ఆన్‌లైన్‌ ఎన్నికల పద్ధతి రావాలి

ABN , First Publish Date - 2022-10-14T06:11:15+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఎన్నికలు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే నిర్వహించుకోవాలా? ఓటు హక్కు వినియోగించుకోవాలంటే గంటల తరబడి...

ఆన్‌లైన్‌ ఎన్నికల పద్ధతి రావాలి

సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఎన్నికలు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే నిర్వహించుకోవాలా? ఓటు హక్కు వినియోగించుకోవాలంటే గంటల తరబడి ఎండలో క్యూలైన్లలో నిల్చోవాల్సిందేనా? ప్రజాప్రతినిధులను ఎన్నికోవాలంటే పనులు మానుకుని వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి తరలిరావాల్సిందేనా? రేషన్ కార్డు నుంచి పాస్‌పోర్టు వరకూ అన్ని సేవలూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటే, ఎన్నికల్లో మాత్రం బ్రిటిష్ కాలపు పద్ధతులతోనే సరిపెట్టుకోవాలా? డిజిటల్ ఇండియా, ఈ–గవర్నెన్స్ అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వాలు ఆన్‌లైన్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేవా? విద్యావంతులు అయివుండి, టెక్నాలజీ అందుబాటులో ఉండీ అరకొర ఓటింగ్ శాతంతోనే సంతృప్తి పడాలా? అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్య పునాదులను బలపరుచుకోలేమా? ఓటు వేసేందుకు క్యూలైన్లో నిలబడి తీరా ఈవీఎం దగ్గరకెళ్లాక మన ఓటు ఎవరో వేసేశారంటే చేసేదేమీ లేక వెనుదిరగాల్సిందేనా? వీటన్నికీ పరిష్కారమేమిటి?


సాధారణ ఎన్నికలను పక్కన పెడితే కనీసం విద్యావంతులు పాల్గొనే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా ఆన్‌లైన్‌ ఎన్నికల విధానాన్ని అమలు చేయాలి. మన దేశంలో ఇప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ శాతం ముఖ్యంగా నగరాలలో తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతోంది. ప్రజాస్వామ్యం పట్ల చదువుకున్నవారు కొంచెం నిర్లిప్తతగా, నిరాశక్తితో ఉన్నారనిపిస్తోంది. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చదువు రానివారు ఈరోజు ఓటుహక్కును తమ విధిగా భావించి దానిని వినియోగించుకుంటున్నారు. సాధారణ ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ వంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఎక్కువమంది ఓటింగ్ పర్సంటేజ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి. దాంతో ఎక్కువ మంది విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.


ఉపాధి కోసం సుదూర పట్టణాలకు వలస వెళ్లినవారు, సెలవు దొరికి, తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖర్చు అధికంగా అవుతోంది. అంత ఖర్చు భరించలేక వారు ఓటు వేయడానికి రావడం మానేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఆన్‌లైన్‌ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలి. అప్పుడు 100 శాతం పోలింగ్ అయ్యే అవకాశముంది. ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

శరత్ కుమార్ రెడ్డి చింతా

Updated Date - 2022-10-14T06:11:15+05:30 IST