మతాన్ని ఛాందసవాదం నుంచి తప్పించలేమా?

ABN , First Publish Date - 2022-11-12T01:56:40+05:30 IST

ఇరాన్‌లో నుదుటిపైన వెంట్రుకల వరుస కనిపించిందని ఒక 22ఏళ్ళ అమ్మాయిని అక్కడి రెలిజియస్ పోలీసులు అరెస్టు చేసి చంపటం, దానికి వ్యతిరేకంగా..

మతాన్ని ఛాందసవాదం నుంచి తప్పించలేమా?

ఇరాన్‌లో నుదుటిపైన వెంట్రుకల వరుస కనిపించిందని ఒక 22ఏళ్ళ అమ్మాయిని అక్కడి రెలిజియస్ పోలీసులు అరెస్టు చేసి చంపటం, దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల్లో ఒక పదహారేళ్ళ అమ్మాయిని అక్కడి పోలీసులు మట్టుబెట్టడం... ఈ ఘటనలతో అంతర్జాతీయ యవనికపై మరోసారి మత ఛాందసవాదం చర్చనీయాంశమైంది. ‘మతం’ అన్నదే ‘ఛాందసవాదా’నికి మారు పేరా, లేక మతమూ ఛాందసవాదమూ రెండూ వేర్వేరు అంశాలా అన్న ప్రశ్నలకు జవాబులను వెతికి పట్టుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే సమాజంలో కీలకమైన మతమనే వ్యవస్థ పట్ల ఒక అవగాహనతో వ్యవహరించగలం.

మతమంటేనే ఛాందసవాదం అని తీర్మానించేసే ముందు మనం ఒకటి ఆలోచించాలి. అది స్వతస్సిద్ధంగానే మనుష్యుల మధ్య తారతమ్యాలను– ‘నీ మతం’ ‘నా మతం’ పేరుతో రెచ్చగొడుతుందా? అన్నది. ఈ ప్రశ్న గురించి ఆలోచించనంత కాలం మతాన్ని రూపుమాపాలా, సానుభూతితో అర్థం చేసుకోవాలా, లేక మతానికి రాజ్యపు మద్దతు ఇచ్చి పెంచి పోషించాలా అన్న విషయం అర్థం కాదు.

కార్ల్ మార్క్స్ ‘మతం ప్రజలకు మత్తుమందు లాంటిది. అది అణగారిన ప్రజల నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి హృదయం లాంటిది, నిస్సారమైన పరిస్థితులకు సారం లాంటిది’ అని వ్యాఖ్యానించాడు.. నిజానికి ఈ నిర్వచనంలో మార్క్స్ మతాన్ని సమాజంలో ఒక పాజిటివ్ అంశంగానే పేర్కొన్నాడు. ఇక్కడ ‘మత్తు మందు’ అన్నది బాధలను మరిపింపజేసే ఒక అంశం అన్న అర్థంలో వాడాడు. అంతేగానీ అదో మూర్ఖత్వం, వ్యసనం అన్న అర్థంలో వాడలేదు. కానీ భారతీయ మార్క్సిస్టులు ఈ మొత్తం వ్యాఖ్యలోంచి ‘మతం ఒక మత్తు మందు’ అన్న భాగాన్ని మాత్రమే ఎత్తి చూపుతూ, మతం ఒక వ్యసనం, మూర్ఖత్వం అన్న అర్థంలో ఈ మాటకు ప్రాచుర్యాన్ని తెచ్చారు. నిజానికి మార్క్స్ పేద ప్రజలు నమ్ముకునే మతాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నాడు. అయితే వర్గ పోరాట దృక్పథంలో అదో ‘ఫాల్స్ కాన్షియస్‌నెస్’ను సృష్టిస్తుందని పేర్కొన్నాడు. ఇక మతాన్ని క్షేత్ర స్థాయిలో ఎలా డీల్ చేయాలో ప్రాక్టికల్‌గా చూపినవాడు లెనిన్. ‘The Attitude of Workers' Party to Religion’ అన్న రచనలో మతం పట్ల సానుభూతిగా ఎలా వ్యవహరించాలో, చర్చితో కలిసి సోషలిస్టు పార్టీ ఎలా పని చేయాలో లెనిన్ విశదీకరిస్తాడు. ఇలా, ఈ సోషలిస్టు సామాజిక శాస్త్రవేత్తలందరూ నాస్తికవాదాన్ని నమ్మినప్పటికీ, ఎవరూ కూడా మతాన్ని పూర్తిగా గర్హించమని గానీ, అది విషపూరితం, దాన్ని నమ్మేవారంతా మూర్ఖులని గానీ స్టీరియోటైపు చేయలేదు.

‘నేను హిందువుగా పుట్టాను, కాని హిందువుగా మాత్రం మరణించను’ అని గర్జించిన ఈ దేశ మహోపాధ్యాయుడు, సామాజిక శాస్త్రవేత్త అంబేడ్కర్ మతం మారి నవయాన బుద్ధిజాన్ని ప్రతిపాదించాడు. అంబేడ్కరుకు మతం అనే భావనతో అస్సలు పేచీ లేదు. అయితే, ‘అది ఒక సామాజిక మార్పు’ను ప్రేరేపించేదిగా ఉండాలని పేర్కొన్నాడు. ప్రతి మనిషికి ‘స్పిరిచువాలిటీ’ అనేది ఒక కోరికగా అంబేడ్కర్ గుర్తించాడు. అయితే మనుషుల మధ్యన అసమానతలకు బీజం వేస్తే అది ఒక ‘వ్యూహం’ తప్ప మతం కాదు అని పేర్కొని, ఆ కారణంగా కుల అసమానతలను ఎత్తి చూపుతూ హిందూత్వాన్ని ఒక మతంగా ఆయన పరిగణించలేదు.

ప్రపంచంలో సామాజిక శాస్త్రంలో పేరెన్నికగన్నవారు మరో ఇద్దరు మ్యాక్స్ వెబర్, ఎమిలీ డుర్ఖీం. వీరిద్దరూ కూడా సమాజంలో మతం కీలక స్థానాన్ని ఒప్పుకున్నారు. మ్యాక్స్ వెబర్ మతంపైన, దాని సమూహ ప్రవర్తన మీద అధ్యయనం చేస్తూ, పాశ్చాత్య దేశాల్లో ‘ప్రొటెస్టెంటు మతం కేపిటలిస్ట్ సమాజం వేపు పురోగమించడానికి ఉపయోగపడింది’ అని పేర్కొన్నాడు. అంతే తప్ప, మతాన్ని విషపు మందు అనో, సామాజిక పీడ అనో పేర్కోలేదు. అలాగే ఇంకో ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డుర్ఖీం సమాజంలో ఆత్మహత్యల మూలాల్ని శోధిస్తూ, ‘కేథలిక్ సమాజం బలంగా ఉన్న చోట మనిషి ఒక సామూహిక బంధంలో ఆసరా వెతుక్కుంటాడు. అందువల్ల అక్కడ ఆత్మహత్యలు తక్కువగా ఉంటాయి’ అని పేర్కొన్నాడు.

ఈ ప్రపంచ ప్రసిద్ధులైన సామాజిక శాస్త్రవేత్తలు ఎవ్వరూ కూడా మతాన్ని ఒక నిరసించదగ్గ విషయంగా పరిగణించలేదు. మరోపక్క వీళ్ళందరూ నాస్తికులే. ఎవరికీ దేవుడు, ఆత్మ, స్వర్గం, మోక్షం లాంటి విషయాలపై నమ్మకం లేదు. అయినప్పటికీ వీళ్ళందరూ ‘మతం’ అనే భావనపైన ఒక సానుభూతిపరమైన అవగాహనను ప్రకటించారు.

అయితే మతంలో ఈ ‘ఛాందసవాదం’ ఎలా వచ్చి చేరుతుంది? వ్యక్తి ప్రవర్తనను, సమాజ సామూహిక ప్రవర్తనను ఒకటిగా భావించడం; మతం తమ వ్యక్తిగత విషయాల్లోనే గాక రాజకీయ ఆర్థిక రంగాల్లో విస్తరించాలి అని కోరుకోవడం; ఈ ప్రపంచం మొత్తం కేవలం మత గ్రంథాల మీద నిలబడి మాత్రమే నడవాలి అని మొండిపట్టు పట్టడం, భిన్నతత్వాలకు తావులేకుండా కేవలం ఒకే దైవ ప్రతిపాదితమైన ప్రాపంచిక సూత్రంతోనే ప్రపంచాన్ని నడపాలని కోరుకోవడం... ఇలాంటి ధోరణుల వల్లనే మతంలోకి ఛాందసత్వం వచ్చి చేరుతుంది.

మనిషి ఇలా ఎందుకు కోరుకుంటాడు? తాను నమ్మిన భావనల ద్వారా, తన సమూహం ద్వారా ఈ సమాజంలో తన ప్రాధాన్యతను బలిష్టపరుచుకోవడం, అంటే– ఒక మెజారిటేరియనిస్ట్‌గా ఉండాలని కోరుకోవడం, ఈ రాజ్యాన్ని ఏదో ‘వంక’తో అయినా ఆక్రమించాలనుకోవటం... ఈ ధోరణి వల్లనే మతం ఛాందస రూపం తీసుకుంటుంది. అందుకే ఏ దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందో అక్కడ మతం పేరుతో జరిగే మరణాలు, చిత్రహింసలు ప్రజల్లో తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం భిన్న దృక్పథాలకు తావునిస్తుంది. అంటే– ఏ మతమైతే భిన్న దృక్పథాలకు తావునివ్వగలదో ఆ మతం మాత్రమే సమాజంలో ఒక పురోగతిని సృష్టించగలదు, లేదా అదే పురోగతికి దోహదం చేయగలదు. లేనప్పుడు ఆయా సమాజాల్లో ‘సివిల్ వార్’ అన్నది నిత్యకృత్యం. ఇప్పుడు మనం ఇరాన్‌లో దాన్నే చూస్తున్నాం. స్పిరిచ్యువల్ కోరికలు దాటి సామాజిక–ఆర్థిక–రాజకీయ రంగంలోకి మతం ప్రవేశించడానికి వీల్లేదు. మతం అన్నది సమాజంలో వ్యక్తి ప్రవర్తనను నిర్దేశించేది. నిజానికి అది ఒక ‘కోడ్ ఆఫ్ కండక్ట్’. దీన్ని ‘షరియా లా’ పేరుతోనో, లేదా ‘మనుస్మృతి’ పేరుతోనో రాజ్యాంగంలో భాగం చేస్తే, ఇక ఆ సమాజాలు రోగగ్రస్థమైనట్టే! ఈ మధ్య అమెరికాలో అబార్షన్‌ను నిషేధించడం అక్కడి కేథలిక్ డామినేషన్‌ను వ్యవస్థీకరించడంలో ఒక భాగమే తప్ప, అది కేవలం స్త్రీల హక్కులపై ఉన్న మగదురహంకారమో, లేదా ‘ప్రో లైఫ్ యాక్టివిజమో’ అస్సలు కాదు.

ఈ మత ఛాందసవాదంలో ఇరుక్కుపోయిన దేశాల్లో నిత్యం ఏదో ఒక రాజకీయ సంక్షోభం, నిత్యం పౌరులకు అభద్రతా భావన కల్పించే చర్యలూ జరుగుతుంటాయి. ఏ కొంత అభివృద్ధి జరిగినా అది కేవలం సహజ వనరుల వల్ల కలిగే వృద్ధి తప్ప మానవ వనరుల వల్ల కలిగే అభివృద్ధి కాదు. అందుకే రాజ్యాంగం వేరు, మత గ్రంథాలు వేరు. మనమంతా ఒకరి వ్యక్తిగత విశ్వాసాలను మరొకరు గౌరవించుకుంటూ సామూహికంగా సమిష్టిగా జీవించే విధానాన్ని నేర్పేది రాజ్యాంగం. వ్యక్తిగా ఎదుటి మనిషిని ప్రేమించాల్సిన నైతికతను నింపేది మతం. అలా అయినప్పుడు మతమూ, రాజ్యాంగమూ రెండూ ఒకదాన్నొకటి ‘కాంప్లిమెంట్’ చేసుకుంటాయి.

మతం మనిషికి నైతిక సూత్రాల మీద బతికేందుకు ప్రేరేపిస్తుంది. మనిషికి బతుకుపై ఆశను పెంపొందిస్తుంది. సమాజంలో, జరిగే జరగాల్సిన సాంకేతిక మార్పులను ఆహ్వానించి మరో మెట్టు ముందుకెళ్ళడానికి ‘ఫెసిలిటేట్’ చేస్తుంది. ఒక సమాజంలో ఇద్దరు మనుషుల కంటే ఎక్కువమంది బతికే చోట పరస్పరం ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో ప్రేమించాలో దాని ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించేదే మతం. అంబేడ్కర్ అన్నట్టు – మతం నియమ నిబంధనల మీద కాదు, నైతిక సూత్రాల మీద ఆధారపడి ఉండాలి. నీవెలా గడ్డం గీసుకోవాలి, నీవెలా స్నానం చేయాలి, నీవెలా జుట్టు కప్పుకోవాలి, నీవెలా తినాలి – ఇలాంటి నియమాల సంపుటి కాదు మతం. ఒక మనిషి నీకు భిన్నమైనవాడైనా సరే ఎలా ప్రేమించాలి, సామూహిక జీవనంలో ప్రతి ఒక్కరినీ ఎలా భాగస్వామ్యులను చేయాలీ... ఇలా నైతిక సూత్రాలు కలిగిన జీవన విధానానికి మార్గం వేసేది మతం.

రాజ్యం మద్దతు లేకుండా కేవలం వ్యక్తుల ద్వారా, వ్యక్తిత్వాల ద్వారా మాత్రమే ఎదగగలిగే సత్తా ఉన్నదే అసలైన మతం! మనుష్యులను నిర్దాక్షిణ్యంగా హింసిస్తేనో, చంపితేనో తాను సమాజంలో ఉంటాను అనుకునే దేవుడు మనకెందుకు? మనం ఎదగడానికి ప్రభుత్వం కావాలి. అంతే కాని అత్యంత శక్తిమంతుడైన దేవుడు ఎదగడానికి ప్రభుత్వం మద్దతు ఎందుకు? అలాంటి దేవుడున్న మతాలు మనకెందుకు?

పి. విక్టర్ విజయ్ కుమార్

Updated Date - 2022-11-12T01:57:47+05:30 IST