ఈ విషాలు, విద్వేషాలకు విరుగుడులేదా?

ABN , First Publish Date - 2022-09-27T06:38:38+05:30 IST

హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తీవ్రమవుతున్న కొద్దీ పాలక పక్ష మెజారిటేరియన్ దృక్పథం మరింత దృఢమవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఆసన్నమవు తున్న తరుణంలో...

ఈ విషాలు, విద్వేషాలకు విరుగుడులేదా?

హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తీవ్రమవుతున్న కొద్దీ పాలక పక్ష మెజారిటేరియన్ దృక్పథం మరింత దృఢమవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఆసన్నమవు తున్న తరుణంలో ఈ సత్యం అంతకంతకు తేటతెల్లమవుతోంది. అధిక సంఖ్యాక వర్గాల అనుకూల వాదం, మతతత్వ చీలికలు పరస్పరం బలపరచుకునే ఎన్నికల వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఆచరణలోకి తెస్తోంది. తద్వారా ఎన్నికల ప్రయోజనాలు అపరిమితంగా సాధించుకోవడమే జాతీయ అధికార పార్టీ లక్ష్యం. మతతత్వ వైషమ్యాలను రెచ్చగొట్టడంతో పాటు, అవి మరింతగా పెచ్చరిల్లిపోయేందుకు దోహదం చేసే మతతత్వ విరుద్ధ వాదనలను కూడా ఉపయోగించుకునే సౌలభ్యాన్ని సమకూర్చే ఒక విలక్షణ తర్కాన్ని మెజారిటీ వాదం ప్రయోగిస్తోంది. ఏమిటా విలక్షణత? అధిక సంఖ్యాకవర్గం ఆలోచనల్లో సందిగ్ధతను, హిందువులు, ముస్లింల మధ్య సరికొత్త సంప్రదింపులను నివారించడమే కాకుండా, మతతత్వ విభేదాలను పెంచుతున్న ప్రబల ప్రక్రియను పటిష్ఠం చేసి మరింతగా అమలుపరిచేందుకు తోడ్పడటమే!


మతతత్వ కథనాలను సవాల్ చేయడంలో వాటి వ్యతిరేక వాదనలు విఫలమవుతున్నాయి. అధిక సంఖ్యాక వర్గాల అనుకూల వాదం నిర్దేశించినట్టుగా నిర్దిష్ట ప్రాచుర్యం, అర్థాన్ని పొందేలా మాత్రమే ఆ విరుద్ధ వాదనలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కేవలం మతతత్వ విరుద్ధ కథనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనమేముంది? అవి, అధిక సంఖ్యాక వర్గాల వారి ఆలోచనలను, మన స్థితిని మార్చగలగాలి. ఒక నవ పరివర్తనను సాధించితీరాలి. అటువంటి మతతత్వ విరుద్ధ కథనాలు ఏవీ ఇంతవరకు ప్రజారంగంలో లేనేలేవు. ఇక, ప్రతికూల ఫలితాలను ఇవ్వని విధంగా ఆ కథనాలను రూపొందించే యోచన, ప్రణాళిక గురించి చెప్పేదేముంది? ఈ అదనపు, నిర్దిష్ట లక్ష్యం లేకుండా వ్యాప్తిలోకి వస్తున్న మతతత్వ వ్యతిరేక వాదనలు బీజేపీని ఏమాత్రం కలవరపరచవు. నిజానికి అవి మతతత్వ ఎజెండాను మరింత పటిష్ఠంగా అమలు పరిచేందుకు దోహదం చేస్తున్నాయనే బీజేపీ భావిస్తోంది. ఇదొక నిష్ఠుర నిజం.


రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ అధినేత అర్నాబ్ గోస్వామి ఇటీవల ప్రతిపక్షాలకు ఒక ధర్మోపన్యాసం ఇచ్చారు. బిల్కిస్ బానోపై అమానుష అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసిన వైనం పైన, వారిని పూలదండలతో స్వాగతించడం పట్ల విపక్షాలు ఒక స్పష్టమైన ధర్మాగ్రహ వైఖరిని ఎందుకు వ్యక్తం చేయలేదని గోస్వామి నిలదీశాడు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎంతో సహా వివిధ రాజకీయ పార్టీలు ఆ నేరస్థుల విడుదలను తీవ్రంగా ఖండించాయి. సిపిఎం, తృణమూల్ నేతలు ఆ నేరస్థులకు జైలు శిక్షను రద్దుచేయడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మౌనం వహించింది! ఇదేమి వైపరీత్యం? బిల్కిస్ బానోకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తే, తాము బీజేపీ పన్నిన రాజకీయ వలలో చిక్కుకుంటామేమోనని రాజకీయ పార్టీలు, బహుశా, భయపడి ఉంటాయి. అందునా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రతిస్పందించడం ప్రమాదకరమని నేతలు విశ్వసించి ఉంటారు. ‘లౌకికవాద’ పార్టీలకు మౌనం అనేది ఒక స్వీయ ప్రయోజనకర సాధనమైపోయింది.


మతతత్వ వ్యతిరేక వాదనల తీరుతెన్నులను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వెసులుబాటు బీజేపీ- ఆరెస్సెస్ లకు లభించడమనేది ప్రతిపక్షాల మౌనం పర్యవసానమేనని చెప్పితీరాలి. ముస్లింలపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ధర్మనిరతితో ప్రతిస్పందించడం లేదు. ఎందుకని? ప్రతిస్పందించకపోవడం వల్లే ఎన్నికల్లో తమ ప్రయోజనాలు నెరవేరుతాయని అవి విశ్వసిస్తున్నాయి! అయితే ఒక సామాజిక వాస్తవాన్ని విపక్షాలు విస్మరిస్తున్నాయి. అది సరికొత్తగా సంభవిస్తున్న సామాజిక పరిపర్తన. సమాజంలోనూ, ఓటర్ల ఆలోచనల్లోను చోటుచేసుకుంటున్న మార్పులు ఎన్నికల్లో జయాపజయాలపై గణనీయమైన ప్రభావాన్ని తప్పక నెరపుతాయి. ఇది కొట్టివేయలేని వాస్తవం. పైగా ప్రతిపక్షాల మౌనంలో ఒక ప్రమాదం అంతర్లీనంగా ఉంది. అన్నార్తులు, అవకాశాలు కొరవడిన అభాగ్యులు, అమానుషాల బాధితుల తరఫున నిలబడని, మాట్లాడని రాజకీయ పార్టీల వల్ల ప్రయోజనమేమిటి? అవి అనవసరమని, వాటికి మద్దతు ఇవ్వడం దండగ అని సామాన్య ప్రజలు తప్పక భావిస్తారు. అంతేకాదు, తిరస్కరిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితి అదే. అటువంటి సంక్షోభంలోకి ప్రాంతీయ పార్టీలను సైతం నెట్టివేయాలని బీజేపీ ఇప్పుడు శత విధాల ప్రయత్నిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, బిల్కిస్ బానో కేసు మొదలైన ముస్లింల సంబంధిత అంశాలు, సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ మౌనం వహిస్తోంది. విద్యా వైద్యాల సంక్షేమ వ్యవహారాల గురించి మాత్రమే ప్రస్తావిస్తోంది. సంక్షేమమే ఆప్ బలం అనే సత్యాన్ని బీజేపీ గుర్తించింది. కనుకనే ప్రధాని మోదీ ఇటీవల ‘ఉచితాల సంస్కృతి’పై ధ్వజమెత్తారు.


ఘర్షించుకుంటున్న భిన్న మతాల వారి మధ్య సమన్వయ సాధన అవకాశాలను సైతం స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకునే సౌలభ్యాన్ని పాలకపక్షానికి ప్రతిపక్షాల మౌన వ్యూహం సమకూరుస్తోంది. పాలకపక్ష నేతలు తొలుత విభేదాలను రెచ్చగొడుతున్నారు, ఆ తరువాత అధిక సంఖ్యాక వర్గాల వారిని హింసాత్మకదాడులకు పురిగొల్పుతున్నారు, ఆ దాడుల నుంచి మైనారిటీ మతస్థులను కాపాడగలిగేది తామేనని బాధితులను విశ్వసింప చేస్తున్నారు. ‘థర్డ్ డిగ్రీ’ పద్ధతులను ఉపయోగించడంలో పోలీసులు అనుసరించే పద్ధతులు సరిగ్గా ఇవే. ఒక పోలీసు అధికారి చిత్ర హింసలకు గురిచేస్తాడు, మరో అధికారి తియ్యగా, అనునయంగా మాట్లాడతాడు. నిస్సహాయుడైన బాధితుడు రాజీకి అంగీకరిస్తాడు.


ప్రతిపక్షాల ఘోషను, కథనాలను ప్రోత్సహించడం ద్వారా వాటిని మౌనం వహించేలా చేసే కళలో బీజేపీ మరింత పరిపూర్ణ నైపుణ్యాన్ని సాధిస్తోంది.


రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ సభ్యత్వ కాలం ముగిసినప్పుడు మోదీ ఆయనకు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. తద్వారా హిందువులు, ముస్లింల మధ్య ఉల్లాసకరమైన సంబంధాలు సాధ్యమేనన్న భావన కలిగించారు. ఆజాద్ ఇప్పుడు కశ్మీర్‌లో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. మోదీతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నందువల్ల ఆజాద్ పార్టీని ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా కశ్మీరీ ముస్లింలు భావించే అవకాశం ఉంది. అధికరణ 370ని రద్దుచేసిన బీజేపీ నాయకత్వాన్ని ఏ మాత్రం విమర్శించకుండానే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని ఆజాద్ డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ లోయ ముస్లింల రక్షకుడుగా తనను తాను చెప్పుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఇది జరుగుతోంది. ఈ బీజేపీ వ్యూహానికి మరో పార్శ్వం కూడా ఉంది. ముస్లింలను సంప్రదింపులకు తీసుకురావడంలో లేదా వారిని వశపరచుకోవడంలో బీజేపీ విజయవంతమయిందని విశాల భారతదేశంలోని హిందూ ఓటర్లకు చెప్పడమే దాని లక్ష్యం.


మత సామరస్యాన్ని దెబ్బతీసే మతతత్వ కుతంత్రాలపై సాధారణ ప్రతి వ్యూహాలతో పోరాడడం వల్ల ప్రయోజనం లేదు. పైగా ఆ వ్యూహాలు వైషమ్యాలను మరింతగా పెంచడానికే దారితీస్తాయి. మౌనం వహించడం వల్ల సత్ఫలితం ఉండకపోగా విపక్షాల వైఖరి అసంబద్ధమైనదనే భావన కలిగిస్తుంది. ప్రతిపక్షాలకు ప్రజల్లో గల స్థానాన్ని బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆక్రమించేందుకే అది తోడ్పడుతుంది. దీనినెలా ఎదుర్కోవాలి? ప్రతిపక్షాలు తొట్టతొలుత అధిక సంఖ్యాక వర్గాల వారిని బీజేపీ కపట వ్యూహాల పట్ల అప్రమత్తం చేయాలి. మతతత్వం పెచ్చరిల్లిపోయేందుకు ఆస్కారమివ్వని మతతత్వ కథనాల వ్యతిరేక వాదనలు రూపొందించి, ప్రజల్లోకి తీసుకుపోవాలి. మైనారిటీ వర్గాల రాజకీయాలలోని అభివృద్ధినిరోధక వైఖరులు, ధోరణులను నిర్ద్వంద్వంగా ఖండించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతేగాక నానావిధ దురాగతాలు, దాడుల నుంచి మైనారిటీలను రక్షించేందుకు తోడ్పడుతుంది. బిల్కిస్ బానోకు బాసటగా నిలిచినప్పుడు మాత్రమే షహీన్ బాగ్ ఉద్యమకారులను, ముస్లింలను బుజ్జగిస్తున్నారనే అభియోగానికి గురవకుండా సమర్థించడం సాధ్యమవుతుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల ముఖ్యంగా ముస్లింల పట్ల అధిక సంఖ్యాక వర్గం వారి అవిచారిత భావనలకు భిన్నంగా ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఒక కొత్త వైఖరిని అనివార్యంగా అనుసరించాలి. సకల భారతీయుల ఆర్థికాభివృద్ధి, సామాజిక అభ్యున్నతికి ఇరు వర్గాల మధ్య అన్యోన్య సంబంధాలను పెంపొందించేందుకు అగ్రప్రాధాన్యమివ్వాలి.

అజయ్ గుడవర్తి

అసోసియేట్ ప్రొఫెసర్, జేఎన్‌యూ

(‘ది వైర్’ వ్యాసానికి స్వేచ్ఛానువాదం)

Read more