పిల్లల భవిష్యత్ కు మొబైల్ ఉరి

ABN , First Publish Date - 2022-12-04T00:04:54+05:30 IST

‘ఈవిశ్వానికి, పిల్లలు అత్యంత విలువైన ఖని లాంటివారు, వారే జాతికి నికార్సయిన ఆశ’ అంటాడు జాన్ ఎఫ్ కెన్నడీ. ఆ మాట అక్షర సత్యం. పేద, గొప్ప తేడా లేకుండా అన్నిరకాల కుటుంబాల్లోనూ పిల్లలపై తల్లిదండ్రులు...

పిల్లల భవిష్యత్ కు మొబైల్ ఉరి

‘ఈవిశ్వానికి, పిల్లలు అత్యంత విలువైన ఖని లాంటివారు, వారే జాతికి నికార్సయిన ఆశ’ అంటాడు జాన్ ఎఫ్ కెన్నడీ. ఆ మాట అక్షర సత్యం. పేద, గొప్ప తేడా లేకుండా అన్నిరకాల కుటుంబాల్లోనూ పిల్లలపై తల్లిదండ్రులు చాలానే ఆశలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. పిల్లల్ని బతికించుకుంటూ ఉంటుంటారు. పిల్లల బాగోగులకు తమ సమయాన్ని, శ్రమను, బాంధవ్యాలను, శాంతి –సౌఖ్యాలను, దాదాపు పూర్తి జీవితాల్ని త్యాగం చేస్తూ పిల్లల్ని మంచి పౌరులుగా చేయటానికి ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు పాటు పడుతూ ఉంటారు. మంచి చదువుల కోసం మంచి స్కూళ్ళలో, కాలేజీల్లో సీట్లకోసం నానాతిప్పలు పడి అప్పోసొప్పో చేసి పిల్లల్ని గట్టెక్కించాలని తపనపడుతున్న కుటుంబాలు ఎన్నో.

తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తూ గాడి తప్పని జీవితాల్లోకి పిల్లలు ప్రయాణించినట్లయితే, కథ సుఖాంతమే. కానీ మారుతున్న ఈ ఆండ్రాయిడ్ మొబైల్ కాలంలో, పిల్లల జీవితాలు ఉహించలేనంతగా వ్యతిరేకదిశలో ప్రభావితమౌతున్నాయి! కొవిడ్ కాలంలో, ఆన్లైన్ క్లాసులు తప్పనిసరైన పిల్లల జీవితాల్లో మొబైల్ పెనుభూతం అయి కూర్చుంది. దానిస్నేహం అనివార్యమయింది. ఈ రోజుల్లో, చదువులో ముందుకు పోవాలంటే డిజిటల్ మీడియా టెక్నిక్స్పై అవగాహన లేకుండా ముందుకెళ్లే అవకాశమే లేదు. ఇలాంటి క్లిష్ట సమస్యలో ఇరుక్కుపోయి ఉన్న పిల్లల్ని, మొబైల్ అడిక్షన్ బారిన పడకుండా, నేరస్థులుగా మారకుండా కాపాడుకోగలమా?

మొబైల్లో పబ్జి లాంటి గేమ్స్కి అడిక్ట్ అయిన పిల్లలు కొందరైతే, పూర్తిగా అశ్లీల చిత్రాలు చూస్తూ, నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవారు మరికొందరు. ఆ విధమైన ‘జ్ఞానాన్ని’ తమతమ జీవితాలకు అన్వయించుకుంటూ, పరిపక్వతలేని ప్రేమలు పెళ్లిళ్ళ కోసం పారిపోవటం ఒక రకమైతే, అడ్డొస్తున్న తల్లి–నీ తండ్రినీ ఎదుర్కోడానికి అప్పటికే వారి మధ్య ఉన్న చిన్నపాటి దూరాల్ని మరింత పెద్దవి చేయటమో, తగవులు పెట్టి దూరం అయ్యేలా చేయటమో జరుగుతోంది. అదీ అయిపోయాక తమపై ఆధారపడే తల్లినో తండ్రినో ఆసరాగా పెట్టుకుని అటునుండి మొబైల్తో తమ స్నేహాన్ని మరింత గట్టిపర్చుకుంటున్నారు కౌమార దశకు చేరిన పిల్లలు.

హైదరాబాద్ పరిసరాల్లోని ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిపై, ఐదుగురు క్లాస్మేట్లు అత్యాచారం చేసి, మొబైల్తో వీడియో తీసి, ఆ వీడియోను ఇంకొంతమంది పిల్లలకు మొబైల్లోనే వాట్సాప్ చేశారు. బాధితురాలితో సహా, ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ బాగా పేదరికంలో ఉన్నవాళ్లే. రోజు కూలీలుగానో, చిన్నపాటి నెలజీతాలతోనో బతుకుతున్న వాళ్ళే. ఇంతపేదవాళ్లకు మొబైల్ ఎందుకు?, ఆ మగపిల్లల చేతికి మొబైల్ ఎవరిచ్చారు’ లాంటి వెర్రిమొర్రి ప్రశ్నలను పక్కనపెడితే–కౌమార దశలోనే పిల్లల్ని రేపిస్ట్లుగా తయారు చేస్తున్న ఈ మొబైల్ స్కూలింగ్ను మనం ఏమన్నా అడ్డుకోవచ్చా? అనే ప్రశ్న వేసుకోవాలి.

‘మా సిమ్ తీసుకుంటే సంవత్సరం పాటు నెట్ ఫ్రీ’ అంటూ అనేక విధాలా దృష్టి మరల్చి, నెట్ మాయా ప్రపంచానికి పిల్లల్ని అలవాటు చేసి, నెట్కి కట్టు బానిసలుగా మార్చిపడేస్తున్నారు వ్యాపారులు. అందులోనుంచి దిగుమతి అవుతున్న అశ్లీల సైట్లను కేవలం పిల్లలో, వాళ్ల తల్లిదండ్రులో అడ్డుకోగలరా? వద్దన్నా కళ్ళముందు పదేపదే స్క్రీన్ పైన కనిపించే ఆ బొమ్మలని కావాలనో, వద్దనుకునో ఒక్కసారైనా క్లిక్ చేయకుండా కళ్ళు, చేతులూ ఊరుకుంటాయా? తండ్రికి పోర్న్ చూసే అలవాటు ఉంటే, అదే మొబైల్ను పిల్లలు వాడేప్పుడు, సహజంగానే అవే బొమ్మలు స్క్రీన్పై ప్రకటనల రూపంలో ప్రత్యక్షమౌతుంటాయి. ఒకసారి క్లిక్ చేస్తే మొబైల్ అల్గోరిథమ్స్ పదేపదే అవే బొమ్మలని చూపిస్తుందన్న విషయం ఎందరు తల్లిదండ్రులు/పిల్లలకి తెలుస్తుంది?

చదువులు చట్టుబండలు చేసుకుని, అశ్లీల చిత్రాలు చూస్తూ, నేరప్రవృతిని నూరిపోసే వీడియోలు చూడటానికి అలవాటు పడి, చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్పడం, రేపులు, మర్డర్లూ అవలీలగా చేసేయ్యడం, పర్యవసానాన్ని, జీవితాల్ని తేలిగ్గా తీసుకోవటం లాంటి పనులకు పాల్పడుతున్న కౌమార దశలోని పిల్లలను, యువతను పట్టించుకొని ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి.

స్కూళ్లలో టీచర్లు ఇప్పటికీ కౌమార దశ పిల్లలకు నీతి సూత్రాలు చెప్తూ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన సదస్సులు నిర్వహించడం దగ్గిరే ఆగిపోయారు. అదీ అవసరమే అయినప్పటికీ, అసలు విషయమేమంటే, ఇప్పటికే పిల్లలు వాళ్ళ మొబైల్ స్నేహంలో ఎన్నో మైళ్ళ దూరం ముందుకు వెళ్లిపోయారు. కొవిడ్ రోజుల్లో ప్రభుత్వాలు తెచ్చిన కంపల్సరీ ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు పిల్లల భవిష్యత్కు మొబైల్ ఉరి బిగించాయి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రవేశించినట్టు అందరికీ అర్థమౌతూనే ఉంది. కేవలం తల్లిదండ్రులు మాత్రమే వారి సమయాన్ని పిల్లలకు కేటాయించినంతమాత్రాన పరిష్కారమయ్యే సమస్య కాదని కూడా తేలిపోయింది. ప్రభుత్వాలు, విద్యావ్యవస్థ, పౌరసమాజం అందరూ ఆలోచించి పరిష్కారాలు వెతకాల్సిన తరుణం ఆసన్నమైంది.

ప్రభుత్వాలు ఆయా సెర్చ్ ఇంజిన్ల యాజమాన్యాలపై విచ్చలవిడి పోర్న్ ప్రసరణపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. నెట్లో వస్తున్న పోర్న్ సైట్స్ను పూర్తిగా నియంత్రించాలి. ప్రధానంగా కౌమారదశలోని బాలబాలికలకు లైఫ్ స్కిల్స్పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సివిల్ సొసైటీ భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి. పిల్లల్ని ఎక్కువ భాగం ప్రకృతికి సమీపంగా తీసుకెళ్లాలి. అడవితో లేదా పచ్చదనంతో, నీటితో లేదా జలపాతాలతో, భూమితో స్నేహాన్ని పెంచాలి. ప్రతి స్కూల్ ఆవరణలో మొక్కల పెంపకం, కిచెన్ గార్డెనింగ్ను పిల్లల భాగస్వామ్యంతో చేయించాలి. కొండలు గుట్టలు ఎక్కిస్తూ, ట్రెక్కింగ్ ప్రోత్సహించాలి. ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక రంగంలో ప్రవేశం కల్పిస్తూ సహాయపడాలి.

పిల్లలు అలసిపోయేలా ఆడుకునే వ్యవస్థే లేదిప్పుడు మన సమాజంలో. సమిష్టి శ్రేయస్సుకు ఉపయోగపడే ఆటస్థలాలు, చెరువులు, పార్కులు అన్నిటినీ హాంఫట్ చేస్తున్న రాజకీయ నాయకులు, కబ్జాకోరులు మన చుట్టూ ఉంటే, ఇక పిల్లలకు ఆడుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? తమ సమయాన్ని, బాల్యాన్ని– బిందాస్గా, ఆరోగ్యకరంగా గడిపే అవకాశం ఎక్కడుంటుంది? అందుకే, పోగొట్టుకున్నదాన్నంతా మొబైల్లోనే వెతుక్కుంటున్నారు! ఆ మొబైల్లో ఫ్రీ నెట్తో దొరికే పిచ్చెక్కించే సెక్స్ వీడియోలు తప్పించి మరేమీ ఆకర్షించడం లేదు వాళ్లని. ప్రభుత్వాలు స్కూళ్లకు ఇవాల్సినంతమంది టీచింగ్, –నాన్ టీచింగ్ స్టాఫ్ను ఇవ్వటం, కావాల్సినంత స్టేషనరీని అందుబాటులో ఉంచడం, నీటివసతితో కూడిన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావడం మొదలైన వాటిని మానేసి, ఏవేవో కొత్త నిబంధనలు తెచ్చి ఉన్న స్టాఫ్ను కూడా తగ్గిస్తున్నాయి. టీచర్లూ పిల్లలే తరగతి గది శుభ్రం చేసుకుంటూ, బాత్రూంలు ఎవరు శుభ్రం చేయాలని వాదులాడుకుంటూ, ఏరోజుకారోజు తక్కువ చాక్పీసుల వాడకంపై జాగ్రత్తలు పడుతూ చదువు చెప్పాల్సిన దౌర్భాగ్యానికి స్కూల్స్ని దిగజార్చడం ఏలిన వారికి శుభమేనా? పిల్లలు ఆడుకోడానికి కమ్యూనిటీ ఆటస్థలం, స్వచ్ఛమైన గాలి పీల్చడానికి పార్క్, అన్ని అవసరాలకు ఉపయోగపడే విశాలమైన మంచినీటి చెరువులను మన పిల్లలకోసం కబ్జాకోరల నుండి విడిపించలేవా ప్రభుత్వాలు?

సుమిత్ర (అంకురం)

Updated Date - 2022-12-04T00:09:42+05:30 IST

Read more