జగన్‌ మాయలు ఇంకానా?

ABN , First Publish Date - 2022-04-24T05:43:18+05:30 IST

‘సంక్షేమ పథకాలు ఆపేయాలని, మనం చేస్తున్న ఇలాంటి పాలన వద్దని దుష్ట చతుష్టయం కోరుకుంటోంది’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సరికొత్త రాగం అందుకున్నారు. అప్పులు పుట్టక డబ్బులు పంచే కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ సరికొత్త ఎత్తుగడకు...

జగన్‌ మాయలు ఇంకానా?

‘సంక్షేమ పథకాలు ఆపేయాలని, మనం చేస్తున్న ఇలాంటి పాలన వద్దని దుష్ట చతుష్టయం కోరుకుంటోంది’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సరికొత్త రాగం అందుకున్నారు. అప్పులు పుట్టక డబ్బులు పంచే కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ సరికొత్త ఎత్తుగడకు ఆయన శ్రీకారం చుట్టినట్టున్నారు. దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తనను కలిసిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ వద్ద తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ఆ అప్పులు చేయడం ఏమిటి? ఆ అవినీతి ఏమిటి? అని ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో కూడా చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ శనివారం ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నివేదిక ఇవ్వడం గమనార్హం. ఇదే సమయంలో ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సంక్షేమం పేరిట ఆదాయంలో సింహభాగం ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయని సదరు నివేదికలో హెచ్చరించింది.


అంతకుముందు కొంతమంది ఉన్నతాధికారులు కూడా ప్రధానమంత్రి వద్ద ఇదే తరహా ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితులు చక్కబడని పక్షంలో శ్రీలంక బాటలోనే ఆయా రాష్ట్రాలు పయనిస్తాయని కూడా పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఈ వాస్తవాలను విస్మరించి దుష్ట చతుష్టయం అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నిందిస్తున్న ‘దుసట చతుసటయం’లో ప్రధానమంత్రి, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, కాగ్‌ కూడా ఉన్నట్టా? తన చేతగానితనం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ముఖ్యమంత్రి ఈ ఎత్తుగడ వేసి ఉంటారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ సరికొత్త ప్రచారానికి తెర తీయడం ద్వారా ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు జగన్‌ అండ్‌ కో పాల్పడుతున్నారు. ఇంతకీ జగన్‌ అమలుచేస్తున్న డబ్బు పంపిణీ కార్యక్రమం సమర్థనీయమా? కాదా? అన్నది తేల్చవలసిన సమయం ఆసన్నమైనది.


ఆకలితో అలమటించే వారిని ఆదుకుంటే సంక్షేమం అవుతుంది. అభివృద్ధిని అటకెక్కించి ప్రజల డబ్బును పంచిపెట్టడం, అదే సమయంలో ఎడా పెడా పన్నులు వేయడం సంక్షేమం ఎలా అవుతుంది? ప్రభుత్వ ఆదాయంలో కొంత మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవడం కోసం లేదా అధికారం నిలుపుకోవడం కోసం ఆదాయానికి మించి అప్పులు చేస్తూ పంచిపెట్టడం సంక్షేమం ఎలా అవుతుంది? జగన్మోహన్‌ రెడ్డి తన ఇడుపులపాయ ఎస్టేట్‌ను అమ్మి లేదా హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న ప్యాలెస్‌లను, ఇతర బినామీ ఆస్తులను అమ్మి ప్రజలకు పంచిపెడితే కూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఆయనను దానకర్ణుడిగా కీర్తించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదే! రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెరుగుతుంటే జగన్‌ సొంత ఆస్తులు పెంచుకోవడంతోనే తంటా అంతా. ప్రజలు అమాయకులు, తాను ఏం చెప్పినా నమ్ముతారు అని జగన్‌ బలంగా నమ్ముతారు. అందుకే పథకాలను ఆపాలంటున్నారని ప్రజలను రెచ్చగొడుతున్నారు.


శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభం ఎందుకు వచ్చిందో జగన్‌రెడ్డికి తెలియదా? అందినకాడికి అప్పు చేస్తూ, పంచిపెడుతూ పోతే ఆ అప్పులను ఎలా తీరుస్తారో చెప్పాలి కదా! జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెరిగిందా? అంటే అదీ లేదు! 2019కి పూర్వం తలసరి ఆదాయంలో 13 శాతం వరకు పెరుగుదల ఉండేది. ఇప్పుడు ఆ పెరుగుదల 4 శాతానికి పడిపోయింది. అంటే ముఖ్యమంత్రి చెబుతున్న సంక్షేమం వల్ల ప్రజల తలసరి ఆదాయం పెరగడం లేదన్నట్టేగా! ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నేను ఎవరినీ అడగను. నాకు రావలసింది నాకు వస్తోంది. జనానికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను. నా ఓటర్లు నాకున్నారు. ఇంకేం కావాలి’ అని ఇటీవల తనను కలిసిన ఒక వ్యాపారవేత్త వద్ద జగన్‌రెడ్డి వ్యాఖ్యానించారట. దీన్నిబట్టి ఆయన మనస్తత్వం ఏమిటో అర్థమవుతోంది. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు, తన ఓటు బ్యాంకు పదిలంగా ఉంటే చాలన్న ధోరణితోనే అప్పులు చేసి మరీ పంచిపెడుతున్నారు. ఇందులో కూడా దగా ఉంది. ఆ విషయం తర్వాత చర్చించుకుందాం. అలవిగాని సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎవరిని పడితే వారిని అందలం ఎక్కిస్తే ఎటువంటి అనర్థం జరుగుతుందో ఇప్పుడు శ్రీలంకలో చూస్తున్నాం. ఆశకు పోయి అధికారాలన్నీ ఒకే కుటుంబానికి కట్టబెట్టడం వల్ల లంకేయులు ఇప్పుడు ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది.


శ్రీలంక దుస్థితి వెలుగులోకి వచ్చిన తర్వాత మన దేశంలోని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం కొన్ని రాష్ట్రాలలో ఆదాయానికి ఏ మాత్రం పొంతనలేని పథకాలు ప్రకటిస్తున్నారని, ఈ ధోరణిని కట్టడి చేయవలసిన తరుణం ఆసన్నమైందని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో కూడా శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. నిజానికి అంతూ పొంతూ లేని సంక్షేమం వల్ల రాష్ట్రాలు మాత్రమే కాదు.. మొత్తం దేశమే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.


కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాల నుంచే.. అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి మాత్రమే ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతోనే ఉత్తరాది రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు సంక్షేమం ముసుగులో పోటీలు పడి పంచిపెట్టడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు కూడా అప్పుల ఊబిలోకి వెళుతున్నాయి. ధనిక రాష్ట్రం అని ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు దశలవారీగా జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చిందో పాలకులు చెప్పగలరా? మరోవైపు ఆయా రాష్ట్రాలలో అవినీతి పెచ్చరిల్లిపోతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు, ఇతర కార్యక్రమాలకు టెండర్లు వేయడం ప్రహసనంగా మారింది. రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాక ముందు వరకు కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేసేవారు. ఆ తర్వాత ఏ పని ఎవరికి ఇవ్వాలో ముఖ్యమంత్రి వద్ద నిర్ణయించడం ప్రారంభమైంది. దీంతో కాంట్రాక్టర్లు కూడబలుక్కొని పనులు పంచుకోవడం, ఆ క్రమంలో ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాల్సిన కమీషన్ల కోసం అంచనాలు పెంచడం మొదలైంది. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో అమలుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే నిజమైన టెండర్‌ ప్రక్రియ అమలవుతోంది. 6 నుంచి 15 శాతం వరకు కమీషన్లు తీసుకొని రాష్ట్రాల్లో పనులు కట్టబెడుతున్నారు.


రాజశేఖర రెడ్డి హయాంలో 6 శాతంగా ఉన్న కమీషన్ల వాటా ఇప్పుడు తెలంగాణలో 8 శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతానికి పెరిగింది. కర్ణాటకలో అయితే ఏకంగా 18 శాతం వరకు కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. అధికారంలో ఉన్న వాళ్లు వందలు, వేల కోట్లు పోగేసుకుంటున్నారు. తమ అవినీతి గురించి ప్రజలు పట్టించుకోకుండా ఉండడం కోసం సంక్షేమం పేరిట పంచిపెట్టే కార్యక్రమాలకు తెర తీస్తున్నారు. తండ్రి ప్రవేశపెట్టిన విధానాన్ని మరింత విస్తృతపరచిన ఘనత జగన్‌రెడ్డికి దక్కుతుంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినందున ఆంధ్రప్రదేశ్‌లో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి తెలిసిందే. దీంతో సహజ వనరులను ఆదాయ వనరులుగా మలచుకున్నారు. ప్రైవేటు కంపెనీలు, వ్యాపారాలను చెరబడుతున్నారు.


ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిసారించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాను చేస్తున్న అప్పులను దారిమళ్లిస్తున్న తీరు చూసి ప్రధాని ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. ఇలా అయితే రాష్ట్రాలే కాదు దేశం కూడా దివాలా తీస్తుందని గ్రహించిన ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇవ్వడంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే అప్పుల కోసం ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర అధికారులకు ‘కుదరదు’ అని కేంద్ర పెద్దలు ముఖం మీదే చెబుతున్నట్టు తెలిసింది.


ఎవరిచ్చారా అధికారం?

ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది న్యాయమైన కోరికే. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో కష్టపడి సంపాదించి చెల్లిస్తున్న పన్నులను దానకర్ణుల్లా సంక్షేమం పేరిట పంచిపెట్టడానికి పాలకులు అలవాటుపడ్డారు. మన దేశంలో వ్యాపారం చేసి సంపాదిస్తే ఎంత పన్ను కట్టాలో తెలిస్తే ఇంత దారుణమా? అని అనిపించకుండా ఉండదు. వ్యాపారంలో వచ్చిన లాభంపై 33 శాతం పన్ను కట్టాలి. ఆ తర్వాత ఆ లాభాన్ని సొంతానికి వాడుకోవాలనుకుంటే డివిడెండ్‌ టాక్స్‌ కట్టాలి. ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాలకు బదిలీ అయ్యే ఆదాయంపై మళ్లీ పన్ను విధిస్తున్నారు. ఇన్ని రకాలుగా చెల్లిస్తున్న పన్నుల ఆదాయాన్ని పప్పు బెల్లాలుగా ఖర్చు పెట్టే అధికారం పాలకులకు ఎక్కడిది? ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తున్నారు.


ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా అప్పులు చేయడం మొదలైంది. ఈ ధోరణికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందా? లేదా? సంక్షేమం అంటే ఏమిటి? అన్నది నిర్వచించాలి కదా? 1983లో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేశారు. ఇప్పుడు, 40 ఏళ్ల తర్వాత రూపాయికే కిలో బియ్యం పథకం అమలుచేయడం సంక్షేమం అవుతుందా? ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేని సంక్షేమం ఎందుకు? తాను అధికారంలో కొనసాగడం కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించే అధికారం జగన్మోహన్‌ రెడ్డికి ఎవరిచ్చారు? మళ్లీ అధికారంలోకి రావడం కోసం దళిత బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టే అధికారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతిపక్షాలు ఇంతకంటే భారీ సంక్షేమ పథకాలను ప్రకటిస్తే రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? అందుకే అలవికాని సంక్షేమం అనర్థం అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పిల్లి మెడలో గంట కట్టాల్సిందే!

ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఏమిటో విస్మరించిన జగన్మోహన్‌ రెడ్డి కేవలం పంచిపెట్టడం ద్వారానే అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ‘పథకాలు ఆపమంటున్నారు’ అని శోకాలు మొదలుపెట్టారు. అప్పులు చేయకుండా మిగులు నిధులతో ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను, భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి, అప్పులు చేసి పంచిపెట్టడాన్ని ఎవరైనా ఎలా సమర్థిస్తారు? అంతెందుకు, జగన్మోహన్‌ రెడ్డి తన పిల్లల కోసం వారడిగినవన్నీ అప్పులు చేసి సమకూర్చుతారా? లేదే? తన కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదని భావించే జగన్‌ వంటి వాళ్లు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని మాత్రం దివాలా తీయించడాన్ని ఎవరైనా ఎలా సమర్థిస్తారు? రాజకీయ నాయకులు, పార్టీల ఈ పోకడలకు చెక్‌ పెట్టవలసిన తరుణం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అదుపు తప్పుతున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? సంక్షేమానికి పరిమితులు విధించాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ పార్టీలను కట్టడి చేయడం తమ పరిధిలోకి రాదని ఎన్నికల కమిషన్‌ తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.


సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తంచేసింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడుతోంది. ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారో తెలియదు. జగన్‌ వంటి వారి వల్ల దేశమే ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుతోంది. బాధ్యులు అందరూ మేల్కోవాలి. సంక్షేమానికి పరిమితులు విధించడం మా పరిధిలోకి రాదని ఎవరికి వారు తప్పుకొంటే రేపు జరగబోయే అనర్థాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవైపు సంపద అంతా గౌతం అదానీ వంటి వారి వద్ద కేంద్రీకృతమవుతోంది. మరోవైపు రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ విధానాల విషయంలో ఎవరి అభ్యంతరాలు వారికి ఉండవచ్చు గానీ ఆయనలోని దేశభక్తిని నమ్మవచ్చు. సంక్షేమానికి పరిమితులు విధించే విషయమై చొరవ తీసుకొని ఆయనే ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు కూడా తమ పరిధి కాదంటున్నందున కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. లేని పక్షంలో ఇవాళ అధికారంలో ఉన్న వారు రేపు ఉండకపోవచ్చు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని అనుకుంటున్న భారతదేశం, ఆ దిశగా ముందుకు సాగాలంటే పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాల్సిందే! లేని పక్షంలో జరిగే అనర్థానికి అన్ని వ్యవస్థలూ బాధ్యత తీసుకోవలసి వస్తుంది.


ఆడలేక మద్దెల ఓడన్నట్టు..

కొత్త అప్పులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తారా? పథకాలు ఆపివేస్తారా? జగన్‌ చెప్పాలి కదా! ముఖ్యమంత్రి అంటే అధికారం చెలాయించడమే అని జగన్‌రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం తన బాధ్యత కాదని ఆయన అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం ఇప్పుడు అందరికీ తెలిసివచ్చింది. అందుకే అప్పులు పుట్టని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన గొప్పగా చెప్పుకొంటున్న పథకాలు వాటంతట అవే ఆగిపోతాయి. ఈ విషయం తెలుసు కనుకే జగన్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పథకాలను ఆపాలని ఎవరో కోరుకుంటున్నారని నిందించడం మొదలుపెట్టారు. సంపద పెంచడం చేతగాని వాడికి ఉన్నదాన్ని పంచిపెట్టే హక్కెక్కడిది? ఏటా లక్ష కోట్లకు పైగా అప్పు చేస్తూ వచ్చిన జగన్‌, ఆ డబ్బుతో ఏం చేశారో ఎందుకు చెప్పడం లేదు? పేదల జపం చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టే అధికారం ఏ ముఖ్యమంత్రికీ ఉండదు.


జగన్‌ వంటి వాళ్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఇలా వ్యవహరిస్తారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. ఊహించి ఉంటే సంక్షేమానికి కూడా పరిమితులు విధిస్తూ రాజ్యాంగంలోనే పొందుపరిచేవారు. ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడు అయితే జగన్‌ వంటి వారిని కట్టడి చేయడానికి చట్టమైనా చేయాలి లేదా రాజ్యాంగ సవరణకైనా పూనుకోవాలి. లేని పక్షంలో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి జగన్‌ వంటి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. జగన్మోహన్‌ రెడ్డి ఎటువంటి ప్రజారంజక పాలన అందిస్తున్నారో తెలియడానికి శుక్రవారం నాటి ఒంగోలు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలే నిదర్శనం. మూడు రోజులుగా పోలీసులు ఒంగోలును తమ అధీనంలోకి తీసుకున్నారు. దుకాణాలను మూయించారు. ఎక్కడికక్కడ ఇనుప కంచెలు వేయించారు. తిరుపతికి వెళుతున్న ఒక కుటుంబానికి చెందిన కారును ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం అని చెప్పి రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూశాక జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం మంచిదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆయనను తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రావాలని డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్షాలు దాన్ని విరమించుకోవాలి. అయినా ప్రజలలో స్వేచ్ఛగా తిరగడానికి జగన్‌ ఎందుకు జంకుతున్నారో అర్థం కావడంలేదు. అధికార దర్పం ప్రదర్శించాలని ఆయన అనుకుంటున్నారా? లేక నిజంగానే ప్రజలకు భయపడుతున్నారా? సజ్జల రామకృష్ణా రెడ్డయినా ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుండును. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏమిటో అనుకుంటాం.


భాష గురించి, సంస్కారం గురించి సజ్జల చేసిన కొన్ని వ్యాఖ్యలు విన్న తర్వాత దాని అర్థం తెలిసివచ్చింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వయసు, అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా శాసనసభ లోపలా బయటా ఆయనను దూషించిన వారిని ప్రోత్సహిస్తున్న సజ్జల వంటి వారు నీతి వాక్యాలు చెప్పడమంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. పుట్టినరోజు జరుపుకొన్న చంద్రబాబుకు దేవతల ఆశీస్సులు లభించకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపిన సజ్జల.. సంస్కారం గురించి మాట్లాడటం వింతగానే ఉంటుంది. సజ్జల వంటి వారి వ్యాఖ్యలే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నో వింతలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ఆక్షేపిస్తున్న వారిని మారీచులు, రాక్షసులతో పోల్చారు. ఇప్పుడు దుష్ట చతుష్టయం అని జగన్‌ ముద్దుగా పిలుచుకుంటున్నారు.


పులివెందుల పులి కేవలం నలుగురు వ్యక్తులకు భయపడటం ఏమిటో అర్థం కావడంలేదు. జగన్‌ పులి కాదు పిల్లి అని మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతోనే తేలిపోయింది. ఆయన పులివెందుల పులే అయివుంటే ఎవరు అడ్డు వచ్చినా సంక్షేమ పథకాలు ఆగవు అని ప్రజలకు భరోసా ఇచ్చేవారు. అలా కాకుండా వాళ్లెవరో ఆపమంటున్నారు అని బావురుమనడం ఎందుకు? ఆయన అభివర్ణిస్తున్న దుష్ట చతుష్టయం నిజంగా అలా చేస్తున్నారా? లేక రాష్ట్రాన్ని పీడిస్తున్న అసలైన దుష్టశక్తి ఎవరు? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. జగన్‌ ముఖంలో అధికార దర్పం కనుమరుగవుతోంది. బేలతనం గోచరిస్తోంది. తన భవిష్యత్తు ఆయనకు కళ్లముందు కనబడుతున్నట్టుంది. అందుకే చివరి అస్త్రంగా ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. అయినా ఆయన తాను చెబుతున్న దుష్ట చతుష్టయాన్ని అడిగి డబ్బులు పంచడం మొదలెట్టలేదుగా! ఇప్పుడు ఆపమంటున్నారని ఆపడానికి!! ఆడలేక మద్దెల ఓడు అని వెనకటికి ఎవరో అన్నారట. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి తీరు చూస్తే ఆ సామెత గుర్తుకువస్తోంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more