ఈ వెలుగుల భారతానికి బాపూ బాటలే కారణం!

ABN , First Publish Date - 2022-10-01T07:36:37+05:30 IST

ఈదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ- పాత్ర మరువలేనిది. స్వాతంత్రోద్యమంలో..

ఈ వెలుగుల భారతానికి బాపూ బాటలే కారణం!

ఈదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ- పాత్ర మరువలేనిది. స్వాతంత్రోద్యమంలో ఆయన అనుసరించిన అహింసా మార్గం యావత్తు ప్రపంచానికే ఆదర్శమయింది. అయన ఈ దేశ ప్రజలకు జాతిపిత అయ్యాడు, ప్రపంచవ్యాప్తంగా మహాత్ముడిగా ప్రఖ్యాతి గాంచాడు. మార్టిన్ లూథర్ కింగ్ నుండి బరాక్ ఒబామా వరకు, ఐన్‌స్టీన్ నుండి స్టీవ్ జాబ్స్ వరకు, నెల్సన్ మండేలా నుండి ఆంగ్‌సాంగ్ సూకీ వరకు ఎందరో మహానుభావులకు అయన స్ఫూర్తిప్రదాత. అయన పుట్టిన రోజును ప్రపంచ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందంటే అయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీ ఇరవయ్యో శతాబ్దపు అత్యంత మహోన్నత వ్యక్తి. దురదృష్టవశాత్తు అంతటి మహానుభావుడు ఆధునిక భారతంలో దూషణలకు గురవుతున్న పరిస్థితి. ఆయన్ని కాల్చి చంపిన గాడ్సే గొప్ప దేశ భక్తుడుగా కీర్తింపబడుతున్న దుస్థితి. ఎందుకీ వైపరీత్యం? ఏమైంది భారతదేశానికి? భారతీయులంతా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది.


స్వాతంత్ర్యానంతరం ఒక పక్క పాకిస్థాన్ పెద్దలు తమ దేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించుకుంటే, మరో పక్క మహాత్మాగాంధీ స్ఫూర్తితో భారతదేశం లౌకికరాజ్యంగా ఏర్పడింది. ఒకపక్క పాకిస్థాన్‌లో హిందువులకు నిలువ నీడలేకుండా పోతున్న తరుణంలో భారతదేశం మాత్రం ముస్లింలకు హిందువులతో సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రసాదించింది. ఇదీ మన ‘దేశభక్తుల’ దృష్టిలో మహాత్మాగాంధీ చేసిన నేరం. పాకిస్థాన్‌ను వాళ్ళు ఇస్లాం దేశంగా ప్రకటించుకున్నప్పుడు, మన దేశాన్ని మనం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించుకోలేకపోయాం? ముస్లింలను ఇక్కడ నుంచి తరిమివేయకుండా ఎందుకు సహనం, అహింస అంటూ మహాత్మాగాంధీ అడ్డుకున్నారు? అంటూ ఆయన్ని నిందిస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం రెండు దేశాల స్థితిగతులను కళ్లారా చూస్తూ కూడా మహాత్మునిపై విషం చిమ్మటం నిజంగా విచారకరం. మహాత్మునిపై మరింత గౌరవం, భక్తి పెరగాల్సిన తరుణంలో ఆయనపై ద్వేషం పెంచటం దురదృష్టకరం. భారతదేశం పాకిస్థాన్ రెండూ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. కానీ ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఎక్కడా పోలికలేదు. ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒకటి అగ్ర దేశాలకు దీటుగా అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే, మరోటి ఉగ్రవాద కోరల్లో చిక్కుకుని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకటి గగనతలంలోకి రాకెట్లు పంపిస్తుంటే, మరొకటి అధఃపాతాళంలో ఉండిపోయింది. ఎందుకు ఇంత తేడా?


ఎందుకంటే అవి అనుసరించిన మార్గాలు వేరు. ఒకటి తన మత ఛాందసవాదంతో ఊగిపోతూ ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయింది. మరోటి అన్ని మతాల వారిని అక్కున చేర్చుకుని సర్వ మానవ సౌభ్రాతృత్వం ప్రదర్శించింది. మహాత్మాగాంధీ నాటిన శాంతి, సహనం అనే బీజాలు మన దేశాన్ని గొప్ప ప్రజాస్వామిక దేశంగా, లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దాయి, మనల్ని అభివృద్ధి పథంలో నిలిపాయి. విద్వేషం, అసహనం అనే పునాదులతో ఏర్పడిన ఏ దేశం కూడా అభివృద్ధి పథంలో నడవలేదు. ఒక వర్గం లేదా జాతి పట్ల విద్వేషం, అసహనం కలిగి ఉండటం మన మానసిక దౌర్బల్యానికి సంకేతం. పాకిస్థాన్ నుండి హిందువులను లేదా భారత్ నుండి ముస్లింలను పారద్రోలినంత మాత్రాన మనుషుల్లోని అసహనం సమసి పోదు. అది వేరే రూపాల్లో సాగుతూనే ఉంటుంది. దానికి మందు ఓర్పు, సహనం.


దేశభక్తి, హిందూత్వం రెండూ ఒకటి కాదని హిందూత్వ వాదులు గుర్తించాలి. దేశభక్తికి భౌగోళిక సరిహద్దులు ఉంటాయి, అది కేవలం ఒక భూభాగం మీద అభిమానం. కానీ హిందూ సనాతన ధర్మం ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అని ప్రవచిస్తుంది. సర్వకాల సర్వావస్థలలో ఏది ధర్మమో, ఏది మనకు ఆచరణీయమో, ఏది మంచిదో చెప్తుంది. హిందూ ధర్మం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు సంబంధించింది. దానికి భౌగోళిక సరిహద్దులు, కాల పరిమితులు ఆపాదించడం ధర్మాన్ని కించపరచటమే. హిందుత్వాన్ని దేశభక్తికి ప్రతీకగా చిత్రీకరించడం ఈ దేశానికి మంచిది కాదు. హిందువులు నిజంగా భారతదేశాన్ని హిందూదేశంగా చూడాలనుకుంటే, ముందుగా వారు తమ ధర్మాన్ని తాము తెలుసుకుని ఆచరించాలి. ఆచరణలో హిందుత్వం లేకుండా కేవలం రాజ్యాంగంలో హిందూదేశంగా మార్చడం వలన ఈ దేశానికి నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.


మహాత్మాగాంధీ హిందూ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించాడు, ప్రపంచానికి మార్గదర్శి అయ్యాడు. ఆయన వల్లే హిందూ ధర్మానికి ఎక్కువ ఆదరణ, ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక విశ్వసనీయత, నిబద్ధత ఉన్న దేశంగా, శాంతికాముక దేశంగా ప్రత్యేక గుర్తింపు ఉందంటే అది మహాత్మాగాంధీ చూపిన బాటలో ఈ దేశం నడవటం వలనే. ప్రధాని మోదీ చరిష్మాకంటే మహాత్మాగాంధీ వేసిన పునాదులే యోగాను అంతర్జాతీయంగా నిలబెట్టాయి. కనుక మన ‘దేశభక్తులు’ మహాత్ముడిని నిందించడం మాని, అయన మార్గంలో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించాలి.


భారతందేశం ఇంకా చాలా రంగాల్లో ఎంతో వెనుకబడి ఉంది. కానీ ఆ వెనుకబాటుకు కారణం మహాత్ముని ప్రబోధాలు కాదు. సమాజంలో రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న స్వార్ధ చింతన, కుటిల రాజకీయాలే అందుకు కారణం. అధికారం కోసం రాజకీయ నాయకులు ఆడే రాక్షస క్రీడల్లో పావులు కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే భారతదేశం మరో పాకిస్థాన్, మరో ఆఫ్ఘానిస్తాన్, మరో శ్రీలంక అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా భారత ప్రజానీకం కళ్ళు తెరచి, మహాత్ముని సేవలను స్మరించుకుని, అయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. అప్పుడే భారతదేశం నిజంగా విశ్వగురువు అవుతుంది.


-డా. గోనుగుంట్ల శ్రీనివాసరావు

(రేపు మహాత్మాగాంధీ జయంతి)

Read more