ట్రంప్‌కు ఎదురుదెబ్బ!

ABN , First Publish Date - 2022-11-12T02:06:08+05:30 IST

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలాబలాలు అంతిమంగా ఎలా ఉన్నప్పటికీ, విభిన్న జాతులకూ, స్త్రీల హక్కులకూ ఈ ఎన్నికల్లో చక్కని ప్రాతినిధ్యం దక్కింది.

ట్రంప్‌కు ఎదురుదెబ్బ!

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలాబలాలు అంతిమంగా ఎలా ఉన్నప్పటికీ, విభిన్న జాతులకూ, స్త్రీల హక్కులకూ ఈ ఎన్నికల్లో చక్కని ప్రాతినిధ్యం దక్కింది. మధ్యంతర ఎన్నికలు జరిగి నాలుగు రోజులైనా ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత రాకపోవడానికి ఓట్లను లెక్కించే విషయంలో అక్కడి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అనుసరిస్తూండటమే కారణం. సెనేట్ మీద ఆధిపత్యం ఎవరిదన్నది అరిజోనా, నేవడా, డిసెంబరు 6న తిరిగి ఎన్నికలు జరగబోతున్న జార్జియా రాష్ట్రాల ఫలితాలు వస్తే తప్ప తేలదు. 435 మంది ఉన్న ప్రతినిధుల సభలో తిరుగులేని విజయాలు సాధిస్తారనుకున్న రిపబ్లికన్లు అతినెమ్మదిగా కనీస మెజారిటీవైపు మాత్రం కదులుతున్నారు.

అభ్యర్థుల గెలుపోటముల మధ్య తేడాలు అతి తక్కువగా ఉండటం, అనేకచోట్ల రీకౌంటింగ్ చేయాల్సిరావడం, గాలి ఏకపక్షంగా లేదనీ, పోరు నువ్వానేనా అన్నట్టుగా జరిగిందని స్పష్టంచేస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతానికి డజను స్థానాలు వెనుకబడివున్న డెమోక్రాట్లు, సెనేట్ లో ఒకస్థానం వెనుకన ఉన్నారు. ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతుల్లోకి పోతున్నదని తెలుస్తున్నప్పటికీ, కీలకమైన సెనేట్ విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రాలన్నీ ఏకపక్షంగా ఓటుచేయలేదనీ, చాలామంది ఊహించినట్టుగా, పలు సర్వేలు చెప్పినట్టుగా డెమోక్రాట్లు అంతగా భంగపడలేదనీ అర్థం. ఫలితాలు మిశ్రమంగా ఉండటం, డెమోక్రాట్లు మంచి పనితీరు కనబరచడం అమెరికా ప్రజాస్వామ్యానికి మంచిది. కొత్తగా అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడి పదవీకాలం మిగతా సగం ఉండగా దిగువసభలోని అన్ని స్థానాలకూ, సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరగడం అమెరికా ప్రజాస్వామ్యంలో ఒక విశేషం. అధ్యక్షుడు ఏ పార్టీకి చెందినవాడైనా, సర్వసాధారణంగా విపక్షమే ఈ ఎన్నికల్లో అధికంగా లబ్ధిపొందుతూంటుంది. అప్పటివరకూ అధ్యక్షుడు, ఆయన పార్టీ అనుసరించిన విధానాలమీద ఈ తీర్పు, మిగతాకాలంలో అధ్యక్షుడిని వీరంగాలు వేయకుండా నియంత్రిస్తుంది. బైడెన్ పాలనలో డెమోక్రాట్లు మరింత దెబ్బతింటారనీ, ట్రంప్ చక్రం తిప్పుతున్నందున రిపబ్లికన్లు అద్భుతాలు చేస్తారనీ అనుకుంటున్న తరుణంలో, ‘రెడ్ వేవ్’ అన్నదేమీ లేదని తేలిపోయింది. రిపబ్లికన్లకు కంచుకోట అనుకున్న రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు సాధించడం విశేషం. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్, ఎన్నికల ప్రక్రియను తప్పుబడుతూ, ఆఖరునిముషం వరకూ ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తూ, నడివీధుల్లో హింసనూ, దురాక్రమణలనూ ప్రోత్సహించి చివరకు విధిలేక విషం కక్కుతూనే గద్దెదిగిన విషయం తెలిసిందే. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పదవీచ్యుతుడినైనానని చెప్పుకుంటున్న ట్రంప్ ఈ ఎన్నికలను రెఫరెండమ్‌గా చెప్పుకున్నారు. మారోమారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి రాచబాటలు పరుస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ట్రంప్ బలపరచిన చాలామంది ఆయా రాష్ట్రాల్లో ఓడిపోవడంతో ఆయనపట్ల సానుభూతి పవనాలేమీ వీయడం లేదని తేలిపోయింది. అధికధరలు, నిరుద్యోగం ఇత్యాది అనేకానేక సమస్యలు వేధిస్తున్నప్పటికీ, మాటకారి ట్రంప్ కంటే చేతల బైడెన్ ఉత్తమం అని అమెరికన్లు అనుకుని ఉంటారు. ట్రంప్ మితవాద, ఉన్మాద వైఖరులకంటే వేతనాలు, ఉద్యోగాలు, అబార్షన్ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ఇత్యాదివి ముఖ్యమని వారు తేల్చారు.

డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయిందని పూర్తిగా చెప్పలేం కానీ, ఈ ఎన్నికల్లో ఆయనకు ఓ బలమైన ప్రత్యర్థి పార్టీలో పుట్టుకొచ్చాడు. రెండు పార్టీలకూ సమానబలం ఉన్న ఫ్లోరిడా రాష్ట్రంలో రిపబ్లికన్ అభ్యర్థి డీశాంటిస్ భారీ మెజారిటీతో గెలవడం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. తాను సమర్థించినవారు ఓడిపోవడం, తాను బాహాటంగా వ్యతిరేకించే డీశాంటిస్ బలమైన నాయకుడిగా అవతరించడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను పక్కనబెట్టి, డీశాంటిస్‌నే ముందుకు తేవాలని చాలామంది రిపబ్లికన్లు భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువమంది మహిళలు గవర్నర్లుగా గెలవడం, ప్రతినిధుల సభలో భారతమూలాలున్నవారికి అధిక ప్రాతినిధ్యం దక్కడం, పలుస్థాయిల్లో ఏషియన్లు, నల్లజాతీయులు, ట్రాన్స్ జెండర్లు విజేతలుగా నిలుస్తూ ఈ ఎన్నికలు వైవిధ్యాన్ని కనబరచడం సంతోషించవలసిన అంశం.

Updated Date - 2022-11-12T12:45:15+05:30 IST