ప్రశ్నించే హక్కుపై ప్రజా చైతన్యం

ABN , First Publish Date - 2022-12-02T02:41:31+05:30 IST

భాగ్యనగరంలో నవంబర్ 21న జరిగిన రెండు కార్యక్రమాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అవి: విద్యావేత్త చుక్కా రామయ్య 98వ పుట్టిన రోజు వేడుక...

ప్రశ్నించే హక్కుపై ప్రజా చైతన్యం

భాగ్యనగరంలో నవంబర్ 21న జరిగిన రెండు కార్యక్రమాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అవి: విద్యావేత్త చుక్కా రామయ్య 98వ పుట్టిన రోజు వేడుక; తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై సమాలోచన సదస్సు. సమాజంలో పౌరుల ప్రశ్నించే హక్కు, దాని ఆవశ్యకతను మొదటి సమావేశంలో ఉపన్యసించిన వక్తలు పేర్కొన్నారు. రెండో సభలో ప్రధాన వక్తలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని వేధించే దిశగా సిబిఐ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుమీద ప్రజల్లో చైతన్యం పెరగాలన్నది వారి ప్రసంగాల సారాంశం. దీన్ని ఆహ్వానించాల్సిందే, అభినందించాల్సిందే.

ఆజాద్ కీ అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, ప్రశ్నించే హక్కు అవసరం గురించి అనుమానం ఉన్నదంటే అది ఆందోళన కలిగించే విషయమే. విశ్లేషించి చూసి, కారణాలు అన్వేషించి, ప్రశ్నించే హక్కును కొనసాగించాల్సిన బాధ్యత నెత్తిన వేసుకోవాల్సింది మాత్రం పౌరసమాజమే. వాస్తవానికి సహకార సమాఖ్య వ్యవస్థకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణులను ప్రశ్నిస్తున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనాలి. ఎవరో ఒకరిద్దరు ప్రశ్నించడంతో ఆగకుండా సమాజంలో చైతన్యం తెచ్చే దిశగా అందరం కలసికట్టుగా పయనించాలి. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య బద్ధంగా అన్యాయాన్ని ప్రశ్నించినవారికి, బీజేపీయేతర రాష్ట్రాధినేతలతో సహా, ఎవరికి, ఏరకమైనా ఇబ్బంది కలిగినా, అలాంటివారికి మద్దతునిచ్చే సంస్థలు ఉండాలి. రాజకీయాలకు అతీతంగా, ఇజాలకు దూరంగా, పార్టీలతో సంబంధం లేకుండా అవి ఏర్పాటు కావాలి, పనిచేయాలి. సార్వజనీన సభ్యత్వ ప్రాతిపదికగా ఆ సంస్థలు రూపుదిద్దుకోవాలి. తెలంగాణ వికాస సమితి లాంటి ఆమోదయోగ్యమైన సంస్థలు, ఈ దిశగా మరింత నిబద్ధతతో ముందుకు సాగాలి. మరెంతోమంది మేధావులను కలుపుకొని, ఇలాంటి సదస్సులు జాతీయ స్థాయిలో కూడా మరెన్నో నిర్వహించాలి.

పౌరుల ప్రశ్నించే హక్కుకు, పౌరహక్కుల అణచివేతకు దేశంలో బీజాలు పడ్డనాడే సామూహికంగా ప్రశ్నించి ఉంటే పరిస్థితులు మరోరకంగా ఉండేవేమో! భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను నిర్బంధించడం జరిగింది. వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కెపి ఛటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘంను స్థాపించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ అరెస్టులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఎవరూ ప్రశ్నించలేదు. ఇందుకు కారణం అప్పట్లో అరెస్టు అయినవారు కమ్యూనిస్టులు కాబట్టేనేమో.

అదే విధంగా భారత్– చైనా యుద్ధ నేపథ్యంలో (ప్రజాస్వామ్యవాది నెహ్రూ ప్రధానిగా ఉండగా) కేంద్ర హోం శాఖ మంత్రి గుల్జారిలాల్ నందా ఆదేశాల మేరకు వేయిమందికి పైగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అప్పుడైనా అదేమిటని ప్రశ్నించిన లేదా ఖండించిన కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు ఆనాడు లేవనాలి. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో ఉన్నారు వారంతా! అలా ప్రశ్నించే హక్కును క్రమంగా వదులుకోవడం మొదలైంది అనాలి. 1970వ దశకం మధ్యనాళ్లలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, వారూ–వీరూ అనే భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. కమ్యూనిస్టు నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి ఉండేది కాదని!

ఇలా జరగబోయే అవకాశాలున్నాయని అలనాటి పౌరహక్కుల ఉద్యమ ఆద్యులు, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు కెవి సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణ హితవు పలికారు. వారి కలయిక ఒక విధంగా భవిష్యత్ భారత పౌరహక్కుల ఉద్యమానికి నాంది అనాలి. కేవలం కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులే తప్ప సభ్యులు కాని ఆ ముగ్గురూ తమ తమ వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉంటూనే హక్కుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. కలిసి ఉద్యమించడానికి సోదర సీపీఐ అంగీకరించినా, ఇతరులు తమకెందుకులే అని నిర్లిప్తతతో ఉన్నారు. ఆ నిర్లిప్తత పర్యవసానమే తదనంతర కాలంలో ఎమర్జెన్సీ అరెస్టులు.

1982లో ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా, పార్టీ రహిత మేధావుల ఆధ్వర్యంలో, బలమైన పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించాలన్న పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘునాథరెడ్డి అధ్యక్షుడిగా, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శిగా, సురవరం సుధాకర రెడ్డి, ఎ.పి. విఠల్ కార్యదర్శులుగా అన్ని పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు కార్యవర్గ సభ్యులుగా పౌరహక్కుల సంస్థ ఆవిర్భావం జరిగింది. ఏడేళ్ల తర్వాత రఘునాథరెడ్డి గవర్నర్ కావడంతో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇవన్నీ ప్రశ్నించే హక్కు దిశగా సాగినవే. కాలక్రమేణా ప్రభుత్వాల ఆలోచనా విధానంలో కొంత మార్పు కనిపించ సాగింది. చట్టపరంగా మానవ హక్కుల సంస్థలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయడం మొదలయింది. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ర్ట స్థాయి హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి. పౌర హక్కుల సంఘాలు చురుగ్గా పనిచేయసాగాయి. మేధావులలో చైతన్యం పెరగడంతో పౌరుల్లో ప్రశ్నించే తత్వం వృద్ధి చెందసాగింది. అయితే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జరగాల్సింది ఇంకా ఎంతో వుంది.

రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణాలను, వాటిల్లోని ఒక రకమైన మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకొని, తమదైన సానుకూల వివరణలు ఇస్తున్నాయి. తద్వారా ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల ప్రశ్నించే హక్కును హరిస్తున్నాయి. ఎన్ని రకాల పౌరహక్కుల సంఘాలు ఆవిర్భవించినా, ఎన్ని ఉద్యమాలు నడిచినా, జరిగే నష్టం జరుగుతూనే ఉంది, ప్రశ్నించే హక్కు కోల్పోతూనే ఉన్నాం. పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదనీ, భవిష్యత్‍లో జరగదన్న నమ్మకం లేదనీ, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే ఒకానొక సందర్భంలో అభిప్రాయపడిందంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంటుంది? 1976లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక ‘హెబియస్ కార్పస్ కేసు’లో తీర్పిచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ‘ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు’ అన్న ఇందిర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో మెజారిటీ తీర్పు ఉన్నది. ఐదవ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, మెజారిటీ తీర్పుతో ఏకీభవించలేదు. విచారణ జరపకుండా నిర్బంధంలో ఉంచడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని ఖన్నా నాడు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని 2011 జనవరిలో ఒక రివ్యూ పిటీషన్పై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉంటున్న వర్తమాన సందర్భంలో, కేంద్ర–రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ ప్రశ్నించే హక్కు కేవలం వైయక్తిక పౌరులకే పరిమితం కాకుండా దాని పరిధి విస్తరించాలి. సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అండగా నిలవాలి. అది గవర్నర్ల నియామకమే కావచ్చు, రాజ్యాంగ స్ఫూర్తితో వారు పని చేసే విధానమే కావచ్చు, కేంద్రం అందించాల్సిన ఆర్థిక సహాయమే కావచ్చు, రాష్ట్రాలు అమలు పరుస్తున్న అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం నుంచి ఇతోధికమైన తోడ్పాటే కావచ్చు, అకారణమైన కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులే కావచ్చు, రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితా– ఉమ్మడి జాబితా పటిష్ఠ అమలే కావచ్చు, మరేదైనా కావచ్చు. పటిష్ఠమైన రాష్ట్రాలే దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి. దానికోసం ముఖ్యమంత్రులు కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే వుండాలి.

వనం జ్వాలానరసింహారావు

Updated Date - 2022-12-02T02:41:35+05:30 IST