దిగజారిన ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-10-08T10:44:09+05:30 IST

పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో, భారతదేశంలో తయారైన దగ్గుమందు తాగి 66మంది పిల్లలు మరణించిన సంఘటన అత్యంత విషాదకరమైనది.

దిగజారిన ప్రతిష్ఠ

పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో, భారతదేశంలో తయారైన దగ్గుమందు తాగి 66మంది పిల్లలు మరణించిన సంఘటన అత్యంత విషాదకరమైనది. ఈ ఘటన వివరాలు చెబుతూ, ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ ఎంత జాగ్రత్తగా పదాలు వాడినప్పటికీ, భారతదేశానికి చెందిన నాలుగురకాల సిరప్పులు ఎంతోమంది అమాయక పిల్లల ప్రాణాలు తీశాయని ప్రపంచానికి అర్థంకాకుండా పోదు. ఈ సిరప్పులు గాంబియాకు మాత్రమే ఎగుమతి అయినట్టు ప్రస్తుతానికి తెలుస్తున్నప్పటికీ, మిగతాదేశాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆయన యావత్ ప్రపంచానికీ ఓ హెచ్చరిక కూడా చేశారు. దేశీయంగా వీటి వినియోగం లేనప్పటికీ, ఈ వార్త ప్రభావంతో మీడియా ఇప్పటికే పిల్లలకు దగ్గుమందు పోస్తున్నారా? జాగ్రత్త అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నది కూడా.


ఈ నాలుగుమందులను తయారుచేస్తున్న హర్యానాకు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ అడ్డదారులు తొక్కడంలో దిట్ట అంటూ మీడియాలో విశ్లేషణలు సాగుతున్నాయి. హర్యానాలోనూ, హిమాచల్ ప్రదేశ్ లోనూ తయారీ కేంద్రాలున్న ఈ సంస్థ తన ఉత్పత్తులు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందాయనీ, జీఎంపి (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) సర్టిఫికేట్ ఉన్నదని ప్రకటించుకున్నందున, ఈ వివాదం రేగిన నేపథ్యంలో మీడియా ఆ గుట్టును కూడా రట్టుచేసింది. ఈ సంస్థను తాము ఎన్నడూ సందర్శించింది లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు నిగ్గుతేల్చేయడంతో మన నియంత్రణ వ్యవస్థల్లో డొల్లతనం మరోమారు బయటపడింది. అంతేకాదు, గతంలో ఈ సంస్థ నాసిరకం ఉత్పత్తులు సరఫరాచేసినందుకు కేరళ, గుజరాత్ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయమూ బయటకువచ్చింది. గత రెండేళ్ళకాలంలోనే ఐదుసార్లు కేరళ రాష్ట్రం ఈ సంస్థ తయారుచేసే టైప్ టూ డయాబెటిస్ కు వాడే టాబ్లెట్లు నాసిరకంగా ఉన్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసిందట. విటమిన్ డీ లోపాన్ని నివారించే ఒక మందులోనూ పరిమితిమించి ఒక రసాయనం వాడటంపై కూడా ఆ రాష్ట్రం అభ్యంతరాలు తెలిపిందట. ఈ ఫిర్యాదులను కేంద్రం పట్టించుకోకపోగా, హర్యానా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం. ఇలా పలు ఫిర్యాదులు వచ్చిన ఆ సంస్థమీద ఇప్పటికే ఓ కన్నేసి ఉంటే, దాని ఉత్పత్తుల నాణ్యత నిగ్గుతేలేది, దాని స్వయం ప్రకటిత గుర్తింపులూ హోదాల బాగోతం కూడా వెలుగుచూసేది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏకంగా ఆ సంస్థ తయారుచేసిన దగ్గు మందులు విషపూరితమైనవని ప్రకటించే దుస్థితి ఏర్పడేది కాదు, దేశం పరువు అంతర్జాతీయంగా పోయేదీ కాదు. 


గాంబియాకు సరఫరాచేసిన మందుల నమూనాలు తీసుకున్నాం, పరీక్షకు పంపాం, ఫలితాలు మరోపదిరోజుల్లో వెలుగుచూస్తాయని హర్యానా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు బ్యాచ్ లకు సంబంధించి సేకరించిన నమూనాల్లో, పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన రెండు రసాయనాల వాడకం మోతాదుకుమించి ఉన్నట్టు నిర్థారణైందని వార్తలు వస్తున్నాయి. ముద్దుగా, బొద్దుగా ఉన్న అందమైన పసిపిల్లల బొమ్మలతో, రంగురంగుల అట్టపెట్టెల్లో ఉన్న ఈ విషాలు తమ పిల్లల ప్రాణాలు తీస్తాయని ఆ నిరుపేద దేశంలోని తల్లులు ఊహించి ఉండరు. ‘ఎగుమతికి మాత్రమే’ అని నిర్దేశించినవి నాణ్యతాప్రమాణాల రీత్యా మరింత హెచ్చుగా ఉండాలి. మరోదేశంలోనో, అంతర్జాతీయంగానో తన పరువు పోకూడదని ప్రతీదేశమూ కోరుకుంటుంది కనుక, నాసిరకం ఉత్పత్తులు ఎగుమతి కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఈ మందులు పోయేది ఆఫ్రికాకే కదా అన్న నిర్లక్ష్యమో, లాభాపేక్షో తెలియదు కానీ, ఈ ఘటన అంతర్జాతీయంగా భారతదేశం పరువు దిగజార్చింది. తయారీలో పర్యవేక్షణా లేదు, ఎగుమతి సందర్భంగా ముందస్తు పరీక్షలూ లేవు, చివరకు దిగుమతి చేసుకున్న గాంబియాలోనూ అదే నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు పోయాయి. డై ఇథైలీన్ గ్లైకాల్, ఇథైలీన్ గ్లైకాల్ వినియోగం మీద ఎన్ని ఆంక్షలు, నియంత్రణలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొదట్లో హిమాచల్ ప్రదేశ్ లో 13మంది, మూడేళ్ళక్రితం జమ్మూలో 11మంది పిల్లలు ఈ విషాల వల్లనే మరణించారని విన్నప్పుడు మన ఔషధ నియంత్రణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిన అవసరం అర్థమవుతుంది.

Read more