‘ఆర్థిక న్యాయం’ చేసేది ఇలాగేనా?

ABN , First Publish Date - 2022-11-12T02:03:21+05:30 IST

శాసనాలు, రాజకీయాలు, సమానత్వ భావం, సామాజిక భావనలతో మిళితమై, దేశవ్యాప్తంగా..

‘ఆర్థిక న్యాయం’ చేసేది ఇలాగేనా?

శాసనాలు, రాజకీయాలు, సమానత్వ భావం, సామాజిక భావనలతో మిళితమై, దేశవ్యాప్తంగా అశేష ప్రజల మాటా మంతీగా ఉన్న ఒక అంశమే ఈ వ్యాస విషయం. అది ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అని మరి చెప్పనవసరం లేదు.

సమకాలీన భారతదేశంలో సామాజిక న్యాయం అంటే ఏమిటి, దాన్ని వాస్తవం చేసేందుకు ముందుకు సాగడమెలా అనే విషయమై నాకు ఒక కచ్చితమైన, స్పష్టమైన దృక్పథం ఉన్నది. మన భారతీయ సమాజంలో అసమానతలు ఎంతగా ఉన్నాయో నాకు బాగా తెలుసు. అవి నన్ను అమితంగా ఆవేదనకు గురి చేస్తున్నాయి. భారతీయ సమాజాన్ని మరింత మెరుగైన సమానత్వ సంఘంగా రూపొందించేందుకు మనం చేయవలసిన వందలాది పనుల గురించి కూడా నాకు ఒక దృఢమైన అభిప్రాయముంది. సామాజిక న్యాయమూ, సమానత్వ భావన కలగలిసిన సందర్భాలలో కొన్నిసార్లు సామాజిక న్యాయం నానా యాతనలకు గురవుతుండగా మరికొన్నిసార్లు సమానత్వ భావాన్ని బలి చేయాల్సిన అగత్యమేర్పడుతోంది.

చట్టాలను శాసనసభలు రూపొందిస్తాయి. ప్రతీ శాసనసభా అత్యధికంగా రాజకీయవేత్తల సమ్మేళనమే. రాజకీయాలతో ప్రమేయం లేని న్యాయమూర్తులు చట్టాలను వివిధ వ్యవహారాలకు అనువర్తింప చేస్తారు; సందర్భానుసారంగా వ్యాఖ్యానిస్తారు; తద్వారా వాటి అమలుకు దోహదం చేస్తారు. న్యాయమూర్తులకు పాలకులు భయపడి తీరాలి. పాలకులకు న్యాయమూర్తులు భయపడకూడదు. శాసనాలు, రాజకీయాలు కలిసికట్టుగా సాధించే ఫలితాలే ఒక దేశం చట్టబద్ధంగా పాలింపబడుతుందా లేదా అన్న దానికి నిజమైన గీటురాయి.

శాసనాలు, రాజకీయాలు, సమానత్వ భావం, సామాజిక న్యాయ భావన మిళితమై ఉన్న వ్యవహారాలలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజలను సందిగ్ధావస్థలోకి నెడుతుండడం కద్దు. జన్ హిత్ అభియాన్‌లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 7న వెలువరించిన తీర్పే అందుకొక ఉదాహరణ. ఆర్థికంగా బలహీన వర్గాలకు, మరింత స్పష్టంగా చెప్పాలంటే అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన 103వ రాజ్యాంగ సవరణ సక్రమతను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పు వెలువరించింది. ఆర్థికంగా బలహీన వర్గాలను ఈ కాలమ్‌లో ‘పేదలు’ ప్రస్తావించేందుకు నేను ప్రాధాన్యమిస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు విషయమై నా అభిప్రాయాలను పక్కన పెట్టి, ఆ తీర్పుతో ముడివడివున్న వివిధ అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. వాటిపై మీరే ఒక అభిప్రాయానికి రావాలని పాఠకులను కోరుతున్నాను.

విద్యా సంస్థలలోనూ ప్రభుత్వ ఉద్యోగాలలోనూ నేడు అనేక రకాల రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇవన్నీ ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల’కు అంటే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)కు రాజ్యాంగం సమకూర్చిన సదుపాయాలే. ఆయా సామాజిక వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే ఆ రిజర్వేషన్ల లక్ష్యం. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ వర్గాల వారు సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిపోవడానికి పలు చారిత్రక కారణాలు ఉన్నాయి. అవి నిర్వివాదమైనవి. శతాబ్దాలుగా వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మన గణతంత్ర రాజ్య నిర్మాతలు సంకల్పించారు. ఆ సంకల్ప ఫలితమే రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్లు. విద్యా ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు న్యాయబద్ధతను సంతరించుకున్నాయి. ప్రజామోదాన్నీ పొందాయి.

అయితే ఎలాంటి రిజర్వేషన్ సదుపాయాన్నీ పొందలేక పోతున్నవారు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యేతర పౌరులు ఆవేదన చెందుతున్నారు. తమకూ ఏదో అన్యాయం జరుగుతోందని వారు భావించసాగారు. తమలోని పేదలు కూడా విద్యా ఉద్యోగాలలో వెనుకబడి పోతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వలే వారూ పలు విధాల వివిధ జీవన రంగాలలో ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. మరి ఈ పేదల కోసం కొత్త రిజర్వేషన్ సదుపాయం కల్పించకూడదా? ఇదీ, వారి ఆకాంక్ష. ఆర్థికంగా బలహీనవర్గాలకు రిజర్వేషన్లు అనే భావన సకారణమైనదే అయినా అందుకు అనేక అవరోధాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

రిజర్వేషన్ సదుపాయం సమకూర్చేందుకు భారత రాజ్యాంగం గుర్తించిన ఏకైక జనశ్రేణి ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడినవారు’. మరి పేద ప్రజలను సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించడం న్యాయమేనా?; ఆర్థిక న్యాయాన్ని సమకూర్చేందుకు పేదలకు రిజర్వేషన్లు సమకూర్చడం ‘భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం లేదా స్వభావాన్ని’ ఉల్లంఘించడం కాదా?; విద్యా ఉద్యోగాలలో మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులలోనూ 50 శాతానికి మించకూడదని తీర్పు జనిత న్యాయం (జడ్జి – మేడ్ లా) స్పష్టం చేసింది. మరి ఆర్థికంగా బలహీన వర్గాలకు కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది ఆ గరిష్ఠ పరిమితిని అతిక్రమించడం కాదా? (చట్టాలు, శాసనాల ఉద్దేశాలు, లక్ష్యాలను అన్వయించడంలో లేదా వాటిని రూపొందించిన చట్టసభ ఎంత మాత్రం ఉద్దేశించని అర్థాలను కనుగొనడంలో న్యాయస్థానాల తీర్పుల వల్ల తయారైన న్యాయమే తీర్పు జనిత న్యాయం).

‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ భావన, రిజర్వేషన్లపై ‘50 శాతం గరిష్ఠ పరిమితి’ సూత్రం అనేవి వివిధ సందర్భాలలో ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగానికి వెలయించిన భాష్యాల నుంచి ప్రభవించాయి. ఆ తీర్పు జనిత న్యాయం సృష్టించిన ఆటంకాలను తొలగించుకోవాలని ప్రస్తుత గౌరవనీయ న్యాయమూర్తులు సంకల్పించుకోవడంతో కొత్త రిజర్వేషన్లకు దారి సుగమమయింది.

సామాజిక న్యాయంతో సమానంగా ఆర్థిక న్యాయానికీ ప్రాధాన్యమివ్వాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులూ– జస్టిస్ లలిత్, జస్టిస్ జేబీ పార్దీ వాలా, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ రవీంద్ర భట్– అంగీకరించారు. ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా పేదలకు కొత్త రిజర్వేషన్ సదుపాయాన్ని సమకూర్చడాన్ని సమర్థించారు. ఆ చర్య రాజ్యాంగ స్వరూపాన్ని ఉల్లంఘించడం కాదని వారు స్పష్టం చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం గరిష్ఠ పరిమితిని అధిగమించడం రాజ్యాంగ విరుద్ధం కాదనే వాదనతో కూడా వారు ఏకీభవించారు. ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికపై పేదలకు విద్యా ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వారు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ కొత్త రిజర్వేషన్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలోని పేదలను మినహాయించాలా, మినహాయించకూడదా అనే విషయమై వారు విభేదించారు. మినహాయంచడాన్ని ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించగా సిజెఐ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ వారితో ఏకీభవించలేదు.

ఎవరు పేదలు అనేది అసలు ప్రశ్న. 103వ రాజ్యాంగ సవరణ పేదలు ఎవరో నిర్ణయించే బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేసింది. ‘కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక ప్రతికూలతలు ‘ఆధారంగా పేదలు ఎవరో గుర్తించాలని ఆ రాజ్యాంగ సవరణ సూచించింది. ఈ అంశంపై జస్టిస్ లలిత్, జస్టిస్ భట్‌ల మైనారిటీ తీర్పు సిన్హో కమిషన్ నివేదికను పేర్కొంది (ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్ఆర్ సిన్హో నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2010లో ఆ కమిషన్ తన నివేదికను సమర్పించింది. జనరల్ కేటగిరీలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాల వార్షిక ఆదాయం ఆదాయ పన్ను పరిమితికి లోపే ఉంటే వారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని సిన్హో కమిషన్ సిఫారసు చేసింది). దేశ జనాభాలో 31.7 కోట్ల మంది ప్రపజలు దారిద్ర్య రేఖకు దిగువున జీవిస్తున్నారని సిన్హోకమిషన్ నిర్థారించింది. వీరిలో ఎస్సీ జనాభా 7.74 కోట్లు, ఎస్టీ జనాభా 4.25 కోట్లు కాగా ఓబీసీ జనాభా 13.86 కోట్లు వెరసి 25.85 కోట్లు. దారిద్ర్య రేఖకు దిగువున జీవిస్తున్న జనాభాలో వీరు 81.5 శాతంగా ఉన్నారు 2010 అనంతరం పెరిగిన జనాభాలో ఈ నిష్పత్తులలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఖాయంగా చెప్పవచ్చు.

కొత్త 10 శాతం రిజర్వేషన్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలోని పేదలను మినహాయించిన రాజ్యాంగ అధికరణలు 15(6), 16(6) రాజ్యాంగ విహితమైనవేనా? న్యాయబద్ధమైనవేనా? ఈ అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో విభజన నెలకొన్నది. ముగ్గురు న్యాయమూర్తులు ఆ అధికరణల రాజ్యాంగ బద్ధమైనవని సమర్థించారు. జస్టిస్ రవీంద్ర భట్ శక్తిమంతమైన భిన్నాభిప్రాయాన్ని రాశారు. ఛీప్ జస్టిస్ లలిత్ ఆయనతో ఏకీభవించారు. జస్టిస్ భట్ తన తీర్పులో ఇలా పేర్కొన్నారు: ‘మన రాజ్యాంగం వివక్షను అనుమతించదు. 103వ రాజ్యాంగ సవరణ సామాజిక న్యాయానికి, తద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు మెరుగ్గా ఉన్నారని మనను భ్రమింపజేసే సవరణ ఇది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలను 10 శాతం కోటా నుంచి తొలగించడం తప్పు. వారు పొందుతున్నట్టుగా చెబుతున్న ప్రయోజనాలను ఉచిత పాసులుగా పరిగణించకూడదు. వారికి జరిగిన అన్యాయానికి పరిహారం ఇచ్చే విధానం అది. సామాజిక మూలాల ఆధారంగా వారిని ఈ కోటా నుంచి మినహాయించడం సమానత్వానికి విఘాతం కలిగించడమే’. జస్టిస్ భట్ మాటలు సుప్రీంకోర్టులోని కోర్టు హాళ్లలో చాలా సంవత్సరాల పాటు ప్రతిధ్వనిస్తూ ఉంటాయనడంలో సందేహం లేదు.

పేదల అభ్యున్నతికై ఒక కొత్త రిజర్వేషన్ సదుపాయాన్ని సృష్టించడం ఆర్థిక న్యాయాన్ని పెంపొందిస్తుంది. అయితే మొత్తం పేద ప్రజల్లో 81.5 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను ఆ రిజర్వేషన్ల నుంచి మినహాయించడం అంటే పేదలలోని నిరుపేదలకు సమానావకాశాలను, సామాజిక న్యాయాన్ని నిరాకరించడమే కాదూ?

‘పళని’ పలుకు

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-11-12T02:03:25+05:30 IST