నాటోవల్లే ఉక్రెయిన్‌ ఉపద్రవం

ABN , First Publish Date - 2022-03-04T06:42:56+05:30 IST

ప్రపంచం అణుయుద్ధం అంచుల్లోకి చేరింది. యుద్ధాన్ని నివారించి, శాంతిని కాపాడేందుకు గొంతు విప్పవలసిన తరుణం ఆసన్నమైంది...

నాటోవల్లే ఉక్రెయిన్‌ ఉపద్రవం

ప్రపంచం అణుయుద్ధం అంచుల్లోకి చేరింది. యుద్ధాన్ని నివారించి, శాంతిని కాపాడేందుకు గొంతు విప్పవలసిన తరుణం ఆసన్నమైంది. నాటో అవతరణ నాడున్న పరిస్థితులకు నేడు కాలం చెల్లింది అని మేము భావిస్తున్నాం. అసలేనాడయినా, ఎక్కడయినా నాటో ఉనికికి సమర్థింపు ఉన్నదా అనే విషయంలోకి మేము ప్రస్తుతం పోదలచలేదు. నాటో కూటమిని విస్తరించబోమని పలుమార్లు ప్రకటించి పలుమార్లు ఉల్లంఘించబడింది. ఐక్యరాజ్యసమితి కనుసన్నలలోనే పలు డొంకతిరుగుడు వాదనలు పెట్టబడ్డాయి. ప్రత్యర్థులలో ఇది తీవ్రమైన అవిశ్వాసాన్నీ, అభద్రతా భావాన్ని పురికొల్పింది.


అంతర్జాతీయ నీతిని, సహజ న్యాయసూత్రాలను నాటో మొత్తంగాను, అందులోని భాగస్వామి పక్షాలు విడివిడిగాను చెరపడుతుంటే ఐక్యరాజ్యసమితి ధృతరాష్ట్రుని పాత్ర వహించింది. మానవ జాతి చరిత్రలో ఎన్నడూ లేనంత మారణకాండ, రక్తపాతం రెండో ప్రపంచయుద్ధం తర్వాత నాటో కూటమి చేయించింది.


ఇప్పటికీ ప్రపంచంలో అనేక సమస్యలు నానబెట్టబడుతున్నాయి. తైవాన్ సమస్య అందులో ఒకటి గానీ, అదొక్కటే మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో, ప్రపంచ శాంతిని కాపాడడం కోసం నాటో ఉనికి చట్టవిరుద్ధం అని తక్షణమే ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అణు యుద్ధాన్ని నివారించడానికి అణ్వస్త్రాలను నిషేధించవలసిందిగా, అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశాలన్నీ మానవ నాగరికతకు శత్రువులుగా ప్రకటించ వలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.

ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం 

Updated Date - 2022-03-04T06:42:56+05:30 IST