షార్ లో మొలిచిన ప్రైవేట్ విత్తు

ABN , First Publish Date - 2022-12-03T00:53:01+05:30 IST

చిన్నప్పుడు చదివిన ‘ఒంటె... యజమాని’ కథ గుర్తుందా? ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ప్రస్తుతం రాకెట్ వేగంతో ...

షార్ లో మొలిచిన ప్రైవేట్ విత్తు

చిన్నప్పుడు చదివిన ‘ఒంటె... యజమాని’ కథ గుర్తుందా? ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ప్రస్తుతం రాకెట్ వేగంతో సంభవిస్తోన్న పరిణామాలు అలాంటి కథే పునరావృతం అవుతుందన్న అనుమానాల్ని మొలకెత్తిస్తోంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ప్రైవేటు భుజస్కందాలపై ఎక్కించి పరుగుపెట్టించాలని కంటున్న కల సాకారమవుతుందో లేక ప్రజలను బడాబాబుల ముందు సాగిలపడేలా చేస్తుందో అన్న ఆందోళనను రేకెత్తిస్తోంది.

అనేక ఓడరేవులు, ప్రభుత్వ ఆధీనంలోని ఎన్నో పరిశ్రమలతో పాటు భారతీయ రైల్వే సైతం ప్రైవేట్ ఒడిలోకి ఒక్కొక్కటిగా చేరిపోతున్నాయి. ఈ పరాధీన పరంపర ఇప్పుడు ఇస్రో ముంగిటకి చేరుకొంది. దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం మంచిదే కాని... అయిదు దశాబ్దాల అవిరళ కృషితో ఇంతింతై వటుడింతైనట్లు ఎదిగిన ఇస్రో ఇంట్లోనే ప్రైవేట్ సంస్థలు పాగా వేసేలా అనుమతించడం ఎంతవరకు సబబన్నది నిజాయితీగా ఆలోచించాలి.

దేశీయ ప్రైవేటు సంస్థలకు రాకెట్, ఉపగ్రహాల టెక్నాలజీని అందించి తయారైన రాకెట్లు, ఉపగ్రహాలను తొలినాళ్ళలో ఇస్రోనే ప్రయోగించాలి గాని, ఇస్రో సెంటర్లలోనే వారికి ప్రత్యేక ప్రయోగవేదికలు, మిషన్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని వారే ప్రయోగించుకొనేలా చేయడం ఇస్రోని ప్రేక్షకపాత్రకి పరిమితం చేయడం అవుతుందనడంలో సందేహంలేదు.

1969లో దేశంలో రాకెట్ ప్రయోగాల కోసం సతీష్ ధావన్ దేశవ్యాప్తంగా అన్వేషించి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట దీవిని గుర్తించారు. ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉండటంతో పాటు తూర్పున బంగాళాఖాతం, మిగిలిన మూడు దిశల్లో‌ పులికాట్ సరస్సు విస్తరించి ఉండటంతో శతృదుర్భేద్యంగా భావించి ఇక్కడ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని నెలకొల్పారు. ఇప్పుడీ దీవి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల్లో ఒకటిగా రూపుదిద్దుకుని ఉంది. అనుమతి ఉంటేనే ఈ రాకెట్ కేంద్రంలోకి ప్రవేశం. ఈ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి దేశ విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తూ దేశ సాంకేతిక అవసరాలను తీరుస్తున్న ఇస్రో, విదేశీ మారక ద్రవ్యాన్నీ భారీగా దేశానికి సమకూర్చిపెడుతోంది. బుల్లి బుల్లి సౌండింగ్ రాకెట్ల నుండి బాహుబలిలాంటి మార్క్ 3 రాకెట్ల వరకు అలవోకగా అంతరిక్షంలోకి ప్రయోగిస్తూ మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్రోలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరలేపింది. కొన్నేళ్ళ క్రితం యాంత్రిక్స్ సంస్థను నెలకొల్పి విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లావాదేవీలు నిర్వహింపచేసింది.

తాజాగా ఆ సంస్థ స్థానంలో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) ఏర్పాటుచేసి విదేశీ ఉపగ్రహాలతోపాటు స్వదేశంలో ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థలతో ఒప్పందాలు చేసుకుని దేశంలో అంతరిక్ష ప్రయోగాలపై ఆధిపత్యం చేస్తోంది. దాంతో ఎన్ఎస్ఐఎల్ అడుగుజాడల్లో ఇస్రో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని నెలలక్రితం కేవలం విదేశీ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఇస్రో కక్ష్యల్లోకి చేరవేసింది. ఈ సందర్భంగా షార్లో జరిగిన మీడియా సమావేశంలో సాక్షాత్తు ఇస్రో ఛైర్మన్ ‘మాదేముంది అంతా వీరిదే’ నంటూ నవ్వుతూ ఎన్ఎస్ఐఎల్ చైర్మన్ని చూపడం ఇస్రో ప్రస్తుత స్థితికి నిదర్శనం.

షార్లో రాకెట్లను ప్రయోగించే సమయంలో ఇస్రో చైర్మన్, వివిధ ఇస్రో సెంటర్ల శాస్త్రవేత్తలు మిషన్ కంట్రోల్ సెంటర్లో కంప్యూటర్లముందు కూర్చుని ప్రయోగాన్ని నిర్వహిస్తుంటారు. అయితే గత నెలలో షార్ నుండి తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంటే ఇస్రో ఛైర్మన్తో పాటు శాస్త్రవేత్తలు మిషన్ కంట్రోల్ సెంటర్ గ్యాలరీలో ప్రేక్షకుల్లా గడపడం గమనార్హం.

అలాగే గత నెల 25న షార్లో ఓ ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థకు ప్రత్యేక ప్రయోగ వేదికను, మిషన్ కంట్రోల్ సెంటర్ను ఇస్రో ఛైర్మన్ ప్రారంభించారు. త్వరలోనే ఈ సంస్థ షార్లోనే ద్రవ ఇంధనం నింపే కార్యక్రమ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంటుందని ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. అతి త్వరలోనే ఈ సంస్థ తన రెండుదశల రాకెట్ను షార్లోని తమ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇలా భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ స్టార్టప్ అంతరిక్ష సంస్థలు షార్లోనే సొంతంగా సౌకర్యాలు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ అంతరిక్ష సంస్థలను ప్రోత్సహించడం అవసరమే. ఆ సంస్థలు తమ రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సొంత కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం వాటికి మార్గం చూపాలిగాని ఎందరో ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచిన షార్ను ఇలా ప్రైవేటు పరం చేయడం సమంజసం కాదు. ఇది ఇలాగే కొనసాగితే అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశానికి అగ్రరాజ్యాల సరసన సగౌరవ స్థానం కల్పించిన ఇస్రో భవిష్యత్తులో ఓ డమ్మీ రాకెట్ ప్రయోగ కేంద్రంగా మారిపోయినా ఆశ్చర్యంలేదు. అలాగే పూర్వం దేశ అవసరాల కోసం తరతరాలుగా తాము నివసించిన శ్రీహరికోట దీవిని వదిలి వలసలెల్లిపోయిన అక్కడి ప్రజల త్యాగం కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది.

ఆర్.ఎం.వి. భాస్కర్ బాబు

సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2022-12-03T00:57:10+05:30 IST