నా విప్లవ ప్రస్థానంలో నిజాం వెంకటేశం

ABN , First Publish Date - 2022-09-29T06:03:38+05:30 IST

విప్లవోద్యమంలో తమకు తోచిన మార్గంలో, తోచిన మేరకు పని చేసిన చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. ఎవరి ఆలోచనలు, దారులు, నిర్వచనాలు, పని విధానాలు...

నా విప్లవ ప్రస్థానంలో నిజాం వెంకటేశం

విప్లవోద్యమంలో తమకు తోచిన మార్గంలో, తోచిన మేరకు పని చేసిన చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. ఎవరి ఆలోచనలు, దారులు, నిర్వచనాలు, పని విధానాలు వారికి ఉన్నాయి. వారంతా సమైక్యమవుతే ఎంత బావుండనుకునే వారు కూడా చాలామందే ఉంటారు. సారాంశంలో వారందరినీ వామపక్ష భావాలుగ‌ల‌ వారుగా చెప్పుకుంటాం. నాకు తెలిసిన నిజాం వెంకటేశం సారు ఆ కోవలోకి వ‌స్తారు. ఇటీవలే ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు సారు మరణం గురించి రాసిన జ్ఞాపకాలు చదవడం తటస్థించి కాసేపు నిశ్చేష్టుడనయ్యాను. ఒక్కసారి నా గతంలోకి వెళ్లాను.


నిజాం వెంకటేశం మా ఊళ్లో చాలా సంవత్సరాలే ఎలక్ట్రికల్‌ సబ్‌–స్టేషన్‌ (పవర్‌ హౌసు)లో పని చేశారు. ఆయన నా సోదరుడు మల్లోజుల కోటేశ్వర్లుకు చాలా సన్నిహిత మిత్రుడు. వారి మైత్రే నన్ను ఆయనకు పరిచయం చేసింది. అవి దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్న రోజులు. అప్పటికే ఏర్పడి ఉన్న రాడికల్‌ విద్యార్థి సంఘం నాయకులు చాలా మంది ఆ సమయంలో అనివార్యంగా రహస్య జీవితానికి వెళ్లారు. వారిలో నా సోదరుడూ ఉన్నాడు. నేను ఆ సమయంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐటిఐలో చేరాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఐటిఐలలో రాడికల్‌ విద్యార్థి సంఘం బలపడి విద్యార్థి ఉద్యమాలు ప్రబలడానికి మా ఐటిఐ అత్యంత కీలక పాత్ర పోషించింది.


నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్న ఆ రోజులలో నాకూ సారుకూ మధ్య స్నేహం పెరిగింది. మా మధ్య స్నేహం పెరగడానికి అమరుడు, నా సన్నిహిత మిత్రులలో ఒకరు కామ్రేడ్‌ దగ్గు రాజలింగం కార‌ణం. ఇది వారిద్దరి మధ్య రాజకీయ భావైక్యత మాత్రమే కాదు, వివిధ రంగాలలో పని చేస్తున్న వారిని విప్లవ పార్టీ సంఘటితపరిచిన‌ తీరుకు ఇది ఉదాహ‌ర‌ణ. రాజలింగం వాళ్ల ఇల్లు సారు వాళ్ల క్వార్టరుకు కూతవేటు దూరంలో ఉండేది. అందువ‌ల్ల రాజలింగం కేరాఫ్‌ అడ్రస్‌ సార్‌ ఇల్లే అయింది.


ఎమర్జెన్సీ రోజులలో నిజాం వెంకటేశం గారి క్వార్టరు రహస్య విప్లవకారుల రాకపోకలకు ఎంతో అనువుగా ఉండేది. మా ఊరుకు దాదాపు 3కి.మీ. దూరంలో, నిర్జన ప్రదేశంలో రాఘవాపురం దర్గాను (వందలాది మామిడి చెట్ల తోటను) ఆనుకొని పవర్‌ హౌసు ఉండేది. దర్గాను ఆనుకొని ఓ పెద్ద గుట్ట ఉండేది. ఆ గుట్టపైన అప్పటికే రైల్వేవారు కమ్యూనికేషన్‌ సెంటరు ఏదో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ పరిసరాలు నిర్జన ప్రాంతాలు కావడంతో, రహస్య జీవితంలో ఉన్నవారు సునాయసంగా, మరో కంట పడకుండా నిజాం వెంకటేశం గారి క్వార్టర్లోకి వెళ్లేవారు. ఒకవేళ ఎవరైనా చూసినా వెంకటేశం గారి మిత్రులని అనుకునేవారు. సారు దగ్గరికి వచ్చే వారందరినీ ఆ కుటుంబ‌ సభ్యులు ఆప్యాయంగా చూసుకునే వారు. ఆనాటి సారు మిత్ర బృందంలోని కొందరు ఇప్పటి విప్లవోద్యమంలో అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారంతా ఇంకా ఈ వార్త చూశారో లేదో చెప్పలేను.


మా ఊళ్లో అప్పటికే కొంత వామపక్ష భావాలు ఉన్న యువతతో నిజాం వెంకటేశం గారికి మంచి సంబంధాలు ఉండేవి. అయితే, నిజానికి వారెవరూ నిస్వార్థంగా ప్రజల కోసం పని చేసే శ్రేణిలోకి వచ్చేవారు కారు. వారిలో ‘లంపెన్‌’ స్వభావం ఎక్కువ‌గా ఉండడంతో ఒకరకంగా ఊళ్లో వాళ్ల మాట చెలామణి అయ్యేదనుకోవచ్చు. అయితే వారు రాడికల్సుకు మాత్రం కోరిన సహాయాన్ని అందించేవారు. మా బాపుకు ఫ్రీడం ఫైటర్‌ అని, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడని గుర్తింపు ఉండడం, నక్సలైటు రాజకీయాలలోకి వచ్చిన నా సోదరుడి ప్రభావం ఉండ‌టం, నేను కాలేజీలో రాడికల్‌ విద్యార్థిగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండ‌టంతో నిజాం వెంకటేశం గారు నన్ను వివిధ కార్యక్రమాలలో ముందు నిలిపి ప్రోత్సహించేవారు.


ఓసారి మా ఊరి శివాలయంలో ఏదో విషయంపై జరిగిన వక్తృత్వ పోటీల్లో నేను ఫస్ట్‌ రావడంతో నిజాం వెంకటేశం నాకు వేమన పద్యాల పుస్తకాన్ని బహుకరించారు. నాకు మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మరో ప్రపంచా’న్ని పరిచయం చేసింది కూడా ఆయ‌నే. నేను వాళ్ల ఇంటికి వెళ్లినపుడు శ్రీశ్రీ కవిత్వాన్ని సారు అద్భుతంగా వినిపించేవారు. వాళ్ల తల్లి ‘చాల్లే ఇక’ అంటూ మొట్టికాయలు వేస్తే, చిన్నపిల్లాడిలా రెచ్చిపోయి ఇంకా గట్టిగా వినిపించేవాడు. ఇవన్నీ చూస్తూ అక్క (ఆయన సహచరి) ముసిగా నవ్వుతూ సంతోషించేది. వాళ్ల పాప అప్పటికి చాలా చిన్నది. బాబు ఉయ్యాలలోని బిడ్డడే! సారు వాళ్ల నానమ్మ వాకిట్లో పరధ్యానంగా కూచోని ఉండేది. ఈ సందడికి అపుడపుడు ఆమె ఏదో గుణగడమో, ముసిగా నవ్వడమో చేసేది. ఆ రోజులు నాలో విప్లవ బీజాలు ప‌డ‌టంలో సారు పాత్ర మర్చి పోలేనిది. అది నాకు జీవితాంతం గుర్తుంటుంది.


మాది మధ్య తరగతి కుటుంబం కావ‌డంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఐటిఐలో మిత్రులతో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి, జేబు ఖర్చులకు కనీసంగా డబ్బు దొరకడం గగనంగానే ఉండేది. నా పరిస్థితి చూసిన సారు తన ఇంజనీరు పిల్లలకు ట్యూషన్‌ చెప్పే కొలువు నాకు ఇప్పించాడు. రోజూ సాయంత్రం ఐదు గంటలకు 3 కి.మీ దూరంలోని పవర్‌ హౌసుకు నడుచుకుంటూ వెళ్లి ఆ పిల్లలకు ఓ గంట సేపు ఇంగ్లీషు ట్యూషన్‌ చెప్పేవాడిని. అప్పటికి సాయంత్రం 7 కావచ్చేది. ముదురు చీకటి అయ్యేది. ఆ సమయానికి పవర్‌ హౌసు అధికారులు ఆఫీసు పనులు ముగించుకొని వాహనంలో మార్కెటింగు కోసం వెళ్లేవారు. ఆ వాహనంలోనే నేను తిరిగి వెనక్కి బయలుదేరి ఇంటికి చేరుకునేవాడిని. అధికారులకు మార్కెటింగు పనులు లేకపోతే, సారుతో కలసి సైకిలుపై వచ్చేవాడిని. పాపం సారే నన్ను సైకిలుపై డబుల్‌ సవారీ కూచోపెట్టుకొని మా ఊళ్లోని జెండా వరకు దిగబెట్టేవాడు. దారి పొడవూతా నాకు ఈ ప్రపంచం గురించి ఎన్నెన్ని మాటలు చెప్పేవాడో. ఆ క్రమంలోనే ఆయన నన్ను యూపీఎస్‌సీ పరీక్షలకు కూడా తయారు చేశాడు. తన సొంత డబ్బులతో పుస్తకాలు కొనిచ్చి మరీ తయారు చేశాడు.


కరీంనగర్‌ జిల్లాలో అప్పటికే సాహిత్య పత్రికలు వెలుగుచూడడం ప్రారంభమైంది. ప్రెస్‌ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సాహితీ పత్రిక వెలువడేది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత ఊపందుకున్న విప్లవ కార్యక్రమాల ప్రచారానికి నిజాం సారు ఆర్థికంగా, హార్దికంగా ఎంతో తోడ్పడేవారు. ఆ రోజుల్లో తాలుకా కేంద్రమైన పెద్దపల్లి వ్యాప్తంగా ప్రభుత్వం విద్యుచ్ఛక్తి విస్తరణ కార్యక్రమాలు చేప‌ట్టింది. సారు పేద రైతులకు కరెంటు కనెక్షన్లు ఇప్పించడంలో తోడ్పడేవారు.


నిజాం వెంకటేశం సారు మరణ వార్త విన్నపుడు సందర్భవశాత్తు ఆయనను ఎరిగిన ముగ్గురు సహచరులం కలిసే ఉన్నాం. దీంతో ఆ పూటంతా ఆయన జ్ఞాపకాలనే నెమ‌రేసుకున్నాం. ఆయన సమకాలీనుడు, సహ ఉద్యోగి బాల్‌ లింగారెడ్డి సారు కూడ మా మధ్య గుర్తుకు వచ్చాడు. వాళ్ళకి కూడా ఆ రోజుల్లో విప్లవ సానుభూతిపరుల కుటుంబమే. 1980లలో రవీందర్‌ రెడ్డి సారు పాత్ర కూడా మా ఊరి రాడికల్‌ రాజకీయాలలో గుర్తుంచుకోవలసినదే! వీళ్లందరికి సెంటరుగా నా సోదరుడు అమరుడు కిషన్‌ జీ (మల్లోజుల‌ కోటీశ్వర్లు) ఉండేవాడు.


ఇలాంటి మిత్రులను ఎందరినో ఈనాటి విప్లవోద్యమం కూడగట్టుకోవలసిన అవసరం ఉంది. హిందుత్వ నేడు మన దేశంలో ప్రధాన శత్రువుగా ముందుకు వచ్చిన తరుణంలో ఈ ఆవశ్యకత మరింత పెరిగింది. ఈనాడు మన మధ్య నిజాం వెంకటేశం సారు లేడు, కానీ, అలాంటి శక్తులు సమాజంలో కోకొల్లలుగా సంఘటితంగా, అసంఘటితంగా ఉన్నాయి. వారందరినీ విప్లవోద్యమానికి అనుకూలంగా కూడగట్టడం విప్లవకారుల విధి. అర్బన్‌ నక్సలైటులంటూ హిందూత్వ శక్తులు దాడులను ముమ్మరం చేస్తున్న పరిస్థితులలో, మీ టూ అర్బన్‌ నక్సల్‌ అంటూ ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులు ముందుకు వస్తున్న వేళ, నిజాం వెంక‌టేశం సారు లేకపోవడం ఒక లోటే. సారు మరణం నా అంతరంగాలలో మరుగున పడిపోయిన అపురూపమైన జ్ఞాపకాలను బయటికి తోడుతున్నది.


నిజాం వెంకటేశం సారు మరణంతో వారి కుటుంబానికి మిత్రులకు కలిగిన దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను. మనమంతా పీడిత ప్రజల కోసం, దోపిడీ లేని సమాజం కోసం సారులాంటివాళ్లను సంపాదించుకొని కలుపుకొని అహర్నిశలు పాటుపడుదాం. విజయం దారిలో ముందుకు సాగుదాం.

మ‌ల్లోజుల వేణుగోపాల్‌

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు

Read more