బాసొక సంబురం

ABN , First Publish Date - 2022-09-09T06:17:44+05:30 IST

నా లెక్కనే నువ్వుసుత మాట్లాడితే పాణం లేసొచ్చినట్లాయే..

బాసొక సంబురం

నా లెక్కనే నువ్వుసుత మాట్లాడితే

పాణం లేసొచ్చినట్లాయే

ఒక్కతల్లి బిడ్డలెక్క యాదికొస్తివి

పెయ్యంతా వొక్కమాలే

తంగేడు పువ్వోలే యిచ్చుకున్ది

నీ బాంచన్ నువ్వు నా సోపతి కట్టు

బాస యాస

తెలంగాణ నుదిటి బొట్టు

బతుకు పోరులో బతుకమ్మ నా బాస

సమ్మక్క సారక్క సంబురాలే నా యాస

పాలు కురిసిన

జొన్నకంకి నా యాస

కాళోజి కలం నుంచి గళమెత్తిన నా బాస

తంతెలు తంతెలుగా మెట్లెక్కిన

వెయ్యిస్తంభాల గుడి...

నా బాస పలుకుబడి

అక్షర రూపం దాల్చిన

ఒకే ఒక్క సిరా చుక్క

లక్ష మెదళ్ళను కదిలించిన 

ప్రజా కవి కాళోజీ పచ్చని మొక్క


అన్యాయంపై ఆయన ఆగని గొడవ

ఆటుపోటుల్లోనూ నడిచిన పడవ

కాలంబు రాగానే కాటేసిన అక్షరం

కవి కాలంలో మాటేసిన శిశిరం

చెమ్మగిల్లిన కన్నులలో ప్రభవించిన కవి

తెలంగాణ బాసపైన ప్రసరించిన రవి

మన కాళోజీ... మన బాసకు బాపూజీ!


– కటుకోఝ్వల రమేష్

Read more