విజయానికి మరో మెట్టు

ABN , First Publish Date - 2022-08-11T10:01:56+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తగా తయారుచేసిన ‘స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వి) తొలి ప్రయోగం విజయవంతం కాలేదు.

విజయానికి మరో మెట్టు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తగా తయారుచేసిన ‘స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వి) తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. మూడేళ్ళుగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిన్న ఉపగ్రహాల వాహక నౌక ప్రయాణం చివరివరకూ విజయవంతంగా సాగి, నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే విషయంలో విఫలం కావడం వల్ల, ఈ మిషన్ తీపి, చేదు అనుభవాల మిశ్రమమని శాస్త్రజ్ఞులు చేస్తున్న వ్యాఖ్య కాదనలేనిది. ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరని కారణంగా నిరుపయోగమైనాయి. ప్రయోగం ఫలితాన్నివ్వకపోవడంతో, ఇస్రో వెంటనే దారితీసిన కారణాలను, ఇతరత్రా సాంకేతికాంశాలను పూసగుచ్చినట్టు వివరించి మంచిపని చేసింది. తప్పొప్పులను పరిశీలించుకుని, నైపుణ్యాలను మెరుగుపరుచుకొని మరిన్ని అద్భుతమైన విజయాలను దేశానికి అందించేందుకు ఇస్రోకు ఇటువంటి సందర్భాలు ఉపకరిస్తాయి.


పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ రాకెట్ దాదాపు పన్నెండు నిముషాలు ప్రయాణించి మూడుదశలనూ చక్కగా దాటింది. భూ పరిశీలనకు ఉద్దేశించి ఇస్రో రూపొందించిన చిన్నపాటి శాటిలైట్ ‘ఈఓఎస్02’ను అది ముందుగా కక్ష్యలోకి వదిలిపెట్టాల్సి ఉంది. ఆ తరువాత,  ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారుచేసిన ‘ఆజాదీశాట్’ అనే ఉపగ్రహాన్ని మరికొన్ని సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ, ప్రయోగం తుదిదశలో జరగాల్సిన ఈ ప్రక్రియ సెన్సార్ పనితీరులో ఎదురైన వైఫల్యంవల్ల విజయవంతం కాలేదు. ఉపగ్రహాలు భూమికి 356కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించడానికి బదులుగా, దీర్ఘవృత్తాకార కక్ష్యల్లోకి జారిపోయి, నిరుపయోగమైపోయాయి.


పిఎస్ఎల్‌వి అనంతరం, ఇస్రో అత్యధిక ఆశలు పెట్టుకున్నది ఈ కొత్తతరం రాకెట్ మీదనే. రెండుమీటర్ల చుట్టుకొలతతో, ముప్పై ఐదుమీటర్ల పొడవుతో ఉన్న ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్‌వి కంటే చిన్నది, తయారీకి, ప్రయోగానికీ సులువైనది. ఉపగ్రహాల ప్రయోగానికి పీఎస్ఎల్‌విని వాడుతున్నప్పటికీ, భారీ ఉపగ్రహాలను అటుంచితే, పరిమాణంలోనూ, బరువులోనూ తక్కువ ఉన్న ఉపగ్రహాల ప్రయోగానికి దీనిని వాడటమంటే దాని శక్తిని దుర్వినియోగం చేయడమే. ఐదునుంచి వెయ్యికేజీలున్న ఉపగ్రహాలకు కూడా భారీ రాకెట్‌లను ప్రస్తుతం వాడవలసి వస్తున్నది. అందువల్ల, ఐదువందల కేజీలలోపు ఉపగ్రహాల ప్రయోగానికి పీఎస్ఎల్‌విని కాక, ఎస్ఎస్ఎల్‌విని వాడాలన్న లక్ష్యంతోనే దానిని తయారుచేసుకున్నారు. ద్రవీకృత ఇంధనాలను వినియోగించే పీఎస్ఎల్‌వితో పోల్చితే ఘనీభవించిన ఇంధనాన్ని వినియోగించే ఈ కొత్త రాకెట్ చవుకైనది, నియంత్రణలోనూ నిర్వహణలోనూ సులువైనది. అనేక ఉపగ్రహాలను ఒకేమారు ప్రయోగించగలిగే సమర్థత ఉండటంతో పాటు, తక్కువ మౌలిక సదుపాయాలూ వ్యవస్థలతో దీనిని ప్రయోగించవచ్చు. ఇప్పుడు వాడుతున్న పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి రాకెట్‌ల తయారీకి దాదాపు మూడునెలల సమయం పడుతున్నందున, పదోవంతు తక్కువ ఖర్చుతో, కొద్దిరోజుల్లోనే ఈ కొత్త నౌకను తయారుచేసుకోవచ్చు. ఉపగ్రహాల అవసరం పెరుగుతూ, వాటి ప్రయోగాల డిమాండ్ హెచ్చుతున్న నేపథ్యంలో, అంతరిక్షంలోకి వాటిని వరుసగా సునాయాసంగా పంపగలిగే అవకాశం దీనితో ఉన్నది. అందువల్లనే, రాబోయే రోజుల్లో ఈ రాకెట్ తమకు ప్రధాన ఉపగ్రహ వాహక నౌక అవుతుందని ఇస్రో నమ్ముతోంది. చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వేలకోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తన వాటా మరింత పెంచుకోవచ్చునని ఆశించింది. 


డేటా, కమ్యూనికేషన్ ఇత్యాది అవసరాలు పెరుగుతున్నప్పుడు వందలకొద్దీ చిన్నచిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి త్వరత్వరగా పంపించాల్సిన అవసరం హెచ్చుతున్నది. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే, ఇస్రో రూపొందిస్తున్న ఉపగ్రహాల సంఖ్యను కూడా పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నాలుగేళ్ళుగా ఈ కొత్త రాకెట్ ప్రయోగం కరోనా సహా అనేక అవాంతరాల వల్ల వాయిదాపడుతూ వచ్చి, ఇప్పుడు సెన్సార్ పనితీరులో లోపంతో చివరిదశలో విఫలమైనందున చింతించాల్సిందేమీ లేదు. రాకెట్ తయారీతో పాటు ఆయా దశల్లో వాటి పనితీరును పరీక్షించే ప్రక్రియలమీద మిగతా చాలాదేశాల అంతరిక్ష సంస్థలతో పోల్చితే ఇస్రో చాలా తక్కువ ఖర్చుచేస్తుందని అంటారు. కారుచవుకగా అద్భుతాలను సాధించగలిగే సమర్థత ఉన్న ఇస్రోకు ఈ వైఫల్యం మరో కొత్త విజయానికి దారులు పరుస్తుందనడంలో సందేహంలేదు.

Updated Date - 2022-08-11T10:01:56+05:30 IST