కేంద్ర నిరంకుశత్వానికి కేసీఆర్ స్వస్తి వాక్యం!

ABN , First Publish Date - 2022-10-01T07:33:58+05:30 IST

రాష్ట్రశాసనసభలో ఇటీవల విద్యుత్తు అంశంపై జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం భావితరాల కోసం భద్రపరచాల్సినది.

కేంద్ర నిరంకుశత్వానికి కేసీఆర్ స్వస్తి వాక్యం!

రాష్ట్రశాసనసభలో ఇటీవల విద్యుత్తు అంశంపై జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం భావితరాల కోసం భద్రపరచాల్సినది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుండే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ఎండగడుతూ, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించే విధానాన్ని లోతుగా తెలియచెబుతూ సాగింది కేసీఆర్ ప్రసంగం.


ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజానీకానికి వెనువెంటనే కేంద్రం భయంకరమైన ద్రోహం చేసిందని గుర్తు చేశారు కేసీఆర్. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం, మొట్టమొదటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో, తెలంగాణ గొంతును నులిమేసే విధంగా, రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిందనీ, పైగా 460 మెగావాట్ల సీలేరు హైడ్రో విద్యుత్ పవర్ ప్రాజెక్టును కూడా వారికి ధారాదత్తం చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక పూర్వమే, ప్రధాని మోదీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారి తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇది జరిగిన రోజునే తాను నరేంద్ర మోదీని ఈ దేశంలో ‘పెద్ద ఫాసిస్ట్’ ప్రధానమంత్రి అని తీవ్రంగా విమర్శించానని, అలా విమర్శించిన మొట్టమొదటి వ్యక్తి తానేనని గుర్తు చేశారు కేసీఆర్.


అప్పటికి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉండి రాష్ట్ర బందుకు పిలుపునివ్వటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. ఇస్తాం తప్పదు, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయాలని కేసీఆర్ జవాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆ రోజున బంద్ విజయవంతంగా పాటించి నిరసన వ్యక్తం చేసింది. ఆ తరువాత కూడా అనేక పర్యాయాలు మండలాల విషయం పక్కనపెట్టి కనీసం సీలేరు పవర్ ప్లాంట్ అయినా వెనక్కు ఇవ్వమని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పరిశీలించలేదు. తెలంగాణ పట్ల అలా ఆరంభమైన వివక్ష, అన్యాయం నిరంతరాయంగా కొనసాగుతూనే వున్నది. ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు వివక్షకు, అన్యాయానికి పరాకాష్ఠ.


ప్రధాని మోదీ అవలంబిస్తున్న నిరంకుశ పాలనా విధానాలను విమర్శిస్తూ, పార్లమెంటులో ఏకపక్షంగా ప్రవేశపెట్టిన కేంద్ర విద్యుత్ బిల్లును ప్రస్తావించారు కేసీఆర్. విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఒక్క తెలంగాణలోనే 98లక్షల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయి. వీరిలో రైతులు, దళితులు, గిరిజనులు; ఇంకా లాండ్రీలు, సెలూన్లు, కోళ్లఫారాలు నడుపుకునే ప్రజలు; చేనేత రంగ కార్మికులు; చిన్న పరిశ్రమలవారూ ఉంటారు. వాస్తవానికి విద్యుత్ సంస్కరణలు అనేది ఒక అందమైన ముసుగు మాత్రమే. నిజానికి ఇది ప్రజలను, పేదలను, రైతులను, విద్యుత్ వాడుకునే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గం. వ్యవసాయాన్ని నడవనీయకుండా చేసి కార్పొరేట్ గద్దలకు ధారాదత్తం చేయడం దీని వెనుక దాగివున్న అసలు కుట్ర అన్నారు కేసీఆర్.


పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఒక బాధ్యత అనీ, ఏ ప్రభుత్వమైనా పరిపాలనలో బాధ్యాతాయుతంగా నడుచుకోవాలని అంటూ, కేసీఆర్ రాజ్యాంగపరమైన కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో కేంద్ర పరిధిలో ఉండేలా కేంద్ర జాబితా అని, రాష్ట్రాల పరిధిలో ఉండేలా రాష్ట్రాల జాబితా అని, ఇరువురు కలిసి సంప్రదించుకుని పనిచేసే విధంగా ఉమ్మడి జాబితా అని పొందుపరిచారు. విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలోనిది. దీని మీద కేంద్రం పెత్తనం లేదు. కానీ, రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండా, మాటమాత్రమైనా చెప్పకుండా విద్యుత్ బిల్లులలాంటి అనేక బిల్లులను ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడం, చట్టాలు చేయడం మామూలైపోయింది. ఈ విధంగా రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు కేసీఆర్.


పార్లమెంటు ఉభయసభలలోనూ బిల్లులపై చర్చ అరుదైపోయింది. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడదామని అనుకుంటే, వారిని మాట్లాడనివ్వకుండా మూకదాడులు చేస్తున్నారు. ఒక్క ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వందమంది అధికార సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం, ఆ అరుపుల మధ్య గందరగోళ పరిస్థితులలో బిల్లును పాస్ చేసుకుని, చట్టాలను తేవటం చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, ముఖ్యంగా జాతీయ జెండానే మార్చేస్తామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆవేదనతో ప్రస్తావిస్తూ ‘ఇది మహాత్ముడు పుట్టిన గడ్డేనా? మహాత్ముడు పుట్టిన నేల మీద ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన ఖర్మనా మనది? ఎక్కడి నుండి దాపురించారు ఈ మరుగుజ్జులు? దీనికోసమేనా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసింది?’ అని ప్రశ్నించారు కేసీఆర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దేశంలో ఏకపార్టీ మాత్రమే ఉంటుందని, వేరే పార్టీలను ఉంచమని, ఉండకుండా చేస్తామని ఇటీవల నిస్సిగ్గుగా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. అలా చేసి చూడమని, తక్షణమే అన్ని పార్టీలను నిషేధించమని, అప్పుడే దేశంలో ఎవరి సంగతి ఏమిటో తెలుస్తుందని సవాలు విసిరారు.


బీజేపీ ప్రభుత్వానికి రెండుసార్లు జరిగిన ఎన్నికలలో ఏభైశాతం ఓట్లు కూడా రాలేదని, కేవలం 36శాతం ఓట్లతో రాజ్యమేలుతున్నదని, అలాంటప్పుడు దేన్ని చూసుకుని ఇంత అహంకారమని, చరిత్రలో హిట్లర్, ముస్సోలినీ, నెపోలియన్ లాంటివారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. అధికారం నెత్తికెక్కి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాలమే కఠినంగా సమాధానం చెపుతుందని హెచ్చరించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎవరో కొందరు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ భయపడరని, ఇంత సువిశాల దేశంలో ప్రజాస్వామ్య మనుగడకోసం ఎన్నో అనుభవాలు, ఎన్నో సందర్భాలు ఉన్నాయని, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటుచేసి పిలుపునిస్తే 40–50 రోజుల్లో జైల్లో నుంచి పుట్టిన జనతా పార్టీ ఈ దేశంపైన జెండా ఎగురవేసిందని, అదే ప్రజాస్వామ్యం శక్తి అని, సమయం వచ్చినప్పుడు ప్రజలు మళ్లీ ఆ శక్తినే ప్రదర్శిస్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఈ బీజేపీ ప్రభుత్వం మరో 18–20 నెలలు మాత్రమే అధికారంలో వుంటుందని, దాన్ని దేవుడు కూడా కాపాడలేడని, వందశాతం ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని, తాను త్వరలోనే జాతీయ పార్టీ స్థాపిస్తానని అన్నారు కేసీఆర్.


మోదీ ప్రభుత్వాన్ని పలు విషయాలలో విమర్శిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరగా– ‘వెరీ సారీ, నేను దుఃఖంతో చెప్తున్నాను. ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్ లక్ అనుకుంటున్నాను. ఇవ్వాళ శాసనసభలో ఒక ముఖ్యమంత్రి లేచి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే దిక్కుమాలిన పరిస్థితి రావడానికి ఎవరు బాధ్యులు?’ అన్న ప్రశ్నతో ఆయన ప్రసంగం ముగిసింది.


వనం జ్వాలా నరసింహారావు

Read more