అభివృద్ధి ముప్పులో నికోబార్!

ABN , First Publish Date - 2022-12-10T01:41:41+05:30 IST

ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి మాటలు పాలకులనోటినుంచి వినబడినప్పుడల్లా, ఆ పేరిట ఎంతమంది బతుకులు నాశనమవుతాయోనని భయం వేస్తూంటుంది.

అభివృద్ధి ముప్పులో నికోబార్!

ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి మాటలు పాలకులనోటినుంచి వినబడినప్పుడల్లా, ఆ పేరిట ఎంతమంది బతుకులు నాశనమవుతాయోనని భయం వేస్తూంటుంది. అభివృద్ధిపేరిట దేశ నడిభాగంలోని అన్ని సహజవనరులూ దోపిడీకి గురవుతూంటే, అంచుల్లో ఉన్న కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలైనా పర్యావరణపరంగా భద్రంగా ఉన్నాయన్న భ్రమను కేంద్రం బద్దలుకొడుతోంది. ‘ది గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు’లో భాగంగా ఆ అద్భుతమైన ద్వీపం తీవ్ర విధ్వంసాన్ని చవిచూడబోతున్నది. ఈ డెబ్భయ్ ఐదువేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో, ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ షిప్ మెంట్ టెర్మినల్ (ఐసిటీటీ), ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఒక భారీ టౌన్ షిప్, ఒక నాలుగువందల యాభై మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో, ఇప్పటివరకూ పెద్దగా స్పృశించని, జీవవైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన ఈ ద్వీపసమూహం తన స్వరూపస్వభావాలను కోల్పోబోతున్నది.

కేంద్రపాలిత ప్రాంతాల్లో అభివృద్ధిపేరిట బడాపారిశ్రామికవేత్తలకు బాటలువేసే బృహత్తర కార్యక్రమం కోసం, దశాబ్దాలుగా అమలులో ఉన్న నిబంధనలను మార్చివేసే పని మూడేళ్ళుగా అతివేగంగా జరుగుతోంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రం చేతుల్లోకి నేరుగా వచ్చిన తరువాత అది స్పష్టంగా కనిపిస్తున్నది కూడా. లక్షద్వీప్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ విషయంలోనూ అభివృద్ధి మరింత వేగవంతం చేయాలన్నది కేంద్రప్రభుత్వం సంకల్పం. కేంద్రపాలిత ప్రాంతాలమధ్య పోటీతత్వాన్ని పెంచి, వాటిని అభివృద్ధి చేయడం ఎలా? అంటూ నీతి ఆయోగ్ కేంద్రానికి ఈ విషయంలో పలు ప్రతిపాదనలతో మార్గదర్శనం చేస్తున్నది. నికోబార్ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 166 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆయా అవసరాలకు బదిలీ అవుతుంది. అందులో 80శాతం అరుదైన జీవకోటికి ఆవాసమైన హరితారణ్యమే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు దారులు పరచడంలో భాగంగా ఆదివాసీ రిజర్వుప్రాంతాలు, అభయారణ్యాల పరిధిని తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాజెక్టు నేరుగా అక్కడి అతిపురాతన స్థానిక ఆదివాసీల ఉనికినే దెబ్బతీయబోతున్నది. కొద్ది వందల సంఖ్యలో ఉండే షోంపెన్ వంటి అరుదైన తెగలు మనుగడ ముప్పును ప్రత్యక్షంగా ఎదుర్కోబోతున్నాయి.

దేశప్రయోజనాలు, అభివృద్ధి పేరిట చేపట్టే భారీ ప్రాజెక్టులకోసం భూములు స్వాధీనపరుచుకుంటున్నప్పుడు నిర్వాసితులకు ప్రభుత్వాలు చాలా హామీలు ఇస్తాయి. ఇక్కడ కూడా నిర్వాసిత్వం ఎదుర్కొంటున్న స్థానికులకు హామీలు దక్కాయి కానీ, న్యాయమే జరగలేదు. పర్యావరణ పరంగా జరుగుతున్న విధ్వంసం మరింత తీవ్రమైనది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్న ‘అండమాన్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఇందుకు మార్గాంతరం సూచించింది. ఎనిమిది లక్షల అతిపురాతన వృక్షాలను నరికేసి, వందల చదరపు కిలోమీటర్ల భూభాగం రూపురేఖలు మార్చివేస్తున్నందుకు ప్రత్యామ్నాయంగా అటవీయేతర భూముల్లో చెట్లు పెంచితే సరిపోతుందని అది సలహా ఇచ్చింది. దీనితో నికోబార్ కు రెండున్నరవేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలో ప్రధానంగానూ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ పచ్చదనాన్ని పరిస్తే సరిపోతుందని కేంద్రం నిర్ణయించింది. ప్రకృతిపరమైన అనుకూలతలు లేనిదే అడవులు పెరగవన్నమాట అటుంచితే, అటవీయేతర భూములను సంపాదించడం ఎంత కష్టమో తెలిసిందే. ఒకపక్క వందలేళ్ళుగా ఒక చల్లని పందిరిమాదిరిగా ఈ దీవులను కప్పేసిన విభిన్నరకాల, విలక్షణమైన అడవులను నాశనం చేస్తూ, దానికి సుదూరంగా మరోచోట విత్తులు వేస్తామని చెప్పడంలోనే డొల్లతనం ఉంది. ఒకచోట నాశనం చేసిన పచ్చదనాన్ని దేశంలో ఎక్కడైనా భర్తీచేయవచ్చునని నిబంధనల్లో రాసుకోవచ్చును కానీ, దాదాపు ఆరువందలయాభై రకాల అరుదైన వృక్షసంపదకూ, మూడువందల ముప్పైరకాల జంతుజాలానికీ జరిగే నష్టాన్ని పూడ్చడం సాధ్యమేనా? యునెస్కో గుర్తింపులు, పర్యావరణ వేత్తల ఆందోళనలు, హితవులు, ఉపసంహరణ అభ్యర్థనలు ఏమాత్రం పట్టని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో మొండిగా ముందుకు సాగుతోంది. సునామీ కూడా ఏమీ చేయలేని, వేలాది సంవత్సరాలుగా ఎవరూ స్పృశించని ద్వీపాలను అభివృద్ధిపేరిట అస్మదీయ పారిశ్రామికవేత్తలకు అప్పగించే పని వేగంగా జరుగుతోంది.

Updated Date - 2022-12-10T01:41:43+05:30 IST