జోడో యాత్ర : జాతీయ కాంగ్రెస్‌ పునర్జన్మ!

ABN , First Publish Date - 2022-09-30T06:19:33+05:30 IST

‘కాంగ్రెస్‌తో మీకు ఈ బాంధవ్యమేమిటి? ‘‘కాంగ్రెస్ అస్తిత్వం నశించిపోవాలి’’ అని ఖరాఖండితంగా మీరు చెప్పలేదా? మరి మీరే ఇప్పుడు ఆ పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేస్తున్నారేమిటి...

జోడో యాత్ర : జాతీయ కాంగ్రెస్‌ పునర్జన్మ!

‘కాంగ్రెస్‌తో మీకు ఈ బాంధవ్యమేమిటి? ‘‘కాంగ్రెస్ అస్తిత్వం నశించిపోవాలి’’ అని ఖరాఖండితంగా మీరు చెప్పలేదా? మరి మీరే ఇప్పుడు ఆ పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేస్తున్నారేమిటి? కాంగ్రెస్ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో మీరు ఎలా పాల్గొంటున్నారు?’– గత మూడు వారాలుగా నేను పదే పదే ఎదుర్కొంటున్న ప్రశ్నలవి. విమర్శకులు నన్ను పరిహసిస్తున్నారు. ఆ ‘కఠిన’ ప్రశ్నలకు సమాధానాన్ని నేను తప్పక దాటవేస్తానని మీడియా ప్రతినిధులు భావిస్తున్నారు. లేదు, జవాబిచ్చే బాధ్యత నుంచి నేను తప్పించుకోబోవటం లేదు. అవి సముచిత ప్రశ్నలే. వాటికి ముక్కుసూటిగా ప్రతిస్పందించాల్సి ఉంది. నేనేమీ నా భావాలు, సంకల్పాలను వదులుకోబోవడం లేదు.


ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఆ ప్రశ్నలు వేసినవారిలో చాలా మంది, నేను అప్పట్లో చెప్పిన, రాసిన విషయాల గురించి పట్టించుకోలేదు; ఇప్పుడు చెప్పుతున్న వాటిని వినడం లేదు. వారికి జ్ఞాపకముందల్లా ‘కాంగ్రెస్ అస్తిత్వం నశించి పోవాలి’ అన్న వ్యాఖ్య మాత్రమే. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నేను నడుస్తున్న దృశ్యాలను మాత్రమే వారు చూస్తున్నారు. చూస్తున్న దాన్ని మాత్రమే విశ్వసిస్తున్నారు. ఇది సబబేనా?


సత్యమేమిటి? 2019 మే 19న నేను ట్విటర్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్య ఏమిటో మరొకసారి చదవండి: ‘కాంగ్రెస్ అస్తిత్వం నశించిపోవాలి. భారత్ భావనను కాపాడేందుకు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ నిలువరించి తీరాలి. నిలువరించలేని పక్షంలో భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ నిర్వర్తించే సానుకూల, నిర్మాణాత్మక పాత్ర ఏదీ ఉండదు. ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు నేడు కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద అవరోధంగా ఉంది’. రెండు రోజుల అనంతరం ఆ వ్యాఖ్యను విపులీకరిస్తూ ఒక జాతీయ దినపత్రికలో నేను ఒక వ్యాసాన్ని రాశాను: ‘అసలు కాంగ్రెస్ పార్టీ అనేదే లేనట్టు ప్రత్యామ్నాయ రాజకీయాలు తమ లక్ష్య సాధనకు ఉపక్రమించకపోతే, అవి ముందుకు సాగలేవు. అందుకే కాంగ్రెస్ అస్తిత్వం నశించిపోవాలని నేను విస్పష్టంగా చెప్పాను’. కాంగ్రెస్‌ను గుడ్డిగా వ్యతిరేకించడమనే అనాలోచిత అలవాటు ఆధారంగా నేను నా వైఖరిని రూపొందించుకోలేదు. ‘కాంగ్రెస్ వ్యతిరేకతా వాదం ఒక స్వల్పకాలిక రాజకీయ ఎత్తుగడ మాత్రమే. దానిని ఒక భావజాలంగా ఎంచుకోకూడదు’ అని నేను అదే వ్యాసంలో స్పష్టం చేశాను. కాంగ్రెస్ నాయకత్వంపై నేను వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదు. ‘నాకు పరిచయమున్న చాలా మంది రాజకీయ నాయకుల కంటే రాహుల్ గాంధీయే చాలా చిత్తశుద్ధి గల నేత. ప్రతి ఒక్కరూ ఈ యువ నేత గురించి భావిస్తున్న దానికి విరుద్ధంగా ఆయన చాలా తెలివైనవాడు’. చాలా మంది వ్యాఖ్యాతలు నా యీ అభిప్రాయాలను కించిత్ కూడా పట్టించుకోలేదు. 


నా విమర్శలోని ప్రధాన వాదన సూటిగా, సరళంగా ఉంది : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభవ ప్రాభవాలు మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, వైవిధ్యానికి ఒక పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి... ప్రధాన జాతీయ ప్రతిపక్షంగా మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉన్నది. మరి ఈ చారిత్రక కర్తవ్య నిర్వహణకు కాంగ్రెస్ గత ఐదేళ్లలో న్యాయం చేసిందా? సమీప భవిష్యత్తులోనైనా ఆ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించగలదని కాంగ్రెస్‌ను విశ్వసించవచ్చునా? విశ్వసించలేమన్నదే నా సమాధానం. ఆ చారిత్రక విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేక పోవడమేకాదు, ఆ బాధ్యతకు నిబద్ధమవదలుచుకున్న వారికి ఒక అవరోధంగా కూడా ఉన్నది’. భారత్ భావనను రక్షించేందుకై బీజేపీ మహాశక్తిని కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోవాలని నేను ప్రగాఢంగా ఆశిస్తున్నాను. ఆ ఆశంస ఆధారంగానే ఆ పురాతన భారత రాజకీయ పక్షం తన చారిత్రక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆరోపించాను. అవును, ఆ ఆశంసే, భారత్ జోడో యాత్రకు మద్దతునిచ్చేలా నన్ను పురిగొల్పింది. ఆ మద్దతు బేషరతుగా ఇస్తున్నదేమీకాదు. రాజ్యాంగ విలువలకు మున్నెన్నడూ లేని విధంగా ముంచుకొస్తోన్న ముప్పు, ఆ ప్రమాదాన్ని శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత గురించి భారత్ జోడో యాత్రకు మద్దతుగా 200మంది మేధావులు, ప్రజా ఉద్యమాల ప్రతినిధులతో కలిసి నేను సంతకం చేసిన ఒక ప్రకటన నొక్కి చెప్పింది. ‘భారత్ జోడో యాత్రకు మద్దతునివ్వడం ద్వారా మేము ఒక రాజకీయ పార్టీతో గానీ, ఒక రాజకీయ నాయకుడితో గానీ మాకు మేము సంబంధం పెట్టుకోవడం లేదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మన సమున్నత రాజ్యాంగ విహిత గణతంత్ర రాజ్యాన్ని కాపాడేందుకు అర్థవంతమైన, ప్రభావశీలమైన ప్రయత్నానికి తోడ్పడడమే మా లక్ష్యం’ అని ఆ ప్రకటన స్పష్టంగా చెప్పింది.


ఇది స్పష్టం చేస్తున్నదేమిటి? నా వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఎటువంటి మార్పులేదు. అదొక సూత్రబద్ధమైన వైఖరి. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల దాడుల నుంచి మన సమున్నత రాజ్యాంగ విలువలను సంరక్షించే కొత్త, ప్రభావశీల రాజకీయాలను అన్వేషించడమే నా సంకల్పం. ఈ సంకల్ప సాధనకే నేను అప్పుడూ ఇప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నాను. ఎందుకంటే సంఘ్ పరివార్ శ్రేణులను సమర్థంగా ఎదుర్కోగల జాతీయ ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రమే కనుక నేను మొట్ట మొదట కాంగ్రెస్ వెనుక నిలబడ్డాను. భారత్ భావనను రక్షించదలుచుకున్నవారు ఎవరైనా సరే తొలుత చేసే పని ఇదేనని కూడా నేను విశ్వసిస్తున్నాను.


భారత జాతీయ కాంగ్రెస్ తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవడమే కాకుండా అందుకొక అవరోధంగా ఉన్నదని కూడా మూడేళ్ల క్రితం నేను ఆక్షేపించాను. ఒక సహేతుక కారణం ప్రాతిపదికనే నేను ఆ ఆరోపణ చేశాను. మరి ఈ మూడేళ్లలో ఏమైనా మార్పు చోటుచేసుకుందా? కాంగ్రెస్‌లో మార్పు సంభవించిందా? లేక నా వైఖరిలో మార్పు ఏమైనా వచ్చిందా? 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్రపై నా విమర్శనాత్మక వైఖరిని మార్చుకున్నానా? లేదు. కాంగ్రెస్ పార్టీ గత మూడు సంవత్సరాలలో ఏమైనా మారిందా? మన గణతంత్ర రాజ్య పునాదులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడంలో కాంగ్రెస్ శక్తి సామర్థ్యాలను విశ్వసించేందుకు దోహదం చేసే మార్పు ఏదైనా ఆ పార్టీలో చోటుచేసుకుందా? ఈ ప్రశ్నకు నేను నిజాయితీగా ఇవ్వగల సమాధానం ఒక్కటే ‘నాకు తెలియదు’. చాలా మంది ఇతరుల మాదిరిగానే నేనూ ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు, సహ (భారత్ జోడో) యాత్రికుల నుంచి మాత్రమే కాదు, ప్రజల నుంచి కూడా ఎటువంటి సమాధానం వస్తుందో అని నేను తెలుసుకోగోరుతున్నాను. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం గురించి ప్రధానంగా మాట్లాడడాన్ని గమనిస్తున్నాను. ఆ అంశాలపై రాహుల్ ఎటువంటి సందిగ్ధతకు తావులేని విధంగా మాట్లాడుతున్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, ప్రజా సంస్థలను కూడా కాంగ్రెస్ ఆహ్వానించిందన్న విషయాన్ని నేను విస్మరించడం లేదు. భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం నిశ్చయించుకుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఎన్నికలలో మాత్రమే కాకుండా రాజకీయంగా, సైద్ధాంతికంగా కూడా పోరాడేందుకు కాంగ్రెస్ సంకల్పించుకుంది. అయితే కాంగ్రెస్ ఆ పోరాటాన్ని మొక్కవోని దీక్షతో తుదకంటా చేయగలదా? ఇదీ, మన కాలం యక్ష ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలోనివారికి మాత్రమే కాదు, విశాల భారతదేశం ముందున్న ప్రశ్న కూడా అది. ఈ ప్రశ్నకు ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చేందుకు సరైన సమయం ఇంకా ఆసన్నమవలేదు.


ఇంతకూ గత మూడేళ్లలో మారిందేమిటి? భారత్. దేశ పరిస్థితులలో ఎంత మార్పు! 2019లోనే మనదేశ పరిస్థితులు సరిగా లేవని మరి చెప్పనవసరంలేదు. ఈ మూడేళ్లలో మనం సాధించిన ప్రగతి ఆ చెడ్డ పరిస్థితులతో పోల్చలేనంతగా అధోగతికి జారిపోవడమే సుమా! మనం ఇప్పుడు ఒక కొండ అంచున ఉన్నాం. మన రాజ్యాంగం, మన స్వాతంత్ర్యోద్యమ వారసత్వం, మన నాగరికతా విలువలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వమూ, ప్రజాస్వామ్యం మాత్రమే కాదు మనకు తెలిసిన– స్వాతంత్ర్య ప్రదాతలు, గణతంత్ర రాజ్య నిర్మాతలు అందించిన– భారత్ మనుగడే తీవ్ర విఘాతాలను ఎదుర్కొంటూ పెద్ద ప్రమాదంలో ఉంది. మనం ఇప్పుడు చరిత్ర చౌరస్తాలో ఉన్నాం. వెలుగుబాటలో ముందుకు సాగాలి. అయితే అందుకు మనం మన అసూయలు, జగడాలు మానుకుని సమైక్యమవాలి. ఏకత్రాటిపై నిలబడినప్పుడే ప్రమాదాన్ని అధిగమించగలం. ఆర్థికవేత్త పాల్ శామ్యూల్ సన్ ననుసరించి నేను మిమ్ములను ఇలా అడగదలుచుకున్నాను: ‘పరిస్థితి మారినప్పుడు నా అంచనాను కూడా మార్చుకుంటాను. అయ్యా, మరి మీరేమి చేస్తారు?’


భవిష్యత్తేమిటి? ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ఏ ప్రయత్నానికైనా కాంగ్రెస్ ఒక ప్రధాన అవరోధంగా ఉందని నేను అన్నాను కదా. ఈ అంచనాలో అంతర్భూతంగా కనిపిస్తున్న భావన ఒకటి ఉంది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు ఆ ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవన్నదే ఆ భావన. అయితే ఈ ఆశాభావానికి విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ గత మూడేళ్లలో కనిపించలేదు. నిజమేమిటంటే ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆశిస్తున్న, విశ్వసిస్తున్న వారందరూ ఒక నైతిక, ఆచరణీయ జాతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో విఫలమయ్యారు. ప్రాంతీయ పార్టీలలో కొన్ని బీజేపీతో గట్టిగా తలపడి విజయం సాధించాయి. అయితే ఆ ప్రాంతీయ పార్టీలు ఏవీ ప్రత్యామ్నాయ జాతీయ వేదికను నిర్మించలేవు. ప్రజా ఉద్యమాలు శక్తిమంతమైనవే.. వివిధ రంగాలలో మేలు మార్పులను సాధిస్తున్నాయి. అయితే బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కోగల సామర్థ్యం వాటికి లేదు. రాబోయే రెండేళ్ల పాటు మన రిపబ్లిక్‌ను కాపాడుకునేందుకు ఉపకరించే ప్రభావశీల సాధనాలు కాంగ్రెస్, ఇతర ప్రధాన స్రవంతి పార్టీలు మాత్రమే. ఈ సత్యాన్ని నన్ను విమర్శించే వాళ్లు సైతం గుర్తించారు.


‘కాంగ్రెస్ అస్తిత్వం నశించిపోవాలి’ అని నేను అన్న మాటను గుర్తుచేసుకుంటున్న వారు సంబంధిత వ్యాసాన్ని ముగిస్తూ నేను చేసిన వ్యాఖ్యను విస్మరిస్తున్నారు. సంభావ్యతల గురించి ఊహిస్తూ నేను ఇలా పేర్కొన్నాను: ‘కాంగ్రెస్ లోపలి, బయటి శక్తి సామర్థ్యాలు ఒక  ప్రత్యామ్నాయంగా మిళితమవుతాయి’. ‘కాంగ్రెస్ అస్తిత్వం నశించి తీరాలి’ అన్న వ్యాఖ్య ఒక కొత్త జననం లేదా ఒక పునర్జన్మ గురించి ఆలోచించేంచేందుకు ఆహ్వానమే. మరి భారత్ జోడో యాత్ర అటువంటి పునర్జన్మ సందర్భమేనని మనం ఎందుకు భావించకూడదు?


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-09-30T06:19:33+05:30 IST