న్యాయ నియామకాలకు కొత్త చట్టం

ABN , First Publish Date - 2022-12-03T00:59:19+05:30 IST

భారత రాజ్యంగ అధికరణలు 124(2), 217(1)కు వివరణ ఇవ్వడంలో సుప్రీంకోర్టు, కార్యనిర్వాహక వర్గం మధ్య విభేదాలు ఉన్నాయి (అవి తీవ్రమైనవని అనేందుకు నేను సంకోచిస్తున్నాను)...

న్యాయ నియామకాలకు కొత్త చట్టం

భారత రాజ్యంగ అధికరణలు 124(2), 217(1)కు వివరణ ఇవ్వడంలో సుప్రీంకోర్టు, కార్యనిర్వాహక వర్గం మధ్య విభేదాలు ఉన్నాయి (అవి తీవ్రమైనవని అనేందుకు నేను సంకోచిస్తున్నాను). రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఉన్నతస్థాయి న్యాయనియామకాలు జరిపే అధికారం పూర్తిగా కార్యనిర్వాహక వర్గానిదే. సుప్రీంకోర్టు, సంబంధిత హైకోర్టును సంప్రదించి కార్యనిర్వాహక వర్గం ఆ ఉన్నత స్థాయి న్యాయ నియామకాలను జరపాలని రాజ్యాంగం నిర్దేశించింది. స్వాతంత్ర్యానంతరం నలభై సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి, సంభావ్య న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అధికరణ 217 నిర్దేశం ప్రకారం కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తుంది. అదే విధంగా సంభావ్య న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించి, అధికరణ 124 నిర్దేశించిన రీతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తుంది.

దశాబ్దాల పాటు అమలులో ఉన్న ఈ న్యాయ నియామకాల పద్ధతి, సెకండ్ జడ్జెస్ కేస్ (1993), థర్డ్ జడ్జెస్ కేస్ (1998) తీర్పులతో రద్దయిపోయింది. కొలీజియం అనే ఒక నియామక వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే అధికారాన్ని కొలీజియం చేపట్టింది. కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు లేదా వెనక్కి పంపించవచ్చు. వెనక్కి పంపిన సిఫారసును కొలీజియం మళ్లీ పంపితే కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించి, నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. కొలీజియం విధానంలో నియమితులయిన న్యాయమూర్తుల నాణ్యత, మొదటి నలభై సంవత్సరాలలో నియమితులయిన న్యాయమూర్తుల నాణ్యత కంటే ఉత్కృష్ట మైనదని చెప్పడానికి ఆస్కారం లేదు. ధర్మమూర్తులుగా గౌరవించదగ్గ న్యాయమూర్తులు ఎందరో నియమితులయ్యారు. అలాగే న్యాయపాలనలో అధర్మానికి పాల్పడిన వారిని ఎంపిక చేసి నియమించడం జరిగింది.

1993 నుంచి అధికారంలో ఉన్న ప్రతీ ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి న్యాయ నియామకాల పద్ధతిలో మార్పులను వ్యతిరేకించింది. అయితే నియామకాలను నిలిపివేయడమనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఒక పరిపాటి అయింది. అలాగే కొలీజియం మళ్లీ పంపిన సిఫారసులను కూడా ఆమోదించకపోవడం తరచూ జరుగుతోంది. ఇది, సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి పూర్తిగా విరుద్ధమైనదని ఇద్దరు గౌరవనీయ న్యాయమూర్తులు స్పష్టం చేయడం గమనార్హం. కొలీజియం సిఫారసులను ప్రభుత్వం త్వరితగతిన ఆమోదించకపోవడం వల్లే సుప్రీంకోర్టులో ఏడు న్యాయమూర్తి పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హైకోర్టులకు మొత్తంగా మంజూరు చేసిన 1108 జడ్జి పోస్టులలో (2022 జూలై 1 నాటికి) 381 ఖాళీగా ఉన్నాయి. మరింత శోచనీయమైన విషయమేమిటంటే ప్రతిభావంతులైన న్యాయమూర్తులు న్యాయమూర్తి పదవిని స్వీకరించేందుకు విముఖత చూపడం. సంభావ్య న్యాయమూర్తిగా తమ పేరును ప్రతిపాదించిన తరువాత నెలల తరబడి ఎటువంటి నిర్ణయం వెలువడని కారణంగా తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్న న్యాయవాదులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.

న్యాయమూర్తుల నియామకాల్లో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి సమాన ప్రాధాన్యమిచ్చేందుకు పార్లమెంటు చేసిన ఒక చట్టం కింద ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ (ఎన్జెఎసి) సృష్టించారు. చట్టంలో కొన్ని చిక్కులు లేకపోలేదు. అయితే వాటిని తేలిగ్గా తొలగించేందుకు అవకాశమున్నది. అయినా న్యాయవ్యవస్థగానీ, కార్యనిర్వాహక వర్గం గానీ ఆ విషయమై తగు శ్రద్ధ చూపలేదు. 2015 అక్టోబర్ 16న ‘రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014’ని కొట్టివేసింది. దానితో పాటు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కూడా ముగిసిపోయింది (జస్టిస్ చలమేశ్వర్ మైనారిటీ తీర్పు మెజారిటీ తీర్పు అంత ముఖ్యమైనదే). 2015 నవంబర్ 1న ఒక జాతీయ దినపత్రికలో నేను రాసిన ‘ది ఎన్జెఎసి కోనన్ డ్రమ్’ అన్న వ్యాసంలో సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పును తీవ్రంగా విమర్శించాను. అయితే కొత్త చట్టానికి ఒక ఉమ్మడి ప్రాతిపదికను సూచించాను.

న్యాయమూర్తులే కొత్త న్యాయమూర్తులను నియమించే ఆనవాయితీ ఏ దేశంలోనూ లేదన్నది న్యాయనియామకాలలో కార్యనిర్వాహక వర్గానికి పూర్తి అధికారముండాలనే వారి వాదన. సర్వీస్లో ఉన్న న్యాయమూర్తులు మాత్రమే ప్రాక్టీసింగ్ లాయర్లు, సర్వీస్లో ఉన్న జిల్లా జడ్జీల నుంచి సంభావ్య న్యాయమూర్తులుగా అర్హులైన వారిని ఎంపిక చేయగలరనేది కొలీజియం విధానాన్ని సమర్థిస్తున్న వారి వాదన. ఉభయ వాదనలలోనూ సత్యమున్నది.

న్యాయ నియామకాల విషయమై ప్రతిష్టంభన కొనసాగితే పరిస్థితులు మరింతగా జటిలమవుతాయి. ఖాళీల సంఖ్య పెరిగిపోతుంది. పెరిగిన కొద్దీ వాటిని భర్తీచేయడం చాలా కష్టమవుతుంది. న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టేందుకు న్యాయవాదులు నిరాకరిస్తారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న న్యాయవ్యవస్థ కూలిపోతుంది. న్యాయపాలన అసాధ్యమైపోతుంది. ఇటువంటి పరిస్థితికి విచారించేవారు న్యాయమూర్తుల కంటే మరెవ్వరూ ఉండబోరు; సంతోషించేవారు కార్యనిర్వాహక వర్గం కంటే మరెవ్వరూ ఉండబోరు. నష్టపోయేది భారత ప్రజలే. ముఖ్యంగా న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించినవారే.

సంభావ్య న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని సంపూర్ణంగా మినహాయించకూడదని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుత పక్షపాత, కక్షపూరిత, మెజారిటీవాద రాజకీయాల ప్రాబల్యం దృష్ట్యా సంభావ్య న్యాయమూర్తుల ఎంపిక అధికారాన్ని ఒక్క కార్యనిర్వాహక వర్గానికే అప్పగించకూడదని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఎన్జెఎసి 2.0లో న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం రెండిటికీ సమాన ప్రాధాన్యముండాలి. న్యాయమూర్తి పదవులకు యోగ్యులైన అభ్యర్థులను ప్రతిపాదించే/ నామినేట్ చేసే అధికారం పూర్తిగా కొలీజియంకే ఉండాలని ఏడేళ్ల క్రితం రాసిన వ్యాసంలో సూచించాను; అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, సిఫారసు చేసే అధికారం ఎన్జెఎసికి ఉండాలి. న్యాయమూర్తులను నియమించే (బాధ్యతతో కూడిన) అధికారం కార్యనిర్వాహక వర్గానికి ఉండాలి. ఉన్నత స్థాయి న్యాయ నియామకాల బాధ్యతను జడ్జీలు కాని న్యాయకోవిదులకు అప్పగించిన పక్షంలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను మరింత మెరుగుపరచవచ్చు.

ఉన్నత న్యాయస్థానాలలో పెరుగుతోన్న న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య, సహజ వివేకమూ నిర్దేశిస్తున్నదేమిటి? న్యాయ నియామకాల సమస్యను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమూ సమున్నత రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలనే కాదూ? రాజనీతిజ్ఞత కొరవడినప్పుడు కఠిన మాటలు కర్కశ మాటలకు కారణమవుతాయి; మనస్తాపాలు పెరిగిపోతాయి; మనస్సుకు తగిలిన గాయాలు బాధిస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగడం వల్ల జరిగేదేమిటి? న్యాయం నష్టపోతుంది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-12-03T00:59:23+05:30 IST