కుండకూ కులముంది

ABN , First Publish Date - 2022-08-17T06:19:29+05:30 IST

గుక్కెడు నీళ్లు తాగితే గుండె ఆగేలా బాదిన ఘనులున్న చోట వజ్రోత్సవ వేడుక రాజుల ఆస్థానంలో...

కుండకూ కులముంది

గుక్కెడు నీళ్లు తాగితే 

గుండె ఆగేలా బాదిన 

ఘనులున్న చోట 

వజ్రోత్సవ వేడుక  

రాజుల ఆస్థానంలో

రక్తపు రంగు పూసుకుంది 

ఇక్కడ కుండకూ 

కులముంది

దాహం తీర్చుకోవడమే

దారుణమా 

చెప్పు మువ్వన్నెల 

పతాకమా

కులము నీటికా 

ఎక్కడా చెప్పలేదే 

మన రాజ్యాంగ పీఠిక 

ఆ తల్లితండ్రుల 

కంటినిండా పెట్టారు 

చీకటనే కాటుక 

ఇక్కడ 

కుండకూ కులముంది 

కుండలోని నీటికీ 

కులముంది

ఎదురుతిరిగే వయసు కాదు 

బదులు చెప్పే ధైర్యం లేదు 

పసి కూనపై పడగెత్తిన 

కులసర్పమా 

ఇందుకా మాకీ 

తిరంగాలు 

చేధించలేని కుల సొరంగాలు

వర్షించకుండానే 

కనుమరుగైపోయిన 

‘మేఘం’ లా 

కన్నుమూసిన 

పసికూనా 

క్షమించరా తండ్రి 

వేడుకల్లో మునిగి 

ఈ పీడకల మరిచిపోయాం

కారంచేడులో నీటి దగ్గర

పోరాట ఈటెగా ఎత్తిన 

మున్నంగి సువార్తమ్మ

బిందైనా ముద్రించండి 

ఈ మువ్వన్నెల పతాకం పై 

తెలుసుకుంటుంది దేశమపుడైనా 

ఈ నీరూ నేల మాకూ సొంతమని

పచ్చల రాజేష్

(రాజస్థాన్‌లో కుండలో నీరు తాగినందుకు టీచర్ దెబ్బలకు కన్నుమూసిన దళిత బాలుడికోసం)

Read more