సీమ అస్తిత్వ కేతనం

ABN , First Publish Date - 2022-09-12T05:52:04+05:30 IST

శాంతి నారాయణ చేస్తున్నది సాహితీ సృజన మాత్రమే అనుకుంటే పొరబాటే! ఆయన చేస్తున్నది వ్యవస్థతో పోరాటం. ఒక ఉద్యమం. ఆయన సాహిత్యాన్ని ఉద్యమ మాధ్యమంగా ఎంచుకున్నారు....

సీమ అస్తిత్వ కేతనం

శాంతి నారాయణ చేస్తున్నది సాహితీ సృజన మాత్రమే అనుకుంటే పొరబాటే! ఆయన చేస్తున్నది వ్యవస్థతో పోరాటం. ఒక ఉద్యమం. ఆయన సాహిత్యాన్ని ఉద్యమ మాధ్యమంగా ఎంచుకున్నారు. బుద్ధి వచ్చింది మొదలు బతుకంతా కష్టాలు కడగళ్లతోటి పోరాటం చేస్తూ చదువుకున్న శాంతి నారాయణకు బతుకు స్వారస్యం బాగా తెలుసు. వ్యసాయ కూలీ కుటుంబం నుండి పైకి ఎదిగివచ్చిన శాంతి నారాయణ అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఉప్పర సామాజిక వర్గంలో మొట్టమొదటి డాక్టరేటు పొందినవారు. 1970 నుండి 2004 వరకూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకునిగా విధులు నిర్వహించి చివరికి డిగ్రీ కాలేజి అధ్యాపకునిగా 2004లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన ఇప్పటివరకు తొమ్మిది కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు, రెండు నవలలు, ఒకే పుస్తకంగా నాలుగు నవలికలూ వెలువరించారు. ప్రశ్నించే జ్ఞాపకం పేరుతో ఆయన యాత్రావిశేషాలను పాఠకులకు అందించారు. స్వంతంగా ‘విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాసంస్థ’ను స్థాపించి, తెలుగు సాహిత్యంలో సగర్వంగా చెప్పుకోగల విమలాశాంతి సాహిత్య పురస్కారాలను ప్రతియేటా కవులకూ, కథా రచయితలకూ అందజేస్తున్నారు. 


శాంతి నారాయణ నవలల్లో ‘పెన్నేటి మలుపులు’ ఒక బృహత్తరమైన నవల. ఈ నవల గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పడి, అప్పటి ఏకధ్రువ రాజకీయాల్లోకి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలను సమగ్రంగా చిత్రించింది. తెలుగుదేశంలో వెలుగులు పరుచుకుంటున్న సంధికాలంలో బడుగు వర్గాలకు, భూస్వాములకు జరిగిన వాస్తవ ఘర్షణలను వర్ణించింది. అట్టడుగు వర్గాల ప్రజలు చైతన్యవంతులై ఆధిపత్య వర్గాలపై చేసిన పోరాటాన్ని, అంతిమంగా వాళ్ళు సాధించిన విజయాన్ని సాహసోపేతంగా కళ్ళకు కట్టింది. ఆధునిక వచనకవితాపితామహుడు కె. శివారెడ్డి ఈ నవలను ఒక ఇతిహాసం (ఎపిక్‌) లాంటి నవలగా పేర్కొన్నారు. దిన పత్రికలో కాలమ్‌గా వచ్చిన ‘నాగలకట్ట సుద్దులు’ రెండు భాగాల్లో శాంతి నారాయణ నాటి అనంతపురం జిల్లా జనజీవితాన్ని, కులాధిపత్య వ్యవస్థని, పెత్తందారీతనాన్ని, నాటి రాజకీయాలని, అవి ప్రజాజీవితాలను ప్రభావితం చేసిన వైనాన్నీ అనంతపురం యాసలో తనదైన శైలిలో వర్ణించారు. 


ఆయన ‘నాలుగు అస్తిత్వాలు - నాలుగు నవలికలు’ పుస్తకంలో పేరులో ఉన్నట్టే నాలుగు నవలికలు ఉన్నాయి. వాటిలో ‘వెట్టికి వెట్టి’ దళిత అస్తిత్వవాదంతోనూ, ‘కంచం మీద కట్టడి’ బహుజన అస్తిత్వవాదంతోనూ, ‘నూర్జహాన్‌’ మైనారిటీ స్త్రీవాదంతోనూ, ‘రక్షక తడులు’ రాయలసీమ అస్తిత్వవాదంతోనూ చేసిన రచనలు. వీటిలోని పాత్రలన్నీ సమకాలీన సమాజంలోని మానవులకు ప్రతినిధులు. శాంతి నారాయణ ఆయా పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసి, వాటి సంవేదనల్ని తాను అనుభవించి, వాటి మూలాన అనంతపురం జిల్లా సామాజిక స్థితిగతుల్ని, సీమవాసుల బతుకుపోరునీ ప్రభావవంతంగా చిత్రించారు.  


శాంతి నారాయణ గొప్పతనం ఎక్కడ ఉంది, అని చూస్తే- పక్కాఫ్యూడల్‌ స్వభావమున్న సమాజంలో అట్టడుగు వర్గాలకు చదువుకునే అవకాశం కలగడం కూడా చాలా కష్టతరం. ఒకవేళ ఎవరికో ఒక్కరికి అతికష్టం మీద చదువుకోవడానికి అవకాశం దక్కినా ఆ చదువంతటా ఫ్యూడలిస్టు వాసనలతో నిండిపోయి ఉంటుంది. అది పెత్తందారీ ఫ్రెండ్లీగా ఉంటుంది. శ్రమ దోపిడీకి బాటలు పరుస్తూ ఉంటుంది. అది పాము కప్పని మింగివెయ్యడం, కొంగ చేపపిల్లని స్వాహా చెయ్యడం, పులి మేకపిల్లని ఆరగించడం ప్రకృతిధర్మం అంటుంది. ఆ విద్యావిధానంలో నువ్వు చదువుకున్నా నీకు కళ్ళుండవు. నీ కళ్ళముందే జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని నువ్వు గుర్తించలేవు. అదంతా సహజమేనని అపోహ పడతావు. శ్రమించేవాళ్లు దరిద్రులుగానూ, పనిదొంగలు ధనవంతులుగానూ ఉండటం ఎలా సాధ్యమన్న ఆలోచనే నీకు రాదు. నువ్వు అదృష్టాన్ని అంగీకరిస్తావు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావు. అభ్యుదయ భావాలు నీ ఛాయాలకు కూడా రావు. నువ్వు చదువుకున్న చదువుతో నీ ప్రతిభంతా ఛందస్సులతో కుస్తీలు పట్టడానికీ, ప్రాసలతో పల్టీలు కొట్టడానికీ, పద్యాలతో గారడీలు చేయడానికే సరిపో తుంది. ఆ ఫ్యూడలిస్టు అశాస్త్రీయ సంప్రదాయంలో నుంచి బయటపడి అభ్యుదయ ప్రపంచంలోకి అడుగు పెట్టడం, శాస్త్రీయ భావజాలాన్ని, హేతువాద దృక్ప థాన్ని అలవరచుకోవడం అంత సులభంగా జరిగే పని కాదు. దానికి ఒక గురువో, ఒక పుస్తకమో, ఒక సంఘ టనో నీలో బీజం వెయ్యాలి. అలా ఫ్యూడలిస్టు ఊబిలో నుంచి బయటపడి అభ్యుదయ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అరుదైన వ్యక్తుల్లో శాంతి నారాయణ ఒక్కరు. 


శాంతి నారాయణ ప్రయాణం ఫ్యూడలిస్టు భావజా లంతో ప్రారంభమైంది. పద్యాలు రాసి అవధానాలు చేయడంతో సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన మెల్లగా సమాజంలోని కులవివక్షని, శ్రమ దోపిడీని గుర్తించాడు. ఆయన కళ్ళు విచ్చుకున్నాయి. కలం మరో మలుపు తీసుకుంది. బడుగు వర్గాల ప్రతినిధిగా మారి, వారి ప్రయోజనాలను కాపాడే సాహిత్య సృజనకు పూనుకున్నాడు. అందులో అమేయమైన విజయం సాధించాడు. 


ఆయన తన సాహిత్యం ద్వారా సమాజానికి తెలియని భూస్వాముల ఆగడాలను చూపించాడు. రాజకీయ నాయకుల దందాలను చూపించాడు. డబ్బు, భూకబ్జాలు, శారీరక సంబంధాలు... ఇలాంటి విషయా ల్లో వాళ్ళకున్న మానసికమైన వైకల్యాలను చూపించాడు. అవన్నీ చూసి ఆ పెత్తందారీలు తట్టుకోలేకపోయారు. ఆయనపై బెదిరింపుల పర్వాలకూ తెరతీ శారు. భూస్వాములు, రాజకీయ నాయకులు చేసిన బుడ్డ బెదిరింపులకు ఆయన ఎన్నడూ భయపడలేదు. ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలబడ్డాడు. సాహిత్యంలోనూ సాంఘిక ఉద్యమాల్లోనూ ఇంతగా రాటు దేలినా పసిపిల్లల్లోని కల్మషంలేనితనాన్ని ఇప్పటికీ మనం ఆయన మోములో, మాటల్లో చూడొచ్చు. శాంతి నారాయణని తెలుగు సాహిత్య చరిత్రలో ఉక్కు మనిషిగా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. 

కవితశ్రీ

94946 96990

Updated Date - 2022-09-12T05:52:04+05:30 IST