‘ఆధ్యాత్మిక హింసకి ఒక రూపం మతం’

ABN , First Publish Date - 2022-11-30T00:52:27+05:30 IST

‘మతాన్ని ఛాందసవాదం నించి తప్పించలేమా?’ అన్న నవంబరు 12నాటి వ్యాసంలో, మతం గురించి మార్క్సూ, లెనినూ వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని...

‘ఆధ్యాత్మిక హింసకి ఒక రూపం మతం’

‘మతాన్ని ఛాందసవాదం నించి తప్పించలేమా?’ అన్న నవంబరు 12నాటి వ్యాసంలో, మతం గురించి మార్క్సూ, లెనినూ వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని వ్యాసకర్త (విక్టర్ విజయకుమార్) ఎలా వక్రీకరించారో చూపించడమే ఈ ప్రతిస్పందన ఉద్దేశం.

(1) ‘మతాన్ని మార్క్సు ఒక పాజిటివ్ అంశంగా పేర్కొన్నాడు’ అన్నారు వ్యాసకర్త. మార్క్సు దృష్టిలో మతం పాజిటివ్ అంశమే అయితే, ‘భ్రమా పూరితమైన ఆనందంగా వున్న మతాన్ని రద్దు చెయ్యాలి’ అని, మార్క్సు ఎందుకు అన్నాడు? ఒక భ్రమా పూరితమైన విషయాన్ని రద్దు చెయ్యాలని ఒక మనిషి అంటే, దానర్ధం ఆ విషయం నెగెటివ్ అంశం అనేగదా?

(2) మతం అనే మాటని మార్క్సు ఒక ‘వ్యసనం’ అనే అర్ధంలో వాడలేదంటున్నారు వ్యాసకర్త. మరి, అయితే, మతాన్ని ‘మత్తుమందు’ అని మార్క్సు ఎందుకు అన్నాడు? ‘మత్తుమందు’ అనేది ఒక వ్యసనమే కదా? అదేమైనా మేధోపరమైన ఆరోగ్యాన్నిచ్చే మందా? ఒకవేళ అది మందే అయితే, మందుని మందు అంటారు గానీ, ‘మత్తుమందు’ అనరు కదా?

(3) ‘మతం పట్ల కార్మికుల పార్టీవైఖరి’ అనే వ్యాసంలో, లెనిన్, మతం పట్ల సానుభూతితో ఎలా వ్యవహరించాలో, చర్చితో కలిసి సోషలిస్టు పార్టీ ఎలా పని చేయాలో ‘విశదీకరించినట్టు’ వ్యాసకర్త భాష్యం చెప్పారు. కానీ, లెనిన్ అలా చెప్పనేలేదు. ఆ వ్యాసంలో, ‘అన్ని మతాలకూ బద్దవ్యతిరేకి అయినట్టి భౌతికవాదమే మార్క్సిజానికి ఆధారం’ అని చాలా స్పష్టంగా అన్నాడు లెనిన్. దీన్ని బట్టి మతం పట్ల సానుభూతిగా వ్యవహరించమని లెనిన్ చెప్పినట్టు కాదు.

(4) ‘సోషలిజమూ, మతమూ’ అనే 1905 నాటి తన వ్యాసంలో, ‘ప్రజారాసులను సర్వే సర్వత్రా కుంగదీసే గుదిబండగా తయారైన ఆధ్యాత్మిక హింస యొక్క ఒక రూపం మతం’ అని లెనిన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడేగానీ, ‘సానుభూతి’ని కాదు.

(5) ‘చర్చితో కలిసి పార్టీ ఎలా పనిచేయాలో’ కూడా లెనిన్ చెప్పాడని ఒక పెద్ద అసత్య ప్రకటన చేశారు వ్యాసకర్త. ‘మతమూ, చర్చీ పట్ల వర్గాల, పార్టీల వైఖరి’ అనే 1909 జూన్ నాటి లెనిన్ వ్యాసంలో, ఒక విషయం వుంది. చర్చినీ, మతాధికారుల్నీ విమర్శిస్తూ, ‘సుర్ కోవ్’ అనే పార్టీ సభ్యుడు, పార్లమెంటులో చేసిన ప్రకటనని లెనిన్, ఇలా మెచ్చుకున్నాడు: ‘మతం ప్రజలకు నల్లమందు...’, ‘ప్రజలను బుద్ధిమాంద్యులుగా చేస్తూన్నట్టి రక్త పిపాసులైన ప్రజా శత్రువులకు (చర్చి అధికారులకు) ప్రజా ధనంలో నుండి చిల్లిగవ్వ అయినా ఇచ్చేది లేదు’ అని ఒక సోషలిస్టు (సురుకోవ్) యుద్ధ నినాదం చేశాడు– అన్న లెనిన్, చర్చితో కలిసి పనిచేయమని ఎలా చెపుతాడు? ఇది పూర్తిగా వక్రీకరణ!

(6) వ్యాసకర్త ప్రస్తావించిన వ్యాసంలోనే, మతంతో పోరాటం విషయమై దృఢంగా నిలబడలేని వారిని ఉద్దేశించి లెనిన్ చాలా తీవ్రమైన పదజాలంతో ఇలా అన్నాడు: ‘మతంతో పోరాటం అంటే భయపడిపోతూ, మత పోరాటం తన విధాయకమన్న విషయమే మర్చిపోయి, దేవునియందు నమ్మకంతో పొత్తు కుదుర్చుకుని, వర్గపోరాట ప్రయోజనాల ప్రకారం నడుచుకోకుండా, ‘నీవు బతుకు, ఒకరిని బతకనియ్యి’ వగైరా వగైరా వివేకపూరిత సూత్రాలననుసరించి, ఎవ్వరినీ నొప్పించకూడదు, ఎవ్వరినీ ప్రతిఘటించకూడదు, ఎవ్వరినీ బెదరగొట్టకూడదు అనే నీచమైనట్టీ, హేయమైనట్టీ ఆలోచనతో ప్రవర్తిస్తాడో అట్టి లిబరల్ పెట్టీబూర్జువా యొక్క, లేదా మేధావి యొక్క అవకాశవాదానికి గాని లొంగిపోకుండా వుండాలి.’ (లెనిన్ వ్యాసాల లోనించీ ప్రస్తావించిన మాటలన్నీ ‘ఉప్పల లక్ష్మణరావు’ గారి అనువాదాలే!). ఇంత తెగేసి చెప్పిన లెనిన్ మాటల్ని, తనే ప్రస్తావించిన వ్యాసంలోని ఈ మాటల్ని, వ్యాసకర్త ఎందుకు పట్టించుకోలేదు? పైగా, మార్క్సునీ, లెనిన్ నీ సరిగా అర్ధం చేసుకోలేదని భారతీయ మార్క్సిస్టుల్ని తప్పుపట్టడమా?

(7) చివరిగా మతం వేరూ, ఛాందసవాదం వేరూ అని తేల్చారు వ్యాసకర్త. అలా అనుకునే హక్కు ఆయనకి వుంది గానీ, అదే అవగాహన మార్క్సూకీ, లెనిన్ కీ కూడా వుందన్నట్టు, వారిని ఉటంకిస్తేనే సమస్య. మతం అనేది దోపిడీని సమర్ధించే ఒక పరికరం అనే విషయాన్ని గ్రహించకుండా, ఇలా ‘మతం మంచిదే గానీ, దాన్ని ఛాందసవాదులు పాడుచేశారు’ అనే వ్యాసకర్త తరహా అవగాహన కొత్తదేమీ కాదు. జర్మన్ తత్వవేత్త ఫొయర్ బాకూ, రష్యన్ రచయిత టాల్ స్టాయీ, మతాన్ని వీడకుండానే మతంలో సంస్కరణల కోసం ప్రయత్నించిన అనేక హిందూ మత గురువులూ, ఇలా చాలా మంది కనపడతారు చరిత్రలో. అలాంటి ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని, 1909 మే నాటి వ్యాసంలోనే, లెనిన్ ఇలా రాశాడు: ‘మతాన్ని నాశనం చేసేందుకు కాకుండా, దాన్ని పునరుద్ధరించేందుకే, ఒక కొత్త ‘ఉన్నత’ మతాన్ని సృష్టించడం, వగైరాల కోసమే మతంపై కత్తికట్టినందుకు ఫొయర్బాక్ ను ఎంగెల్సు తూర్పారబెట్టాడన్న విషయం మనం గుర్తుకు తెచ్చుకుందాం. మతం ప్రజల నల్లమందు–అని మార్క్సు చెప్పిన సూక్తి మతంపై మార్క్సిస్టు దృక్పధానికంతటికీ పునాదిరాయి. దోపిడీని సమర్ధించడానికీ, కార్మికవర్గంపై మందు చల్లడానికీ ఉపయోగపడేటట్టి బూర్జువావర్గ అభివృద్ధి నిరోధక పరికరాలుగానే ఆధునిక మతాలనూ, చర్చీలనూ అన్ని మతసంస్తలనూ మార్క్సిజం ఎల్లప్పుడూ పరిగణించింది’.

భాస్కరమ్మ – రామమోహన బాపూజీ

Updated Date - 2022-11-30T00:52:27+05:30 IST

Read more