పరుగుల పండుగ

ABN , First Publish Date - 2022-10-19T06:09:02+05:30 IST

క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించే టీ20 పోటీల ప్రపంచకప్‌ పండుగ కంగారూ నేలపై ఆరంభ మైంది. అసలు టీ20 అంటేనే ఉరిమే ఉత్సాహం.. అందులోనూ ప్రపంచకప్‌ అంటే...

పరుగుల పండుగ

క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించే టీ20 పోటీల ప్రపంచకప్‌ పండుగ కంగారూ నేలపై ఆరంభ మైంది. అసలు టీ20 అంటేనే ఉరిమే ఉత్సాహం.. అందులోనూ ప్రపంచకప్‌ అంటే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనలవికాదు. మరో మూడు రోజుల్లో అసలు సిసలు మ్యాచ్‌లు జరగబోతున్నా, తొలి రౌండ్‌ అర్హత పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2007లో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఏడు ప్రపంచకప్‌లు జరిగాయి. ఫార్మాట్‌, పాల్గొనే జట్ల సంఖ్యవంటి విషయాల్లో కొన్ని మార్పుచేర్పులు జరిగినా, అభిమానుల ఆదరణ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ క్రీడా రంగంలో ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ అత్యధిక ప్రజాదరణ పొందిన టోర్నమెంట్‌. క్రికెట్‌కు సంబంధించి వన్డే వరల్డ్‌కప్‌కు అత్యంత ఆదరణ ఉండేది. అయితే క్రమేపీ టీ20 వరల్డ్‌కప్‌కు అభిమానులు దాసోహమైపోతున్నారు. తాజాగా మొదలైన ఈ మెగా టోర్నీలో నమీబియా, స్కాట్లాండ్‌ వంటి పసికూనలు, పెద్దజట్లయిన శ్రీలంక, వెస్టిండీస్‌లను మట్టికరిపించి సంచలనం సృష్టించాయి. ఈ తరహా అనూహ్య ఫలితాలు టోర్నీ క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. అంటే తనదైన రోజున ఎంత చిన్న జట్టయినా చాంపియన్‌ను సైతం ఓడించగలదు. ఇప్పటివరకూ జరిగిన ఏడు అంచెల్లో కేవలం వెస్టిండీస్‌ మాత్రమే రెండుసార్లు ట్రోఫీ గెలవగలిగింది.


ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్‌–పాక్‌ మ్యాచ్‌ల క్రేజే వేరు. తాజా వరల్డ్‌కప్‌లోనూ ఈ రెండు జట్ల మ్యాచ్‌కు దాదాపు లక్షమంది ప్రేక్షక సామర్థ్యమున్న మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌ వేదిక కాబోతోంది. ఈసారి ఫైనల్‌ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగాలన్నది అభిమానుల ఆకాంక్ష. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ర్టేలియాతో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లకు కూడా వీక్షకాదరణ పుష్కలంగా ఉండబోతోంది.


ఈ పోటీలకు 8 జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో నాలుగు జట్లు వీటితో జత చేరతాయి. ఇప్పుడు అర్హత పోటీలు జరుగుతున్నా, సూపర్‌–12  పోటీల్లోనే అసలు సిసలు మజా ఉంటుంది. భారత్‌ సహా అన్ని ప్రముఖ జట్లూ ఆ దశలో బరిలోకి దిగుతాయి. ఏ జట్టు ట్రోఫీని గెలుస్తుందో ఎంత మాత్రం అంచనావేయలేని పరిస్థితి. టోర్నీలో ఆతిథ్య ఆస్ర్టేలియాతోపాటు భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, ఆఫ్ఘానిస్థాన్‌, అలాగే అర్హత రౌండ్‌ ఆడే ఇంకో 8 దేశాలు పోటీపడుతున్నాయి. 2007లో టైటిల్‌ గెలిచిన తర్వాత టీమిండియా ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. గత ఏడాది కప్‌లో గ్రూపు దశను కూడా దాటలేకపోయిన మనోళ్లు పాకిస్థాన్‌ చేతిలో కూడా ఓటమిపాలయ్యారు. కానీ ఈసారి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీవంటి బ్యాటింగ్‌ స్టార్లతో బలీయంగా ఉన్న మెన్‌ ఇన్‌ బ్లూ విజేతగా ఆవిర్భవించగల సత్తా ఉన్న జట్లలో ఒకటి. ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా, కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ భారత జట్టులో కీలకం కాబోతున్నారు. బ్యాకప్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఉండనే ఉన్నాడు. అయితే భారత్‌ బౌలింగ్‌కు వెన్నెముకలాంటి జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా లేకపోవడం పెద్ద దెబ్బే. గత ఏడాది వరల్డ్‌కప్‌లో పాల్గొన్న కోహ్లీ, రవిశాస్ర్తిలిద్దరూ తమ పదవులనుంచి తప్పుకోగా, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ నయా జోడీ నేతృత్వంలో టీమిండియా మరింత జోరును ప్రదర్శించి భారత్‌ కీర్తి కిరీటంలో ఇంకో టీ20 ప్రపంచకప్‌ను చేరుస్తారని ఆశిద్దాం.


మరోవైపు మహిళా క్రికెట్‌ అభిమానులకు ఓ శుభవార్త. రాబోయే సీజన్‌ నుంచి అమ్మాయిలకూ ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ పోటీల్లో ఐదు జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ ఐదు జట్లను జోన్‌కు ఒక జట్టు చొప్పున ఎంపికచేయనున్నారు. పురుషుల ఐపీఎల్‌ మాదిరిగానే పూర్తిస్థాయి నియమ నిబంధనలతో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ ఫార్మాట్‌లో భారత మహిళల జట్టు మరింత బలీయంగా మారే అవకాశం లభిస్తుంది. రోజర్‌ బిన్నీ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన బీసీసీఐ కార్యవర్గం దీని నిర్వహణకు ఆమోదముద్ర వేసింది. 2018 నుంచి ఇప్పటిదాకా పురుషుల ఐపీఎల్‌ జరిగే సమయంలోనే మూడు జట్లతో టీ20 చాలెంజ్‌ పేరుతో నిర్వహిస్తున్నా.. అది ఎగ్జిబిషన్‌ టోర్నీగా మాత్రమే కొనసాగింది. పూర్తిస్థాయి ఐపీఎల్‌ రాకతో ఇకపై అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ధనాధన్‌ క్రికెట్‌తో మెరిపించబోతున్నారన్నమాట.

Read more