ఇది జాషువా పద్యమేనా?

ABN , First Publish Date - 2022-09-28T10:15:14+05:30 IST

ఊహ రెక్క తొడిగితే– అది జాషువా పద్యమై ఎగురుతుంది. కల్పనలో అనల్ప వైభవాన్ని ఆవిష్కరించడంలో ‘నవయుగ కవిచక్రవర్తి’ చూపిన అనన్య ప్రతిభ అపూర్వం....

ఇది జాషువా పద్యమేనా?

ఊహ రెక్క తొడిగితే– అది జాషువా పద్యమై ఎగురుతుంది. కల్పనలో అనల్ప వైభవాన్ని ఆవిష్కరించడంలో ‘నవయుగ కవిచక్రవర్తి’ చూపిన అనన్య ప్రతిభ అపూర్వం. పద్యాన్ని ఎత్తుకోవటంలోను, ముగింపులో బిగింపు చూపటంలోను, జాషువా నిజంగానే కవితావిశారదుడు. పద్యనిర్మాణ దక్షతపై ఆయన చేసిన సంతకం ఎప్పటికీ చెరిగిపోనిది. సరికొత్త పద ప్రయోగాలకు పట్టాభిషేకం చేసిన మహనీయుడాయన. ఈ విలువలన్నీ రసలబ్ధులకు తెలిసినవే! వేలకొలది పద్యాలు ఆయన వెంట నడిచాయి. ఆ పద్యాల వెంట మనమూ నడిచాము. ఏ పద్యానికి ఆ పద్యమే ఆణిముత్యం. అయితే ఇంతవరకు పాఠకలోకానికి తెలియని పద్యమొకటి నా దృష్టికి కొన్ని ఏండ్ల క్రితమే వచ్చింది. ఈ పద్యం గురించి ఎందరినో అడిగాను. వారి దృష్టికే ఇది రాలేదన్నారు. ఈ పద్యాన్ని కవులు, హరికథకులైన మా నాన్న (రంగినేని కాశిరాజు) ఎవరికో వివరిస్తుంటే నేను నా బాల్యంలో విన్నాను. ఇది జాషువా పద్యమని నాతో ఓసారి నాన్న అన్నారు. సుమారుగా ఎనభైయేండ్ల క్రితం పద్యమిది. అప్పుడు విన్న ఆ పద్యం– చిన్న వయస్సు కావటం వలన ధారణలో అంతగా లేకపోయింది. పద్యం ఉత్పలమాల. మూడు  పాదాలే గుర్తున్నాయి. ఇదే విషయం తణుకులో నివసించిన కవి పండితులు తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులుకి (డా. తంగిరాల వెంకట సుబ్బారావు సోదరులు) విన్నవిస్తే– వారు శేషభాగాన్ని పూర్తి చేశారు తనదైన రీతిలో. సోమయాజులుకి జాషువా కవిత్వం ఆరవ ప్రాణం. ఈ పద్యం సోమయాజులు ‘ఏరిన ముత్యాలు’ పుస్తకంలో ప్రచురితమైంది.


ఇంతకీ ఆ పద్యాన్ని చెప్పే ముందు సందర్భాన్ని ప్రస్తావించటం ఇక్కడ ముఖ్యం.

‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు బహుముఖీన ప్రజ్ఞాదురుంధరులు. ‘ఆంధ్రపత్రిక’ను నడిపేవారు. ‘అమృతాంజనం’ ప్రసాదించిన ఆధునిక ధన్వంతరి. ‘అమృతాంజనం’ గురించి ఒక వాణిజ్య ప్రకటన విడుదల చేయాలనుకున్నారు. పంతులుగారిలో మాతృభాష పట్ల, సాహిత్యం యెడల ఆపారమైన ఆదరభావం పరిమళిస్తుండేది. ఆ కోణంలో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ‘అమృతాంజనం’ అంశంగా ఒకే ఒక పద్యాన్ని ఎవరు గొప్పగా రాస్తారో వారికి వేయినూట పదహార్లు సొమ్మును బహుమతిగా ప్రకటించారు. దానిని ఇప్పటి సొమ్ముతో పోలిస్తే– లక్షల్లోనే ఉంటుంది.


ఈ ప్రకటన చూడగానే ఎందరో తమ పద్యాల్ని పంపించారు. అసంఖ్యాకంగా వచ్చిపడ్డాయి. ఆ గుట్టలోంచి ఒకే ఒక పద్యం తలకాయ ఎత్తింది. నాన్న చెప్పినట్లుగా– అది జాషువా పద్యం అనిపిస్తుంది. ఆ పద్యాన్ని గమనించండి.


‘‘వాలి ఖగేశ్వరుం డమృతభాండము భూమికి దెచ్చువేళ– జే

జేల రణంబులో తొణికి చిందిన బిందువు లేవిధాన– సీ

సాలకు బట్టిరో తెలియజాలము; నేడమృతాంజనాఖ్యతో

(చాల గడించెపేరు; గుణసంపద ‘నొప్పుల’ ద్రోసిరాజనన్‌!)’’

ఈ పద్యం ఎటువంటి కల్పనకు జీవం పోసిందో మనం గమనించగలం.


ఇంద్రలోకంలో ఉన్న అమృతకలశాన్ని భూమికి తీసికుని వచ్చే సందర్భంలో– అటు దేవగణానికీ, ఇటు ఖగరాజుకీ యుద్ధం జరిగింది. ఆ సన్నివేశంలో– ఆ పెనుగులాటలో– ఆ కలశం నుంచి కొన్ని అమృతబిందువులు తొణికి, నేలపై పడబోతున్న సమయంలో కింది నుంచి ఆ బిందువుల్ని సీసాలలో నింపారట. అదే నొప్పుల్ని నివారించే అమృతాంజనం. పద్యం పల్లకిపై ఊరేగడమంటే ఇదే!


ఈ పద్యశిల్పాన్నీ, భావాన్నీ చూస్తే– జాషువా రచనే అనిపిస్తుంది. అయితే ఇదెక్కడా పుస్తకాలలో కనిపించటం లేదు. ఇంత మంచి పద్యం ఎలా మరుగునపడిపోయిందో మరి! నిజానిజాలు సాహిత్య చరిత్ర చెప్పాలి.

రసరాజు

(నేడు జాషువా జయంతి)

Read more