యూపీ తీర్పు తెచ్చే మార్పులు ఎన్నో!

ABN , First Publish Date - 2022-02-23T06:10:25+05:30 IST

ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు సైకిల్‌నే ఎందుకు ఉపయోగిస్తారు? ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేసిన ప్రశ్న అది. సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ ప్రశ్న...

యూపీ తీర్పు తెచ్చే మార్పులు ఎన్నో!

ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు సైకిల్‌నే ఎందుకు ఉపయోగిస్తారు? ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేసిన ప్రశ్న అది. సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ ప్రశ్న వేయడం, ఉగ్రవాదులకూ ఆ పార్టీకి సంబంధాలున్నాయని ఆరోపించడం యూపీలో ఎన్నికల ప్రచారం ఏ స్థాయికి వెళ్లిందో స్పష్టం చేస్తోంది. మోదీ వ్యాఖ్యలు సైకిల్ నడిపే సామాన్యుడిని అవమానించడమేనని సమాజ్‌వాది పార్టీ విమర్శించింది. ఆయన నిరాశా నిస్పృహలకు ఆ వ్యాఖ్యలు సంకేతమని కూడా విశ్లేషణలు వచ్చాయి.


ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మూడు దశల ఎన్నికల్లో గాలి ఎటు వైపు వీస్తుందనే విషయంలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మూడు దశల్లోనూ సమాజ్ వాది పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని, ఇప్పటికే 80–90 సీట్ల వరకు ఆ పార్టీ గెలుచుకునే అవకాశాలున్నాయని స్థానిక పాత్రికేయవర్గాలు అంటున్నాయి. అయితే బుధవారం ప్రారంభమయ్యే నాలుగో దశ నుంచీ బిజెపి పుంజుకుంటుందని మిగతా దశల్లో బిజెపికే ఆధిక్యత ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కనబరిచిన ప్రభంజనాన్ని బిజెపి ఈ ఎన్నికల్లో ప్రదర్శించలేకపోవచ్చునని బిజెపి వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. బిజెపి గెలిచినా కొద్దిపాటి మెజారిటీతో మాత్రమే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. బిజెపి సంఖ్యాబలం 180 దాటితే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని విశ్లేషించేవారు కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించేందుకే మాయావతి తన పార్టీని రంగంలోకి దించారని ఒక సీనియర్ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. చివరకు ఫలితాలు ఏ విధంగా ఉన్నా, బిజెపి -ఎస్‌పి మధ్య ముఖాముఖి పోటీ చాలా రసవత్తరంగా మారింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో యోగీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉంటే, రైతాంగం తీవ్ర అసంతృప్తి ప్రదర్శిస్తే, లఖీంపూర్ ఖేరీ వంటి ఘటనలు ప్రభావం చూపిస్తే, వెనుకబడిన వర్గాలు, దళితులతో పాటు జాట్‌లు సంఘటితమైతే ఈ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ ప్రభంజనం వీచి తీరుతుంది. అఖిలేశ్ యాదవ్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నప్పటికీ ఎస్‌పి అఖండమైన మెజారిటీతో గెలుస్తుందని ఎవరూ ఇంతవరకూ చెప్పే సాహసం చేయలేదు. అదేసమయంలో బిజెపి గతంలోలాగా బ్రహ్మాండమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేకపోతున్నారు.


ప్రజలు మౌనంగా తమ మనసులో మాటను దాచుకున్నప్పుడు ప్రధానంగా ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల రాజకీయ విశ్లేషకులకే కాక, రాజకీయ పార్టీల అధినేతలకు కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రత్యర్థిపై రాజకీయాస్త్రాలు సంధించేటప్పుడు హుందాతనం కాని, హోదా కానీ, నిజమైన సమస్యలు కానీ గుర్తు రావు. మోదీ ఉగ్రవాదం, హిందూత్వ గురించి మాట్లాడితే యోగీ ఆదిత్యనాథ్ ఖబరిస్తాన్ నుంచి ప్రతిపక్షాలు ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. అగ్రనేతల దారిలో బిజెపి అభ్యర్థులు, వారి తరఫున ప్రచారం చేస్తున్న ఇతర నేతలు కూడా మతపరమైన భాషను ఉపయోగిస్తున్నారు. ఇది దేనికి సంకేతం?


గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో యోగీ ఆదిత్యనాథ్ సమర్థపాలనను నరేంద్ర మోదీ, అమిత్ షాలు అదే పనిగా ప్రశంసిస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. యోగీ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అమిత్ షా తాజాగా ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకప్పుడు యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని యోచించిన నేతలే ఇప్పుడు యోగీ నాయకత్వాన్ని బహుదా ప్రశంసించేందుకు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఇది దేనికి సంకేతం? గతంలో కంటే తక్కువ మెజారిటీ వచ్చినా, లేక అధికారంలోకి రాలేకపోయినా అందుకు బాధ్యత యోగీపైనే మోపడానికి వారు రంగం సిద్ధం చేస్తున్నారా? తక్కువ మెజారిటీ వస్తే యోగీ బదులు మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని యోచిస్తున్నారా? యోగీ సంతృప్తికరమైన మెజారిటీతో గెలిస్తే ఆయన కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయ నేత అవుతారని భావిస్తున్నారా?


యూపీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ సమీకరణాలనే కాదు, బిజెపిలో రాజకీయ సమీకరణాలను కూడా మారుస్తాయనడంలో సందేహం లేదు. పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపైన మాత్రమే కాదు, ప్రతిపక్షాల వ్యూహరచనపై కూడా ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. అంతేకాదు, భారత రాజకీయాలపై దక్షిణాది ప్రభావం చూపే అవకాశాలు కూడా పెరగక తప్పదు. రాజీవ్ గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కేవలం సోనియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలు, ఒడిషాకు చెందిన మెజారిటీ ఎంపిలు పీవీకి మద్దతు నీయడం, అందుకు తోడుగా బెంగాల్, కేరళ ముందుకు రావడం, చివరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా రాజీకి సిద్ధపడడం కారణమని అప్పటి రాజకీయాలు నిశితంగా అధ్యయనం చేసిన వారికి అర్థం అవుతుంది. అబ్దుల్ కలామ్, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతులుగా ఎంపికైనప్పుడు కూడా ఉత్తర-–దక్షిణ సమీకరణాలు కీలకపాత్ర పోషించాయి.


ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దామని, నేరచరితుల ఆటకట్టించామని యోగీ ప్రభుత్వం ప్రధానంగా ప్రచారం చేసుకుంటోంది. నాల్గవ దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో లఖీంపూర్ ఖేరీ, ఉన్నావ్ నియోజకవర్గాలు ఉన్నాయి. లఖీంపూర్ ఖేరీలో రైతులపై వాహనం నడిపించిన కేసులో ముద్దాయి అయిన కేంద్ర మంత్రి కుమారుడు ఏ పార్టీకి చెందిన వారు? ఎన్నికల సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని యోగీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదు? ఆయనకు కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని లఖీంపూర్ ఖేరీలో హతుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాయి? ఉన్నావ్‌లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపిన కుల్దీప్, ఆమె తండ్రిపై పోలీసు కస్టడీలోనే హత్య చేసిన అతడి సోదరుడు ఏ పార్టీకి చెందిన వారు? విచిత్రమేమంటే నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వడంలో ఏ పార్టీ వెనుకాడలేదని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించిన అభ్యర్థుల రికార్డులను పరిశీలించి స్పష్టం చేసింది. ప్రతి దశలోనూ 20 నుంచి 25 శాతం వరకు నేరచరితులకు టిక్కెట్లు ఇస్తున్నారని తేల్చింది. ఉదాహరణకు నాల్గోదశలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థుల్లో 40 శాతం మంది నేరచరితులే. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బిజెపితో సహా అన్ని పార్టీలు విస్మరించాయి. మా పార్టీలో ఎక్కువ మంది అభ్యర్థులు నేరచరితులే అని బిజెపి సీనియర్ నేత ఒకరు చెప్పారు.


ఈ నేపథ్యంలో మన లోక్‌సభలో సగం మంది ఎంపీలు నేరచరితులేనని సింగపూర్ ప్రధానమంత్రి లీసిన్ లుంగ్ వ్యాఖ్యానించడంలో తప్పేముంది? సింగపూర్ ప్రతిపక్ష ఎంపీలపై వచ్చిన ఆరోపణలపై సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆ దేశ పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల్లో పరిస్థితులకంటే సింగపూర్‌లో పరిస్థితులు ఎంత మెరుగో వివరించారు. తమ తొలినాటి నేతలు స్థాపించిన రాజకీయ వ్యవస్థలు ఇప్పుడు గుర్తుపట్టలేకుండా మారిపోయాయని, ఇజ్రాయిల్‌లో రెండేళ్లలో నాలుగు సార్వత్రక ఎన్నికలు జరిగినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారని, అక్కడ ఎందరో రాజకీయనేతలు, అధికారులు నేరాలకు పాల్పడి జైలుపాలయ్యారని పేర్కొన్నారు. అదే విధంగా నెహ్రూ కాలంలో భారతదేశం పాటించిన ప్రజాస్వామిక ఆదర్శాలకూ ఇప్పటికీ పొంతన లేదని అన్నారు. పైగా సగం మంది ఎంపీలపై క్రిమినల్ ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని, కొంతమంది అత్యాచారం, హత్యలవంటి నేరాలకు కూడా పాల్పడ్డారని ఆయన ఎత్తి చూపారు. బిజెపి నుంచి గెలిచిన ఎంపీల్లో 116 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2014తో పోలిస్తే లోక్‌సభలో నేరచరితుల సంఖ్య 26 శాతం పెరిగిందని ఏడీఆర్ కూడా గతంలోనే ప్రకటించింది. హేయమైన నేరాలకు పాల్పడిన వారి సంఖ్య 109 శాతం పెరిగిందని, హత్యానేరాలకు సంబంధించి 11 మంది, మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 19 మంది, కిడ్నాపింగ్ లకు సంబంధించి ఆరుగురు, విద్వేష ప్రసంగాలకు సంబంధించి 29 మందిపై కేసులు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. సహజంగా బిజెపి నుంచి ఎక్కువ మంది ఎంపీలు గెలిచినందువల్ల ఎక్కువ మంది నేరచరితులు ఆ పార్టీలో కూడా ఉంటారు.


మరి సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగ శాఖ నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? గతంలో రైతుల ఆందోళన గురించి కెనడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించినప్పుడు కూడా ఇలాంటి నిరసనే వ్యక్తం చేశారు. మన నేతలు కూడా ఇతర దేశాలలో కంటే మన దేశంలో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని చెప్పుకుంటూనే ఉంటారు. కొవిడ్ మరణాల గురించి ఇతర దేశాల పరిస్థితులతో పోల్చుకుంటూ మన నేతలు ప్రకటనలు చేశారు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం వల్ల దేశం దెబ్బతింటుంది అని సింగపూర్ ప్రధాని కూడా అన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం మతతత్వాన్ని, ఉగ్రవాదాన్నీ కూడా ఉపయోగించుకునే నేతల హ్రస్వదృష్టితో దేశం ఎప్పుడు, ఎలా బాగుపడుతుంది?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-02-23T06:10:25+05:30 IST