న్యూడ్‌ కాల్స్‌పై సిట్‌ విచారణ

ABN , First Publish Date - 2022-11-12T01:35:05+05:30 IST

గద్వాల జిల్లా మీరు సృష్టించిన కొత్త జిల్లాలలో ఒకటి. మొదటినుండి ఈ నియోజకవర్గంలో వేరే రాజకీయ పార్టీలు గెలుస్తూ ఉన్న చరిత్ర ఉంది.

న్యూడ్‌ కాల్స్‌పై సిట్‌ విచారణ

ముఖ్యమంత్రి గారూ,

గద్వాల జిల్లా మీరు సృష్టించిన కొత్త జిల్లాలలో ఒకటి. మొదటినుండి ఈ నియోజకవర్గంలో వేరే రాజకీయ పార్టీలు గెలుస్తూ ఉన్న చరిత్ర ఉంది. మొదటిసారి మీ పార్టీ గెలవడంతో ఇక్కడ టిఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. ఇక్కడ కొంత మంది రాజకీయ నాయకులు జూరాల ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా, సీడ్ పత్తి ఆర్గనైజర్లుగా కోట్లలో సంపాదించుకుంటున్నారు. ఇంకో ప్రక్క అతికరువు ప్రాంతంగా ఉన్న గట్టు మండలం ఈ జిల్లాలోనే ఉంది. పేదరికం, కరువు, వలసల వలన పేదవారు కడు పేదవాళ్లుగా మారిపోతుంటే కొన్ని వర్గాలకు చెందిన పెత్తందారులు కోటీశ్వరులుగా మారుతున్నారు. డబ్బు ఉందనే అహంభావంతో ఎంతోమంది పేద మధ్య తరగతి అమ్మాయిలను ప్రేమ పేరుతో వలవేసి వారిని గర్భవతులను చేసి ఎంతో కొంత డబ్బు చేతిలో పెడుతున్నారు. కొందరు ధైర్యం చేసి చీటింగ్ కేసు పెట్టినా చివరికి వారిని బలవంతంగా కోర్టులో రాజీలు చేసినవి కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలంటే చులకనగా చూడటం వారు కేవలం తమ శారీరక అవసరాలకే పనికొస్తారనే భావన, డబ్బు వలన అగ్ర కులం వల్ల వచ్చిన అహంకారమే నేడు న్యూడ్ కాల్స్ కేసు వరకు వచ్చింది. 150మంది దాకా ఈ కేసులో గృహిణులు, ఉద్యోగులు, విద్యార్థినులు ఇరుక్కున్నారంటే ఇది చిన్న విషయం కాదు. పోలీసులను సస్పెండ్ చేసినంత మాత్రాన ఇక్కడ బాధితులకు న్యాయం జరగదు. దీని వెనుక ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధాన పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అసలు ‘పెద్ద మనుషులు’ తప్పించుకున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహిళలకు నిజంగా న్యాయం జరగాలంటే మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. సిట్‌తో విచారణ జరిపితే, అక్కడి రాజకీయ నాయకుల బండారాలు బయట పడతాయి. మహిళలను ఈ స్థితికి దిగజార్చినట్లు చేశారంటే వారు ఎంత తీవ్ర మానసిక హింసను ఎదుర్కొని ఉంటారో సులభంగా అందరికీ అర్థం అయ్యే విషయమే. వీరు సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చేసుకున్న వార్తలు కూడా ప్రతికలలో వచ్చాయి. ఇంతమంది మహిళలను ఈ స్థితికి దిగజార్చడంలో ఇద్దరు ముగ్గురు ఉండటం సాధ్యం కాదు. ఇంకా ఎక్కువ మంది కచ్చితంగా ఉంటారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి దోషులందరినీ అరెస్టు చేయాలి. నడిగడ్డగా పేరొందిన గద్వాల జిల్లా ఉద్యమాల గడ్డగా కూడా పేరు పొందింది. ఈ ఉద్యమాలు లేకుండా తీవ్రమైన నిర్బంధం అమలు చేసి, ఉపాలాంటి చట్టాలను నమోదు చేసి యువతను ఉద్యమాలకు దూరం చేసిన ఫలితంగా దోషులకు విచ్చలవిడితనం వచ్చింది.

– జ్యోతి

రాష్ట్ర కన్వీనర్, చైతన్య మహిళా సంఘం

Updated Date - 2022-11-12T01:35:08+05:30 IST