూండడం బీజేపీకి కలిసొచ్చేవే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కంటే, త్వరలో ప్రకటించబోయే గుజరాత్‌లో ఎక్కువ స్థానాలు సంపాదించలేని పక్షంలో బీజేపీకి పెద్ద అప్రదిష్ఠే. హిమాచల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో, రాబోయే ఏడాదిన్నర కాలంలో ఏడురాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు, ఆ తరువాత సార్వత్రక ఎన్నికలకు తెరలేచినట్టు భావించవచ్చు.

Read more