మోయతుమ్మెద

ABN , First Publish Date - 2022-10-03T05:46:13+05:30 IST

ఉత్తెర్ల వానలు ఉర్మీ ఉర్మీ కొడుతుంటే తాసుపామై వురుకుతుంది తాటి వనాల నడ్మల వాగు ఎందుకు? అలా! ఒంటరిగా...

మోయతుమ్మెద

ఉత్తెర్ల వానలు ఉర్మీ ఉర్మీ

కొడుతుంటే 

తాసుపామై వురుకుతుంది తాటి వనాల నడ్మల వాగు

ఎందుకు? అలా! ఒంటరిగా

దుఃఖిస్తున్నావు

రా! నాతో జలచలనం చెయ్యమంది వాగు


అక్షరాల భగభగమండుతున్న

బాలసూర్యున్ని

తన సంకకెత్తుకుంది చేతులు సాపి

యిష్టంగా ఈదడం నేర్పింది!

అలల పైన 

హోరున పరిగెత్తడం నేర్పింది! సాగిపొమ్మని


ఎంత పిచ్చిది వాగు!

అచ్చం మా అవ్వోల్నే

కండ్లు తెరిచి ప్రవహిస్తున్న నీటిబుడగద్దాలలో 

                        నిండా నా రూపమే 

మేఘాలు తుంపర్లు తుంపర్లుగ 

                   జలాక్షింతలు జల్లుతుంటే

ధరిత్రి మీద పాలధారై పారుతుంది స్వచ్ఛంగా 

                      పాడితే పాటల ఝరీ!

                       ఆడితే ఆటల కచేరి!!

అణిగిమణిగి హద్దులుంటేనే

కల్పవల్లి! 

ఉగ్రరూపం దాల్చిందా! 

పంటల్ని నీటిజడలతో ముంచే 

        ల్యాగెల మైసవ్వతల్లి

సదివితే విజ్ఞానశాస్త్రశాల!

చైతన్యాల నీటిధార!!

పండుతాటిసెట్ల పట్వల్ల కెక్కి

వూరించే సల్లని ఈత కల్లు నీరా

ఊట సెల్మై వూరింది గంగ


ఆదొండ మాదొండ మొదల్లను ఆత్మతో స్పర్శించి

బోడగాకరకాయతీగ బోదెల్ల పారి

ఎల్లేరు పుల్లేరుగడ్డల ఉడుగుపాదుల మడుగుల్ల జేరి

తుంగలు మంగలు తుంపలు రేణుకంపలు 

         గరకగడ్డి పొర్కలు శిబ్బితీగలు మర్రిఊడలు 

                     తిప్పతీగలు తప్పకుంట తడిపి

నర్రెంగసెట్లతో నాట్యమాడి కట్లతీగలతోని పొట్లాడుకుంట

తంగేడుసెట్ల తలపెయ్యి కడిగి

తామెర పువ్వై తళతళా మెరిసింది

వొర్రెలు మిర్రలు సాకలిపొయ్యిలు మంచినీళ్ల తావులు

బండలను కొండలను గుండెలకత్తుకోనీ

చెక్‌ డ్యాముల చంద్రవంకాయ నిండి

పెద్దమత్తడిమీదికేలి

ప్రేమతో దుంకి పశుపక్ష్యాదులకు జీవనాధారమైంది వాగు


పరక పిల్లలకు ప్రాణ ప్రాణమై

జెల్ల పిల్లలకు జీవునమైంది

బొచ్చెచేపల బొత్తన శెన కట్టి

ఎండ్రికిచ్చలతోటి ఎత్తింది నీటి జెండా

కుర్రమట్టల మీసాలు దువ్వి

పాపడ ఉల్ష్షై పసిడి ఉశికె మీద పరుగందుకుంట

రవ్వుల కసికెలా

గవ్వల మువ్వల రాగమై

కొంరెల్లీ మల్లన్న బెక్కంటి రామలింగన్న బసపురం ఎల్లమ్మ 

             పంచముఖ సోమన్న ప్రతాప లక్ష్మీనరసింహ

                                       పాదాలు కడిగి

సన్యాసి మఠాలను సాపు జేసి

నీరుకట్టే జేరిగొడ్డు వానకోకిల బొండిగెల దూరి దూప తీర్చి

తాబేల్లకు మొసళ్ళకు తల్లై పురుడు పోసి

కప్పతల్లులకు కాన్పుజేసింది

కొంగలకు గద్దలకు కడుపునిండా దావతిచ్చి 

     బుడుబుంగై ఉశికల అంతర్థానమైంది

బుసకొట్టె పాముల్నె

మెసలుదీసుకుంట

నీటిపట్టుమీది మోయతుమ్మెదై

తియ్యటి సంగీతస్వరాలు పలికేటి వాగు

తడి తడి పోరాటాల సారిణి

నా అంతర్వాహిని

కొండపాక గిరాయిపల్లి మద్దిల నడుమ 

      మేకల బండ సింగరయ్య లొద్ది మానేరునదై 

        ఎలగందులకోట మీదికి ఎక్కిన పౌరుషమా

పువ్వు పువ్వులే ఉండే నీ పురా జ్ఞాపకాలు 

              పుండు పుండు అయినవి

ఎన్నీల కురువంగో వలలో! వాగు పారంగో వలలో!!

దండు కదులంగో వలలో!

దండులో మనమిద్దరం వలలో!!

ముందు నడువంగో వలలో!

జ(న)ల గానం చేద్దాం...!!

పొన్నాల బాలయ్య

99089 06245


Read more