అపూర్వ ఘట్టం

ABN , First Publish Date - 2022-10-26T01:22:58+05:30 IST

రెండువందల సంవత్సరాలు మనదేశాన్ని ఏలిన శ్వేతజాతీయుల దేశానికి భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు...

అపూర్వ ఘట్టం

రెండువందల సంవత్సరాలు మనదేశాన్ని ఏలిన శ్వేతజాతీయుల దేశానికి భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఒక క్రైస్తవ మెజారిటీ దేశానికి గుళ్ళూ గోపురాలూ సందర్శించే ఒక హిందువు పాలకుడు అయ్యాడు. వ్యాపార వాణిజ్య రంగాల్లోనూ, సాంకేతిక రంగాల్లోనూ భారత మూలాలున్నవారు అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికీ, బహుళజాతి కంపెనీలకు సీఈవోలుగా ఎదిగినప్పటికీ, బ్రిటిష్ చరిత్రలోనే అతిపిన్నవయస్కుడిగా సునాక్ ఆ దేశానికి ప్రధాని కావడం ఒక చారిత్రక ఘట్టం.

టెన్ డౌనింగ్ స్ట్రీట్‌లోకి ప్రవేశిస్తూ చేతులు ఊపుతున్న సునాక్ కుడిచేతికి కట్టివున్న ఎర్రతాడు గురించి బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. దీనికి ముందు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు లిజ్ ట్రస్ ఉపయోగించిన పోడియంను కూడా మార్చివేసిన విషయాన్ని మీడియా చెప్పుకుంటోంది. కిందిభాగంలో పలువంకర్లు తిరిగివున్న ఆ పాత పోడియం స్థానంలో నిటారుగా, ఎటువంటి హంగులూ లేని ఓ సాధారణ బల్లను తెచ్చిపెట్టడం సునాక్ నిలకడతనానికి నిదర్శనమని కొందరు అంటున్నారు. ఆయన పాలన ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నకు స్వపక్ష ఎంపీయే అత్యంత బోరింగ్ పాలన మీరు చూడబోతున్నారు అని సమాధానం చెప్పాడు. ఏమాత్రం ఆకర్షణీయమైన నినాదాలు, నిర్ణయాలకు తావులేని పాలననే దేశ ప్రజలంతా కోరుకుంటున్నారనీ, తామూ దానినే కోరుకున్నందున ఒక కంపెనీ సీఈవోలాగా అహర్నిశలూ పనిచేసే ఒక చేతలమనిషిని ప్రధానిగా ఎన్నుకున్నామని అన్నారాయన. సునాక్ రాక వెనుక ఆర్థికం తప్ప మరే ఎజెండా లేదు. అన్యాధా శరణం నాస్తి అన్నట్టుగా బరిలో ఎవ్వరూ లేకుండా అధికారపక్ష ఎంపీలంతా ఆయనకే పగ్గాలు అప్పగించారు. సునాక్‌కు స్వాగతం చెబుతున్నప్పుడు వారిలో కనిపించిన ఉత్సాహం ఆయనమీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. దేశం అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనీ, కఠినమైన నిర్ణయాలు తప్పవని సునాక్ తన తొలి ప్రసంగంలోనే ప్రకటించారు. ఆర్థికమంత్రిగా కరోనా కష్టకాలంలో తాను గతంలో తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలను గుర్తుచేస్తూ, పార్టీ మేనిఫెస్టోకు కట్టుబడతానని హామీ ఇస్తూ, దేశాన్ని ఒడ్డునపడవేస్తానని హామీ ఇచ్చారు. లిజ్ ట్రస్ నిర్ణయాలన్నింటినీ తిరగదోడిన మాజీ ఆర్థికమంత్రినే తన ఆర్థికమంత్రిగానూ ప్రకటించారు.

బ్రిటిష్ ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నిక మరింత ఉన్నతంగా నిలబెట్టింది. శ్వేతజాత్యహంకారం సమసిపోయిందని అనలేం కానీ, బహుళ అస్తిత్వాలున్న వైవిధ్యభరితమైన సమాజం ఎలా ఉండాలనడానికి సునాక్ ఎంపిక ఒక ఉదాహరణ.ఆదిలో బ్రెగ్జిట్, అనంతరం కరోనా, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతిన్నది. పౌండ్ పతనమైంది, ద్రవ్యోల్బణం అధికమైంది, సామాన్యుడి నిత్యజీవితం దుర్భరమైపోయింది. ఇంధనధరలు హెచ్చి రాబోయే శీతాకాలం భయపెడుతున్నది. ఆర్థికవ్యవస్థలో స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా, ఒక ఆర్థికవేత్తను అతడి మూలాలతో, రంగుతో నిమిత్తం లేకుండా ఆ దేశం తన పాలకుడుగా ప్రతిష్ఠించుకుంది. నిజజీవిత సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న కష్టాలే ప్రాతిపదికగా నాయకత్వ నిర్ణయం జరిగింది. మనదేశంలోనూ చాలా రంగాల్లో దాదాపు అవే రోగలక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ భావోద్వేగాలే ప్రధానమై, బహుళత్వంమీదా, వైవిధ్యం మీద నిరంతర దాడి సాగుతూనే ఉంటుంది.

కన్సర్వేటివ్ పార్టీ ఆఖరు ఆశ సునాక్. ఆయన ధనికుడనీ, పేదల బాధలు తెలియవన్నది విపక్షం విమర్శ. సునాక్ ప్రమాణం తరువాత కూడా ఎప్పటిలాగానే అది తక్షణ ఎన్నికలు డిమాండ్ చేసింది. ఆర్థికసంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేయడం ఇతడివల్ల కూడా కాదని అంటూనే, సునాక్ రాకతో టోరీలకు రాజకీయంగా కాస్తంత మేలు జరగవచ్చునని విపక్షనాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. ఏతావాతా ప్రస్తుతానికి సునాక్ మీద అందరిలోనూ ఎంతోకొంత నమ్మకం కనిపిస్తున్నది. భారతదేశం దివాళా అంచుల్లోకి జారిపోయి, తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నపుడు ఒక మౌనమునిలాగా రంగప్రవేశం చేసి, తన వినూత్నమైన, కఠినమైన నిర్ణయాలతో దేశాన్ని గాడినపడేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాగానే సునాక్ కూడా బ్రిటన్‌ను ఉద్ధరించాలని అందరూ ఆశిస్తున్నారు. రాబోయే రెండేళ్ళకాలం సునాక్‌కు అగ్నిపరీక్ష. ఇంతలోగా ఆర్థికం చక్కబడితే, పార్టీలో ఏ ఉపద్రవాలూ చోటుచేసుకోకుంటే సునాక్ నాయకత్వంలో టోరీలు 2025 జనవరి ఎన్నికల్లో నెగ్గవచ్చు, సునాక్ కొనసాగవచ్చు.

Updated Date - 2022-10-26T01:23:02+05:30 IST