కథకుల తిలకుడు

ABN , First Publish Date - 2022-01-03T06:32:34+05:30 IST

శీతాకాలం చలితోపాటు ధనుర్మాసాన్ని, పతంజలి శాస్త్రి గారిని తీసు కొస్తుంది. ఎందుకంటే ఆయన కథలలోని శీతల సమీరం పాఠకుడిని మురిపిస్తుంది...

కథకుల తిలకుడు

శీతాకాలం చలితోపాటు ధనుర్మాసాన్ని, పతంజలి శాస్త్రి గారిని తీసు కొస్తుంది. ఎందుకంటే ఆయన కథలలోని శీతల సమీరం పాఠకుడిని మురిపిస్తుంది. 


ఈసారి ఇంకోటి కూడా పతంజలి శాస్త్రిగారిని గుర్తు చేసింది. డిసెంబరు నెల మొదటివారంలో ప్రముఖ యువ చరిత్రకారుడు, మనుఎస్‌.పిళ్ళై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ: ‘‘I would not call it anecdotal. Good history comes from a combination of sources’’ అంటాడు. ఇలాంటి కాంబినేషనల్‌ సోర్సెస్‌ను కథలను చేస్తూ, ఆ కథల ద్వారా గడిచిన నాలుగు దశాబ్దాల తెలుగునేల పరిణామాన్ని, చరిత్రను, సంస్కృతిని మాత్రమే కాకుండా జీవితాన్ని కూడా పదిలం చేస్తున్న కథకులు తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు. ఈ నెల తొమ్మిదిన కాకినాడలో అజోవిభో జీవన సాఫల్య పురస్కారం అందు కోబోతున్న సందర్భంలో... ఆయన కథల ఆవరణలోకి సంచారం చెయ్యడానికి, ఆయన కథలను అంటుకుని ఉన్న మెరుపుల ముచ్చట్లను తలచుకోవడానికి, ఆయన కథన చాతుర్యానికి మురిసిపోవడానికి, ఆయన వాక్యాల సొగసును, పరిమళాలను ఆస్వాదించడానికి ఈ అవకా శాన్ని వినియోగించుకుందాం.


సుమారు డెబ్భైకి పైగా కథలను రాసిన పతంజలి శాస్త్రిగారి కథనవిహారం నాలుగు మజిలీల్లో కుదురుకుంది. మొదటిది ‘పతంజలిశాస్త్రి కథలు’. ఈయన ఈ కథా సంపుటిని మిత్రులకు పంపిస్తూ ‘అచ్చుతప్పులతో...’ అని రాసి, సంతకం పెట్టేవారు. ఇది చూడగానే ఆయనలోని చమత్కారం, నిజాయితీ స్పష్టంగా అర్థం అయ్యేది. ఇవి ఆయన కథలకు ఆయువుపట్టు. ఈ సంపుటి ‘భగవంతం కోసం’ అనే కథతో ప్రారంభమవుతుంది. ఇది మనకు త్రిపురను గుర్తు చేస్తుంది. పతంజలి శాస్త్రిగారే కథ చివర్న త్రిపురను ఎకనాలెడ్జి చేస్తారు. బహుశా, తెలుగు కథా వాకిట ప్రవేశించడానికి ఆయనకి భగవంతం కథ ఒక ‘ఇన్లెట్‌’. ఫ్రాంక్‌ ఓ కానర్‌ లాంటి వాళ్ళు సమాజం దూరంగా నెట్టిన మనుషుల గురించి, సమాజానికి దూరం జరిగిన వ్యక్తుల గురించి కథలు మాట్లాడ తాయి, మాట్లాడాలి అని చెప్పిన తర్వాత కథలన్నీ అదే దారిలో క్యూ కట్టాయి. తెలుగు కథ కూడా దానినే అనుసరించింది. కథకు ఒక రుచి, వాసన అలవాటు చెయ్యడం మొదలయ్యింది. ఇది తప్పు కాదు కానీ, ఇది మాత్రమే కథ కాదు. నాకు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ ఎప్పుడో రాసిన ఒక కవితలో మాట గుర్తుకొస్తోంది. ‘Clarification of life’, జీవితం పట్ల స్పష్టత. అంతే కాదు ఆమ్‌స్టర్‌డామ్‌ విశ్వవిద్యాలయంలో సాహిత్య సిద్ధాంతాన్ని బోధిస్తున్న ఫ్రొఫెసర్‌ మైక్‌ బాల్‌ రాసిన ‘Naratogy. Introduction to the theory of narrative’ అనే పుస్తకానికి తానే పీఠిక రాస్తూ ‘momentory stay against confusion’ అని తేల్చిచెప్తుంది. ఈ రెండింటిని మర్చిపోవడం వలన కథ చిన్నబోవడం మొదల య్యింది. ఈ సమయంలోనే వెలుగుచూసిన కొత్త మొలక ‘పతంజలిశాస్త్రి


కథలు’.

ఆ తర్వాత ‘నలుపెరుపు’, ‘రామేశ్వరం కాకులు’, ‘సమాంతరాలు’ అనే మరో మూడు మజిలీలు పంతంజలి శాస్త్రిగారి కథలను మన మధ్యకు మోసుకొ చ్చాయి. ఇప్పటివరకు తెలుగు కథకు తెలియని కొత్త సంగతులను పతంజలి శాస్త్రి గారి కథ పరిచయం చెయ్యడం మొదలు పెట్టింది. సమన్వయ కథనం (Coordinate Narration) అందులో మొదటిది. వచనం (Text), కథావస్తువు (Fable), కథ చెప్పేతీరు (Syuzhet) అనే మూడు లేయర్‌లను ఒకే తానులో అల్లి ఒకదానిలో నుండి మరో దానిలోకి ఇంటర్‌ లింక్‌ చేస్తూ పాఠకుడిని కూడా తీసుకువెళ్ళగలిగే ఒక కళాద్భుతానికి పతం జలిశాస్త్రిగారి కథ పునాదులు వేసింది. కేవలం ప్లాట్‌, కథావస్తువు మాత్రమే రాజ్యమేలుతున్న దశలో దానికి వచనాన్ని కూడా యాడ్‌ చేసి మూడు లేయర్ల యూనిక్‌ 


నిర్మాణాన్ని తెలుగు కథకు పరిచయం చేసిన వారు పతంజలి శాస్త్రి. ఈయన కథలలో టెక్స్‌ట్‌ అంటే వచనం కూడా కథనాన్ని, వస్తువును శాసించడమే కాదు, అనుసరిస్తుంది కూడా. దీనిని మళ్ళీ మనం మైక్‌బాల్‌ మాటలలోనే చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఒక ‘artifact’.

 

దానికి ఆయన కథలను చాలానే చెప్పొచ్చు. ‘నలుపెరుపు’ కథలో గతం, వర్తమానం ఒకదాని వెంట ఒకటి జమిలిగా సాగిపోయే కథనం పాఠకుడిని ఊపిరితీసుకోనీయదు. ‘కార్తీకం మంచు పిడికిలి బిగించింది’ అనే మొదటి వాక్యం నుండి నోరు తెరిచి ఆమె నిర్జీవంగా స్టూలు మీంచి జారిపోయింది’ అనే ఆఖరి వాక్యం దాకా కథలో రెండు కాలాలు సమాంతరంగా ముందుకు కదులుతాయి. ఇంతవరకు, తెలుగులో ఇలాంటి కథ వెలుగు చూడలేదు. ఇలాంటిదే ‘రామేశ్వరం కాకులు’. పతంజలిశాస్త్రి గారి కథలలో కథకుడు జరగబోయే విషయానికి పాఠకుడిని తయారుచేస్తారు. ఇది ఓపెన్‌ టెక్స్‌ట్‌ నెరేషన్‌ పూర్తిగా విపులపరిచే కథన శైలి. కానీ దీనికీ మళ్ళీ వచనం ద్వారానే ద్వారం ఏర్పాటు చేశారు. ‘‘ఆ స్పర్శలో ఆమె నది అయిపోయింది’’ అంటాడు ఒకచోట, 


‘నదీనాం సాగరో గతి’ మనకు తెలిసందే. కథ చివరలో ఆమె సము ద్రంలోకి వెళిపోతుంది. అంతేకాదు కథకుడు పాత్రలను పరిచయం చెయ్యడం కూడా కథనంలోనే ఇమిడిపోయి ఉంటుంది. అది సంభాషణ కాదు, ఒకరి గురించి ఒకరుచెప్పే మాటకాదు. కాని కథలలోని పాత్రలు పాఠకుడి ముందు నిలువెత్తు జీవితంతో నిలబడతాయి. ‘రామే శ్వరం కాకులు’ కథలో ఎస్సై గురించి చెపుతూ ‘అతని ప్రపంచం నిండా వెలుతురు పడని చీకటి’ అంటారు. ‘ముక్తి కోసం’ 


కథలో నారాయణ గురించి చెపుతూ ‘ధనుర్మాసంలో ప్రాణంతో మిగతా రోజుల్లో శరీరంతో బతుకుతాడు’ అంటాడు. అతను హరిదాసు. తెలుగు కథ ఇంతవరకు చూడని పాత్ర ఇది. పల్లీలవాడి గురించి ‘చారి కరెంటుబిల్లు’ కథలో ‘పల్లీలు వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వాడు బావుండడం కూడా తీసుకు వెళ్ళిపోయాడు’ అంటారు. ఇలాగ వచనం, కథనం, కథ అల్లుకుపోయి జీవితాన్ని చెప్పడం మొదలుపెట్టిన కథలివి.


పతంజలిశాస్త్రి కథల కాన్వాస్‌ చాలా చిన్నది. గోదావరి జిల్లాల పల్లెలు, పట్టణాలూనూ. గోదావరి నదీతీరం సాక్షిగా అనేక కథలకు పురుడు పోసిన వారాయన. నిజానికి చాలా గొప్ప కథలన్నీ చిన్న కాన్వాస్‌లోనుంచి పుట్టినవే. ఈయన కథలు ఆ కాన్వాస్‌ను చిత్రిస్తాయి. ఇవాళ కథ వీడియో టెక్నిక్‌ను కూడా అంది పుచ్చుకుంది. అందుకే మనకు శాస్త్రిగారి కథల ప్రదేశాలు మన కళ్ళముందు తిష్టవేసుక్కూర్చుంటాయి. మనల్ని కూడా ఆ కాలానికి ఆ ప్రాంతానికి తీసుకువెళతాయి. ‘ఎన్నికలయిపోయాయి నగరంలో అనేక ప్రాంతాలు సర్కస్‌ గుడారం ఎత్తేసిన మర్నాటిలా ఉన్నాయి’ (రబ్బీషు). ‘‘గది లుంగీ అంత, వంటిల్లు తువ్వాలంత (రుబ్బురోలు), ‘‘రెండు పురాతనమైన చెట్టు కొమ్మలు గాలికి కలిసి విడిపోతున్నట్టు ఆకులు మాట్లాడుకుంటున్నట్లు ఒక చల్లటి ఋతువేదో వాళ్ళని పొట్లం కట్టింది’’ (జోగిసంతులు తిరిగిరాలేదు) లాంటి ఎన్నో వాక్యాలు మన ముందు ఆ ప్రాంతాల చిత్రాలని గీస్తాయి. ఆ మనుష్యులను, ఆ కలయికలను మనం మనసుతోనే కాదు, కళ్ళతోనూ చూస్తాం. తెలుగు కథాప్రపంచం చాలావరకు ఒక సమస్యలోంచి కథ చెప్పడం మొదలు పెట్టింది. ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని, ఒక వ్యవస్థని టార్గెట్‌ చేసుకుని బయలుదేరింది. అనేక ఉద్యమాలని భుజాన వేసుకుని ముందుకు కదిలింది. అనేక పేర్లతో అనేక దార్ల గుండా కథ రావడం మొదలయ్యింది. ఈ విస్తృతి ఆహ్వానించదగినదే కాని ‘కథ’కు మూలమైన సూత్రాన్ని మర్చిపోయింది. పతంజలి శాస్త్రి గారి కథలు ఆ మర్చిపోయిన మూలాలని పట్టుకున్నాయి. ఒక చిన్న కుటుంబాన్ని తీసుకుని ఒక పెద్ద సమస్యలోకి సమాజం జారిపోవడం చెపుతారు. సమస్యలోంచి జీవితాన్ని కాకుండా జీవితంలోంచి సమస్యను చూడడం పతంజలిశాస్త్రిగారి కథలు చేస్తున్న పని. కథ నిజంగా చేయ వలసిన పనే. ప్రపంచ కథ కూడా ఇప్పటి వరకు చేస్తున్న పని కూడా ఇదే. కొత్త సాంకేతికతతో ఎప్పటికప్పుడు తన కథలను అలంకరించడం పతంజలి శాస్త్రి గారికి అలవాటు. ‘వాస్తవం’, ‘తురకపాలెం దేవకన్యలు’ కథలలోని సమాంతర వాస్తవం (Parellel realism) కథనంలో అల్లుపోయి ఉంటుంది. ఊహ ఒకటి, జరుగుతున్న వాస్తవం మరొకటి. రెండూ ఒకే సమయంలో జరుగుతాయి. ఊహలో ఉన్న ఆలోచనకి పూర్తి భిన్నంగా అక్కడి సంఘటన జరుగుతుంది. ఒక సంఘటనను దూరం నుండి చూస్తూ మనసులో ఆ సంఘటన తాలూక దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఉంటాడు. కాని అక్కడ జరిగిన ఆ సంఘటన నిజ స్వరూపం మరోలా ఉంటుంది. ఇది పాఠకుడు గుర్తి స్తాడు. 


కథలో పాత్ర ఊహిస్తున్న దృశ్యానికి జరిగిన దృశ్యానికి పాఠకుడే సాక్షి. కాని కథలో ఒకే కాలంలో జరిగిన ఒకే సంఘటన ఒకటి ఊహలోనూ మరొకటి వాస్తవంలోనూ రెండు రకాలుగా కనబడుతుంది. ఇలాంటి కథలు కూడా తెలుగులో చాలా అరుదుగా వచ్చినవే. పతంజలి శాస్త్రి గారి నాలుగో మజిలీ ‘సమాంతరాలు’ కథా సంపుటి. ఒకే ప్లేన్‌లో ఉన్న కథలను పొదివి పట్టుకుంది. శాస్త్రిగారి మాటల్లోనే చెప్పాలంటే... ‘‘ఒక స్థితి దాటిన తర్వాత అనుభవం వైయుక్తికం కాదనుకుంటున్నాను. పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒక రకమైన మృత్యు స్పృహ - అనుభవాలు అవి చొక్కా పేంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి’’ అంటారు. శాస్త్రిగారి కథలలో భాష కూడా మహా రుచిగా ఉంటుంది. తెలుగు పాఠకుడి టేస్ట్‌ని పెంచిన కథకుడు ఆయన. ‘రోహిణి’ కథ ప్రారంభిస్తూ... ‘రోహిణీ నది సంధ్యాసమయంలో శాస్త భుజం మీద నుండి జారిన కాషాయంబరంలా ఉంది’ అని రాస్తాడాయన. ఇలాంటి పోలికలు కోకొల్లలు. ‘మార్కండేయులు కాఫీ’ కథలో ‘బీమా ఇద్దరినీ కలిపింది, జీవితం విడదీసింది’ అంటారు. ముందే మనం చెప్పుకొన్న చమత్కారం మొత్తం కథని పాఠకుడికి చేరవేస్తుంది. అలాగే ‘వెన్నెల వంటి వెలుతురు గూడు’ కథలో ఒక పరిచయం తాలూకు అనుభూతిని, సహానుభూతి చేసుకుని ‘ఎక్కడో ఆకుపచ్చని కొండల్లో మనిషి అడుగుపెట్టని సరస్సులో స్నానించి బయటపడ్డాను’ అని చెప్పగానే పాఠకుడు ఆ స్వచ్ఛతకు ఆత్రుత పడతాడు.


పతంజలిశాస్త్రి గారి కథలన్నీ ఒక తెలియని, కనపడని ఒక బంధాన్ని కలిగి ఉంటాయి. ఒక ఇంటర్‌లింక్‌ కథల నిండా పరచుకొని ఉంటుంది. గ్రామా లలో మనకి సాధారణంగా కనపడే ప్రతి విషయాన్ని ఈ కథలు కాలంతో పాటు పట్టుకున్నాయి. ఈ డెబ్భై కథలు మనకు తెలుగు నేల గురించి చరిత్ర మరిచిన ఎన్నో నిజాలను చెప్పడం మొదలుపెడతాయి. కాన్వాస్‌ చిన్నది కావడం వలన మొత్తం జీవితం ఈ కథలలో కనపడుతుంది. ఈ కథలు జీవితాన్ని రికార్డు చేయవు. ప్రతిబింబించవు. ఫొటో తీయవు. ఎందుకంటే పతంజలిశాస్త్రి కథ నాలుగు దశాబ్దాలుగా తెలుగునేలపై సాగుతున్న జీవితమే.


సాంస్కృతిక, చారిత్రక వారసత్వాలని తమ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఆ ఐకనోగ్రఫీని రాజకీయశక్తికి కీలకంగా చేసుకుంటూ జాతీయతను పునర్‌నిర్మిస్తున్న నేటి ప్రభుత్వాల తీరును ఎప్పుడో ఊహించి ఉంటారు శాస్త్రిగారు. అందుకే, మన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక, ప్రకృతి సంపదలను మన జీవితాలకి అనుసంధానం చేస్తూ నాలుగు దశాబ్దాల కాలాన్ని పాఠకుల ముందు పెట్టిన కథలివి. బ్రాండ్‌ మాథ్యూస్‌ అనే విమర్శకుడు మపాసా కథలు గురించి చెపుతూ ‘‘Greek sense of form, a Latin power of Construction, and french felicity of style’’ అంటాడు. ఇది ఎప్పుడో 1901లో అన్నమాట. ఇప్పుడు కనుక బ్రాండ్‌ మాథ్యూ బతికుంటే సింపుల్‌గా ‘‘మపాసా కథలు తెలుగు పతంజలి శాస్త్రి కథల స్థాయికి దాదాపు దగ్గరగా ఉన్నాయి’’ అని చెప్పేవారు.  

నండూరి రాజగోపాల్‌


Updated Date - 2022-01-03T06:32:34+05:30 IST